ప్రత్యేక విదర్భకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంపూర్ణ మద్ధతును ప్రకటించారు.
నాగపూర్: ప్రత్యేక విదర్భకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంపూర్ణ మద్ధతును ప్రకటించారు. నగరంలోని ఛత్రపతి నగర్ స్క్వేర్‌కు శుక్రవారం ఉదయం చేరుకున్న కేజ్రీవాల్ రోడ్డు షో ప్రారంభించారు. ఆయన వెంట నాగపూర్ లోక్‌సభ అభ్యర్థి అంజలి దమనియాతో పాటు స్థానిక నాయకులు ఉన్నారు. ఓపెన్ జీపులో ఎక్కి ఆయన ప్రజలకు అభివాదాలు చేస్తూ ముందుకు సాగారు. కొన్నిచోట్ల ప్రసంగించారు.
అవినీతిని నిర్మూలించాలంటే ఆప్ అభ్యర్థులకు ఓటేయాలని కోరారు. మత రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలను తిప్పికొట్టాలన్నారు. అంతకుముందు గురువారం రాత్రి సదర్‌లోని ఓ విలాసవంతమైన హోటల్‌లో జరిగిన పార్టీ అతిథ్యమిచ్చిన విందులో కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఇందులో పాల్గొని పార్టీకి రూ.పదివేల చొప్పున విరాళం ఇచ్చిన 140 మందితో కేజ్రీవాల్ ముచ్చటించారు. ప్రత్యేక విదర్భకు ఆప్ మద్ధతు ఉంటుందని ప్రకటించారు.