Pentapati Pullarao
-
బీజేపీకి బిహార్ ఎంత ముఖ్యం?
నోట్ల రద్దు విషయంలో నరేంద్ర మోదీని తప్పుపట్ట వచ్చునేమోగానీ, జమిలి ఎన్నికల అంశంలో మాత్రం ఆయన్ని ఒప్పుకోవచ్చు. 2019 మేలో పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే, 2019 నవంబర్‌లో మహా రాష్ట్ర, హరియాణా ఎన్నికలు వచ్చాయి. 2020 జనవరిలో జార్ఖండ్, ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల హడావుడి నుండి దేశం కొద్దిగా విశ్రాంతి తీసుకుంటుండగానే అక్టో బర్లో మళ్లీ బిహార్ ఎన్నికలు దూసుకొస్తున్నాయి. ఢిల్లీ లాంటి చిన్న రాష్ట్రమే బీజేపీని ఎంత టెన్షన్ పెట్టిందో చూశాం. అలాంటిది బిహార్ ఎన్నికలు ఊహించండి! గత ఎన్నికల్లో నితీశ్ కుమార్‌తో కలిసి బీజేపీ 40 లోక్‌సభ సీట్లకు 39 గెలుచుకుంది. ఈసారి నితీశ్ ఓడిపోయాడంటే, బీజేపీకి ఆదరణ తగ్గిందన్న విమర్శను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బీజేపీతో కలిసి నితీశ్ 2005, 2010ల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. 2015లో మోదీ ప్రధాని అయ్యాక బీజేపీని వదిలి, లాలూ ప్రసాద్ యాదవ్‌తో ‘మహాఘట్ బంధన్’ గా జట్టు కట్టారు. 243 సీట్లకు 178 సీట్లు గెలిచి, బీజేపీని 55 సీట్లకే పరిమితం చేసి, ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే, ఉప ముఖ్యముంత్రిగా ఉన్న లాలూ కొడుకు తేజస్వి యాదవ్ మీద అవినీతి ఆరోపణలు రాగానే లాలూను వదిలి నితీశ్ బీజేపీతో ప్రభుత్వాన్ని కొనసాగించారు. బిహార్ ఎన్నికల్లో ప్రస్తుతం నితీశ్, బీజేపీ, రామ్ విలాస్ పాశ్వాన్ ఎన్డీయే పక్షంగా, లాలూ, కాంగ్రెస్ మరో వర్గంగా బరిలో ఉన్నాయి. నితీశ్ 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశారు. లాలూ, రాబ్డిదేవి పది హేనేళ్లు సీఎం పీఠం మీద కూర్చున్నారు. నితీశ్ ప్రతి నిధిగా జితన్ రామ్ మాంఝీ ఒక్క ఏడాది ముఖ్య మంత్రి స్థానంలో ఉన్నారు. అంటే 30 ఏళ్లుగా నితీశ్, లాలూ కుటుంబమే బిహార్‌ను ఏలుతున్నది. నితీశ్ మార్చి ఒకటినే పట్నాలో ఎన్నికల శంఖా రావం పూరించారు. 200 అసెంబ్లీ స్థానాలు గెలవడా నికి ప్రయత్నిస్తానని ప్రకటించారు. లాలూలా తాను అవినీతిపరుణ్ని కాదన్న సందేశాన్ని గట్టిగానే ప్రజ ల్లోకి తీసుకువెళ్లగలిగారు. అయితే, హఠాత్తుగా నితీశ్ పార్టీని వీడిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తాను కూడా బిహార్ ఎన్నికల బరిలో ఉంటానని ప్రక టించారు. లాలూ కంటే నితీశ్ ఉత్తముడే కావొచ్చు, కానీ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరిలోకీ ఉత్త ముడా అని కిశోర్ ప్రశ్నిస్తున్నారు. ఒక మనిషి, ఒక కులం పార్టీలైన జితన్ రామ్ మాంఝీ(హెచ్ఏఎం), ఉపేంద్ర కుశ్వాహా (ఆర్ఎల్ ఎస్పీ), ముకేశ్ సాహ్నీ(వీఐపీ పార్టీ) లాంటివాళ్లు మూడోశక్తిగా బరిలో ఉన్నారు. వీళ్లు లాలూతో జట్టుగా ఉన్నప్పటికీ తేజస్వితో సఖ్యతగా లేరు. లాలూ జైల్లో ఉండటంతో తేజస్వి సంకీర్ణానికి నాయ కత్వం నెరుపుతున్నారు. లాలూకు యాదవులు, ముస్లిముల్లో మంచి ఆదరణ ఉంది. కానీ నితీశ్ ముందు తేజస్విలాంటి పరిపక్వత లేని మనిషి నిల బడలేడని ఈ పార్టీ నాయకుల అభిప్రాయం. అందుకే శరద్ యాదవ్‌ను సీఎం అభ్యర్థిగా కోరుతున్నారు. వీళ్లది ఉత్త శబ్ద కాలుష్యమే అని తేజస్వి విమర్శిస్తున్న ప్పటికీ పార్టీని తీవ్ర గందరగోళంలో పడేయటంలో వీళ్లు విజయం సాధించగలరు. పప్పు యాదవ్ నేతృ త్వంలోని జన్ అధికార్ పార్టీ, కన్హయ్య కుమార్ నేతృత్వంలోని వామపక్ష పార్టీలు కూడా ఎన్నికల బరిలో ఉన్నాయి. ఇవి రెండూ భారీగానే జనాన్ని ఆకర్షిస్తాయి. అయితే, వామపక్షాలను కలుపుకొని పోవడానికి లాలూ సిద్ధంగా లేరు. తెలివైన కన్హయ్య కుమార్ గనక గట్టిగా నిలదొక్కుకుంటే, అది తన కొడుకు తేజస్వి భవితవ్యానికి చరమగీతం అవుతుం దని లాలూ నమ్మిక. 2019లో కూడా వామపక్షీయు లతో లాలూ చేతులు కలపనిది ఇందుకే. గతేడాది మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ ఓడింది. ఢిల్లీ తప్ప ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే. మళ్లీ గనక నితీశ్‌ని ముఖ్యమంత్రిని చేయలేకపోతే బీజేపీ పూర్తిగా బలహీనపడిందన్న ముద్ర పడుతుంది. మునిగి పోయే ఓడలోంచి ఎలుకలు కూడా దూకి వెళ్లిపో తాయి. పైగా ఈ ఫలితాలు ఎన్నికలు సమీపించిన బెంగాల్లోనూ, ఈశాన్య రాష్ట్రాలు, అస్సాంలోనూ ప్రభావం చూపిస్తాయి. అందుకే ఈ ఎన్నికలకు బీజేపీ అంత ప్రాముఖ్యత ఇస్తోంది. ఆ కారణంగానే ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనూ జరగని విధంగా, సీఏఏకు వ్యతిరేకంగా నితీశ్ ప్రభుత్వం తీర్మానం చేయడానికి అంగీకరించింది. రాజకీయాల్లో గెలు పులు శాశ్వతం కాదు. వరుస వైఫల్యాల వల్ల గతేడాది మేలో వచ్చిన భారీ విజయం మరుగున పడింది. అందుకే బిహార్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవ డానికి బీజేపీ సిద్ధంగా లేదు. పెంటపాటి పుల్లారావు వ్యాసకర్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు -
ముందున్నవి సంబరాలు కాదు.. సవాళ్లే!
జగజ్జేతలు కూడా అనూహ్యంగా సామ్రాజ్యాలను కోల్పోయినట్లు చరిత్ర చెబుతోంది. సంవత్సరం లోపే వరుసగా 9 రాష్ట్రాల్లో అధికారం కోల్పోవడం భారతీయ జనతా పార్టీకి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రాజ్యాంగంతో ముడిపడిన మౌలిక విధానాలను వేగంగా మార్చడం, ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో ఘోర వైఫల్యం, ప్రభుత్వం వెలుపలి ప్రతిభను పార్టీలోకి ఆకర్షించలేకపోవడం, వ్యవసాయం, నిరుద్యోగిత పరిష్కారం కాకపోవడం, కూటమి మిత్రులు దూరం కావడం బీజేపీకి పెనుసవాళ్లను తీసుకొస్తోంది. మహారాష్ట్రను కోల్పోవడం రాజకీయంగా కమలానికి అతిపెద్ద దెబ్బ. ఈ కొత్త సంవత్సరం బీజేపీకి చాలా సవాళ్లను తీసుకొచ్చింది. కొత్త సమస్యలకు మోదీ, షాలు కొత్త పరిష్కారాలు కనుగొంటారేమో కాలమే చెప్పాలి. ప్రపంచం మొత్తాన్ని జయించామని మీరు భావిస్తున్న క్షణంలోనే అనూహ్యంగా కొత్త సవాళ్లు ఎదురవుతాయి. చరిత్రలో అతి పెద్ద సామ్రాజ్యాలు అనుకోని సవాళ్లు ఎదురై తమను కూల్చివేస్తాయమని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాయి. హంగరీ, ఆస్ట్రియా, తదితర యూరప్ దేశాల రాజులు 800 సంవత్సరాల క్రితం అత్యున్నత అధికారాన్ని చలాయిస్తుండేవారు. ఉన్నట్లుండి వీరు తమ నగర రాజ్యాలపై వేలాదిమంది మంగోలు అశ్విక దళాల దాడిని ఎదుర్కోవలసి వచ్చింది. వేలాది మైళ్ల దూరం ప్రయాణించివచ్చిన మంగోల్ రౌతులు విరుచుకుపడి రాత్రింబవళ్లు తమపై దాడులు కొనసాగించగలవని యూరోప్ రాజులు అసలు ఊహించలేకపోయారు. మంగోలులు ఉన్నట్లుండి యూరప్‌లో కనిపించి నగరం తర్వాత నగరాన్ని ధ్వంసం చేసిపడేశారు. మంగోలుల ఆకస్మిక ఉనికిని ఊహించని యూరోపియన్ మహా సామ్రాజ్యాలు చేష్టలుడిగి చూస్తుండిపోయాయి. అదేవిధంగా, బీజేపీ, నరేంద్రమోదీ 2020 ఆగమనం సంద ర్భంగా సంబరాలు చేసుకుంటూండగానే ఆకస్మిక సవాళ్లు ఎదురయ్యాయి. ఒకటి మాత్రం నిజం. ఏ రాజకీయనేత కానీ, పాలకుడు కానీ తమను ఏ సవాలు కుప్పగూలుస్తుందనే విషయాన్ని ముందుగా ఊహించలేరు. దక్కన్, మరాఠాలపై కేంద్రీకరించడం ద్వారా తమ సామ్రాజ్యమే కుప్పకూలుతుందని ఔరంగజేబ్ ఎన్నడూ ఊహించలేదు. వాస్తవానికి ఔరంగజేబు నేటి ఔరంగాబాద్‌లోనే చనిపోయాడు. అదేవిధంగా బీజేపీకి 2020లో సవాళ్లు ఎదురవుతున్నాయి. కూలంకషంగా ఈ సవాళ్లను పరిశీలిద్దాం. 