the Shiv Sena
-
రెండు చోట్లా బీజేపీకే పట్టం!
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడే న్యూఢిల్లీ: జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ శక్తులైన శివసేన, లోక్‌దళ్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన మహారాష్ట్ర, హర్యానాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా... ఫలితాల సరళి మధ్యాహ్నం వరకే వెల్లడయ్యే అవకాశముంది. మూడు గంటల సమయం నుంచి ఆయా స్థానాల్లో తుది ఫలితాల వెల్లడి ప్రారంభమవుతుంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశముందని ఇప్పటికే ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య ప్రధానంగా పోటీ జరుగుతుండగా... హర్యానాలో అధికార కాంగ్రెస్‌కు చావుదెబ్బ తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 15వ తేదీన మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో హర్యానాలో76.5 శాతం పోలింగ్ నమోదుకాగా మహారాష్ట్రలో 63.1 శాతం నమోదైంది. బీజేపీని కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన ప్రధాని మోదీ చరిష్మాకు.. ఈ ఎన్నికల ఫలితాలే తొలి పరీక్షగా నిలవనున్నాయి. మహారాష్ట్రలో హంగ్ ?.. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు గాను.. ప్రధాన పార్టీలైన బీజేపీ 280 స్థానాల్లో, శివసేన 282, కాంగ్రెస్ 287, ఎన్సీపీ 278, ఎంఎన్ఎస్ 219 స్థానాల్లో పోటీపడ్డాయి. మహారాష్ట్రలో ఏ పార్టీకీ సరైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని, హంగ్ ఫలితాలు తప్పకపోవచ్చని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్ పేర్కొనడంతో.. ఇక్కడ ఉత్కంఠ నెలకొంది. కానీ ఎన్నికల ముందు విడిపోయిన మిత్రపక్షాలు బీజేపీ, శివసేనతో పాటు ఎన్సీపీ కూడా తామే పూర్తిస్థాయి మెజారిటీ సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం చిత్తు చిత్తుగా ఓడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఆదర్శ్ కుంభకోణంపై ఆ పార్టీకి చెందిన మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పరిస్థితిని దిగజార్చాయి. అయితే.. ఫలితాల అనంతరం బీజేపీ, శివసేన తిరిగి పొత్తుపెట్టుకోవచ్చనే వార్తలను ఆ పార్టీలు ఖండించాయి. దీనిపై శనివారం శివసేన ప్రతినిధి సంజయ్ రౌత్ మాట్లాడుతూ... ‘‘మహారాష్ట్రలో శివసేన ఒంటరిగానే అధికారంలోకి వస్తుంది. బీజేపీది ప్రతిపక్షంగా ఉంటుంది’ అని అన్నారు. అయితే ఎన్డీయేలో శివసేన కొనసాగడం నేపథ్యంలో.. మహారాష్ట్రలో తిరిగి బీజేపీ-శివసేన ఒక్కచోటికి చేరడం ఖాయమని విశ్లేషకులటున్నారు. ఎగ్జిట్‌పోల్స్ కూడా మహారాష్ట్రలో రెండో అతిపెద్ద పార్టీగా శివసేన నిలుస్తుందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్సీపీ కూడా శివసేనతో ఎన్నికల అనంతర పొత్తుపై కన్నేసిందని చెబుతున్నారు. హర్యానాలో కాంగ్రెస్ ఔట్.. హర్యానాలోని 90 స్థానాలకు.. అక్కడి అధికార కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, ఐఎన్ఎల్డీ తలపడ్డాయి. వరుసగా మూడోసారి కూడా అధికారంలోకి రావాలనుకున్న భూపిందర్ సింగ్ హుడా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ భవితవ్యం ఆదివారం వెలువడనుంది. అయితే కాంగ్రెస్ పదేళ్ల పాలనకు ఈ సారితో తెరపడబోతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ తొలిసారిగా బీజేపీ అధికారాన్ని చేపట్టనుందని ఎగ్జిట్‌పోల్స్ పేర్కొన్నాయి. ఈ సారి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని మోదీ ఆకర్షణ బీజేపీకి సీట్లు తీసుకొచ్చినా... మెజారిటీకి కొద్ది దూరంలో ఆగిపోయే అవకాశముందని అంచనా వేశాయి. -
'మాకు శివసేన మద్దతు అవసరం లేదు'
పాట్నా:మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన మద్దతు అవసరం ఎంతమాత్రం లేదని బీజేపీ స్పష్టం చేసింది. తాము మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ అధికార ప్రతినిది సయ్యద్ షెహ్ నాజ్ తెలిపారు. తాజాగా జరిగిన మహారాష్ట్ర, హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన సహకారం ఏమైనా తీసుకుంటారా?అని ప్రశ్నించగా.. ఆ అవసరం తమ పార్టీ రాదని షెహ్ నాజ్ తెలిపారు. ఏ పార్టీకి కూడా మెజారిటీ స్థానాలు రావని, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీలు భారీ ఎత్తున నష్టపోతుండగా.. ఆ మేరకు బీజేపీ లాభపడనుందని, శివసేన రెండో అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని అవి పేర్కొంటున్నాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాటుపై పార్టీల గుండెల్లో అలజడి మొదలైంది. -
నేను సీఎం కాకూడదా?
చాయ్‌వాలా ప్రధానికాగా లేంది.. ‘సామ్నా’లో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్య ముంబై/నాగ్‌పూర్: చాయ్‌వాలా ప్రధానికాగా లేంది.. తాను ముఖ్యమంత్రి కావటంలో తప్పేమిటని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. పార్టీ పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్య చేశారు. చాయ్‌వాలాగా జీవితం ఆరంభించిన మోదీ వంటి సాధారణ వ్యక్తి ప్రధాని కాగా లేంది.. తాను సైతం ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదని ఆయన ప్రశ్నించారు. ఠాక్రేలు ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేయలేదనేది వాస్తవమని, అదే సమయంలో బాధ్యతల నుంచి ఏనాడూ తప్పించుకోలేదని పేర్కొన్నారు. -
మహారాష్ట్రపై కాదు పాక్ ఆగడాలపై దృష్టి పెట్టండి
మోదీకి శివసేన సలహా ముంబై: ప్రధాని మోదీపై శివసేన దాడి తీవ్రమైంది. ఆయన మహారాష్ట్ర రాజకీయాలపై కాకుండా కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తున్న పాక్ ఆగడాలపై దృష్టి సారించాలని బుధవారం శివసేన తన అధికార పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో పేర్కొంది. సీమాంతర కాల్పులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం కావడంతోపొరుగుదేశం బరితెగిస్తోందని విమర్శించిం ది. కేంద్రంలో ఉండాల్సిన మోదీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో తీరికలేకుండా ఉండడం దేశ భద్రతను నిర్లక్ష్యం చేయడమేనంది. దేశాన్ని కాపాడుకోవడానికి 56 అంగుళాల ఛాతీ అక్కర్లేదని, దృఢసంకల్పం ఉంటే చాలని పేర్కొంది. -
ఠాక్రేపై గౌరవముంటే విడిపోయేవారా?
