‘పులి’స్వారీకి బీజేపీ ఇక సరి
మహారాష్ట్రులు శివసేనను మాత్రమే ఆదరిస్తారనీ, గుజరాత్‌కు చెందిన మోదీ, అమిత్‌షాల ఆధిపత్యాన్ని అంగీకరించబోరనీ శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ వ్యాఖ్యానించింది. ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలు చూస్తే మోదీ గాలి లేదని తేలిపోయిందని కూడా శివసేన నేతలు భాష్యాలు ఆరంభించారు.
అక్టోబర్ 15న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో అనూహ్యమైన పరిణామాలు సంభవించాయి. ఆ రెండు రాష్ట్రాలలో తన మిత్ర పక్షాలకు బీజేపీ మొట్టికాయ వేసింది. హర్యానా జనహిత పార్టీ నాయకుడు కుల్దీప్ బిష్ణోయి గొంతెమ్మ కోర్కెలను నిష్కర్షగా తోసిపుచ్చింది. ఇంకో అడుగు ముందుకు వేసి మహారాష్ట్రలో పాతికేళ్లుగా శివసేనతో నెరపుతున్న మైత్రికి కూడా మంగళం పాడింది. మిత్రపక్షాలు ఆడమన్నట్టు ఆడే ందుకు బీజేపీ నిరాకరించింది. ఆ పార్టీల చేతులలో అవమానాలు పొందడానికీ, అవి చేస్తున్న బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగడానికీ బీజేపీ సిద్ధంగా లేదు. నిజానికి కొన్ని సందర్భాలలో బెదిరింపులు అనుకున్న ఫలితాలను ఇవ్వలేవు.
మిత్రులకు మొట్టికాయ
శివసేన ప్రస్తుత నేత ఉద్ధవ్ ఠాక్రే, హర్యానా జనహిత పార్టీ నాయ కుడు కుల్దీప్ ఇద్దరూ తండ్రుల నుంచి రాజకీయాలను వారసత్వంగా పుచ్చుకున్నవారే. ఉద్ధవ్ పార్టీ కోసం ఏ రోజూ ఏమీ చేయలేదు. తండ్రి బాల్ ఠాక్రే ఆయన కోసం సర్వం సిద్ధం చేసిపెట్టారు. ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే. 24 సంవత్సరాల ఈ యువకుడు తనను ప్రధాని నరేంద్ర మోదీ, లేదంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతోనూ సమ స్థాయిలో చూడాలని ఆశపడుతున్నాడు. కుల్దీప్ అల నాటి కాంగ్రెస్ నేత భజన్‌లాల్ తనయుడే. తాను మహా పురుషుల కోవలోనివాడినని కుల్దీప్ ప్రగాఢ విశ్వాసం. ఎవరూ అంగీకరించలేని డిమాండ్లను బీజేపీ ముందు పెట్టాడు. ఒకటి వాస్తవం- బీజేపీ ఢిల్లీ పీఠం మీద ఉన్నప్పటికీ మహారాష్ట్రలో అధికారం చేపట్టాలంటే శివసేన చేయూతనీ, హర్యానా ఎన్నికలలో విజయం సాధించాలంటే కుల్దీప్ మద్దతునూ తీసుకోకతప్పదు. ఆ రెండు రాష్ట్రాలలోనూ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారం చేపట్టకుండా చేయడం బీజేపీకి అనివార్యం. ఈ కృషిలో విఫలమైతే అది ఆ పార్టీకి ఎదురుదెబ్బే. నిజానికి బాగా ధనికులైన వ్యాపార వేత్తలతో పాటు, కోట్లకు పడగలెత్తిన రాజకీయ నాయకులు కూడా ఆ రెండు రాష్ట్రాలలోనే ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ కనుక మళ్లీ అధికారంలోకి రాగలిగితే అది పార్టీకి గొప్ప సాంత్వన కలిగించే పరిణామమే.
సేనతో పాతికేళ్ల పొత్తుకు స్వస్తి
ఈ నేపథ్యంలో శివసేనతో బీజేపీ తన చిరకాల మైత్రికి స్వస్తి పలకడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. నిజానికి శివసేన లేకుండా ఎన్నికలకు వెళ్లడం ఎంత కష్టమో బీజేపీకి తెలియనిది కాదు. దీనివల్ల చేదు ఫలితాలు తప్పవని కూడా తెలుసు. అయినా మైత్రికి స్వస్తి పలకక తప్పని పరిస్థితులు ఏర్పడినాయి. ఆ రెండు పార్టీలది విజయవంతమైన పొత్తు. ఆ కూటమి 1994లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఎన్డీయే ప్రభుత్వానికి ఈ కలయిక వల్ల ఎంతో లబ్ధి చేకూరింది. ఆఖరికి 2014 సాధారణ ఎన్నికలలో అక్కడి 48 లోక్‌సభ స్థానాలకు గాను 42 ఈ కూటమే హస్తగతం చేసుకుంది. ఈ విజయం మోదీ వల్లనే సాధ్యమైందని బీజేపీ సహజంగానే భావిస్తోంది. అందుకే, ఇంతకాలం అక్కడి రాజకీయాలలో శివసేన తరువాతి స్థానానికే పరిమితమైన బీజేపీ ఇప్పుడు పదో న్నతిని కోరుకుంటోంది. దీనితో పాటు ఉద్ధవ్ నాయకత్వంలో శివసేన బలహీన పడింది. వెరసి ఈసారి అసెంబ్లీ పోరులో తమకు ఎక్కువ స్థానాలు కేటాయిం చాలనీ, ఆఖరికి ముఖ్యమంత్రి పదవి కూడా తమ పార్టీ అభ్యర్థికి దక్కాలనీ బీజేపీ భావించింది. అదే సమయంలో ఉద్ధవ్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శివసేన ప్రకటనలు గుప్పించింది. దీనితో ఆ రెండు పార్టీల మధ్య పెరిగిన అగాధం ఎంతటిదో వెల్లడైంది. శివసేనతో సరైన పద్ధతిలో వ్యవహరించగల నేర్పు ఉన్న గోపీనాథ్ ముండే వంటి నాయకుడి హఠాన్మరణం కూడా బీజేపీకి పెద్ద లోటు. కానీ సీనియర్లు లేని లోపం శివసేనకు ఉంది. గడచిన ఎనిమిదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కారణంగా శివసైనికులలో ఏర్పడిన నైరాశ్యాన్ని పారద్రోలాలన్నా ఆ పార్టీకి ఇప్పుడు అధికారం అవసరం. పైగా శివసేన నాయకత్వం కోసం పోటీ పడి గత కొద్దికాలం నుంచి ఉద్ధవ్‌కి పోటీగా మారిన సోదరుడి వరస నాయకుడు రాజ్ ఠాక్రే కూడా పార్టీని బలహీనపరిచాడు. నిజానికి బాల్ ఠాక్రే మరణంతోనే శివసేన ప్రాభవం పోయిందని చాలామంది అభిప్రాయం. అలాగే ఉద్ధవ్ కాంగ్రెస్‌ను గానీ, శరద్‌పవార్ ఎన్సీపీని గానీ నిలువరించగల దీటైన నేత కాదు. కానీ 2014లో బీజేపీ విజయం శివసేనలో ఆశలు రేపింది.
మోదీతో మారిన దృశ్యం
పదిహేను మంది ఎంపీలు మాత్రమే ఉన్నప్పటికీ వాజపేయి హయాంలో శివసేన పలు మంత్రి పదవులతో పాటు, లోక్‌సభ స్పీకర్ పదవిని కూడా దక్కించుకోగలి గింది. ఇప్పుడు 22 మంది ఎంపీలు ఉన్నప్పటికీ మోదీ మంత్రివర్గంలో శివసేనకు చిన్న మంత్రిత్వ శాఖ మాత్రమే లభించింది. మోదీ మిగిలిన బీజేపీ నాయకుల మాదిరిగా కాదని శివసేనకు అనుభవానికి వచ్చింది. దీనితో పాటు మహారాష్ట్రలో తమ పార్టీ ప్రాధాన్యాన్ని ఇకపై తగ్గిస్తారన్న అనుమానం కూడా వారిలో మొదలైంది. అందుకే మరోసారి తమ పార్టీ అభ్యర్థి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడాలని శివసేన భావిస్తోంది.