1. తొమ్మిది రాష్ట్రాల ఎన్నికల్లో వరుస పరాజయం: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, హరియాణా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, ఇప్పుడు జార్కండ్‌లలో బీజేపీ శాసనసభ ఎన్నికల్లో పరాజయం పొందింది. మహారాష్ట్ర నాటి ముఖ్యమంత్రి ఫడ్నవిస్, జార్కండ్ నాటి ముఖ్యమంత్రి రఘుబర్ దాస్లపై అక్కడి అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. 2019 మే పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో మహారాష్ట్ర, హరియాణా, జార్కండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం నల్లేరు మీద నడకగానే ఉంటుందని నరేంద్రమోదీ భావించారు. కానీ ఈ మూడు రాష్ట్రాల్లో పరాజయాలు బీజేపీకి, దాని అధినేతలకు షాక్ కలిగించాయి. 2. దారుణంగా మారిన ఆర్థిక వ్యవస్థ: భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థను నిర్వహించడానికి నిపుణుల అవసరం ఉందని మోదీ అర్థం చేసుకున్నట్లు లేదు. రక్షణ, విదేశీ వ్యవహారాలను నిర్వహించడం కష్టమని భావిస్తుంటారు కానీ ఆర్థిక వ్యవస్థను నిర్వహించటమంత కష్టమైన పని మరొకటి ఉండదు. మోదీ ఇంత పెద్ద అంశాన్ని నిర్లక్ష్యం చేశారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఆర్థికంగా పెద్ద వైఫల్యాలను చవిచూశాయి కానీ మోదీ ప్రభుత్వం కూడా వాటికి ఏమాత్రం భిన్నంగా లేదు. 3. విధానాల్లో పెను మార్పులు: 2019 మే నెల నుంచి మోదీ దేశానికి మింగుడు పడని స్థాయిలో రాజ్యాంగపరంగా తీవ్ర మార్పులను ప్రవేశపెట్టారు. ఇదే విధానాలను మరింత మృదువుగా, సమయస్ఫూర్తితో ప్రవేశపెట్టి ఉండవచ్చు. ఆర్టికల్ 370ని గంగలో కలి పారు సరే. కానీ దానికి కూడా ఒక పద్దతి అనేది ఉంటుంది కదా. తర్వాత పౌరసత్వ సవరణ చట్టంలో మార్పులు చేశారు. తర్వాత జాతీయ పౌర పట్టిక. కానీ మోదీ వీటన్నింటినీ అందరికీ సంతృప్తి కలిగించేరీతిలో తీసుకురావలసి ఉండేది. ఇప్పుడు మోదీలోని ఈ బలహీనమైన పనివిధానాన్నే ప్రత్యర్థులు అనుకూలంగా మల్చుకున్నారు. వేగంగా, ఆలోచనారహితంగా చేయడానికి బదులుగా, మోదీ ప్రభుత్వం జాగ్రత్తగా మార్పులను తీసుకువచ్చి ఉంటే బాగుండేది. 4. వ్యవసాయ వైఫల్యం: దేశంలోని సగం జనాభా ఇప్పటికీ వ్యవసాయంతో ముడిపడి ఉంది. నరేంద్రమోదీ కానీ, గతంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వ్యవసాయాన్ని ప్రోత్సహించే కిటుకులలో నైపుణ్యం సాధించలేదు. రుణమాఫీలు మినహా ఈ ప్రభుత్వాలు చేసిందేమీ లేదు. మరింత సాగు లేక బీమాను కల్పిస్తే వ్యవసాయరంగ వృద్ధికి సరిపోతుందని మోదీ భావించారు కానీ అవి అసలు సమస్యలకు పరిష్కారాలు కావు. మోదీ హయాంలో వ్యవసాయం కుప్పగూలిపోతోంది. 5. నిరుద్యోగిత చాలా సంక్లిష్ట సమస్య: ఆర్థిక వ్యవస్థ సమర్థంగా పనిచేస్తున్నప్పుడు నిరుద్యోగంపై పెద్దగా ఆరోపణలు ఉండవు. కానీ ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ లాగా దిగజారుతున్నప్పుడు నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోతోందని ప్రభుత్వంపై విమర్శలు తప్పవు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి రేటు గురించి మోదీ ప్రభుత్వం ఏమాత్రం అర్థం చేసుకోవడం లేదు. ఉపాధి కల్పన వల్ల మాత్రమే వృద్ధి రేటు సాధ్యపడుతుంది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితి కూడా గత మూడేళ్లలో ఆశాజనకంగా లేదు. దీంతో మోదీ ప్రయత్నాలకు మరింత దెబ్బ కలుగుతోంది. 6. ప్రభుత్వం వెలుపలి ప్రతిభకు తిరస్కృతి: కేంద్ర ప్రభుత్వాన్ని మీరు పరిశీలించినట్లయితే, మీకు మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ కనబడతారు. తర్వాత పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ వంటి సమర్థ మంత్రులు ఒకరిద్దరున్నారు. ఇతరులంతా అనామకులే. సాధారణంగా ఏ కేంద్ర ప్రభుత్వంలో అయినా కనీసం పదిమంది మాజీ ముఖ్యమంత్రులు ఉండేవారు. రాజకీయ నాయకులను ఆకర్షించినట్లే పాలనాపరంగా ప్రతిభ కలవారిని కూడా మోదీ ప్రభుత్వంలోకి తీసుకోవాలి. కానీ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, విప్రో చీఫ్ అజీమ్ ప్రేమ్‌జీ వంటి పారిశ్రామిక, ఐటీ మేధావులను మోదీ తన ప్రభుత్వంలోకి తీసుకోవలసి ఉండె. మోదీ ఎంతసేపటికీ మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, గూగుల్ తదితర విదేశీ కంపెనీల ఉద్యోగులను కలవడంపైనే ఆసక్తి ప్రదర్శిస్తున్నారు తప్పితే ఘనమైన భారతీయ ప్రతిభామూర్తులను పక్కన పెట్టేశారు. 7. దూరమవుతున్న కూటమి మిత్రులు: రాజకీయాలు అంటే అర్థం మిత్రులను కూడగట్టడం, వారిని నిలుపుకోవడం. 2014కి ముందు బీజేపీ చాలా నమ్రతతో ఉండి అనేకమంది మిత్రులను ఆకర్షించింది, పొత్తులను కూర్చుకుంది. కానీ తర్వాత్తర్వాత బీజేపీ తన మిత్రులను కోల్పోతూ వచ్చింది. కొత్తగా మిత్రులను కలుపుకోవడంలో విఫలమైంది. 2019లో ఘనవిజయం తర్వాత చిన్న పార్టీల నుంచి ఒక్కరికి కూడా బీజేపీ మంత్రి పదవిని ఇవ్వలేదు. ఇది ఆ పార్టీనే బలహీనపర్చి మహారాష్ట్ర, హరియాణా, జార్కండ్‌లలో ఓటమికి దారి తీసింది. భవిష్యత్తు అవకాశాలు: తప్పులను సరిదిద్దుకోవడంలో నరేంద్రమోదీ గతంలో గొప్ప ప్రతిభ చూపారు. కానీ గత రెండేళ్లలో మోదీ, షాలు ఆర్థిక వ్యవస్థను నిర్లక్ష్యం చేసేశారు. ఇది దేశానికి, ఆర్థిక వ్యవస్థకు కూడా హాని చేసింది. ఆర్థిక వ్యవస్థ మోదీ ప్రభుత్వానికి అతి పెద్ద సవాలుగా మారింది. దీనికి పరిష్కారం ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేయడం కాదు. ద్రవ్య విధానాలు, పన్నుల సంస్కరణలో మౌలిక మార్పులే మార్గం. రాజకీయంగా చూస్తే మహారాష్ట్రలో ఎవరు గెలిస్తే వారే కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే మహారాష్ట్రను బీజేపీ ఎలా గెల్చుకుంటుందన్నదే పెద్ద ప్రశ్న. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత 1987లో భారత్ మొత్తంగా ఆయన్ని, తన కుటుంబాన్ని ప్రేమించింది. వారు చాలా మంచిగానూ, స్వచ్ఛమైనవారుగానూ కనిపించారు. కానీ సంవత్సరం లోపే రాజీవ్ అప్రతిష్టను మూటగట్టుకుని 1989 ఎన్నికల్లో ఓడిపోయారు. రాజీవ్ గాంధీ ప్రతిష్ట ఎంత వేగంగా దిగిజారిపోయిందో ఇప్పుడు బీజేపీ గుర్తుంచుకోవాలి. సమస్య ఏమిటంటే, చిన్న చిన్న సమస్యలను తక్షణం పరిష్కరించాలి. లేకుంటే అవే అతిపెద్ద సమస్యలుగా మారతాయి. బీజేపీ పుంజుకోవాలంటే దేశవ్యాప్తంగా మరింతమంది నాయకులను ప్రోత్సహించాలి. అధికారం చుట్టూనే కోటరీలు ఉంటాయి. బీజేపీలోకూడా ఇదే జరుగుతోంది. కోటరీలు రాజకీయ పార్టీలను నాశనం చేస్తాయి. యూరోపియన్ రాజులు 5 వేల మైళ్ల దూరంనుంచి అనూహ్యంగా వచ్చిపడిన మంగోలుల చేతిలో చిత్తయిపోయారు. అజేయులైన మరాఠాలను ఓడించాలన్న దుగ్ధవల్లే ఔరంగజేబు పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ఈ కొత్త సంవత్సరం బీజేపీకి చాలా సవాళ్లను తీసుకొచ్చింది. కొత్త సమస్యలకు మోదీ, షాలు కొత్త పరిష్కారాలు కనుగొంటారేమో కాలమే చెప్పాలి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం తర్వాత మోదీ, షాలు ఎక్కువకాలం విశ్రాంతిగా ఉండలేరు. నూతన సవాళ్లు నూతన పరిష్కారాలను కోరుకుంటాయి. మోదీ, షాలు వీటిని కనుగొంటారేమో వేచి చూడాల్సిందే. పెంటపాటి పుల్లారావు వ్యాసకర్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు -
దిద్బుబాటు లేకుంటే తిప్పలు తప్పవు!