సాక్షి, ముంబై: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా ధ్వజమెత్తారు. 25 ఏళ్ల అనుబంధం తెగిపోతున్న సమయంలో బాల్‌ఠాక్రేపై ఉన్న గౌరవం, ప్రేమాభిమానాలు గుర్తుకురాలేదా..? అని మోడీని నిలదీశారు. శివసేనపై విమర్శలు చేయనని, ఇలా దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రేకు నివాళులు అర్పిస్తున్నాని మోడీ ఆదివారం ముంబైలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ఉద్ధవ్.. సామ్నా సంపాదకీయం ద్వారా తనదైన శైలిలో మోడీపై మండిపడ్డారు. ‘బాల్‌ఠాక్రే పై మోడీకి గౌరవం ఉండడం మంచిదే. ఇందుకు మేము ఆయనకు స్వాగతం పలుకుతాం. మేం కూడా మోడీని గౌరవిస్తాం. అయితే హిందుత్వం అనే గట్టిదారంతో ఏర్పడిన బంధాన్ని శివసేన అధినేత బాల్‌ఠాక్రే 25 ఏళ్లు కొనసాగించారు. ఆ బంధం ఇప్పుడెలా తెగిపోయింద’ని ప్రశ్నించారు. సీట్ల పంపకాల విషయంపై ముందుకువచ్చి బంధం తెగకుండా చూసినట్లయితే బాల్‌ఠాక్రేకు అది నిజమైన నివాళి అయ్యేదంటూ చురకలంటించారు. రాష్ట్ర ప్రజలు తెలివైనవారేనని, వారందరికీ అసలు దొంగలెవరు..? బురఖాలో ఉన్న దొంగలెవరో..? అనేది తెలుసునంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి మహారాష్ట్రను దోచుకున్నాయని ఆరోపించారు. ‘ఇటీవలే గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబేన్ పటేల్ ముంబైకి ఏ ఉద్దేశంతో వచ్చివెళ్లారో తెలిసిందే. ముంబైలోని పారిశ్రామికవేత్తలను మహారాష్ట్రలో ఉండవద్దని, అందరు గుజరాత్‌కు తరలిరావాలని ఆనందీబేన్ పిలుపునిచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇలా చేయడం కూడా మహారాష్ట్రను దోచుకోవడమే అవుతుంద’ని ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారు. ‘మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన బెల్గావ్, కారవార్ తదితర ప్రాంతాలపై మోడీ, అమిత్ షా, నితిన్ గడ్కరీ, దేవేంద్ర ఫడ్నవీస్‌ల అభిప్రాయాలేమిటి..? సరిహద్దు ప్రాంతాల్లో సుమారు 20 లక్షలమంది మరాఠీలపై జరుగుతున్న అన్యాయంపై వైఖరేమిటి? ఛత్రపతి శివాజీ మహారాజు ఆశీర్వాదాలున్నాయంటు మహారాష్ట్రలోకి వచ్చిన వారు సరిహద్దు అంశంపై ఎందుకు మాట్లాడడంలేదు? కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. మోడీ ప్రధానిగా ఉన్నారు. కాని యెల్లూర్లో మరాఠీ ప్రజలకు దారుణంగా అన్యాయం జరుగతోంది. ఇలాంటి సమయంలో మరాఠీ ఎంపీలు ఢిల్లీలో ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మహారాష్ట్రను ముక్కలు చేయాలన్న కలతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింద’ని ఆరోపించారు. తుల్జాపూర్లో ఆవేశంగా.. శివసేన, బీజేపీల బంధం తెగిపోవాలనేది మాతా తుల్జభవాని నిర్ణయం కావొచ్చని, అందుకే బంధం తెగిపోయిందని శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. తుల్జాపూర్లో సోమవారం జరిగిన బహిరంగ సభలో ఆయన తనదైన శైలిలో కాంగ్రెస్, ఎన్సీపీలతోపాటు బీజేపీపై విమర్శలు గుిప్పించారు. గోపీనాథ్ ముండే ఉండి ఉంటే కూటమి ముక్కలయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. అధికారం చేజిక్కించుకునేందుకు అందరు ప్రచార బరిలోకి దిగారని, ప్రధాని, హోంమంత్రి, కేంద్రమంత్రులు అనేక హామీల వర్షం కురిపిస్తున్నారన్నారు. ‘అధికారం మాకివ్వండి.. మాకివ్వండి.. మేము రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలు చేస్తామో చూడండ’ని అంటున్నారంటూ ఎద్దేవా చేశారు. సీట్ల పంపకాలపై మాట్లాడుతూ ... ‘అసెంబ్లీపై కాషాయం రెపరెపలాడాలంటే తుల్జాపూర్లో కూడా కాషాయం రావాలని కార్యకర్తలు చెప్పారు. అయితే ఈ సీటు బీజేపీకి వెళ్లితే ఎలా అని కొందరు ప్రశ్నించారు. అదే సమయంలో బంధం తెగిపోయిందని వార్త వచ్చింది. దీన్నిబట్టి నీకు నిండుగా ఇస్తానని చెబుతుండగా కూటమిలో ఏముందని తుల్జాభవాని నాకు సంకేతాలిచ్చినట్టయింది. అలా బీజేపీ, శివసేన కూటమి తెగిపోవాలని మాతా తుల్జాభవాని నిర్ణయించిందని నాకు అనిపిస్తోందన్నారు. తుల్జాపూర్తోపాటు రాష్ట్ర అభివృద్ధి విషయంపై ఎవరూ శ్రద్ధ వహించలేదు. కానిమేము రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఇందుకోసం అన్ని ప్రణాళికలు మావద్ద సిద్ధంగా ఉన్నాయి. అయితే మాకు అధికారం ఇవ్వాలా..? వద్దా..? అనే విషయాన్ని మీరే నిర్ణయించుకోండ’ంటూ ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారు. -
కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకోను: అనంత్ గీతే
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గం నుంచి తాను వైదొలగబోనని శివసేన నేత, కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి అనంత్ గీతే స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో పొత్తు విచ్ఛిన్నమైనప్పటికీ.. తమ పార్టీ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కొనసాగుతుందని చెప్పారు. బుధవారం న్యూఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు ఆయన పై విధంగా స్పందించారు. అనంత్ గీతే శివసేన నుంచి కేంద్ర కేబినెట్లో ఏకైక మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకంపై ఏర్పడిన ప్రతిష్టంభనతో శివసేనతో పొత్తును బీజేపీ వదులుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ నుంచి శివసేన తప్పుకుం టుందని ఊహాగానాలు వినిపించాయి. దీనిపై గీతే స్పందిస్తూ.. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో శివసేన కీలక పాత్ర పోషించిందని, అందువల్లే రాజీనామా చేసే ప్రసక్తి లేదన్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత బీజేపీ, శివసేన కలిసే అవకాశం ఉందా అని విలేకరులు ప్రశ్నించగా.. భవిష్యత్తు గురించి ఇప్పుడే మాట్లాడటం సరికాదన్నారు. -
‘రాజ్‌నాథే కొనసాగి ఉంటే...’
