Anjali Damania
-
'నా భర్తతో చాట్ చేస్తుంటే దావూద్ ఫోన్ చేశాడు'
ముంబయి : ప్రముఖ ఉద్యమకారురాలు అంజలి దమానియాకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడంటూ ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీజేపీ నేత ఏక్నాథ్ ఖడ్సేపై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరిస్తున్నారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 'నేను నా భర్తతో చాటింగ్ చేస్తున్న సమయంలో అర్ధరాత్రి పూట నాకు ఓ ఫోన్ వచ్చింది. ట్రూకాలర్ ద్వారా ఆ నెంబర్ దావూద్‌ది అని తెలిసింది. పాకిస్థాన్ నెంబర్ నుంచే ఆ ఫోన్ వచ్చింది. తన ఫోన్లో దావూద్ 2 అని కనిపించింది. ఈ విషయాన్ని నేను ముంబయి కమిషనర్‌కు ఫిర్యాదు కూడా చేశాను. ఆయన తగిన చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారు' అని తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతేకాకుండా రెండు స్క్రీన్ షాట్లు కూడా పంపించారు. -
అంజలిపై అసభ్య వ్యాఖ్యలు.. బీజేపీ నేతపై కేసు
సాక్షి, ముంబై: ఓ ఉద్యమకారిణిపై అసభ్య వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీజేపీ నేత ఏక్నాథ్ ఖడ్సే పై కేసు నమోదు అయ్యింది. ఓ పబ్లిక పంక్షన్ లో ఆయన ప్రసంగిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ అంజలి అనే ఉద్యమకారిణి వకోలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అంజలి దమానియా ఆప్ లో క్రియాశీలక నేతగా కూడా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 2న ఏక్నాథ్ తన పుట్టినరోజు సందర్భంగా జలగావ్లో ఓ సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ప్రసంగిస్తున్న వేళ అంజలిని ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆమె సన్నిహితుడొకరు ఆమెకు సమాచారం అందించగా, వకోలా పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై ఐపీసీ 509(మహిళలను కించపరిచేలా వ్యవహరించటం) ప్రకారం కేసు నమోదు చేశారు. అయితే ఘటన జలగావ్లో చోటుచేసుకోవటంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వకోలా అధికారులు తెలిపారు. తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఏక్నాథ్ చెబుతుండగా, తన దగ్గర వీడియో సాక్ష్యం ఉందని అంజలి వెల్లడించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏక్‌నాథ్‌పై గతేడాది అవినీతి ఆరోపణలు వినిపించగా, అంజలి మరికొందరితో కలిసి ఆ అంశంపై ప్రజా ప్రయోజన దాఖలు చేశారు. చివరకు ఆరోపణలు రుజువు కావటంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్నాథ్ను మంత్రి పదవి నుంచి తప్పించారు. -
ఆప్ సీనియర్ లీడర్ రాజీనామా
ముంబై: ఆప్ నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యతిరేకవర్గం పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సీనియర్ నాయకుల మధ్య విభేదాలు తారా స్థాయిలో రగులుతూండగానే... మహారాష్ట్ర పార్టీ సీనియర్ లీడర్ అంజలి దామానియా పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె తన ట్విట్టర్ లో కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఆయన్ని నమ్మాను. ఆయన సిద్ధాంతాలకు మద్దతిచ్చాను తప్ప.. ఆయన రాజకీయ బేరసారాలకు కాదంటూ ట్వీట్ చేశారు. 2014 లో ఢిల్లీ అసెంబ్లీలో పూర్తి మెజార్టీ సాధించేందుకు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ మంతనాలు జరిపారని, బేరసారాలకు పాల్పడ్డారంటూ ఆప్ మాజీ ఎమ్మెల్యే రాజేష్ గార్గ్ విడుదల చేసిన ఆడియో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే అంజలి రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ పరిణామంపై స్పందించడానికి ఆప్ మంత్రి గోపాల్ రాయ్ తిరస్కరించారు. -
విలువలు పాటించాను..పార్టీని వీడుతున్నాను