గత ఆయిదున్నరేళ్ల పాలనలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించిన బీజేపీ.. మహారాష్ట్రలో ఆకస్మిక రాజకీయ పరిణామాలతో చేష్టలుడిగిపోయింది. శివసేనకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని ఊహించలేకపోయిన బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహపరంగానే దెబ్బతినిపోయింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వైఫల్యం, జీడీపీ పతనం, నిరుద్యోగిత వంటి మరకలు ఉన్నప్పటికీ మోదీపై వ్యక్తిగతంగా సదభిప్రాయం ఆ పార్టీకి నేటికీ బలాన్ని అందిస్తోంది. అయితే నరేంద్రమోదీ, అమిత్ షాలు తమను తాము చక్కదిద్దుకోగలమని నిరూపించుకున్నారు. మహారాష్ట్ర గుణపాఠాలను త్వరగా నేర్చుకుని బీజేపీ మిత్రుల సంఖ్యను పెంచుకుని, శత్రువుల సంఖ్యను తగ్గించుకుంటే అది మళ్లీ తన పూర్వ ప్రభలను వెదజల్లుతుంది. పం«థాను మార్చి గెలుపొందడం.. మారకుండా ఓటమివైపు పయనించడం అనే రెండు అవకాశాలు బీజేపీ ముందున్నాయి. శివసేన రూపంలో ఆప్తమిత్రుడే బద్ధ శత్రువుగా మారి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పర్చాక బీజేపీలో నిశ్శబ్దం తాండవిస్తోంది. దీనిపైనే శరద్ పవార్ ప్రతి రోజూ వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు: ‘అమిత్ షా ఎక్కడ? ఎమ్మెల్యేలను గెల్చుకుని ప్రభుత్వాలను ఎవరు ఏర్పర్చగలరు?’ ఇక బీజేపీ సాహసప్రవృత్తి కలిగిన ప్రతిపక్షాన్నే ఎదుర్కోనుందా లేక ఆ పార్టీ తన సంతృప్తస్థాయిని ఇప్పటికే చేరుకుందా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంతృప్తస్థాయి అంటే సాధ్యపడినంత అత్యున్నత స్థాయికి చేరిందనీ, ఇక తదుపరి దశలో క్షీణత లేక పతనం తప్పదని అర్థం. అయితే బీజేపీ తగ్గుముఖంలో ఉందని ఇప్పటికిప్పుడే చెప్పడం తొందరపాటే కావచ్చు. మోదీ నేతృత్వంలోని బీజేపీ 2014 నుంచి నిరంతర విజయాలను నమోదు చేస్తూ వచ్చింది. కొన్ని ఉపఎన్నికల్లో నష్టపోయి ఉండవచ్చు. కానీ ఆ పార్టీ బలాన్ని సంతరించుకుంటూనే వచ్చింది. పెద్దనోట్ల రద్దు, పేలవమైన జీఎస్టీ వంటి తప్పిదాలను మోదీ ప్రభుత్వం చేసినప్పటికీ మొత్తం మీద ప్రధాని మంచి పనులే చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు.అయితే 2019 అక్టోబర్ 24న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి విజయం తప్పదనిపించిన చోట ఉన్నట్లుండి భారీ రాజకీయ విషాదంగా పరిణమించింది. బీజేపీ, శివసేనలు ఈ ఎన్నికల్లో గెలిచినప్పటికీ శివసేన తర్వాత ఒక్కసారిగా బీజేపీని ఎత్తి కుదేసింది. ఈసారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవి తనకే కావాలని శివసేన బహిరంగంగా పట్టుబట్టడంతో ఇరుపార్టీల మధ్య విచ్ఛిన్నత తప్పలేదు. అనేక మలుపులు, ఒడిదుడుకుల తర్వాత బీజేపీ ప్రధాన శత్రువులైన కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన శరద్ పవార్‌తో పొత్తు కలిపిన శివసేన ఏకంగా ప్రభుత్వాన్నే ఏర్పర్చేసింది. మహారాష్ట్ర రాజకీయాలు బీజేపీని నిస్సహాయతలోకి నెట్టేశాయి. ఎన్నికల వ్యూహ రచనలో అతిశక్తిమంతులుగా ముద్రపడిన నరేంద్రమోదీ, అమిత్ షాలు నిస్సహాయులైనట్లు కనిపించారు. బీజేపీకి ఇప్పుడు శివసేన బద్ధ శత్రువైంది. పైగా కాంగ్రెస్, ఎన్సీపీలు బీజేపీకి బదులుగా మహారాష్ట్రలో ప్రభుత్వంలో ఉన్నాయి. ప్రతిపక్షం ఐక్యంగా ఉంటే బీజేపీ, మోదీలను ఓడించగలదనే సంకేతాన్ని కొత్త కూటమి ఇచ్చింది. మహారాష్ట్రలో బీజేపీ ఓటమి ఫలితాలు మహారాష్ట్రను బీజేపీ కోల్పోవడం నిస్సందేహంగా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. దేశంలోనే అత్యంత సంపన్న రాష్ట్రం మహారాష్ట్ర. బీజేపీ ప్రత్యర్థులు ఇక్కడ వచ్చే ఎన్నికలకోసం ఎలెక్టోరల్ బాండ్ల ద్వారా భారీ నిధులను సేకరించగలరు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి 48 లోక్‌సభ స్థానాలకుగాను 41 స్థానాలు గెల్చుకున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఫలితాన్ని సాధించడం చాలా కష్టం. అందుకే మహారాష్ట్రలో ఓటమి బీజేపీ పతనానికి నాంది పలుకనుందా లేక మరో చిన్న పరాజయంగానే మిగిలిపోతుందా అనేది ప్రశ్నగా మిగిలింది. మహారాష్ట్రను కోల్పోవడం బీజేపీని నైతికంగా దెబ్బతీసింది. ఒక సంపన్న రాష్ట్రం ఇంత సులభంగా తమ చేతుల్లోంచి చేజారిపోయిందా అని బీజేపీ కేడర్, నాయకత్వం చేష్టలుడిగిపోయారు. బలహీనంగా కనిపించిన శివసేన చేతుల్లో అజేయమైనదని పేరొందిన మోదీ, షాల వ్యూహం దెబ్బతినిపోవడం బీజేపీ ప్రతిష్టను మసకబార్చింది. మహారాష్ట్రనే కోల్పోయినప్పుడు, రానున్న జార్ఖండ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ నష్టపోవచ్చు. ప్రతిపక్షం మళ్లీ శక్తిని పుంజుకుంది, ఐక్యత అనేది బలమైన బీజేపీని కూడా ఓడించవచ్చనే అభిప్రాయం ప్రతిపక్షంలో పెరిగింది. బీజేపీ బలాలు మహారాష్ట్రలో బీజేపీ ఓడిపోయినప్పటికీ, లోక్‌సభ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల 6 నెలల కాలం ఉంది. నరేంద్రమోదీ సత్పరిపాలనను అందించగలిగితే రాజకీయాల్లో పైచేయి సాధించటానికి ఇది సుదీర్గ సమయమే. కాబట్టి 2014 ఎన్నికల్లో ప్రజల విశ్వసనీయతను బీజేపీ పొందే అవకాశం ఉంది కూడా. పైగా ప్రతిపక్షానికి జాతీయ వ్యాప్తంగా తమ్ముతాము నిరూపించుకున్న జాతీయ స్థాయి నాయకులు లేరు. సోనియా గాంధీ కుటుంబం ఇప్పటికే విస్తృత ప్రచారం జబ్బు బారినపడ్డారు. ఇక వారినిుంచి ఒరిగేదేమీ లేదు. రాజకీయాల్లో పాతబడిపోతే త్వరగా తెరవెనక్కు పోతారు. ప్రజలు మార్పు కోరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని యువతకు, నూతన నేతలకు ఇవ్వడానికి సిద్దంగా లేదు. కాంగ్రెస్ తన జనాకర్షణ శక్తిని కోల్పోయిందని బీజేపీకి తెలుసు. పైగా కాంగ్రెస్ నుంచి దానికి వచ్చే ప్రమాదం ఏదీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్‌లో అందరూ ప్రాంతీయనేతలే. జాతీయ నేతలు లేరు. అదే అధికార పక్షాన్ని చూస్తే ఈశాన్య భారత రాష్ట్రాల్లో కూడా బీజేపీ బాగా ఎదిగింది. బెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలు, అసోంలలో బీజేపీ బలీయమైన శక్తిగా మారింది. బెంగాల్లో మమతకు, ఒడిశాలో నవీన్ పట్నాయక్‌కు బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. అసోంని, ఈశాన్య భారతాన్ని దాదాపు ఈ పార్టీనే పాలి స్తోంది. బీజేపీకి ఇది అతిపెద్ద బలం మరి. పైగా తూర్పు, ఈశాన్య భారత్‌లో కోట్లాదిమంది పరదేశీయులు వలస వచ్చి స్థిరపడినందున బీజేపీ ప్రవేశపెట్టిన జాతీయ పౌరసత్వ చట్టం ఎన్ఆర్సీ దేశంలోని అనేక ప్రాంతాల్లో భావోద్వేగాలను ప్రేరేపించింది. ఎన్నార్సీకి భారీ డిమాండ్ ఉంటున్నందున బీజేపీ ఈ ఎన్నార్సీని అమలు పర్చి భారీ ప్రయోజనాన్నే పొందవచ్చు. ఇక విదేశీ విధాన వ్యవహారాల్లో మోదీ గొప్ప విజయం సాధించారు. కశ్మీర్ వంటి కీలక అంశంలో ప్రపంచం మొత్తంగా మన వాదనను బలపర్చేలా మోదీ ప్రభుత్వం చేయగలిగింది. దేశంలో వారసత్వ రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటుండటంతో వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకలాగే సులభం కావచ్చు. బీజేపీ బలహీనతలు మహారాష్ట్రలో వ్యూహపరంగా బీజేపీ దెబ్బతినిపోవడానికి కేంద్రీకృత నాయకత్వమే కారణం. శివసేనకు రెండున్నర ఏళ్లు ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని హామీ ఇచ్చి ఉంటే మహారాష్ట్ర ఇంత సులభంగా చేజారిపోయి ఉండేదని చాలామంది పరిశీలకుల వ్యాఖ్య. కానీ ఈ విషయాన్ని మోదీ, షాలకు చెప్పే ధైర్యం బీజేపీలో ఎవరికీ లేదు. శివసేన డిమాండును అంగీకరించి ఉంటే ఇంత ఉపద్రవం ఎదురయ్యేది కాదు. బీజేపీ కూడా కాంగ్రెస్ లాగే అధిష్టానం, దాని ముందు ఎవరూ నిలబడలేని పనివిధానంతో సాగుతోంది. మోదీ, షా, పీయూష్, గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్ మినహాయిస్తే మంత్రిమండలి రాజకీయంగా, పాలనాపరంగా బలహీనమైంది. అనుభవం లేని మంత్రులవల్లే ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం, విద్య వంటి రంగాలు ఫలితాలనివ్వడం లేదు. పైగా పొత్తు పార్టీలను నిర్లక్ష్యం చేయడం బీజేపీని బాగా దెబ్బతీస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న బీజేపీ కూటమి పార్టీలను పక్కనబెట్టేసింది. పైకి ఏమీ అనలేకపోయినా వీరంతా సమయం కోసం కాచుకుని ఉన్నారు. మహారాష్ట్ర ఉదంతంలో గుణపాఠాలు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరన్న విషయం మర్చిన బిజేపీ శివసేనకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని ఊహించలేకపోయింది. అనూహ్యంగా అలా జరగడంతో బీజేపీ షాక్‌కు గురయింది. కాంగ్రెస్ పార్టీ శివసేనతో పొత్తుకు సిద్ధపడగలదని ఏమాత్రం ఊహించినా శివసేనకు సీఎం పదవిని ఇవ్వడానికి బీజేపీ సిద్ధపడిపోయేది. ఢిల్లీని ఏలుతున్న తనను అర్భక పార్టీ అయిన శివసేన ఏం చేస్తుందన్న నిర్లక్ష్యం ప్రదర్శించడమే బీజేపీ కొంప ముంచింది. ఏకు అనుకున్న శివసేన ఇప్పుడు ప్రమాదకర శత్రువుగా మారిపోయింది. అలాగే మీ మిత్రుల సంఖ్యను పెంచుకుని శత్రువుల సంఖ్యను తగ్గించుకోవాలన్న ప్రాథమిక సూత్రాన్ని బీజేపీ మర్చిపోయింది. అయితే నరేంద్రమోదీ, అమిత్ షాలు తమను తాము చక్కదిద్దుకోగలమని నిరూపించుకున్నారు. పెద్దనోట్ల రద్దు గురించి మోదీ ఇప్పుడు కనీసంగా ప్రస్తావించలేదు. అరుణ్ జైట్లీ జీఎస్టీని కుప్పగూలిస్తే, మోదీనే దాన్ని మెరుగుపర్చారు. ఉపయోగంలేని మంత్రుల, నేతలను వదిలించుకోవడంలో మోదీ, షాలు సిద్ధహస్తులు. తన రాజ కీయాలను మార్చుకుని మిత్రులను సంపాదించుకుని మరింత నమ్రతగా ఉండే అవకాశం ఇప్పటికీ బీజేపీ ముందుంది. ఈకోణంలో మహారాష్ట్ర బీజేపీకి పెద్ద గుణపాఠమైంది. బీజేపీ తన తప్పిదాలను సరిదిద్దుకుని నమ్రత గల పార్టీగా మారుతుందా? ఇప్పుడు బీజేపీకి రెండు అవకాశాలున్నాయి. మార్పు చెంది గెలుపొందడం, మారకుండా ఉండి ఓటమి వైపు పయనించడం! వ్యాసకర్త, పెంటపాటి పుల్లారావు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు -
నిండా మునగనున్న టీడీపీ
సందర్భం పొత్తు విచ్ఛిన్నమయ్యాక బీజేపీ కంటే టీడీపీయే నష్టపోయేది ఎక్కువ. కారణం కేంద్ర స్థాయిలో బీజేపీ అవసరం టీడీపీకి ఉంది కానీ టీడీపీ అవసరం బీజేపీకి ఉండదు. బాబు ఇప్పుడు అన్నిరకాలుగా ఒంటరి. ఇది తన ప్రత్యర్థులకే మేలు చేస్తుంది. టీడీపీ, బీజేపీ పార్టీల బంధం ఆకస్మికంగా విచ్ఛిన్నం కావడంతో ఉన్నట్లుండి గొప్ప స్నేహితులు శత్రువులుగా మారిపోయారు. చంద్రబాబు తనకు రాసిన ఉత్తరానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మార్చి 18న ప్రత్యుత్తరం ఇచ్చిన తర్వాత రెండు పార్టీల మధ్య సంబంధాలు మరింతగా బెడిసికొట్టాయి. తన రాజకీయ జిత్తులను ప్రదర్శించడానికి చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని షా తన ఉత్తరంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. పైగా, చంద్రబాబు ప్రభుత్వం ఇంతవరకు కేంద్రం ఇచ్చిన నిధులకు సంబంధించి ఖర్చుచేసిన లేదా దుబారా చేసిన లెక్కల వివరాలను ఒక్కసారి కూడా సమర్పించలేదని షా పేర్కొనడంతో ఇరుపార్టీల మధ్య పోరాటం మరింతగా పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగినన్ని నిధులను ఇవ్వడం లేదని గత ఆరునెలలుగా టీడీపీ బహిరంగంగానే ఆరోపిస్తూ వచ్చింది. 2018 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ తర్వాత బాబు తీవ్ర ఆగ్రహం ప్రకటించి, పార్లమెంటులో ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తామని, తమ డిమాండ్లకోసం ఆందోళన చేస్తామని చెప్పారు. ఇప్పుడు టీడీపీ బీజేపీకి ప్రత్యర్థిగా ఉంది. ఈ క్రమంలో బీజేపీ, టీడీపీలు రాజకీయ క్రీడను పునరుద్ధరించాయి. టీడీపీ, బీజేపీ రెండు కూడా ఎదుటిపక్షం బుకాయిస్తోందని భావిస్తూ మరిన్ని ప్రయోజనాలు పొందడం కోసం చర్చలు చేస్తున్నాయి. వైఎస్సార్సీపీ అడుగడుగునా అడ్డుకుని ప్రతిఘటించింది కాబట్టే ఈ రెండు పార్టీలు ఆడుతున్న జూద క్రీడ మొత్తంగా విఫలమైంది. 2018 ఫిబ్రవరిలో కేంద్ర మంత్రి పదవులను కోల్పోవాల్సి వస్తుందని, కేంద్రంపై పట్టు కోల్పోవాల్సి వస్తుందని టీడీపీ ఎన్నడూ ఊహించలేదు. అలాగే 4 ఏళ్ల పొత్తు తర్వాత టీడీపీ తనకు శత్రువుగా మారుతుందని బీజేపీ కూడా భావించలేదు. ఎ. కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగడం ద్వారా కేంద్ర మంత్రి పదవులనూ, అధికారులపై తన ప్రభావాన్నీ టీడీపీ కోల్పోయింది. బాబు, ఆయన మంత్రులను కేంద్రం సాదరంగానే గౌరవించింది. కేంద్రంలో వీరు అనేక పనులు చక్కబెట్టుకున్నారు కూడా. ఇప్పుడు కేంద్ర మంత్రులు బాబుకు ఎలాంటి అదనపు గౌరవం చూపించటం లేదు. ఆ స్థానంలో శతృత్వం, అగౌరవం మాత్రమే మిగిలాయి. బి. ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలను బహిరంగంగా విమర్శించడం ద్వారా బాబు బలమైన శత్రువులను కొని తెచ్చుకున్నారు. ఈ ఇద్దరు ప్రముఖులూ తామాడిన మాటకు కట్టుబడిలేరని ఆరోపిస్తూ యావద్దేశం ముందూ వారిని బాబు అవమానించారు. ఇప్పుడు అరుణ్ జైట్లీ లేక ప్రధాని మోదీ అప్పాయింట్మెంట్ కూడా చంద్రబాబు పొందలేని పరిస్థితి ఏర్పడింది. సి. టీడీపీ కేంద్రప్రభుత్వంలో భాగంగా ఉన్నంతవరకు చంద్రబాబు సత్వర ఆమోదాలు పొందగలిగేవారు, కొత్త ప్రాజెక్టులకు ఆమోదముద్ర సాధించుకునేవారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2019 ఎన్నికలలో తన ప్రత్యర్థిని ఎంత బలోపేతం చేస్తుందన్న ప్రాతిపదికనే టీడీపీ చేసే ప్రతి డిమాండ్‌నూ పరిశీలించే అవకాశముంది. డి. కేంద్రం నుంచి గరిష్టంగా నిధులు, పెట్టుబడులు పొందడానికే చంద్రబాబు తమతో పొత్తును ఉపయోగించుకున్నారని, ఇప్పుడు తమను మోసం చేశారని బీజేపీ భావిస్తోంది. బాబు ఇక విదేశీ పెట్టుబడులను, విదేశీ సందర్శకులను ఏపీకి తీసుకురావడం చాలా కష్టమవుతుంది. ఇ. రాబోయే 12 నెలల్లో బీజేపీకి చంద్రబాబు లేక టీడీపీ అవసరం ఉండదు. కానీ టీడీపీకి మాత్రం బీజేపీతో అవసరం ఉంది. ఇది నాయుడికి ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు బీజేపీ ఆంధ్రా కోసం ఏ రాయితీలనైనా ఇస్తే ఆ ఘనత ఇతరులకే కానీ టీడీపీకి మాత్రం రాదు. కేంద్రప్రభుత్వం రైల్వే జోన్ తదితర హామీలను ఇచ్చేటట్టయితే చంద్రబాబుకు, టీడీపీకి ఆ ఘనత దక్కనిరీతిలో ఇస్తుంది. ముగింపు : టీడీపీ ఏకాకి అయిపోయింది. ఢిల్లీలో అధికారాన్ని కూడా కోల్పోయింది. మోదీ, తదితరుల ఆగ్రహాన్ని చవిచూసే ప్రమాదమున్నందున 2019లో బీజేపీ అధికారంలోకి రాకూడదని చంద్రబాబు ప్రార్థించవలసి ఉంటుంది. చంద్రబాబు తనను నిందించడంపై అరుణ్ జైట్లీ ఆగ్రహంతో ఉన్నారు. ఇక కాంగ్రెస్ కూడా చంద్రబాబు కెరీర్‌ను ముగించాలని చూస్తోంది. అంటే బీజేపీ లేక కాంగ్రెస్ ఎవరు ఢిల్లీలో అధికార పీఠమెక్కినా చంద్రబాబుకు మేలు జరగదు. పవన్ కల్యాణ్ వంటి నూతన శక్తులు రంగంలోకి రావడం వైఎస్సార్ సీపీ బలాన్ని మరింతగా పెంచనుంది. చంద్రబాబు పాలనతో విసిగిపోయిన ఓటర్లు టీడీపీకి దూరంకానున్నారు. చంద్రబాబు తమకు ఆశలు చూపించినట్లుగా తాము సింగపూర్ లేదా స్విట్జర్లండ్ కలలు కంటూ పొద్దుబుచ్చాలా లేదా ఉద్యోగాలు లేని సాధారణ జీవితంతో సంతృప్తి పడాలా అనే విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇకపై తమ అంచనా తాము వేసుకుంటారు. తన అవినీతి చర్యలపై విచారణ ప్రారంభమవుతుందని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే బీజేపీ తనను జైల్లో పెట్టవచ్చని చంద్రబాబు పదే పదే చెబుతూ వస్తున్నారు. బాబు బాగా భయపడుతున్నాడని ఇది తెలుపుతోంది. బీజేపీ ప్రభుత్వానికి టీడీపీ బలమైన మిత్రుడిగా మీడియా, న్యాయవ్యవస్థ ఇంతవరకూ చూస్తూ వచ్చింది. ఇప్పుడు బాబు బీజేపీకి బద్ధశత్రువు కాబట్టి వీరు కూడా తనకు దూరం కావచ్చు. ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీకి రావలసిన అవసరం ఉండదు లేక ఏపీకి ప్రాజెక్టుల కోసం ప్రయత్నించి అవన్నీ తన ఘనతే అని చెప్పుకునే అవకాశమూ ఉండదు. నిస్సందేహంగానే బీజేపీ కంటే టీడీపీనే నష్టపోయేది ఎక్కువ. 2019లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే టీడీపీ భారీగా నష్టపోతుంది. ఏపీలో ఆయన ప్రత్యర్థులకు అధిక ప్రయోజనం సిద్ధిస్తుంది. చంద్రబాబు ఇకనుంచి కేంద్ర ప్రభుత్వంతో వ్యవహరించేందుకు మెరుగైన వ్యూహాలు, ఎత్తుగడలు పన్నాల్సి ఉంటుంది. అమిత్ షా ఉత్తరాలు రాసి ఊరకుండే వ్యక్తి కాదు. ఆయన మాటల కన్నా.. చేతల మనిషి అని గుర్తుంచుకోవాలి. - పెంటపాటి పుల్లారావు వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు ఈ–మెయిల్ : drppullarao@yahoo.co.in -
'మంత్రులు సంబరాలు మాని.. ఆదేశాలు అమలు చేయాలి'