న్యూఢిల్లీ: బీజేపీతో తెగదెంపులపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆ పార్టీ చీఫ్ అమిత్ షాపై పరోక్షంగా విమర్శలు సంధించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు బీజేపీ అధ్యక్షుడిగా ఉండాలని రాజ్‌నాథ్ సింగ్‌ను కోరానని, ఆయనే బీజేపీ అధినేతగా ఉండి ఉంటే ఇరు పార్టీల మధ్య పొత్తు నిలిచేదని అన్నారు. ‘మోదీని పీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి ముందు రోజు రాజ్‌నాథ్ నాతో మాట్లాడారు. ఈ నిర్ణయానికి మద్దతివ్వాలని కోరారు. నేను మద్దతిచ్చాను. ఆయన అందర్నీ కలసికట్టుగా ఉంచే వ్యక్తి’ అని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకం పై బీజేపీనేతలు సుష్మా, అద్వానీలతో మాట్లాడానని చెప్పారు. పొత్తు విచ్ఛిన్నం కావడం మంచిది కాదని అద్వానీ చెప్పారన్నారు. రాష్ట్రం లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు గురించి షా కొల్హాపూర్‌లో మాట్లాడిన తీరు.. వారికి శివసేనతో పొత్తు ఇష్టం లేదనడానికి నిదర్శనమన్నారు. -
మోదీతో చర్చించాకే తేలుస్తాం: ఉద్దవ్
కేంద్రానికి మద్దతు ఉపసంహరణపై శివసేనాధిపతి స్పందన చవాన్‌కు సంకీర్ణాన్ని నడిపే దృక్పథం లేదు: పవార్ ముంబై/పుణె/జమ్మూ: బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే విషయాన్ని ప్రధాని మోదీతో చర్చించిన తర్వాత నిర్ణయిస్తామని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే తాజాగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి శివసేన వైదొలగుతుందని, తమ పార్టీ నేత అనంత్‌గీతే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు సోమవారం ప్రకటించిన ఉద్దవ్, మంగళవారం కాస్త పట్టువిడుపు ధోరణిలో మాట్లాడారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయనతో మట్లాడి...దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఉద్దవ్‌ఠాక్రే మంగళవారం ముంబైలో మీడియాతో చెప్పారు. సీట్ల పంపకంలో తేడాలతో మహారాష్ట్రలో శివసేన, బీజేపీ విడిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు మహారాష్ట్రలో 15 ఏళ్ల అనుబంధానికి స్వస్తి చెప్పి, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న నేషనలిస్ట్ కాంగ్రె స్ పార్టీ, అందుకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తీరే కారణమంది. చవాన్‌కు సంకీర్ణాన్ని నడిపే దృక్పథం లేదని, ఆయన విభజన ఎత్తుగడలకు పాల్పడినట్లు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ అన్నారు. కాగా ఎన్నికల తరువాత బీజేపీతో కలిసి పోవాలనే ఎత్తుగడతోనే ఎన్సీపీ తన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుందని పృధ్వీరాజ్ చవాన్ తుల్జాపూర్ లో కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచార. సందర్భంగా ఆరోపించారు. -
‘పులి’స్వారీకి బీజేపీ ఇక సరి
మహారాష్ట్రులు శివసేనను మాత్రమే ఆదరిస్తారనీ, గుజరాత్‌కు చెందిన మోదీ, అమిత్‌షాల ఆధిపత్యాన్ని అంగీకరించబోరనీ శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ వ్యాఖ్యానించింది. ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలు చూస్తే మోదీ గాలి లేదని తేలిపోయిందని కూడా శివసేన నేతలు భాష్యాలు ఆరంభించారు. అక్టోబర్ 15న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో అనూహ్యమైన పరిణామాలు సంభవించాయి. ఆ రెండు రాష్ట్రాలలో తన మిత్ర పక్షాలకు బీజేపీ మొట్టికాయ వేసింది. హర్యానా జనహిత పార్టీ నాయకుడు కుల్దీప్ బిష్ణోయి గొంతెమ్మ కోర్కెలను నిష్కర్షగా తోసిపుచ్చింది. ఇంకో అడుగు ముందుకు వేసి మహారాష్ట్రలో పాతికేళ్లుగా శివసేనతో నెరపుతున్న మైత్రికి కూడా మంగళం పాడింది. మిత్రపక్షాలు ఆడమన్నట్టు ఆడే ందుకు బీజేపీ నిరాకరించింది. ఆ పార్టీల చేతులలో అవమానాలు పొందడానికీ, అవి చేస్తున్న బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగడానికీ బీజేపీ సిద్ధంగా లేదు. నిజానికి కొన్ని సందర్భాలలో బెదిరింపులు అనుకున్న ఫలితాలను ఇవ్వలేవు. మిత్రులకు మొట్టికాయ శివసేన ప్రస్తుత నేత ఉద్ధవ్ ఠాక్రే, హర్యానా జనహిత పార్టీ నాయ కుడు కుల్దీప్ ఇద్దరూ తండ్రుల నుంచి రాజకీయాలను వారసత్వంగా పుచ్చుకున్నవారే. ఉద్ధవ్ పార్టీ కోసం ఏ రోజూ ఏమీ చేయలేదు. తండ్రి బాల్ ఠాక్రే ఆయన కోసం సర్వం సిద్ధం చేసిపెట్టారు. ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే. 24 సంవత్సరాల ఈ యువకుడు తనను ప్రధాని నరేంద్ర మోదీ, లేదంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతోనూ సమ స్థాయిలో చూడాలని ఆశపడుతున్నాడు. కుల్దీప్ అల నాటి కాంగ్రెస్ నేత భజన్‌లాల్ తనయుడే. తాను మహా పురుషుల కోవలోనివాడినని కుల్దీప్ ప్రగాఢ విశ్వాసం. ఎవరూ అంగీకరించలేని డిమాండ్లను బీజేపీ ముందు పెట్టాడు. ఒకటి వాస్తవం- బీజేపీ ఢిల్లీ పీఠం మీద ఉన్నప్పటికీ మహారాష్ట్రలో అధికారం చేపట్టాలంటే శివసేన చేయూతనీ, హర్యానా ఎన్నికలలో విజయం సాధించాలంటే కుల్దీప్ మద్దతునూ తీసుకోకతప్పదు. ఆ రెండు రాష్ట్రాలలోనూ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారం చేపట్టకుండా చేయడం బీజేపీకి అనివార్యం. ఈ కృషిలో విఫలమైతే అది ఆ పార్టీకి ఎదురుదెబ్బే. నిజానికి బాగా ధనికులైన వ్యాపార వేత్తలతో పాటు, కోట్లకు పడగలెత్తిన రాజకీయ నాయకులు కూడా ఆ రెండు రాష్ట్రాలలోనే ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ కనుక మళ్లీ అధికారంలోకి రాగలిగితే అది పార్టీకి గొప్ప సాంత్వన కలిగించే పరిణామమే. సేనతో పాతికేళ్ల పొత్తుకు