ముంబై: మహారాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అంజలీ దమానీ పార్టీకి రాజీనామా చేశారు. ఈమెతో పాటు రాష్ట్ర కార్యదర్శి ప్రీతి మీనన్ కూడా ఆమ్ ఆద్మీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేత నితిన్ గడ్కరీపై పోటీ చేసి ఓటమి పాలైన అంజలీ.. తన రాజీనామా లేఖను ఆమోదించాలని ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కు విన్నవించారు. ఇందుకు గాను ఆమె ఆప్ పార్టీ సభ్యులకు గురువారం ఓ లేఖ రాశారు. 'నేను బరువెక్కిన హృదయంతో నా సహచరులకు రాజీనామా విషయం తెలియపరుస్తున్నాను. ఆప్ తో నా సంబంధాలు నేటితో తెగిపోతున్నాయి. నాకు రాజకీయ అవకాశం ఇచ్చిన కేజ్రీకి ధన్యవాదాలు. అతను నాకు అన్న లాంటివాడు. అంటూ లేఖలో తెలిపింది.
ఈ అంశానికి సంబంధించి ఎటువంటి వివాదాలు లేవని మీడియాకు తెలిపింది. ఇప్పటి వరకూ తాను విలువలు పాటించానని, ఇకపై కూడా ఆ విలువలతోనే ముందుకు వెళతానని ఆమె స్పష్టం చేశారు. తాను అకస్మికంగా పార్టీ నుంచి బయటకొచ్చినా.. తన ఆశీస్సులు ఎప్పుడూ పార్టీకి ఉంటాయని అంజలీ తెలిపారు. ప్రస్తుతం వీరి రాజీనామాల అంశం పార్టీలో తీవ్ర అలజడి రేపింది. త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే క్రమంలో రాష్ట్ర స్థాయి నేతలు రాజీనామాలు చేయడంతో పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే తగలింది.