విశాఖపట్నం: రాజధాని అమరావతి నిర్మాణంపై జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని ఆర్థికవేత్త డాక్టర్ పెంటపాటి పుల్లారావు అన్నారు. ట్రైబ్యునల్ ఆదేశాలతో పాలకులు కిందపడ్డా పైన ఉన్నట్టు నటిస్తూ ప్రజలను భ్రమింపజేస్తున్నారని విమర్శించారు. విశాఖలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఎన్జీటీ ఉత్తర్వులు తమకు అనుకూలంగా ఉన్నాయని, వాటితో రాజధాని నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయన్నట్టుగా పురపాలకశాఖ మంత్రి నారాయణ వ్యాఖ్యానించడం, సంబరాలు చేసుకోవడంలో అర్థం లేదన్నారు. ఆ ఉత్తర్వులను ఆయన మరోసారి చదువుకుంటే ప్రభుత్వానికి అవి ఎంత వ్యతిరేకంగా ఉన్నాయో అర్థమవుతుందన్నారు. రాజధాని నిర్మాణంపై ఇచ్చిన ఈ తీర్పుపాలకులకు కాకుండా రాష్ట్రానికి మేలు చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ కార్యదర్శి చైర్మన్‌గా ఉండే కమిటీని నియమించిందని, కనీసం మూడు నెలలకోసారి నివేదిక ఇవ్వాలని, అవసరమైతే తనిఖీ బృందాలను పంపి ఎన్జీటీ విధించిన షరతులు అమలవుతున్నాయో లేదో పరిశీలించాలని, వీటిపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. నదీ తీరంలో నిర్మాణాలు చేపట్టరాదని, నదీ ప్రవాహానికి ఆటంకం కలగకూడదని స్పష్టం చేసిందనన్నారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఎప్పటికప్పుడు వీటిని పర్యవేక్షించాలని, ఏ పౌరుడికి ఇబ్బంది కలిగినా కమిటీకి ఫిర్యాదు చేయొచ్చని సూచించిందన్నారు. ఈ మంత్రిత్వ శాఖ తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చని పక్షంలో మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించవచ్చని తెలిపిందన్నారు. అంతేకాదు అదనపు ప్రధాన కార్యదర్శితో మరో కమిటీని వేసి సక్రమంగా అమలు చేస్తున్నారో లేదో చూడాలని పేర్కొందన్నారు. ఇకమీదట నదీ పరివాహక ప్రాంతంలో పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతి లేకుండా ఒక్క మొక్క కూడా నాటకూడదని, చిన్నపాటి నిర్మాణం చేపట్టరాదని పుల్లారావు తెలిపారు. చాలా అరుదైన కేసుల్లోనే ఇలాంటి స్పష్టమైన ఆదేశాలిస్తుందని చెప్పారు. ఇవన్నీ చూస్తే ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వలేదని ఎవరికైనా అర్థమవుతుందన్నారు. మంత్రులు సంబరాలు చేసుకోవడం మాని ట్రైబ్యునల్ ఆదేశాలను అమలు చేయాలని, నిపుణులతో చర్చించాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టుతో 5 లక్షల మంది తరలింపునకు గురవుతున్నారని దీనిపై ప్రత్యక్ష పరిశీలనకు రావాలని తాను ఎన్జీటీ చైర్మన్ స్వతంత్రకుమార్ను ఆహ్వానించానని, ఇందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారని పుల్లారావు తెలిపారు. -
నిర్వాసితులను నిర్బంధిస్తారా?
సాక్షి, రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేల బృందం 5 లక్షల నిర్వాసితుల సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమని ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ పెంటపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల పోలవరం పర్యటన కర్ఫ్యూను తలపించిందని వ్యాఖ్యానించారు. పోలవరం వస్తున్న ఎమ్మెల్యేల బృందానికి సమస్యలు చెప్పుకుందామని భావించిన నిర్వాసితులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు చేసి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు. బ్రిటీష్ హయాంలో లండన్ నుంచి భారతదేశానికి ఎంపీలు వచ్చినపుడు వ్యవహరించిన విధంగా ఏపీ ప్రభుత్వం నిర్వాసితులను నిర్బంధించిందన్నారు. దీనిపై త్వరలోనే న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎంను పొగడటానికి ఇచ్చిన ప్రాధాన్యత పోలవరం నిర్వాసితుల సమస్యలపై పెట్టలేదని విమర్శించారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్లడంతో నిర్వాసితులను పోలీసులు ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు. -
ఆర్భాటాలను నిలదీసిన సవాళ్లు
విశ్లేషణ తిరుగులేదనుకున్న గుజరాత్లో వ్యతిరేక పవనాలు అటు ప్రధాని మోదీని, ఇటు బీజేపీని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. గెలుపుకు ఢోకా లేనప్పటికీ అక్కడ పరిస్థితి మారిందన్నదే ఈ కలవరపాటుకు కారణం. గుజరాత్ లోని తన స్వస్థలమైన వాద్నగర్ని 2017 అక్టోబర్ 8న సందర్శించిన ప్రధాని నరేంద్రమోదీ దేవుళ్లు తనను రక్షిస్తారంటూ భావోద్వేగం ప్రదర్శిం చారు. మోదీ తీవ్రంగా కలవరపడుతున్నారని, తన భవిష్యత్తు పట్ల ఆందోళన చెందుతున్నారని చెప్పడానికి ఇదొక స్పష్టమైన సంకేతం. సొంత రాష్ట్రాన్ని పదేపదే సందర్శించడం, ఎన్నికలకు ముందు వరాలు గుప్పించడం చూస్తుంటే గుజరాత్ ఎన్నికలు మోదీని తీవ్రంగా కలవరపెడుతున్నట్లు స్పష్టమవుతోంది. గుజరాత్లో గౌరవప్రదమైన విజయం మోదీకి ఇప్పుడు చాలా అవసరం. 2012 గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాల స్థాయి తాజా ఎన్నికల్లో పొందకుంటే ఢిల్లీలో మోదీ పాలన సంక్లిష్టమవుతుంది. ఈ పరిస్థితి మోదీ స్వయంగా కొనితెచ్చుకున్నదే. గుజరాత్లో బీజేపీ విజయానికి ఢోకా లేకపోవచ్చు కానీ నరేంద్రమోదీ పట్ల గుజరాత్ ఇప్పుడు కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నట్లుంది. మోదీ ప్రధానిగా తమకు మంచి చేస్తారా లేదా అనే విషయంపైనే గుజరాత్ ప్రజలు కలవరపడుతున్నారు. గుజరాత్ శాసనసభకు 2017 డిసెంబర్ నెలలో జరగనున్న ఎన్నికలు మోదీకి, అమిత్ షాకు అతి పెద్ద సవాలుగా మారాయి. తన రాజకీయ రాజధానిపై మోదీ పెద్దగా ఖర్చుపెట్టకుండానే, గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ సునాయాస విజయాన్ని సాధించాల్సి ఉండె. కానీ దురదృష్టవశాత్తూ మోదీ, షాలు విజయాలను వినమ్రంగా స్వీకరించి వాటినుంచి నేర్చుకోవడం లేదు. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత అసొం, ఈశాన్య భారత్, హరియాణా, ఉత్తరాంచల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో మోదీ, షా ద్వయం బీజేపీకి ఘన విజయాలు సాధించిపెట్టారు. కానీ ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాల్లో కూడా ప్రధాని కనిపించడం మోదీ ప్రతిష్టను మసకబార్చింది. 7 నెలల క్రితం జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోదీ సునాయాస విజయం సాధిస్తారని అందరూ అంగీకరించారు. కానీ ఇప్పుడు మోదీ–బీజేపీ శిబిరంలో చాలా కలవరపాటు కనిపిస్తోంది. ప్రమాద సంకేతాలు గుజరాత్ నుంచే మొదటగా వచ్చాయి. 2017 సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ జపనీస్ ప్రధానితో కలసి గుజరాత్లో లక్ష కోట్ల రూపాయల విలువైన బుల్లెట్ రైలుకు ప్రారంభోత్సవం చేసినప్పుడు ఇది స్పష్టమైంది. భారత్ భారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుతుంది కాబట్టి ఇది చాలా మంచి ప్రాజెక్టు. కానీ ఈ ఇద్దరు నేతలూ రోడ్ షో చేసిన సందర్భంలో ప్రజలు ఎలాంటి ఆసక్తిని ప్రదర్శించలేదు. దేశంలో కూడా ఈ ఘటనను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ప్రజల్లో ఈ నిరాసక్తి మోదీని దిగ్భ్రాంతికి గురిచేసింది. గుజరాత్ తనను తీవ్రంగా కలవరపాటుకు గురిచేయవచ్చని మోదీ ఎట్టకేలకు గుర్తించారు. కాగా, గుజరాత్లో మోదీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఒక తాటికి తెచ్చే ప్రయత్నాలను కాంగ్రెస్ చేపట్టింది. ఓబీసీలకు చెందిన యువ నేత అల్పేష్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హార్దిక్ పటేల్, దళిత నేత జిగ్నేష్ మెవానీలు మోదీకి వ్యతిరేకులుగా ఉన్నారు. వీరి మద్దతును కాంగ్రెస్ పొందవచ్చు కూడా. హార్దిక్, మెవానీ, ఠాకూర్ వంటి వారు కేవలం మీడియా సృష్టిమాత్రమేనా అనేది కాలమే చెబుతుంది. కానీ కాంగ్రెస్ చుట్టూ చేరుతున్న ఈ కొత్త స్నేహితులు కచ్చితంగా మోదీని బీజేపీని ప్రస్తుతం కలవరపాటుకు గురిచేస్తున్నారన్నది వాస్తవం. మోదీ కలవరపాటుకు కారణాలు : 1. పెద్దనోట్ల రద్దుతో మోదీ అనేక తప్పులు చేశారనడంలో సందేహమే లేదు. వ్యాపార రాష్ట్రమైన గుజరాత్ దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే ఎక్కువగానే పెద్దనోట్ల రద్దుతో తీవ్రంగా నష్టపోయిందని మోదీ గ్రహించారు. లక్షలాదిమందికి ఉపాధి కల్పించిన గుజరాత్ నగల పరిశ్రమలో జీఎస్టీ తర్వాత తీవ్ర నిరసనలు చెలరేగాయి. గుజ రాత్ ఆగ్రహాన్ని పసిగట్టిన మోదీ జీఎస్టీలో కాస్త మార్పులు చేయించినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 2. గత మూడేళ్లలో మోదీ దేశ వ్యవసాయ రంగ ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపయ్యేలా చేస్తానని పదే పదే చెబుతూ వచ్చారు. భూసార నాణ్యతా కార్డు, కిసాన్ పరపతి కార్డుల గురించి ప్రతి నీటి చుక్కనూ ఒడిసిపట్టి మరిన్ని పంటలు పండించడం గురించి ప్రధాని నిర్విరామంగా ప్రచారం చేస్తూవచ్చారు. కానీ వీటిలో ఏ ఒక్కటీ పనిచేయలేదని మోదీకి అర్థమైంది. 