స్వస్తి ఈ నేపథ్యంలో శివసేనతో బీజేపీ తన చిరకాల మైత్రికి స్వస్తి పలకడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. నిజానికి శివసేన లేకుండా ఎన్నికలకు వెళ్లడం ఎంత కష్టమో బీజేపీకి తెలియనిది కాదు. దీనివల్ల చేదు ఫలితాలు తప్పవని కూడా తెలుసు. అయినా మైత్రికి స్వస్తి పలకక తప్పని పరిస్థితులు ఏర్పడినాయి. ఆ రెండు పార్టీలది విజయవంతమైన పొత్తు. ఆ కూటమి 1994లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఎన్డీయే ప్రభుత్వానికి ఈ కలయిక వల్ల ఎంతో లబ్ధి చేకూరింది. ఆఖరికి 2014 సాధారణ ఎన్నికలలో అక్కడి 48 లోక్‌సభ స్థానాలకు గాను 42 ఈ కూటమే హస్తగతం చేసుకుంది. ఈ విజయం మోదీ వల్లనే సాధ్యమైందని బీజేపీ సహజంగానే భావిస్తోంది. అందుకే, ఇంతకాలం అక్కడి రాజకీయాలలో శివసేన తరువాతి స్థానానికే పరిమితమైన బీజేపీ ఇప్పుడు పదో న్నతిని కోరుకుంటోంది. దీనితో పాటు ఉద్ధవ్ నాయకత్వంలో శివసేన బలహీన పడింది. వెరసి ఈసారి అసెంబ్లీ పోరులో తమకు ఎక్కువ స్థానాలు కేటాయిం చాలనీ, ఆఖరికి ముఖ్యమంత్రి పదవి కూడా తమ పార్టీ అభ్యర్థికి దక్కాలనీ బీజేపీ భావించింది. అదే సమయంలో ఉద్ధవ్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శివసేన ప్రకటనలు గుప్పించింది. దీనితో ఆ రెండు పార్టీల మధ్య పెరిగిన అగాధం ఎంతటిదో వెల్లడైంది. శివసేనతో సరైన పద్ధతిలో వ్యవహరించగల నేర్పు ఉన్న గోపీనాథ్ ముండే వంటి నాయకుడి హఠాన్మరణం కూడా బీజేపీకి పెద్ద లోటు. కానీ సీనియర్లు లేని లోపం శివసేనకు ఉంది. గడచిన ఎనిమిదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కారణంగా శివసైనికులలో ఏర్పడిన నైరాశ్యాన్ని పారద్రోలాలన్నా ఆ పార్టీకి ఇప్పుడు అధికారం అవసరం. పైగా శివసేన నాయకత్వం కోసం పోటీ పడి గత కొద్దికాలం నుంచి ఉద్ధవ్‌కి పోటీగా మారిన సోదరుడి వరస నాయకుడు రాజ్ ఠాక్రే కూడా పార్టీని బలహీనపరిచాడు. నిజానికి బాల్ ఠాక్రే మరణంతోనే శివసేన ప్రాభవం పోయిందని చాలామంది అభిప్రాయం. అలాగే ఉద్ధవ్ కాంగ్రెస్‌ను గానీ, శరద్‌పవార్ ఎన్సీపీని గానీ నిలువరించగల దీటైన నేత కాదు. కానీ 2014లో బీజేపీ విజయం శివసేనలో ఆశలు రేపింది. మోదీతో మారిన దృశ్యం పదిహేను మంది ఎంపీలు మాత్రమే ఉన్నప్పటికీ వాజపేయి హయాంలో శివసేన పలు మంత్రి పదవులతో పాటు, లోక్‌సభ స్పీకర్ పదవిని కూడా దక్కించుకోగలి గింది. ఇప్పుడు 22 మంది ఎంపీలు ఉన్నప్పటికీ మోదీ మంత్రివర్గంలో శివసేనకు చిన్న మంత్రిత్వ శాఖ మాత్రమే లభించింది. మోదీ మిగిలిన బీజేపీ నాయకుల మాదిరిగా కాదని శివసేనకు అనుభవానికి వచ్చింది. దీనితో పాటు మహారాష్ట్రలో తమ పార్టీ ప్రాధాన్యాన్ని ఇకపై తగ్గిస్తారన్న అనుమానం కూడా వారిలో మొదలైంది. అందుకే మరోసారి తమ పార్టీ అభ్యర్థి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడాలని శివసేన భావిస్తోంది. దూషణ పర్వంలో మిత్రపక్షం పొత్తు చెడిన తరువాత శివసేన మీడియా యుద్ధం ఆరంభించింది. మోదీ ప్రభా వం పార్లమెంటు ఎన్నికలకే పరిమితమనీ, మహారాష్ట్ర ఎన్నికలలో ఆ ప్రభావం ఉండదనీ ఆ పార్టీ నాయకులు ప్రచారం ప్రారంభించారు. మహారాష్ట్ర బీజేపీ నేత లకు ఒక స్థాయి అంటూ ఏమీలేదని కూడా శివసేన విమర్శలు మొదలుపెట్టింది. మహారాష్ట్రులు శివసేనను మాత్రమే ఆదరిస్తారనీ, గుజరాత్‌కు చెందిన మోదీ, అమిత్‌షాల ఆధిపత్యాన్ని అంగీకరించబోరనీ శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ వ్యాఖ్యానించింది. ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలు చూస్తే మోదీ గాలి లేదని తేలి పోయిందని కూడా శివసేన నేతలు భాష్యాలు ఆరంభించారు. బీజేపీ ద్రవ్యో ల్బణాన్ని అరికట్టలేకపోయిందని కూడా ఎద్దేవా చేశారు. గడచిన నెలలో శివసేన నాయకులు బీజేపీ మీద చేసిన విమర్శలు విరోధులు కూడా చేయలేదంటే అతి శయోక్తి కాదు. మొత్తంగా ఒక అపరిపక్వ ధోరణిని శివసేన ప్రదర్శించింది. అనుభవశూన్యులతో తంటా ప్రధాని అభ్యర్థిగా మోదీని బీజేపీ ప్రకటించినప్పటికీ శివసేన ఆయనకు మద్దతు ప్రకటించలేదు. అప్పుడు ఎల్కే అద్వానీ, సుష్మాస్వరాజ్‌ల వైపు శివసేన మొగ్గు చూపడమే కాకుండా, మోదీ మీద పలు విమర్శలు కూడా సంధించింది. కానీ శివ సేన అంచనాలు తారుమారైనాయి. ఇప్పుడు ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే పెద్ద సమస్యగా పరిణమించాడు. ఇతడొక మేధావి అని ఉద్ధవ్ నిశ్చితాభిప్రా యం. కానీ ఇతడికి రాజకీయ అనుభవం లేకపోవడం అటుంచి, చాలా దూకుడు స్వభావం కలిగినవాడని పేరుంది. బీజేపీతో కఠినంగా వ్యవహరించవలసినదని తండ్రికి సలహా ఇచ్చినది ఇతడే. శివసేన అధికారం చేపట్టి తీరాలనీ, బీజేపీకి ముఖ్యమంత్రి పీఠం దక్కితే ఇక శివసేనకు భవిష్యత్తు లేదనీ, బీజేపీ బతకనివ్వ దనీ ఆదిత్య తండ్రికి నూరిపోశాడని చెబుతారు. శివసేన మినహా బీజేపీకి గత్యం తరం లేదని కూడా ఆదిత్య నమ్మకం. పొత్తు సమస్య పరిష్కారానికి బీజేపీ జాతీ య కార్యదర్శి ఓమ్ మాథుర్ ముంబై వస్తే ఆయన చర్చలకు వచ్చినది ఒక ఎమ్మె ల్యేనో, ఎంపీనో కాదు, ఆదిత్య వచ్చాడు. చివరికి దూకుడు స్వభావం కలిగిన ఉద్ధవ్‌ను ముఖ్యమంత్రిని చేయడం కంటె, మహారాష్ట్రను కోల్పోవడమే మంచి దన్న అభిప్రాయానికి బీజేపీ వచ్చింది. అందుకే బీజేపీకి మరో మార్గం లేకపో యింది. అపరిపక్వ, అనుభవ రాహిత్యంతో కూడిన సలహాలు విన్నందుకు శివ సేన సర్వం కోల్పోయే అవకాశమే ఎక్కువ. ఏమైనా బీజేపీ ఇప్పుడు పులి (శివ సేన గుర్తు) స్వారీ దిగుతోంది. స్వారీ చేయడం కాదు, దిగడమే అసలు సవాలు. (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) - పెంటపాటి పుల్లారావు -
పునరాలోచిస్తా: ఉద్ధవ్
సాక్షి ముంబై: కేంద్రప్రభుత్వం నుంచి వైదొలగుతామని ప్రకటించి 24 గంటలు గడవకముందే శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే మాటమార్చారు. ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించిన తరువాత ఎన్డీఏలో నుంచి బయటపడే విషయంపై పునరాలోచించి నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన మంగళవారం ప్రకటించారు. లోకసభ ఎన్నికల్లో బీజేపీ, శివసేనలు కలిసిపోటీ చేశాయి. కేంద్రంలో శివసేనకు చెందిన అనంత్ గీతేకు మంత్రి పదవి దక్కింది. కానీ రాష్ట్రంలో సీట్ల సర్దుబాటుపై విభేదాలు ఏర్పడడంతో బీజేపీ, శివసేనలు విడిపోయిన అనంతరం కేంద్ర మంత్రికి అనంత్ గీతే రాజీనామా చేస్తారని, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా శివసేన బయటపడుతుందని ఉద్దవ్ ఠాక్రే సోమవారం ప్రకటించారు. అయితే మాతోశ్రీలో జరిగిన ఓ విలేకరుల సమావేశంలో ఈ విషయంపై కూడా మాట్లాడుతూ ఎన్డీఏ నుంచి బయటపడే విషయంపై పునరాలోచిస్తామని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న శివసేన కేంద్రంలో మాత్రం అధికారం కోసం ఆ పార్టీతో అంటకాగుతోందని ఎంఎన్ఎస్ అధ్యక్షులు రాజ్ ఠాక్రే విమర్శించడంతో ఉద్ధవ్ స్పందించి అనంత్ గీతే రాజీనామా చేస్తారని ప్రకటించారు. కానీ తన నిర్ణయంపై పునరాలోచన చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బీజేపీ-శివసేన కూటమిని ప్రజలు ఎన్నుకొని కేంద్రంలో అధికారం ఇచ్చారని, ఇప్పుడు ప్రభుత్వం నుంచి వైదొలగితే ప్రజల తీర్పును వమ్ము చేసినట్లవుతందని అన్నారు. అందువల్ల పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాను శివసైనికుడనని, నాయకుడు ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధమని అనంత్ గీతే ఢిల్లీలో ప్రకటించారు. -
నేడు ముంబైకి రానున్న అమిత్ షా
సాక్షి, ముంబై: బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నేడు ముంబైకి రానున్నారు. దీంతో మహాకూటమిలో సీట్ల పంపకాలపై నెలకొన్న గందరగోళానికి నేటితో తెరపడొచ్చని భావిస్తున్నారు. పొత్తుపై నేడు అధికారిక ప్రకటన కూడా వెలువడుతుందని చెబుతున్నారు. షా రాకతో సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నారు. గురువారం ఉదయమే ముంబైకి చేరుకునే షా మహాకూటమిలో కొనసాగాలా? వద్దా? అనే విషయంపై మహారాష్ట్ర బీజేపీ నాయకులతో చర్చించడంతోపాటు శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రేతో కూడా భేటీ అయ్యే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. అనంతరం మహాకూటమిపై తుది ప్రకటన వెలుపడుతుందంటున్నారు. గత కొన్ని రోజులుగా సీట్ల పంపకాలపై ఏర్పడ్డ విభేదాలు తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఎలాగైన కూటమిగానే పోటీ చేయాలని మహాకూటమిలోని శివసేన, బీజేపీలతోపాటు ఇతర పార్టీలు కోరుకుంటున్నప్పటికీ కొన్ని సీట్లపై లెక్కలు తేలకపోవడంతో విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో గత కొన్నిరోజులుగా రోజుకో కొత్త ఫార్ములా మహాకూటమిలో కన్పిస్తోంది. ఇప్పటి వరకు బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తుండగా తాజా ఫార్ములా (శివసేన 151, బీజేపీ 130, మిత్రపక్షాలు 7 )పై మిత్రపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. తమకు గౌరవప్రదమైన స్థానాలు కేటాయించనట్టయితే ఒంటరిగా బరిలోకి దిగనున్నట్టు శివసేన, బీజేపీలను హెచ్చరించాయి. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీల మద్య కూడా సీట్ల పంపకాలపై సయోధ్య కుదరలేదు. ఎన్సీపీ 144 సీట్లు ఇవ్వాలన్న డిమాండ్‌పై పట్టుబడుతుండగా కాంగ్రెస్ మాత్రం దీనికి ససేమిరా అంటోంది. పితృపక్షాల కారణంగానే..? పితృపక్షాల కారణంగానే నిర్ణయాలు తీసుకోవడంలేదని తెలిసింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ పెద్దగా ఎవరు నామినేషన్లు కూడా దాఖలు చేయకపోవడానికి కారణం కూడా పితృపక్షాలేనని చెబుతున్నారు. గురువారంతో పితృపక్షాలు ముగియడంతోపాటు నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. దీంతో పొత్తులపై తుది నిర్ణయాలతోపాటు అభ్యర్థుల జాబితాలను కూడా గురువారమే ప్రకటిస్తారని తెలుస్తోంది. నామినేషన్ల పర్వం శనివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా శుక్ర, శనివారాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెన్నెస్ కూడా తమ బ్లూ ప్రింట్స్‌తో గురువారం మాటుంగాలోని షణ్మూకానంద్ హాల్లో కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలోనే ఎమ్మెన్నెస్ అధ్యక్షులు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని సమాచారం. మరోవైపు మిగతా పార్టీలలో ఆప్ పోటీ చేయనని ప్రకటించింది. ఇక మిగిలిన ఎస్పీ, బీఎస్పీ, ఇతర రిపబ్లికన్ గ్రూపులు కూడా తొందర్లోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. ఈసారి మరాఠ్వాడతోపాటు మైనార్టీ ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో పోటీ చేసేందుకు ఎఐఎం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దీంతో ఈసారి రాష్ట్ర రాజకీయాల్లో పోటీ రసవత్తరంగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్-ఎన్సీపీల మధ్య సీట్ల పంపకాలపై తుది నిర్ణయం ఇప్పట్లో వెలువడే సూచనలు కనిపించ డంలేదు. మహాకూటమిలో సీట్ల పంపకాలపై ఓ స్పష్టత వెలువడ్డాకే ప్రజాస్వామ్య కూటమి సీట్ల పంపకాలపై నిర్ణయం వెలువడవచ్చని కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు చెబుతున్నారు. -
కాషాయ బంధం నిలిచింది!
