అంజలిపై అసభ్య వ్యాఖ్యలు.. బీజేపీ నేతపై కేసు
సాక్షి, ముంబై: ఓ ఉద్యమకారిణిపై అసభ్య వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీజేపీ నేత ఏక్‌నాథ్ ఖడ్సే పై కేసు నమోదు అయ్యింది. ఓ పబ్లిక పంక్షన్ లో ఆయన ప్రసంగిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ అంజలి అనే ఉద్యమకారిణి వకోలా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అంజలి దమానియా ఆప్ లో క్రియాశీలక నేతగా కూడా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 2న ఏక్‌నాథ్ తన పుట్టినరోజు సందర్భంగా జలగావ్‌లో ఓ సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ప్రసంగిస్తున్న వేళ అంజలిని ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆమె సన్నిహితుడొకరు ఆమెకు సమాచారం అందించగా, వకోలా పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై ఐపీసీ 509(మహిళలను కించపరిచేలా వ్యవహరించటం) ప్రకారం కేసు నమోదు చేశారు.
అయితే ఘటన జలగావ్‌లో చోటుచేసుకోవటంతో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు వకోలా అధికారులు తెలిపారు. తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఏక్‌నాథ్ చెబుతుండగా, తన దగ్గర వీడియో సాక్ష్యం ఉందని అంజలి వెల్లడించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏక్‌నాథ్‌పై గతేడాది అవినీతి ఆరోపణలు వినిపించగా, అంజలి మరికొందరితో కలిసి ఆ అంశంపై ప్రజా ప్రయోజన దాఖలు చేశారు. చివరకు ఆరోపణలు రుజువు కావటంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్‌నాథ్‌ను మంత్రి పదవి నుంచి తప్పించారు.