3. నిన్నా మొన్నటి వరకు మోదీ పెద్దనోట్ల రద్దు, జీఎస్టీకి సంబంధించి మొత్తం ఘనత తనదేనని చెప్పుకుంటూ వచ్చారు. ఉన్నట్లుండి జీఎస్టీ అనేది దేశంలోని అన్ని రాష్ట్రాలు, రాజకీయ నేతల ఏకాభిప్రాయ ఫలితమేనని మాట మార్చారు. బీజేపీ గుజరాత్ ఎన్నికల్లో గెలవచ్చు కానీ మెజారిటీ ఎంత వస్తుందన్నదే ప్రశ్న. గుజరాత్లో విఫలమైతే, బీజేపీలో మోదీకి వ్యతిరేకంగా చిన్నపాటి తిరుగుబాటు రావచ్చు. ఒక వైపు మోదీ, మరొకవైపు తెలుగు రాష్ట్రాల సీఎంలిద్దరు ఈ విషయంలో పాఠాలు నేర్వాలి. మోదీ గుజరాత్లో అభివృద్ధి, ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ వచ్చారు. కానీ గుజరాత్ ప్రజలు ఇప్పుడు ఆయనను ఎందుకు కలవరపాటుకు గురిచేస్తున్నారన్నది ప్రశ్న. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాతే అనూహ్య ఘటనలు జరిగిపోతుంటాయి. వాస్తవం ఏమిటంటే.. సొంత రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ తన ఆధిక్యతను కోల్పోయారు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికలు మోదీపై మరిన్ని డిమాండ్లను విధించవచ్చు. బుల్లెట్ రైళ్లు, నర్మదా డ్యామ్‌లు, అమరావతిలు ఆ ఎన్నికలకు అసందర్భం, అప్రస్తుతం కావచ్చు. పెంటపాటి పుల్లారావు వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు ఈ–మెయిల్ : ppr193@gmail.com -
అంతర్గతపోరులో తొలిదెబ్బ
విశ్లేషణ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ అంటే జీడీపీ లెక్కలు కాదు. అది ఉద్యోగాల కల్పన. పెద్దనోట్ల రద్దుపై మోదీని, జీఎస్టీపై జైట్లీని తప్పుబట్టాల్సి ఉంది. మోదీ పనితీరుపై బీజేపీ సీనియర్ నేత నేరుగా దాడి చేయడం ఇదే తొలిసారి. దీని పరిణామాలేంటి? రాజకీయాల్లో ఒక వారం రోజులు సుదీర్ఘ కాలమేనని 50 ఏళ్ల క్రితమే నాటి బ్రిటన్ ప్రధాని హెరాల్డ్ విల్సన్ చెప్పారు. వారం కంటే ఎక్కువ రోజులే గడిచాయి కానీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ వృద్ధ నేత యశ్వంత్ సిన్హా మధ్య కుమ్ములాట కొనసాగ డమే కాదు మరింత విస్తృతమవుతోంది. యశ్వంత్ సిన్హా సమస్యను, దాన్ని లేవనెత్తిన సమయాన్ని చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు. ఐఏఎస్ అధికారిగా కెరీర్ మొదలెట్టిన సిన్హా 30 ఏళ్లపాటు రాజకీయాల్లో గడిపారు. ప్రస్తుతం 80 ఏళ్ల వయసులోనూ చురుగ్గా ఉన్న సిన్హా దెబ్బకాచుకుని తిరిగి లేవడంలో నిష్ణాతుడు. 1987లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సిన్హా దివంగత ప్రధాని చంద్రశేఖర్‌కు ప్రీతిపాత్రుడు. 1989లో ఎంపీగా గెలిచి ఏడాదిపాటు చంద్రశేఖర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత 1998లో బీజేపీలో చేరిన సిన్హా, నాటి ప్రధాని ఏబీ వాజ్‌పేయి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆర్థికమంత్రిగా ఆయన రికార్డు చిదంబరం, జైట్లీ కంటే ఏమంత పెద్దగా లేదు. ఈ ముగ్గురి ఉమ్మడి లక్షణం ఏమిటంటే.. గొప్ప చింతనాపరులు, టీవీలో చక్కగా చర్చించేవారు, ఢిల్లీ రాజకీయాలపై, ఢిల్లీ మీడియాపై గట్టి పట్టు సాధించారు. మోదీపై సిన్హాకు తనదైన ఈర్షా్యద్వేషాలున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ, బహుశా మోదీ తనకు ఏదైనా గొప్ప పాత్ర కల్పించవచ్చని తాను భావించి ఉండవచ్చు. కానీ సిన్హా కుమారుడు జయంత్ సిన్హాను మంత్రిగా చేసినందున ఇక తనకు సిన్హా విజ్ఞానంతో అవసరం లేదని మోదీ భావించారు కాబోలు. దీంతో సిన్హా కాస్త అసంతృప్తి చెందివుంటారు. సకాలంలో రాజకీయాలనుంచి తప్పుకోకపోతే నేతల రాజకీయ భవిష్యత్తు వైఫల్యంతోనే ముగుస్తుందని బ్రిటిష్ రాజకీయనేత ఇనోచ్ పావెల్ చెప్పారు. అలాగే సిన్హా తన చక్కటి ఆరోగ్యం, ఆకాంక్షలతో బాధితుడయ్యారు. మోదీ తన హయాంలో తీసి పడేసిన పలువురు సీనియర్ బీజేపీ నేతలు, ఎంపీలతో సిన్హా విస్తృతంగా చర్చించే ఉండాలి. అరుణ్ జైట్లీ–మోదీ ఆర్థిక విధ్వంస విధానాలపై ఉన్నట్లుండి దాడి చేయడానికి సిన్హా అంత అపరిపక్వత కలవారేమీ కాదు. ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతోందని ఆర్బీఐ, ఎస్బీఐ, జాతీయ గణాంక కమిషన్ తేల్చి చెప్పిన తర్వాతే సిన్హా సరైన సమయాన్ని చూసి మరీ దాడికి దిగారు. ఆర్బీఐ, ఇతర సంస్థల అభిప్రాయాలతోపాటు, ప్రజలు కూడా ఆర్థిక వ్యవస్థ సరిగా లేదని గ్రహించారు. మితిమీరిన పన్నులు, ఉపాధి కల్పనలో పూర్తి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. స్వచ్ఛభారత్, మేక్ ఇన్ ఇండియా వంటి మంచి పథకాలను మోదీ ప్రారంభించారు. తన విదేశీ విధానం చక్కగా సాగుతోంది. కాని బలహీనమైన మంత్రివర్గం ఫలితాలను సాధించడం లేదు. పైగా, ఆర్థిక మంత్రి జైట్లీని మోదీ నియంత్రించలేకపోతున్నారు. ఆర్థిక వ్యవస్థ కోలుకోలేనంతగా విఫలమైందన్న ఆరోపణలతో సిన్హా బహిరంగ ప్రకటన చేసినప్పుడు స్పష్టంగా ఒక విషయం చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అపాయింట్మెంట్ కావాలని కోరితే ప్రధాని కానీ, మరే మంత్రి కానీ తనను కలిసేందుకే సిద్ధపడలేదని, ఈ నేపథ్యంలో జాతి హితం కోసం ప్రజల్లోకి వెళ్లకుండా తానెలా ఉండగలనని అన్నారు. దీంతో, 80 ఏళ్ల వయసులో సిన్హా ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారంటూ జైట్లీ ఆగ్రహంతో స్పందించారు. ఒక సీనియర్‌ను ఘోరంగా అవమానించినట్లు స్పష్టమవడంతో జైట్లీ ప్రతిష్ట మసకబారింది. మొత్తం సమస్య ఎక్కడుందంటే ఆర్థిక వ్యవస్థ క్షీణించడం లేదని జైట్లీ దేశాన్ని ఒప్పించలేకపోవడమే. వృద్ధి రేటు వంటి సంఖ్యలతో జనాలకు పనిలేదు. వారు అధిక పన్నులను, నిరుద్యోగాన్ని మాత్రమే చూస్తున్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ తర్వాత నిరుద్యోగం తారస్థాయికి చేరింది. జీఎస్టీ విధాన రూపకర్త తానే కాబట్టి మొత్తం పేరు తనకే రావాలని జైట్లీ భావిం చారు. కానీ జీఎస్టీ ప్రభావం ఘోరంగా ఉంది. పన్నులను, జీఎస్టీ పన్ను రేట్లను తగ్గించాలని చాలామంది జైట్లీకి సూచించారు కానీ తాను వాటిని లెక్కపెట్టకపోగా చాలామంది ప్రజలు ఇప్పుడు పన్నులు చెల్లిస్తున్నారని, పన్నులను అధికంగా రాబట్టడం గొప్ప విజయమని ప్రకటించారు. భారత్‌లో సామాన్యులు అధిక పన్నులు చెల్లించడానికి ఒప్పుకోరు. తన పన్ను విధానాల ద్వారా జైట్లీ మోదీకి అనేకమంది శత్రువులను తయారు చేసి పెట్టారు. ఆర్థిక స్థితి సరిగా ఉండి ఉంటే జైట్లీపై యశ్వంత్ సిన్హా ఎన్నటికీ దాడి చేసి ఉండేవారు కాదు. యూపీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది కాబట్టి ప్రజలు తమతోనే ఉన్నారని మోదీ చెప్పుకుంటున్నారు. కానీ చేసిన వాగ్దానాలకు తగినట్లుగా మోదీ పని చేయడం లేదన్న అభిప్రాయం ఇప్పటికే ప్రజల్లో ఏర్పడింది. అందుకే మెజారిటీ ప్రజలు ఇప్పటికీ మోదీని బలపరుస్తున్నప్పటికీ విమర్శలు పెరుగుతున్నాయి. ముడి చమురు ధరలు ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయి కాబట్టి ఆర్థిక వ్యవస్థ కోలుకోవచ్చు. మోదీ ప్రభుత్వంలో తీవ్ర లోటు ఏదంటే అత్యున్నత ఆర్థికవేత్తలు ఎవరూ తన సరసన లేరు. దీంతో స్తోత్రాలు చేస్తూ బతికేస్తున్న ఆర్థిక శాఖ అధికారులపైనే మోదీ పూర్తిగా ఆధారపడుతున్నారు. ప్రధానిగా గతంలో మన్మోహన్ సింగ్ వంటి ఆర్థిక వేత్త సైతం ఆర్థిక సలహాదారులను పెట్టుకున్నారు. మోదీ పన్నులు తగ్గించినట్లయితే, ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదు చేరుతుంది. దీంతో వందరోజుల్లోనే రైతులు నిజమైన ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు. అలా ఆర్థికవ్యవస్థ కూడా మెరుగవుతుంది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ అంటే జీడీపీ లెక్కలు కాదు. అది ఉద్యోగాల కల్పన. పెద్దనోట్ల రద్దుకు మోదీని, పేలవమైన జీఎస్టీకి జైట్లీని పూర్తిగా తప్పుబట్టాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారంలో నవ్వించే అంశం ఒకటుంది. 80 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి, అత్యంత శక్తిమంతుడైన, ముఖ్యుడైన జైట్లీపై దాడి చేయడం నవ్వు తెప్పిస్తోంది. కాగా, బీజేపీ మంత్రులు, పార్టీ సీనియర్లు, లాయర్లు, మీడియా కూడా దీనిని ఎంచక్కా ఆస్వాదిస్తున్నారు. పెంటపాటి పుల్లారావు వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు ఈ–మెయిల్ : ppr193@gmail.com -
మార్పుల వెనుక మతలబు!
విశ్లేషణ భారత వృద్ధి రేటు చైనా వృద్ధి రేటు కంటే హెచ్చుగా ఉందని మోదీ ప్రభుత్వం చెబుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మాత్రం చైనా భారత వృద్ధి రేటును అధిగమించి ముందుకు వెళుతోంది. దీనితో మోదీలో కలవరం ఆరంభమై సరైన ఫలితాలు తీసుకురాలేకపోయిన మంత్రులను తొలగిస్తానని, మంచి ఫలితాలు సాధించిన వారికి పదోన్నతి కల్పిస్తానని ప్రకటించారు. అయితే మంత్రులంతా విఫలమైనారని మాత్రం మోదీ చెప్పలేరు. ఎందుకంటే, అలా చెబితే తాను కూడా విఫలమైనట్టే. మంత్రిమండలి పునర్ వ్యవస్థీకరణ అవసరం వచ్చిందంటే, అది వైఫ ల్యాన్ని అంగీకరించడమే. మరో మాటలో చెప్పాలంటే, నీ మంత్రిమండలి సభ్యుల ఎంపికలో నీ నిర్ణయం సరికాదన్నమాటే. నీవు అనర్హులను మంత్రు లుగా చేర్చుకున్నట్టే. రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన మూడో మంత్రిమండలి పునర్ వ్యవస్థీకరణ సమాధానాలు లేని చాలా ప్రశ్నలను మిగిల్చింది. వ్యక్తిగతంగా మోదీ ప్రభ వెలుగుతూనే ఉంది. ఆయన ప్రభుత్వం మీద ఎలాంటి అవినీతి మచ్చ పడలేదు. బీజేపీ జాతీయ అధ్య క్షుడు అమిత్ షా అకుంఠిత, నిరంతర కృషితో చాలా రాష్ట్రాలలో ఆ పార్టీ ప్రభుత్వాలు ఏర్పడినాయి కూడా. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా చాలా ప్రాంతీయ పార్టీల మద్దతు బీజేపీ సాధించింది. ఇక ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ సాధించిన అసాధారణ విజయం దేశమంతా విస్తుపో యేటట్టు చేసింది. మార్పులు అవసరమా? రాజకీయంగా చూస్తే బీజేపీ, ఆ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ అప్రతి హతంగా సాగుతున్నారని చెప్పాలి. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, తమిళనాడుకు చెందిన అన్నా డీఎంకే వంటి ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు బీజేపీ వెంటే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో వైఎస్సార్ సీపీ, టీఆర్ఎస్లు కూడా బీజేపీతో స్నేహబంధం నెరపుతున్నాయి. ఇంత పటిష్టంగా ఉన్న సమయంలో మోదీ మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించవలసిన అవసరం ఏమొచ్చింది? కొందరు మంత్రులను ఎందుకు తొలగించవలసి వచ్చింది? ఇది చాలా మందికి వచ్చిన సందేహం. నిజానికి మోదీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ గురించిన ఊహాగానాలు ఆగస్టు 25, 2017 నుంచి ఆరం భమైనాయి. పెద్ద నోట్ల రద్దు తరువాత ఆర్థికవృద్ధి వేగం తగ్గిందంటూ రిజర్వు బ్యాంక్, ఇతర ఆర్థిక సంస్థలు లెక్కలు చెప్పడం ఆరంభించినది కూడా అప్పుడే. దానితోనే పునర్ వ్యవస్థీకరణ అంచనాలు శ్రీకారం చుట్టుకున్నాయి. వృద్ధి రేటు 5.7 శాతానికి దిగిపోయిందని ప్రభుత్వ గణాంక విభాగం అధిపతి టీసీఏ అనంత్ ధ్రువీకరించారు. పెద్ద నోట్ల రద్దు ఫలితంగా లక్షలాది ఉద్యోగాలు మాయ మైనాయని కొన్ని సంస్థలు వెల్లడించాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చతికిల పడింది. దేశంలో నిర్మాణం పూర్తి చేసుకున్న 50 లక్షల గృహాలు అమ్ముడు పోకుండా మిగిలి ఉన్నాయి. వ్యవసాయ రంగం మీద కూడా చాలా చెడు ప్రభావం పడింది. రైతుల బలవన్మరణాలు కొనసాగు తూనే ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి నత్తనడక నడవడం గురించీ, నిరుద్యోగం గురించి ప్రజలు ప్రశ్నించడం ఆరంభించారు. 2014 ఎన్నికల సభలలో మోదీ ఇచ్చిన వాగ్దా నాలలో ఇదే ప్రధానమైనది. దేశం రూపురేఖలు మార్చి, సంవ త్సరానికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని ఆయన ఢంకా బజాయించేవారు. కానీ ఈ వాగ్దానాలేవీ అమలుకు నోచుకోలేదు. అయితే మోదీ మంత్రిమండలి సాధించిన కొన్ని అద్భుతమైన విజ యాలు కూడా ఉన్నాయి. స్వచ్ఛభారత్ కార్యక్రమం అలాంటిదే. మరుగు దొడ్లను అనివార్యం చేస్తూ, దేశంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చిన ఈ కార్యక్రమంతో ఒక కొత్త స్పృహ మొదలయింది. విదేశీ వ్యవహరాలలో కూడా మోదీ ప్రభుత్వం ఎంతో చురుకైన పాత్ర పోషించింది. మౌలిక సదుపాయాల కల్పన రంగం అభివృద్ధి, రోడ్ల నిర్మాణం కూడా పటిష్టంగా జరుగుతున్నాయి. జీఎస్టీని ప్రవేశపెట్టినది కూడా ఈ ప్రభుత్వమే. అయితే ఈ వస్తుసేవల చట్టం ఫలితాలు వెంటనే కానరావు. కానీ వెంటనే జరిగిన మేలు ఏమిటంటే, రాష్ట్రాల సరిహద్దులలో సరుకులతో ఉన్న భారీ వాహనాలు ఇప్పుడు రోజుల తరబడి నిలిచిపోవడం లేదు. ఇది కూడా చెప్పుకోదగిన విజయమే. మోదీ ప్రభుత్వంలో కనిపించే మరో సుగుణం–విమర్శలకు సాను కూలంగా స్పందించడం. వెంటనే సవరణ చర్యలు చేపట్టడం కూడా. అంటే మోదీ తన తప్పులను దిద్దుకునే సదవకాశం విపక్షమే కల్పిస్తున్నది. మోదీ ప్రభుత్వంలో బలహీనతల గురించిన ప్రమాద ఘంటికలు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు రాజీనామా చేయడంతోను, దానిని ప్రధాని ఆమోదిం చడంతోను బయటపడ్డాయి. వరసగా జరిగిన రైలు ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ సురేశ్ ప్రభు పదవికి రాజీనామా ఇచ్చారు. వాస్తవం ఏమిటంటే నిరుద్యోగ సమస్యను పరిష్కరించే యత్నం సరిగా జరగలేదు. అంటే కార్మిక, నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖల వైఫల్యం ఉంది. రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అఖిల భారత స్థాయిలో జరుగుతున్న వీరి అలజడులు మోదీ సర్కారును కలత పెడుతున్నాయి. మోదీ కలవరం ఫలితం భారత వృద్ధి రేటు చైనా వృద్ధి రేటు కంటే హెచ్చుగా ఉందని మోదీ ప్రభుత్వం చెబుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మాత్రం చైనా భారత వృద్ధి రేటును అధిగమించి ముందుకు వెళుతోంది. దీనితో మోదీలో కలవరం ఆరంభమై సరైన ఫలితాలు తీసుకురాలేకపోయిన మంత్రులను తొలగిస్తానని, మంచి ఫలితాలు సాధించిన వారికి పదోన్నతి కల్పిస్తానని ప్రకటించారు. అయితే మంత్రులంతా విఫలమైనారని మాత్రం మోదీ చెప్పలేరు. ఎందుకంటే, అలా చెబితే తాను కూడా విఫలమైనట్టే. ఫలితంగానే మంచి ఫలితాలు సాధించిన మంత్రులు, విఫలురైన మంత్రుల కోసం అన్వేషణ ఆరంభించడం జరిగింది. నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్‌ప్రతాప్ రూడీ, కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయల మీద ఉద్వాసన వేటు చాలా సులభంగానే పడింది. అయితే ఆర్థికవృద్ధి వెనుకబడిందని ప్రభుత్వం కనుక ప్రకటిస్తే, ఆ తప్పు సీనియర్ మంత్రులకు చెందుతుంది. వాస్తవం ఏమిటంటే, అంత బలవంతుడైన మోదీకి కూడా సీనియర్ మంత్రులను తప్పించడం అంత సులభం కాదు. అందుకే బలహీనులైన వారి మీద ఉద్వాసన వేటు