శివసేన, బీజేపీ పొత్తు ఓకే శివసేనకు 151, బీజేపీకి 130, మిత్రపక్షాలకు 7 సీట్లు ఇచ్చేలా కుదిరిన అవగాహన ముంబై/న్యూఢిల్లీ: పాతికేళ్ల బంధం నిలబడింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తును కొనసాగించాలని బీజేపీ, శివసేనలు నిర్ణయించాయి. సీట్ల సర్దుబాటులో ఏర్పడ్డ ప్రతిష్టంభనను తొలగించేందుకు రెండు పార్టీల రాష్ట్రస్థాయి నేతలు మంగళవారం సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీట్ల పంపకానికి సంబంధించి ఒక కొత్త ప్రతిపాదనపై చర్చ జరిపామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్, బీజేపీ నేత వినోద్ తావ్దే తెలిపారు. ఆ ప్రతిపాదన వివరాలను మాత్రం వారు వెల్లడించలేదు. అయితే, పార్టీ వర్గాల సమాచారం మేరకు ఆ ప్రతిపాదనలో.. బీజేపీకి 130 స్థానాలు ఇచ్చేందుకు శివసేన అంగీకరించింది. అదే సమయంలో తాము మొదట్నుంచీ చెబుతున్నట్లుగా 151 సీట్లలో సేన పోటీ చేస్తుంది. బీజేపీకి పెరిగే సీట్ల మేరకు మహాకూటమి(మహాయుతి)లోని ఇతర పార్టీలకు కేటాయించిన సీట్లలో కోత విధిస్తారు. కూటమిలోని మిత్రపక్షాలైన ఆర్పీఐ(అథవలే), రాష్ట్రీయ సమాజ్‌పక్ష్, స్వాభిమాని షేత్కారీ పక్ష్, శివ్ సంగ్రామ్లతో ఈ ప్రతిపాదనపై చర్చించి, వాటి ఆమోదం తరువాత దీన్ని అధికారికంగా ప్రకటిస్తారు. పై ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే ఆ మిత్రపక్షాలకు 7 స్థానాలు మాత్రమే మిగుల్తాయి. బీజేపీకి 119 స్థానాలకు మించి ఇవ్వబోమని శివసేన తేల్చిచెప్పడం, కనీసం 130 సీట్లు కావల్సిందేనని బీజేపీ పట్టుబట్టడంతో పొత్తు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడటం తెలిసిందే. ప్రజలు కోరుకుంటున్నారు: ఉద్ధవ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్న తన ఆశను పక్షం రోజుల క్రితం బహిరంగంగా వెల్లడించిన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అది ప్రజల ఆకాంక్షేనంటూ మంగళవారం మాట మార్చారు. కాంగ్రెస్, ఎన్సీపీ చర్చలు అసంపూర్ణం కాంగ్రెస్, ఎన్సీపీల పొత్తుపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇరు పార్టీల నేతలు మంగళవారం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అధికారిక నివాసంలో మంగళవారం జరిగిన సుదీర్ఘ చర్చల్లో 124 స్థానాల్లో పోటీ చేయాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను ఎన్సీపీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. 144 సీట్లు కావాల్సిందేనని పట్టుబట్టింది. కాగా, ఎన్సీపీతో పొత్తు కొనసాగుతుందన్న ఆశాభావాన్ని కాంగ్రెస్ వ్యక్తం చేసింది. -
రాజీ బాటలోనే ‘కమలం’
ఇటీవలి ఉప ఎన్నికల్లో వరసపెట్టి దెబ్బతిన్న కారణంగా బీజేపీ ఆచితూచి అడుగులేస్తోంది. అందువల్లే మహారాష్ట్రలో శివసేనతో ఏదో విధంగా రాజీ పడాలని చూస్తోంది. ఇటీవల యూపీ, రాజస్థాన్, బీహార్ తదితర రాష్ట్రాల్లో ఉప ఎన్నికల్లో దెబ్బతిన్న బీజేపీ వచ్చే నెలలో మహారాష్ట్ర, హర్యానాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలకు తన వ్యూహానికి పదును పెట్టుకుంటోంది. ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఆచి తూచి వ్యవహరించే సూచనలు కనబడుతున్నాయి. ముఖ్యంగా యూపీ, రాజస్థాన్, గుజరాత్ ఉప ఎన్నికల్లో ఓటమికి గురి కానట్లయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో శివసేనతో సీట్ల పంపిణీలో బీజేపీ మరింత మెరుగ్గా బేరసారాలు చేయడా నికి వీలయ్యేది. కేంద్రంలో తిరుగులేని మెజారిటీతో అధికారం కైవసం చేసుకున్న జాతీయ పార్టీ బీజేపీ మహారాష్ట్రలో ఒక స్థానిక పార్టీతో సీట్ల ఒప్పందం విషయంలో ఏదో విధంగా రాజీ పడాలని చూస్తోంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసినప్పటినుంచి గత మూడునెలల్లో జరిగిన పరిణామాల పర్యవసానంలో భాగమే ఈ రాజీ అని చెప్పాలి. ఇటీవలి ఉప ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ జయకేతనం ఎగురవేస్తే, గుజరాత్, రాజస్థాన్‌లలో బీజేపీ కంచుకోటలను కాంగ్రెస్ బద్దలు చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో కుదేలైపోయిన కాంగ్రెస్ ప్రతినిధులు ఈ వందరోజుల్లో తొలి సారిగా మీడియా ముందు చిరునవ్వులు చిందించారంటే ఉప ఎన్నికలపై అంచనాలు ఎలా తారుమార య్యాయో అర్థమవుతుంది. మూడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు రెండు అంశాలపై అత్యంత స్పష్టతనిచ్చాయి. మోదీ ప్రభంజనంగా చెబుతున్నది బీజేపీ స్వయం ప్రకాశం కాదు. కాంగ్రెస్ పార్టీపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఏర్పడిన తీవ్ర అసంతృప్తి, ప్రభుత్వ వ్యతిరేకతా ఓటే మోదీని అందలమెక్కించింది. జాతీయ నిర్మాణంపై కోటి ఆశలు రేకెత్తించిన మోదీ బలమైన వ్యక్తిత్వం దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని ఆయనకు అనుకూలంగా మలచింది తప్పితే దీంట్లో బీజేపీ ఘనత లేదు. రెండోది. ఎవరు ఔనన్నా కాదన్నా హిందూత్వ ప్రాతిపదికన సాగే ప్రచారం మన దేశ ప్రజలను ఆకర్షించబోదు. యూపీ, గుజరాత్, రాజస్థాన్ అసెంబ్లీ ఉప ఎన్నికలు నిర్ద్వంద్వంగా ఈ విషయాన్ని నిరూపించాయి. ఉప ఎన్నికలు వ్యక్తిగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు, సంస్థగా పార్టీకి పరాభవాన్ని కొని తెచ్చాయనడం కంటే సార్వత్రిక ఎన్నికల తర్వాత మత ప్రాతిపదికన ప్రజలను సమీకరించాలని బీజేపీ, ఆరెస్సెస్ తీవ్రస్థాయిలో చేసిన ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారంటేనే వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. యూపీ ఉప ఎన్నికల్లో ఇదెంత గొప్పగా రుజువయిందంటే అమిత్‌షా ఎన్నికల ఫలితాల అనంతరం ఎంత ధీరత్వంతో కనిపించినప్ప టికీ పరాభవ భారం స్పష్టంగా కనిపించింది. సమాజ్‌వాదీ, బీఎస్పీ పార్టీల పెట్టని కోటగా ఉన్న యూపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ స్థానాలు కొల్లగొట్టిన సంరంభాన్ని ఉప ఎన్నికలు తుడిచిపెట్టేశాయి. దేశంలోనే మత ఘర్షణల పరంగా అత్యంత ఉద్రిక్తంగా ఉంటున్న యూపీలో మతతత్వం, లవ్ జిహాద్ నినాదంతో ఉపఎన్నికల ప్రచారాన్ని ఆరెస్సెస్ దాని అనుబంధ సంస్థలూ ఎంత తీవ్రంగా కొనసాగించినా ఓటమి తప్పలేదు. మతఘర్షణలు చెలరేగిన షహరాన్‌పూర్ నియోజకవర్గంలో కూడా బీజేపీ పాగా వేయలేక పోవడం గమనార్హం. స్వీయ ప్రయోజనాలు, విధ్వంస రాజకీయాలను తిప్పికొట్టగలిగిన పరిణతి భారత సామాన్య ప్రజానీకానికి ఉందని ఎమర్జెన్సీ తదుపరి ఇందిరా గాంధీ ఓటమి నుంచి పదే పదే రుజువవుతూనే ఉంది. ఆయా రాష్ట్రాల్లో పార్టీ అనూహ్య ఓటమిని బీజేపీ కూడా స్థానిక నేతలపై నెట్టివేయవచ్చు. కాని ఉప ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి అత్యంత విలువైన గుణపాఠాలు నేర్పాయి. అదేమిటంటే నరేంద్ర మోదీ వేరు, బీజేపీ వేరు. ఉపఎన్నికలు ప్రధాని మోదీపై తీర్పు కాదు. తనను ప్రధానిని చేసిన ప్రజాదరణకు ఆయన దూరం కాలేదు. దెబ్బతిన్నదల్లా పార్టీగా బీజేపీ, దాని అధ్యక్షుడు అమిత్‌షా. యూపీ అసెంబ్లీ ఉప ఎన్నికలు పూర్తిగా అమిత్‌షా కనుసన్నలలో నడిచాయి. అయినా మూడు నెలల్లోపే ఆయనకు అక్కడ శృంగభంగం తప్పలేదు. ఈ ఫలితాల నుంచి సరైన గుణపాఠం తీసుకోకుంటే వ్యాధి నివారణ ఎన్నటికీ సాధ్యం కాదు. అది కేంద్ర ప్రభుత్వంపై కూడా ప్రభావం చూపే ప్రమాదముంది. మోదీ చలువతో అమిత ప్రాభవం సాధించిన అమిత్ షాకు శృంగభంగం కావటం బీజేపీలోనే చాలామందికి సంతోషం కలిగింది. ఈ నేపథ్యంలో త్వరలో జరుగనున్న హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మతపర విభజనలు, విద్వేష ప్రచారాన్ని కొనసాగించాలా లేదా అనేది బీజేపీ తేల్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే మహారాష్ట్రలో తమ మైత్రిని ఫణంగా పెట్టి సీట్ల గొడవను రచ్చకీడ్చిన శివసేన, బీజేపీల భవిష్యత్తును ఆ రాష్ట్ర ప్రజలే తేల్చాలి. ఇక జాట్ రాజకీయాలే కీలకంగా ఉన్న హర్యానాలో బీజేపీ, స్థానిక పార్టీలు సైతం అమిత్ షా పనిశైలిపట్ల అంత సంతోషంగా లేరు. మొత్తం మీద ఉప ఎన్నికల అనంతరం బీజేపీ పరిస్థితి సజావుగా లేదు. పైకి అమిత్ షా ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం మాత్రం మునుపటిలా లేదు. ప్రధాని మోదీకి మలినం అంటని నేపథ్యంలో తాజా ఎన్నికలను బీజేపీ ఎలా ముగిస్త్తుందన్నది ఆసక్తికరం. కె. రాజశేఖరరాజు -
అబ్బే.. అదేం లేదు!