దూషణ పర్వంలో మిత్రపక్షం
పొత్తు చెడిన తరువాత శివసేన మీడియా యుద్ధం ఆరంభించింది. మోదీ ప్రభా వం పార్లమెంటు ఎన్నికలకే పరిమితమనీ, మహారాష్ట్ర ఎన్నికలలో ఆ ప్రభావం ఉండదనీ ఆ పార్టీ నాయకులు ప్రచారం ప్రారంభించారు. మహారాష్ట్ర బీజేపీ నేత లకు ఒక స్థాయి అంటూ ఏమీలేదని కూడా శివసేన విమర్శలు మొదలుపెట్టింది. మహారాష్ట్రులు శివసేనను మాత్రమే ఆదరిస్తారనీ, గుజరాత్‌కు చెందిన మోదీ, అమిత్‌షాల ఆధిపత్యాన్ని అంగీకరించబోరనీ శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ వ్యాఖ్యానించింది. ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలు చూస్తే మోదీ గాలి లేదని తేలి పోయిందని కూడా శివసేన నేతలు భాష్యాలు ఆరంభించారు. బీజేపీ ద్రవ్యో ల్బణాన్ని అరికట్టలేకపోయిందని కూడా ఎద్దేవా చేశారు. గడచిన నెలలో శివసేన నాయకులు బీజేపీ మీద చేసిన విమర్శలు విరోధులు కూడా చేయలేదంటే అతి శయోక్తి కాదు. మొత్తంగా ఒక అపరిపక్వ ధోరణిని శివసేన ప్రదర్శించింది.
అనుభవశూన్యులతో తంటా
ప్రధాని అభ్యర్థిగా మోదీని బీజేపీ ప్రకటించినప్పటికీ శివసేన ఆయనకు మద్దతు ప్రకటించలేదు. అప్పుడు ఎల్‌కే అద్వానీ, సుష్మాస్వరాజ్‌ల వైపు శివసేన మొగ్గు చూపడమే కాకుండా, మోదీ మీద పలు విమర్శలు కూడా సంధించింది. కానీ శివ సేన అంచనాలు తారుమారైనాయి. ఇప్పుడు ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే పెద్ద సమస్యగా పరిణమించాడు. ఇతడొక మేధావి అని ఉద్ధవ్ నిశ్చితాభిప్రా యం. కానీ ఇతడికి రాజకీయ అనుభవం లేకపోవడం అటుంచి, చాలా దూకుడు స్వభావం కలిగినవాడని పేరుంది. బీజేపీతో కఠినంగా వ్యవహరించవలసినదని తండ్రికి సలహా ఇచ్చినది ఇతడే. శివసేన అధికారం చేపట్టి తీరాలనీ, బీజేపీకి ముఖ్యమంత్రి పీఠం దక్కితే ఇక శివసేనకు భవిష్యత్తు లేదనీ, బీజేపీ బతకనివ్వ దనీ ఆదిత్య తండ్రికి నూరిపోశాడని చెబుతారు. శివసేన మినహా బీజేపీకి గత్యం తరం లేదని కూడా ఆదిత్య నమ్మకం. పొత్తు సమస్య పరిష్కారానికి బీజేపీ జాతీ య కార్యదర్శి ఓమ్ మాథుర్ ముంబై వస్తే ఆయన చర్చలకు వచ్చినది ఒక ఎమ్మె ల్యేనో, ఎంపీనో కాదు, ఆదిత్య వచ్చాడు. చివరికి దూకుడు స్వభావం కలిగిన ఉద్ధవ్‌ను ముఖ్యమంత్రిని చేయడం కంటె, మహారాష్ట్రను కోల్పోవడమే మంచి దన్న అభిప్రాయానికి బీజేపీ వచ్చింది. అందుకే బీజేపీకి మరో మార్గం లేకపో యింది. అపరిపక్వ, అనుభవ రాహిత్యంతో కూడిన సలహాలు విన్నందుకు శివ సేన సర్వం కోల్పోయే అవకాశమే ఎక్కువ. ఏమైనా బీజేపీ ఇప్పుడు పులి (శివ సేన గుర్తు) స్వారీ దిగుతోంది. స్వారీ చేయడం కాదు, దిగడమే అసలు సవాలు.
(వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) - పెంటపాటి పుల్లారావు