రాజీ బాటలోనే ‘కమలం’
ఇటీవలి ఉప ఎన్నికల్లో వరసపెట్టి దెబ్బతిన్న కారణంగా బీజేపీ ఆచితూచి అడుగులేస్తోంది. అందువల్లే మహారాష్ట్రలో శివసేనతో ఏదో విధంగా రాజీ పడాలని చూస్తోంది.
ఇటీవల యూపీ, రాజస్థాన్, బీహార్ తదితర రాష్ట్రాల్లో ఉప ఎన్నికల్లో దెబ్బతిన్న బీజేపీ వచ్చే నెలలో మహారాష్ట్ర, హర్యానాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలకు తన వ్యూహానికి పదును పెట్టుకుంటోంది. ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఆచి తూచి వ్యవహరించే సూచనలు కనబడుతున్నాయి. ముఖ్యంగా యూపీ, రాజస్థాన్, గుజరాత్ ఉప ఎన్నికల్లో ఓటమికి గురి కానట్లయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో శివసేనతో సీట్ల పంపిణీలో బీజేపీ మరింత మెరుగ్గా బేరసారాలు చేయడా నికి వీలయ్యేది. కేంద్రంలో తిరుగులేని మెజారిటీతో అధికారం కైవసం చేసుకున్న జాతీయ పార్టీ బీజేపీ మహారాష్ట్రలో ఒక స్థానిక పార్టీతో సీట్ల ఒప్పందం విషయంలో ఏదో విధంగా రాజీ పడాలని చూస్తోంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసినప్పటినుంచి గత మూడునెలల్లో జరిగిన పరిణామాల పర్యవసానంలో భాగమే ఈ రాజీ అని చెప్పాలి. ఇటీవలి ఉప ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ జయకేతనం ఎగురవేస్తే, గుజరాత్, రాజస్థాన్‌లలో బీజేపీ కంచుకోటలను కాంగ్రెస్ బద్దలు చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో కుదేలైపోయిన కాంగ్రెస్ ప్రతినిధులు ఈ వందరోజుల్లో తొలి సారిగా మీడియా ముందు చిరునవ్వులు చిందించారంటే ఉప ఎన్నికలపై అంచనాలు ఎలా తారుమార య్యాయో అర్థమవుతుంది.
మూడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు రెండు అంశాలపై అత్యంత స్పష్టతనిచ్చాయి. మోదీ ప్రభంజనంగా చెబుతున్నది బీజేపీ స్వయం ప్రకాశం కాదు. కాంగ్రెస్ పార్టీపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఏర్పడిన తీవ్ర అసంతృప్తి, ప్రభుత్వ వ్యతిరేకతా ఓటే మోదీని అందలమెక్కించింది. జాతీయ నిర్మాణంపై కోటి ఆశలు రేకెత్తించిన మోదీ బలమైన వ్యక్తిత్వం దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని ఆయనకు అనుకూలంగా మలచింది తప్పితే దీంట్లో బీజేపీ ఘనత లేదు. రెండోది. ఎవరు ఔనన్నా కాదన్నా హిందూత్వ ప్రాతిపదికన సాగే ప్రచారం మన దేశ ప్రజలను ఆకర్షించబోదు. యూపీ, గుజరాత్, రాజస్థాన్ అసెంబ్లీ ఉప ఎన్నికలు నిర్ద్వంద్వంగా ఈ విషయాన్ని నిరూపించాయి. ఉప ఎన్నికలు వ్యక్తిగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు, సంస్థగా పార్టీకి పరాభవాన్ని కొని తెచ్చాయనడం కంటే సార్వత్రిక ఎన్నికల తర్వాత మత ప్రాతిపదికన ప్రజలను సమీకరించాలని బీజేపీ, ఆరెస్సెస్ తీవ్రస్థాయిలో చేసిన ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారంటేనే వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. యూపీ ఉప ఎన్నికల్లో ఇదెంత గొప్పగా రుజువయిందంటే అమిత్‌షా ఎన్నికల ఫలితాల అనంతరం ఎంత ధీరత్వంతో కనిపించినప్ప టికీ పరాభవ భారం స్పష్టంగా కనిపించింది. సమాజ్‌వాదీ, బీఎస్పీ పార్టీల పెట్టని కోటగా ఉన్న యూపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ స్థానాలు కొల్లగొట్టిన సంరంభాన్ని ఉప ఎన్నికలు తుడిచిపెట్టేశాయి. దేశంలోనే మత ఘర్షణల పరంగా అత్యంత ఉద్రిక్తంగా ఉంటున్న యూపీలో మతతత్వం, లవ్ జిహాద్ నినాదంతో ఉపఎన్నికల ప్రచారాన్ని ఆరెస్సెస్ దాని అనుబంధ సంస్థలూ ఎంత తీవ్రంగా కొనసాగించినా ఓటమి తప్పలేదు. మతఘర్షణలు చెలరేగిన షహరాన్‌పూర్ నియోజకవర్గంలో కూడా బీజేపీ పాగా వేయలేక పోవడం గమనార్హం. స్వీయ ప్రయోజనాలు, విధ్వంస రాజకీయాలను తిప్పికొట్టగలిగిన పరిణతి భారత సామాన్య ప్రజానీకానికి ఉందని ఎమర్జెన్సీ తదుపరి ఇందిరా గాంధీ ఓటమి నుంచి పదే పదే రుజువవుతూనే ఉంది. ఆయా రాష్ట్రాల్లో పార్టీ అనూహ్య ఓటమిని బీజేపీ కూడా స్థానిక నేతలపై నెట్టివేయవచ్చు. కాని ఉప ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి అత్యంత విలువైన గుణపాఠాలు నేర్పాయి. అదేమిటంటే నరేంద్ర మోదీ వేరు, బీజేపీ వేరు. ఉపఎన్నికలు ప్రధాని మోదీపై తీర్పు కాదు. తనను ప్రధానిని చేసిన ప్రజాదరణకు ఆయన దూరం కాలేదు. దెబ్బతిన్నదల్లా పార్టీగా బీజేపీ, దాని అధ్యక్షుడు అమిత్‌షా. యూపీ అసెంబ్లీ ఉప ఎన్నికలు పూర్తిగా అమిత్‌షా కనుసన్నలలో నడిచాయి. అయినా మూడు నెలల్లోపే ఆయనకు అక్కడ శృంగభంగం తప్పలేదు. ఈ ఫలితాల నుంచి సరైన గుణపాఠం తీసుకోకుంటే వ్యాధి నివారణ ఎన్నటికీ సాధ్యం కాదు. అది కేంద్ర ప్రభుత్వంపై కూడా ప్రభావం చూపే ప్రమాదముంది.
మోదీ చలువతో అమిత ప్రాభవం సాధించిన అమిత్ షాకు శృంగభంగం కావటం బీజేపీలోనే చాలామందికి సంతోషం కలిగింది. ఈ నేపథ్యంలో త్వరలో జరుగనున్న హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మతపర విభజనలు, విద్వేష ప్రచారాన్ని కొనసాగించాలా లేదా అనేది బీజేపీ తేల్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే మహారాష్ట్రలో తమ మైత్రిని ఫణంగా పెట్టి సీట్ల గొడవను రచ్చకీడ్చిన శివసేన, బీజేపీల భవిష్యత్తును ఆ రాష్ట్ర ప్రజలే తేల్చాలి. ఇక జాట్ రాజకీయాలే కీలకంగా ఉన్న హర్యానాలో బీజేపీ, స్థానిక పార్టీలు సైతం అమిత్ షా పనిశైలిపట్ల అంత సంతోషంగా లేరు. మొత్తం మీద ఉప ఎన్నికల అనంతరం బీజేపీ పరిస్థితి సజావుగా లేదు. పైకి అమిత్ షా ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం మాత్రం మునుపటిలా లేదు. ప్రధాని మోదీకి మలినం అంటని నేపథ్యంలో తాజా ఎన్నికలను బీజేపీ ఎలా ముగిస్త్తుందన్నది ఆసక్తికరం.
కె. రాజశేఖరరాజు