ముంబై: మహారాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అంజలీ దమానీ పార్టీకి రాజీనామా చేశారు. ఈమెతో పాటు రాష్ట్ర కార్యదర్శి ప్రీతి మీనన్ కూడా ఆమ్ ఆద్మీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేత నితిన్ గడ్కరీపై పోటీ చేసి ఓటమి పాలైన అంజలీ.. తన రాజీనామా లేఖను ఆమోదించాలని ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కు విన్నవించారు. ఇందుకు గాను ఆమె ఆప్ పార్టీ సభ్యులకు గురువారం ఓ లేఖ రాశారు. 'నేను బరువెక్కిన హృదయంతో నా సహచరులకు రాజీనామా విషయం తెలియపరుస్తున్నాను. ఆప్ తో నా సంబంధాలు నేటితో తెగిపోతున్నాయి. నాకు రాజకీయ అవకాశం ఇచ్చిన కేజ్రీకి ధన్యవాదాలు. అతను నాకు అన్న లాంటివాడు. అంటూ లేఖలో తెలిపింది. ఈ అంశానికి సంబంధించి ఎటువంటి వివాదాలు లేవని మీడియాకు తెలిపింది. ఇప్పటి వరకూ తాను విలువలు పాటించానని, ఇకపై కూడా ఆ విలువలతోనే ముందుకు వెళతానని ఆమె స్పష్టం చేశారు. తాను అకస్మికంగా పార్టీ నుంచి బయటకొచ్చినా.. తన ఆశీస్సులు ఎప్పుడూ పార్టీకి ఉంటాయని అంజలీ తెలిపారు. ప్రస్తుతం వీరి రాజీనామాల అంశం పార్టీలో తీవ్ర అలజడి రేపింది. త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే క్రమంలో రాష్ట్ర స్థాయి నేతలు రాజీనామాలు చేయడంతో పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే తగలింది. -
ఆప్ రాకతో నాగపూర్‌లో ముక్కోణం!
నాగపూర్ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రంగప్రవేశంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నాగపూర్ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ అనివార్యం కానుంది. ఇంతవరకు ఇక్కడ ముఖాముఖి తలపడిన బీజేపీ, కాంగ్రెస్‌లు ఈసారి ఆప్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. సామాజిక కార్యకర్త నుంచి రాజకీయ నాయకురాలిగా అవతారమెత్తిన అంజలీ దమనియాను ఆప్ తన అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ సీటును ఆశించిన స్థానికురాలు, సామాజిక కార్యకర్త రూపా కులకర్ణిని కాదని ఆప్ అంజలిని తన అభ్యర్థిగా ప్రకటించింది. ఇక ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ రంగంలో నిలవనున్నారు. వచ్చేవారం కాంగ్రెస్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించనుండడంతో నాగపూర్ నుంచి పోటీ చేసే ఆ పార్టీ అభ్యర్థి ఎవరో తేలిపోతారు. ప్రస్తుత ఎంపీ విలాస్ ముత్తెంవార్‌కు మరోమారు అవకాశం లభించవచ్చని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాలో ఆప్ 20 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. వీరిలో మహారాష్ట్ర నుంచి ముఖ్యంగానాగపూర్లో అభ్యర్థి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. గడ్కరీపై పోటీకి స్థానిక అభ్యర్థినే నిలపాలన్న ఆలోచనను విరమించుకొని అంజలీని ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీకి గట్టి పట్టున్న నాగపూర్‌లో ఆ పార్టీ అగ్రనేతపై పోటీకి అంజలీని మించిన అవినీతిరహిత అభ్యర్థి ఆప్‌కు లభించలేదని పేర్కొన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్ నాయకుడు అర్వింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తొలుత విముఖత వ్యక్తం చేసిన అంజలి, ఆ తరువాత నాగపూర్‌లో పోటీకి అంగీకరించినట్లు తెలిసింది. వివిధ కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న గడ్కరీని మరింత ఎండగడతానని ఆమె చెబుతున్నారు. అంజలిపై బీజేపీ, కాంగ్రెస్‌లు ‘స్థానికేతర’ ముద్ర వేస్తున్నప్పటికీ, ఆమె తన తొలి ప్రయత్నంలోనే భారీ స్థాయిలో ఓట్లు కొల్లగొట్టే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఆమె గడ్కరీ విజయావకాశాలను దెబ్బతీసినా ఆశ్చర్యపోనక్కర లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆమె గెలవకపోయినా గడ్కరీ ఓటమికి ఆమె దోహదపడవచ్చని, ఆప్ లక్ష్యం అదేనని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ సహా యూపీఏ సర్కారులోని పలువురు మంత్రులను లక్ష్యంగా చేసుకొని వారికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ తన అభ్యర్థులను బరిలోకి దించుతోంది. ఎన్డీఏ విషయంలో మాత్రం ఒక్క గడ్కరీనే లక్ష్యంగా చేసుకున్నట్టు ఆప్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల్లో చోటుచేసుకున్న అవకతవకలను కప్పిపుచ్చడంలో గడ్కరీ కేంద్ర మంత్రి శరద్‌పవార్‌తో కుమ్మక్కయ్యారని అంజలీ దమనియా ఆరోపించారు. -
గడ్కారీ...కాచుకో!
