నాగపూర్ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రంగప్రవేశంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నాగపూర్ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ అనివార్యం కానుంది. ఇంతవరకు ఇక్కడ ముఖాముఖి తలపడిన బీజేపీ, కాంగ్రెస్‌లు ఈసారి ఆప్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. సామాజిక కార్యకర్త నుంచి రాజకీయ నాయకురాలిగా అవతారమెత్తిన అంజలీ దమనియాను ఆప్ తన అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ సీటును ఆశించిన స్థానికురాలు, సామాజిక కార్యకర్త రూపా కులకర్ణిని కాదని ఆప్ అంజలిని తన అభ్యర్థిగా ప్రకటించింది.
ఇక ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ రంగంలో నిలవనున్నారు. వచ్చేవారం కాంగ్రెస్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించనుండడంతో నాగపూర్ నుంచి పోటీ చేసే ఆ పార్టీ అభ్యర్థి ఎవరో తేలిపోతారు. ప్రస్తుత ఎంపీ విలాస్ ముత్తెంవార్‌కు మరోమారు అవకాశం లభించవచ్చని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాలో ఆప్ 20 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. వీరిలో మహారాష్ట్ర నుంచి ముఖ్యంగానాగపూర్‌లో అభ్యర్థి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. గడ్కరీపై పోటీకి స్థానిక అభ్యర్థినే నిలపాలన్న ఆలోచనను విరమించుకొని అంజలీని ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీకి గట్టి పట్టున్న నాగపూర్‌లో ఆ పార్టీ అగ్రనేతపై పోటీకి అంజలీని మించిన అవినీతిరహిత అభ్యర్థి ఆప్‌కు లభించలేదని పేర్కొన్నాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్ నాయకుడు అర్వింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తొలుత విముఖత వ్యక్తం చేసిన అంజలి, ఆ తరువాత నాగపూర్‌లో పోటీకి అంగీకరించినట్లు తెలిసింది. వివిధ కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న గడ్కరీని మరింత ఎండగడతానని ఆమె చెబుతున్నారు. అంజలిపై బీజేపీ, కాంగ్రెస్‌లు ‘స్థానికేతర’ ముద్ర వేస్తున్నప్పటికీ, ఆమె తన తొలి ప్రయత్నంలోనే భారీ స్థాయిలో ఓట్లు కొల్లగొట్టే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఆమె గడ్కరీ విజయావకాశాలను దెబ్బతీసినా ఆశ్చర్యపోనక్కర లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆమె గెలవకపోయినా గడ్కరీ ఓటమికి ఆమె దోహదపడవచ్చని, ఆప్ లక్ష్యం అదేనని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ సహా యూపీఏ సర్కారులోని పలువురు మంత్రులను లక్ష్యంగా చేసుకొని వారికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ తన అభ్యర్థులను బరిలోకి దించుతోంది. ఎన్డీఏ విషయంలో మాత్రం ఒక్క గడ్కరీనే లక్ష్యంగా చేసుకున్నట్టు ఆప్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల్లో చోటుచేసుకున్న అవకతవకలను కప్పిపుచ్చడంలో గడ్కరీ కేంద్ర మంత్రి శరద్‌పవార్‌తో కుమ్మక్కయ్యారని అంజలీ దమనియా ఆరోపించారు.
ఆప్ రాకతో నాగపూర్‌లో ముక్కోణం!
Published Tue, Feb 18 2014 11:04 PM | Last Updated on Fri, Oct 19 2018 7:37 PM
Advertisement
Advertisement