ముంబై: ఆప్ నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యతిరేకవర్గం పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సీనియర్ నాయకుల మధ్య విభేదాలు తారా స్థాయిలో రగులుతూండగానే... మహారాష్ట్ర పార్టీ సీనియర్ లీడర్ అంజలి దామానియా పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె తన ట్విట్టర్ లో కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఆయన్ని నమ్మాను. ఆయన సిద్ధాంతాలకు మద్దతిచ్చాను తప్ప.. ఆయన రాజకీయ బేరసారాలకు కాదంటూ ట్వీట్ చేశారు.
2014 లో ఢిల్లీ అసెంబ్లీలో పూర్తి మెజార్టీ సాధించేందుకు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ మంతనాలు జరిపారని, బేరసారాలకు పాల్పడ్డారంటూ ఆప్ మాజీ ఎమ్మెల్యే రాజేష్ గార్గ్ విడుదల చేసిన ఆడియో సంచలనం సృష్టించింది.
ఈ నేపథ్యంలోనే అంజలి రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ పరిణామంపై స్పందించడానికి ఆప్ మంత్రి గోపాల్ రాయ్ తిరస్కరించారు.