ముంబై: పక్షం రోజుల కిందట ముఖ్యమంత్రి కావాలన్న అభిలాషను వ్యక్తం చేసిన శివసేన అధినేత ఉద్ధవ ఠాక్రే ఇప్పుడు మాట మార్చారు. తనకు అటువంటి కోరికే లేదని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనకు మద్దతు తెలిపేందుకు, తనను ఆశీర్వదించేందుకు వార్కారీ సమాజ్‌కు చెందిన వారు మంగళవారం తన వద్దకు వచ్చారని ఉద్ధవ్ తెలిపారు. తనపట్ల వారు కురిపించిన ప్రేమ తనకు చాలని అన్నారు. తనకు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ లేదని చెప్పారు. విఠల్ భక్తులైన వార్కారీ సమాజ్ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి కావాలని ఉంటుందని, ఆ కుర్చీ కోసం పోట్లాడుతారని అన్నారు. ‘నేను ఎంత అదృష్టవంతుడినో చూడండి. నా తలపై కిరీటం వద్దని నేననుకుంటున్నాను. ప్రజలేమో నన్ను సీఎంగా చూడాలనుకుంటున్నారు. ఈ ప్రేమను గెలుచుకోవాలి’ అని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. మరోవైపు కాషాయ కూటమిలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్ధవ్ ఉండాలని శివసేన పట్టుబడుతోంది. కానీ బీజేపీ మాత్రం ఎన్నికల తర్వాతనే నాయకుడిని ప్రకటించాలని భావిస్తోంది. ఈనెల 13 వ తేదీన ఓ టీవీ చానెల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఉద్ధవ్ ఠాక్రే, మొదటిసారిగా ఓ బహిరంగ వేదికపై నుంచి, తాను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు తనకో అవకాశం ఇవ్వాలని కోరుతున్నానని, ఆపై వారికి ఫిర్యాదు చేసే అవకాశం తానివ్వబోనని ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రి పదవి కోసం కలలు కనడం లేదని, అయితే ఆ బాధ్యత లభిస్తే మాత్రం వెనుకంజ వేయబోనని చెప్పారు. నేటి దినాల్లో ముఖ్యమంత్రులు ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం లేదని, వైమానిక సందర్శనలు చేసి ఆ తర్వాత పండర్పూర్ యాత్రకు వెళ్లిపోతారని ఉద్ధవ్ విమర్శించారు. ఎమ్మెన్నెస్‌పై కూడా ఉద్ధవ్ విమర్శలు సంధించారు. ప్రస్తుతం కాంగ్రెస్, ఎన్సీపీపై తాము పోరాడుతున్నామని,ఈ బరిలో మూడో పక్షం కూడా ఉందని ఆయన ఎమ్మెన్నెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ మూడో ఖాళీ ఎన్నడూ భర్తీ కాదని, అవసరమైతే దానికి (ఎమ్మెన్నెస్) వ్యతిరేకంగా కూడా తాము పోరాడుతామని ఠాక్రే స్పష్టం చేశారు. నిర్లక్ష్యాన్ని సహించం: రాందాస్ సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల్లో తమను నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని మహాకూటమి నాయకులను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే హెచ్చరించారు. మంత్రాలయలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. మహాకూటమిలో సీట్లసర్దుబాటుపై లుకలుకలుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాకూటమికి తమతో అవసరం లేదనుకుంటే, ఆ విషయాన్ని తమకు ముఖాముఖి చెప్పేస్తే ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కుంటామన్నారు. ఇరుపార్టీల నాయకులు తొందరపడవద్దని హితవు పలికారు. ‘పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ ప్రజాస్వామ్య కూటమిని గద్దె దింపే సమయం ఆసన్నమైంది.. మహాకూటమికి అధికారాన్ని చేజిక్కించుకునే సమయం దగ్గరపడింది..ఇలాంటి సందర్భంలో గత 25 ఏళ్లుగా కొనసాగుతున్న బంధాన్ని చెడగొట్టుకోవడం భావ్యంకాద’న్నారు. ఇరు పార్టీల నాయకుల్లో ఎవరో ఒకరు కొంత మెతక వైఖరి అవలంభించాలని ఆయన సూచించారు. లేదంటే అధికారం కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి చేతిలోకి వెళుతుందని హెచ్చరించారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తనతో సంప్రదించిన విషయం వాస్తవేమనన్నారు. దళితుల ఓట్లు గ్రేస్ మార్కుల లాంటివని, ఒకవేళ మహాకూటమి పొత్తు బెడిసి కొడితే ఎన్సీపీలోకి రావాలని పవార్ విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. ఒకవేళ మహాకూటమి విడిపోతే తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే, అత్యధిక స్థానాలు ఇచ్చే పార్టీకి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. -
ఎమ్మెన్నెస్‌కు మరో షాక్
సాక్షి, ముంబై : నాసిక్‌లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్)కు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు శివసేనలో చేరారు. ఎమ్మెన్నెస్ కార్పొరేటర్లైన నిలేష్ శెలార్, శోభనా షిందే బుధవారం మాతోశ్రీలో ఉద్దవ్ సమక్షంలో శివసేన తీర్థం పుచ్చుకున్నారు. తాము ఊహించినట్టుగా ఎమ్మెన్నెస్‌తో అభివృద్ధి జరగలేదని, అందుకే తాము శివసేనలో చేరినట్టు వారు పేర్కొన్నారు. ఎమ్మెన్నెస్‌కు షాక్ నాసిక్ మేయర్ ఎన్నికలు ఎమ్మెన్నెస్‌కు మరింత సమస్యగా మారనుంది. గత ఎన్నికల్లో బీజేపీతో జతకట్టిన ఎమ్మెన్నెస్ నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారం చేపట్టింది.ఈ సారి ఎన్నికల్లో మాత్రం ఎమ్మెన్నెస్‌తో బీజేపీ తెగదెంపులు చేసుకుంది. మళ్లి శివసేన, బీజేపీ, ఆర్పీఐలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒంటరైన ఎమ్మెన్నెస్‌కు ఇద్దరు కార్పొరేటర్లు పార్టీని వీడిచి వెళ్లిపోయారు. వారిద్దరూ శివసేనలో చేరడం మరింత షాక్‌కు గురి చేసింది. మహాకూటమికే అధికారం: ఉద్దవ్ ఠాక్రే నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్లో మహాకూటమి అధికారంలోకి వస్తుందన్న ధీమాను శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే వ్యక్తం చేశారు. శివసేనలో చేరిన ఇద్దరు కార్పొరేటర్లకు స్వాగతం ఆయన స్వాగతం పలికారు. శుక్రవారం జరగబోయే ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని తమ అభ్యర్థి మేయర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
కార్పొరేటర్ పదవి రద్దు
సాక్షి, ముంబై: తప్పుడు కులధ్రువీకరణ పత్రం సమర్పించినందుకుగాను ఎమ్మెన్నెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక శృంగారే కార్పొరేటర్ పదవిని ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేయాలని ప్రియాంక నిర్ణయించుకున్నారు. 2012 ఫిబ్రవరిలో జరిగిన నగర పాలక సంస్థ (బీఎంసీ) ఎన్నికల్లో విఖ్రోలిలోని కన్నంవార్ నగర్ వార్డు నంబరు 112 నుంచి ఎమ్మెన్నెస్ టికెట్పైప ఎస్సీ రిజర్వేషన్ కోటా కింద ప్రియాంక శృం గారే పోటీ చేశారు. అప్పట్లో నామినేషన్ పత్రాలతో ఆమె కులధ్రువీకరణ పత్రం సమర్పించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె తప్పుడు కులధ్రువీకరణ పత్రం సమర్పించారని ఆరోపిస్తూ రెండో స్థానంలో నిలిచిన శివసేనకు చెందిన అభ్యర్థి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వాస్తవాలను పరిశీలించిన కుల ధ్రువీకరణ పరిశీలన కమిటీ సదరు పత్రం సరైనది కాదంటూతేల్చి చెప్పిం ది. దీంతో ఆమె కార్పొరేటర్ పదవిని రద్దు చేస్తున్నట్లు మేయర్ సునీల్‌ప్రభు ప్రకటించారు. అంతేగాకుండా 2012 ఏప్రిల్ 17 నుంచి ఆమె బీఎంసీ ద్వారా పొం దిన గౌరవ వేతనం, ఇతర భత్యాలు, ఫలాలు తిరిగి తీసుకుంటామన్నారు. అంతటితో ఊరుకోకుండా ఆమెకు బీఎంసీ పరిపాలనా విభాగం అందజేసిన ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, ఫోన్ బిల్లుల తాలూకు సొమ్మును తిరిగి వసూలు చేసుకుంటామన్నారు.అయితే ప్రియాంక శృంగారే కార్పొరేటర్ పదవి రద్దు కావడంతో ఈ వార్డులో ఉప ఎన్నిక నిర్వహిస్తారా? లేక రెండో స్థానంలో నిలిచిన శివసేనకు చెందిన శ్రద్ధా రుకేకు కట్టబెడతారా? అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. దీనిపై త్వరలో తుది నిర్ణయం తీసుకుం టామని మేయర్ సునీల్ ప్రభు చెప్పారు.