దావూద్ కాల్స్ వివాదం: ఆ నంబర్ నాదే!
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం నుంచి తనకు నిత్యం ఫోన్ కాల్స్ వస్తున్నట్టు వచ్చిన ఆరోపణలను బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే తోసిపుచ్చారు. దావూద్ భారత్‌కు తరచూ కాల్స్ చేసే జాబితాలో ఉన్న ఫోన్ నంబర్ తనదేనని, అయితే తనకు దావూద్ నుంచి ఎలాంటి కాల్స్ రాలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న దావూద్ భారత్‌లో అధికంగా కాల్ చేసిన ఫోన్ నంబర్లు తాజాగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో బీజేపీ నేత ఖడ్సే పేరు ఉండటం కలకలం రేపుతోంది.
ఈ వివాదంపై ఖడ్సే స్పందిస్తూ 'వారికి దావూద్ ఫోన్ నంబర్ తెలిస్తే మొదట పోలీసులకు ఆ విషయం ఎందుకు తెలియజేయలేదు. ఎందులో ఏదో గూడుపుఠాణి ఉన్నట్టు కనిపిస్తోంది. నా మీద ఆరోపణలు చేసిన వారికి దావూద్ నంబర్ ఎలా తెలిసిందే. దీనిపై పోలీసులు విచారణ జరుపాలి. గత ఏడాది కాలంలో నా ఫోన్‌కు విదేశీ కాల్స్ రావడం, విదేశాలకు ఫోన్ చేయడంగానీ చేయలేదు' అని చెప్పారు.
దావూద్ భారత్‌కు తరచూ కాల్ చేస్తున్న నాలుగు ఫోన్ నంబర్ల ఖడ్సే పేరు మీద తీసుకున్న నంబర్ కూడా ఉందని వడోదరకు చెందిన ఎథికల్ హ్యాకర్ మనీష్ భంగాలే హ్యాకింగ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దావూద్ నంబర్ ను హ్యాక్ చేయడం ద్వారా ఈ వివరాలు బయటపెట్టారు. ఈ నంబర్ల గురించి జాతీయ చానెళ్లలో కథనాలు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దావూద్ నిత్యం కాల్ చేస్తున్న ఫోన్ నంబర్లపై దర్యాప్తు జరుపుతామని బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది.