న్యూఢిల్లీ: బీజేపీపై ధ్వజమెత్తారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీలో బుధవారం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బలం నిరూపించుకున్న అనంతరం ఆయన కమలం పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవిశ్వాస తీర్మానానికి 14 సీట్లు అవసరం కాగా.. బీజేపీకి 8 మంది సభ్యులే ఉన్నారని, అయినా ఆప్ ఎమ్మెల్యేలను బెదిరించి తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. సత్యేంజర్ జైన్, మనీశ్ సిసోడియాలా మిమ్మల్ని కూడా అరెస్టు చేస్తామని ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ భయపెట్టిందన్నారు. అయినా తమ ఎమ్మెల్యేలు లొంగకపోవడంతో అవిశ్వాస తీర్మానం ఆలోచనను బీజేపీ విరమించుకుందని చెప్పారు. అందుకే తానే విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.
'మాకు 62 మంది ఎమ్మెల్యేలున్నారు. మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ ప్రస్తుతం మాతో లేరు. మరికొందరు వ్యక్తిగత కారణాల వల్ల ఢిల్లీలో లేరు. ఇప్పుడు అసెంబ్లీలో 56 మంది ఎమ్మెల్యేలమున్నాం. ఈడీ, సీబీఐ ఈ ఎమ్మెల్యేలను కదిలించలేవు. మేం ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. మా తప్పులను ప్రతిపక్షం గుర్తిస్తే సరిదిద్దుకుంటాం. 2017లో కూడా ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారు. 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్నారు. కానీ అది ఎలా సాధ్యమో నాకు అర్థం కాలేదు. అమిత్‌షా మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని జర్నలిస్టు మిత్రులు నాతో చెప్పారు. బీజేపీ నేతలు మీకు ఇంకా సిగ్గు ఉంటే మా వైపు చూడకండి. మేం ఆమ్ ఆద్మీ పార్టీ. భగత్‌సింగ్ వారసులం. అవసరమైతే ఉరికంభం ఎక్కుతాం కానీ దేశానికి నమ్మకద్రోహం చేయం.' అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
'అవినీతిపరులంతా ఒకే వేదికపైకి వచ్చారని ప్రధాని మోదీ ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారు. కానీ బీజేపీలో అనినీతి నేతలను ఈడీ, సీబీఐ కాపాడుతున్నాయి. దేశంలోని గజ దొంగలంతా కమలం పార్టీలోనే ఉన్నారు. కాలం మారుతుంది. ఏదో ఒకరోజు మోదీ అధికారం కోల్పోక తప్పదు. ఆరోజు భారత్ అవినీతి రహిత దేశం అవుతుంది. బీజేపీ నేతలంతా జైలుకు వెళతారు..' అని కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయే నేతలు కాదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. 2025లో తమకు 67 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ 2025లో కాదు 2050లో కూడా ఢిల్లీలో అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.
చదవండి: బాంబే హైకోర్టులో మమతా బెనర్జీకి చుక్కెదురు!
Comments
Please login to add a commentAdd a comment