మంత్రిపై మరక.. పార్టీ చీఫ్ సీరియస్
మహారాష్ట్ర ప్రభుత్వంలోనే అత్యంత సీనియర్ మంత్రి అయిన ఏక్‌నాథ్ ఖడ్సే పదవికి ఎసరు వచ్చేలా ఉంది. అక్రమ భూదందాలలో ఆయన పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రావడం ఒక ఎత్తయితే.. తాజాగా ఆయన కాల్ రికార్డులలో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో ఆయన మాట్లాడినట్లు తేలడంతో బీజేపీ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. అవినీతిని ఏమాత్రం సహించబోమన్న పార్టీ విధానానికి అనుగుణంగా.. ఖడ్సే మీద వచ్చిన ఆరోపణలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా పార్టీ మహారాష్ట్ర శాఖను బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆదేశించారు. ఖడ్సే వ్యవహారాన్ని వీలైనంత త్వరగా తేల్చేయాలని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఆయన కోరినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం ఫడ్నవిస్.. రెవెన్యూమంత్రి ఖడ్సేను గత సోమవారం పిలిపించి దీనిపై చర్చించారు. వాస్తవానికి సోమవారమే ఖడ్సే రాజీనామా చేస్తారన్న కథనాలు వచ్చినా, ఆయన చేయలేదని బీజేపీ సీనియర్ నేత ఒకరు అన్నారు. ఈరోజు కాకపోతే రేపైనా ఆయన తప్పుకోక తప్పదని చెబుతున్నారు.
ఈ వ్యవహారం నేపథ్యంలో బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ఏక్‌నాథ్ ఖడ్సే డుమ్మాకొట్టారు. అంతేకాదు.. సోమవారం నుంచి ఆయన తన ఎర్రబుగ్గ కారును కూడా వాడటం మానేశారు. తొలుత ఒక హ్యాకర్, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఖడ్సేపై ఈ ఆరోపణలు చేశాయి. కానీ దావూద్‌తో ఖడ్సే మాట్లాడారనేందుకు ఆధారాలు ఏమీ లేవని బీజేపీలోనే కొన్నివర్గాలు అంటున్నాయి. దావూద్ ఇబ్రహీం ఫోన్లను ట్యాప్ చేసేందుకు మహారాష్ట్రలో ప్రత్యేకంగా నియమించిన స్పెషల్ క్రైంబ్రాంచి కూడా ఖడ్సేతో దావూద్ మాట్లాడాడనడానికి ఆధారాలేమీ లేవని అంటోంది. అయితే తాను దావూద్ ఇబ్రహీం ఫోన్ రికార్డులను హ్యాక్ చేశానని, అందులో ఖడ్సే నెంబరు కూడా ఉందని మనీష్ భంగాలే అనే హ్యాకర్ చెబుతున్నాడు.
ఇంకా.. గత ఏప్రిల్ నెలలో ఖడ్సే భార్యకు, అల్లుడికి దాదాపు రూ. 23 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూ. 3 కోట్లకే ఇచ్చేశారు. అది ప్రభుత్వ భూమి కాదని, ప్రైవేటు వ్యక్తుల నుంచి కొన్నామని.. మార్కెట్ వాల్యూను బట్టి స్టాంప్ డ్యూటీ కట్టామని ఖడ్సే అంటున్నారు.