నాగపూర్ అప్ అభ్యర్థిని అంజలి దమయాని మరో ఐదు కుంభకోణాలు వెలుగులోకి తెస్తా నీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళతా నాగపూర్: బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ చేసిన మరిన్ని అక్రమాలను వెలికి తీసేందుకు సిద్ధంగా ఉన్నానని నాగపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అంజలి దమయాని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర నీటి పారుదల కుంభకోణాల్లో గడ్కారీ పాత్ర ఉందని వెలుగులోకి తీసుకొచ్చిన దమనియా ఆయన ప్రమేయమున్న మరో ఐదు కుంభకోణాలు త్వరలోనే బయటపెడతానని సవాల్ చేశారు. తనకు చిన్న పిల్లలు ఉండటం వల్ల గతంలో పోటీకి ఆసక్తి చూపలేదన్నారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాకతో రాజకీయ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తెలిపారు. అవినీతిపై పోరాటం కోసం ఏకంగా ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా కేజ్రీవాల్ వదిలేశారని, అలాంటప్పుడు మనమెలా ఇంట్లో కూర్చుగలమని ప్రశ్నించారు. అందుకే ఆప్ తరఫున పోటీ చేసేందుకు సముఖంగా ఉన్నానని స్పష్టం చేశారు. 2011 సంవత్సరంలో జల కుంభకోణంలో ఎన్సీపీ అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్, గడ్కారీల మధ్య అవినీతి సంబంధాన్ని వెలుగులోకి తీసుకొచ్చానని తెలిపారు. ఈ కుంభకోణంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసే విషయంలో సహయం చేయాలని గడ్కారీని సంప్రదించానని, అప్పుడు ఆయన అందుకు నిరాకరించారని చెప్పారు. ఈయన ప్రమేయమున్న మరో ఐదు కుంభకోణాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఈ ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో గడ్కారీపై పోటీ చేసేందుకు సదా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు ఉంటాయని తెలుసని, అయినా ప్రజల మధ్యలోకి వెళ్లే తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాజకీయాల నుంచి అవినీతి నాయకులను సాగనంపడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. ‘అవినీతిపైనే మా యుద్ధం. ఆ పరిస్థితుల నుంచి మార్పులు తేవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. తప్పక మారుస్తామ’ని అంజలీ ధీమా వ్యక్తం చేశారు. తనను బీజేపీ స్థానికేతరురాలు అంటోందని, అయితే తాను మహారాష్ట్రీయురాలు, భారతీయురాలినని తెలిపారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి పోటీ చేస్తుండగా, తాను నాగపూర్ నుంచి బరిలోకి దిగితే తప్పేంటని ప్రశ్నించారు. మన వ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతితో పాటు ఇందుకు కారణమైన రాజకీయ నేతలను పెకిలించడమే తమ ముందున్న ధ్యేయమని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో 300, అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులను ఆప్ బరిలోకి దింపుతుందని వెల్లడించారు. అవినీతిపై పోరే ఏజెండాగా పార్టీ మేనిఫెస్టో ఉంటుందన్నారు. నాగపూర్‌లో ఈ నెల 21 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తానని దమనియా ప్రకటించారు. తమ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక ప్రచారం కోసం వస్తారని వెల్లడించారు.