నాగపూర్ అప్ అభ్యర్థిని అంజలి దమయాని
మరో ఐదు కుంభకోణాలు వెలుగులోకి తెస్తా
నీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళతా
నాగపూర్: బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ చేసిన మరిన్ని అక్రమాలను వెలికి తీసేందుకు సిద్ధంగా ఉన్నానని నాగపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అంజలి దమయాని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర నీటి పారుదల కుంభకోణాల్లో గడ్కారీ పాత్ర ఉందని వెలుగులోకి తీసుకొచ్చిన దమనియా ఆయన ప్రమేయమున్న మరో ఐదు కుంభకోణాలు త్వరలోనే బయటపెడతానని సవాల్ చేశారు. తనకు చిన్న పిల్లలు ఉండటం వల్ల గతంలో పోటీకి ఆసక్తి చూపలేదన్నారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాకతో రాజకీయ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తెలిపారు. అవినీతిపై పోరాటం కోసం ఏకంగా ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా కేజ్రీవాల్ వదిలేశారని, అలాంటప్పుడు మనమెలా ఇంట్లో కూర్చుగలమని ప్రశ్నించారు. అందుకే ఆప్ తరఫున పోటీ చేసేందుకు సముఖంగా ఉన్నానని స్పష్టం చేశారు.
2011 సంవత్సరంలో జల కుంభకోణంలో ఎన్సీపీ అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్, గడ్కారీల మధ్య అవినీతి సంబంధాన్ని వెలుగులోకి తీసుకొచ్చానని తెలిపారు. ఈ కుంభకోణంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసే విషయంలో సహయం చేయాలని గడ్కారీని సంప్రదించానని, అప్పుడు ఆయన అందుకు నిరాకరించారని చెప్పారు. ఈయన ప్రమేయమున్న మరో ఐదు కుంభకోణాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఈ ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో గడ్కారీపై పోటీ చేసేందుకు సదా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు ఉంటాయని తెలుసని, అయినా ప్రజల మధ్యలోకి వెళ్లే తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాజకీయాల నుంచి అవినీతి నాయకులను సాగనంపడమే తమ ముందున్న లక్ష్యమన్నారు.
‘అవినీతిపైనే మా యుద్ధం. ఆ పరిస్థితుల నుంచి మార్పులు తేవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. తప్పక మారుస్తామ’ని అంజలీ ధీమా వ్యక్తం చేశారు. తనను బీజేపీ స్థానికేతరురాలు అంటోందని, అయితే తాను మహారాష్ట్రీయురాలు, భారతీయురాలినని తెలిపారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి పోటీ చేస్తుండగా, తాను నాగపూర్ నుంచి బరిలోకి దిగితే తప్పేంటని ప్రశ్నించారు. మన వ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతితో పాటు ఇందుకు కారణమైన రాజకీయ నేతలను పెకిలించడమే తమ ముందున్న ధ్యేయమని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో 300, అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులను ఆప్ బరిలోకి దింపుతుందని వెల్లడించారు. అవినీతిపై పోరే ఏజెండాగా పార్టీ మేనిఫెస్టో ఉంటుందన్నారు. నాగపూర్‌లో ఈ నెల 21 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తానని దమనియా ప్రకటించారు. తమ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక ప్రచారం కోసం వస్తారని వెల్లడించారు.
గడ్కారీ...కాచుకో!
Published Mon, Feb 17 2014 10:44 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement