ఆరోపణలు రుజువైతే రాజకీయాలకు గుడ్‌బై
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వంలో నంబర్ 2గా ఉన్న సీనియర్ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే తన పదవికి రాజీనామా చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. పుణెలో ప్రభుత్వ భూమి కొనుగోలులో అక్రమాలు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు ఫోన్‌కాల్స్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన శనివారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
తనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆరోపణల వల్ల తనపై మచ్చ రాకూడదనే రెవెన్యూ మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. 'ఫోర్జరీ పత్రాలతో నన్ను ఇరికించారు. నాకు వ్యతిరేకంగా చీప్ పబ్లిసిటీ స్టంట్ సృష్టించారు' అని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడితో కలిసి విలేకరులతో మాట్లాడిన ఆయన ప్రజల అభిమతానికి అనుగుణంగానే రాజీనామా చేశానని, తన రాజీనామా కొందరు స్వార్థపరులకు చెంపపెట్టు లాంటిందని అన్నారు. గత 40 ఏళ్లుగా బీజేపీ అభివృద్ధి కోసమే తాను పనిచేశానని, తనపై నిరాధార ఆరోపణలు మోపారని చెప్పారు. మరోవైపు రాజీనామా చేసిన ఖడ్సేకు బీజేపీ అండగా నిలిచింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు తొలగిపోయేవరకు ఆయన మంత్రిగా కొనసాగబోరని పేర్కొంది.