పడింది. రూడీ, దత్తాత్రేయలతో పాటు, అంతగా పేరు ప్రఖ్యాతులు లేని వారినే తొలగిం చారు. ఉమాభారతిని తొలగించాలన్న ప్రయత్నం ఆరంభించగానే ఆమె తిరుగుబాటు జెండా ఎత్తారు. దానితో ఆమె కొనసాగారు. దీనర్థం బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన గంగా ప్రక్షాళన పథకం కూడా విఫలమైనట్టే. నిజానికి బీజేపీ నుంచి, పార్లమెంటు నుంచి మాత్రమే కాకుండా బయట నుంచి కూడా ప్రతిభావంతులను కేంద్ర మంత్రిమండలిలో చేర్చుకోవలసిన అవసరం ఉంది. దేశంలో ఇలాంటి ప్రతిభ ఎంతో ఉంది. విప్రో అధినేత ఆజీం ప్రేమ్‌జీ, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వంటివారి సేవలను ఉపయో గించుకోవచ్చు. అంటే కొన్ని దేశాలలో ఆచరిస్తున్నట్టు బయటి వారిని మంత్రి మండలిలో చేర్చుకోవాలి. మంత్రివర్గ మార్పు ముఖ్యఫలితాలు: ఎ. నలుగురు మాజీ ఉన్నతాధికారులను చేర్చుకోవడం అంటే వారు ఏదో అద్బుతాలు చేసేస్తారని కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో నట్వర్ సింగ్, మణిశంకర్ అయ్యర్ తదితరులను మంత్రులుగా తీసుకొచ్చింది కానీ వారు ఘోరంగా వైఫల్యం చెందారు. ఇటీవల కాలంలో మంత్రులుగా నియ మితులైన ఏ రిటైర్డ్ అధికారి కూడా గొప్పగా ఊడపొడిచింది లేదు. ఇదే పరిణామం ఇప్పుడు పునరావృతం కాదని చెప్పలేము. బి. రాజీవ్ రూడీని పదవినుంచి తొలగించి, ఉమాభారతిని సాగనంపిన తర్వాత రాజనాథ్ సింగ్ తిరుగుబాటు చేశారు. సెప్టెంబర్ 2న రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో ఆకస్మిక భేటీ జరిగింది. అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ అక్కడికి పరుగులు తీశారు. దాని తర్వాతే ఉమా భారతి, తదితరులు తమ పదవులు కాపాడుకున్నారన్నది స్పష్టం. బహుశా రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పును నిలిపివేసి ఉండవచ్చు. మోదీ పర్యవసానాల గురించి భయపడి ఉండవచ్చు. దీంతోనే వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ వంటి పలువురు విఫల మంత్రులను తొలగించలేదు. సి. జేడీయూ, ఏడీఎమ్కెలను మంత్రివర్గంలో చేర్చుకోలేదంటేనే మంత్రి వర్గ విస్తరణ పూర్తి కాలేదని అర్థం. ఇంకా ఏడు ఖాళీలు మాత్రమే ఉన్నందున తదుపరి విస్తరణ సమయం నాటికి మరికొందరు మంత్రులను తొలగించ వచ్చు కూడా. డి. కేంద్రప్రభుత్వంలో ప్రస్తుతానికి అరుణ్ జైట్లీ శక్తివంతమైన మంత్రిగా ఆవిర్భవించారు. ఆయన అనుచరుల్లో కొందరిని ప్రమోట్ చేశారు. కొందరిని కాపాడారు. ప్రభుత్వం వెనుక ఉన్న అసలైన శక్తి నిస్సందేహంగా అరుణ్ జైట్లీనే. ఇ. ఇక నిర్మలా సీతారామన్ ఏకంగా రక్షణ మంత్రి కావడం మరీ విశేషం. ఆమెకు శుభాభినందనలు తెలుపుతూనే గతంలో స్వరణ్ సింగ్, జగ్జీవన్ రామ్, ఏకే ఆంటోనీ, బన్సీలాల్, జార్జి ఫెర్నాండజ్, వీపీ సింగ్, వైబీ చవాన్, పీవీ నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీ, ఎస్బీ చవాన్ వంటి ప్రము ఖులు అధిష్టించిన కుర్చీలో ఆమె కూర్చుంటున్నారని గుర్తు చేయాలి. మిగిలివున్న సమస్యలు: ఆర్థిక వ్యవస్థ వైఫల్యం కొనసాగుతోంది. దాని అస్వస్థతకు నివారణే కనిపిం చటం లేదు. ఆర్థిక మంత్రులలో మార్పూ కనిపించడం లేదు. రూడీ, దత్తా త్రేయ వంటి మంత్రులను తొలగించాక, కొత్త మంత్రులు ఇక చేసేదే ముంటుంది? ప్రమాదాల సాకు చెప్పి రైల్వే మంత్రి సురేష్ ప్రభును తొల గించారు సరే.. కానీ అదేరకమైన ప్రమాదాలు ఇక ముందూ జరిగితే రైల్వే కొత్త మంత్రి పీయూష్ గోయల్‌ను కూడా అలాగే తొలగిస్తారా? తెలుగు రాష్ట్రాలు : బండారు దత్తాత్రేయ తెలంగాణలో ఓబీసీలకు చెందినవారు. కచ్చితంగా ఆయన స్థానంలో ఒక ఓబీసీకి లేక దళితుడికే మంత్రిపదవి కేటాయించవలసి ఉంది. తొమ్మదిమంది కొత్త కేంద్ర మంత్రుల్లో 8మంది అగ్రకులాలకు చెందినవారు. ప్రమోట్ చేసిన మంత్రులందరూ అగ్రకులాలవారే. ఆంధ్ర ప్రదేశ్ నుంచి బీజేపీకి చెందిన హరిబాబుకు మంత్రిగా అవకాశం రావచ్చని బాగా ప్రచారం జరిగింది. కానీ హరిబాబు కోసం ఎన్ని వత్తిళ్లు వచ్చినప్పటికీ, మోదీ, అమిత్ షాలు సోషల్ ఇంజనీరింగ్‌నే నమ్ముతారు. పైగా ప్రస్తుతం ఏపీకి చెందిన ఇద్దరు టీడీపీ కేంద్రమంత్రులూ అగ్రకులాలకు సంబంధిం చినవారేనని వారికి తెలుసుకూడా. ప్రజల్లో తన ఇమేజీ చక్కగా ఉన్నప్పటికీ, తన ప్రభుత్వం సరిగా లేదని మోదీకి పూర్తిగా తెలుసు. తన ప్రభుత్వం వచ్చే 18 నెలల్లో ఏం చేస్తుందన్నది కాలమే చెబుతుంది. ఉపాధికి సంబంధించి గత 36 నెలల్లో జరగని అద్భుతం వచ్చే 18 నెలల్లో జరిగిపోతుందంటే సందేహపడాల్సిందే. వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు ppr193@gmail.com పెంటపాటి పుల్లారావు -
చైనాను దీటుగా ఎదుర్కొనాల్సిందే
విశ్లేషణ భూటాన్‌లోని దోక్ లామ్ సమస్యపై చైనాతో యుద్ధానికి భారత్ సిద్ధం కావాలి. చిన్న పొరుగు దేశాలకు భారత్ రక్షణ కల్పించలేదని చూపడమే చైనా లక్ష్యం. భూటాన్, భారత్ రక్షణను వదులుకుని తమ దేశంలో దౌత్య కార్యాలయాన్ని తెరవాలని చైనా కోరుకుంటోంది. పెద్ద శత్రువు చేతిలో ఓటమికి గురికావడం అవమానకరమేమీ కాదు. అసలు పోరాటానికి ఇచ్ఛగించకపోవడమే అవమానకరం. చిన్న పొరుగు దేశాలను వంచించేది లేదని భారత్ స్పష్టం చేయాల్సి ఉంది. అంతా అనుకునేదానికి భిన్నంగా చైనా నేరుగా మనకు ఎన్నడూ పొరుగు దేశంగా లేదు. 1950 అక్టోబర్ 7న చైనా సైన్యం టిబెట్‌ను స్వాధీనం చేసుకుంది. ఇక అప్పట్నుంచీ చైనా మనకు పొరుగు దేశమైంది. అప్పటి నుంచి భారత్‌కు అత్యంత చెడు కాలం ప్రారంభమైంది. చైనా పొరుగు దేశం కావడం కంటే పాకిస్తాన్ ఏర్పాటే మనకు తక్కువ హానికరమైనది. గత 60 ఏళ్లుగా చైనాతో మన దేశం సమస్యలను ఎదుర్కొంటూనే ఉంది. మనం మిత్రులను ఎంచుకోగలమే గానీ ఇరుగు పొరుగులను ఎంచుకోలేం. 1947 వరకు బ్రిటిష్ వారు మన దేశంలో ఉన్నంత వరకు చైనా, టిబెట్‌కు వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. టిబెట్ తనదేనని అననూ లేదు. కానీ, బ్రిటిష్‌వారు వెళ్లిపోవడంతోనే, టిబెట్‌ను ఆక్రమించినా భారత్ అభ్యంతరం చెప్పదని అది గ్రహించింది. టిబెట్, భారతదేశమంత పెద్దది, ప్రపంచంలోని అతి పెద్ద నదులకు పుట్టినిల్లు. భారత్‌తో దానికి 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దు ఉండేది. హఠాత్తుగా అది భారత–చైనా సరిహద్దుగా మారిపోయింది. ఇలా భారత్ మంచి పొరుగును కోల్పోయింది. దాని స్థానంలో సుదీర్ఘ సరిహద్దుగల దురాక్రమణదారు మనకు పొరుగు దేశంగా మారింది. చైనా ఆలోచనా విధానమే వేరు భూటాన్ సరిహద్దుల్లో ఇటీవల భారత–చైనా ఉద్రిక్తతలు రాజుకున్నప్పటినుంచి మీడియా వ్యాఖ్యాతలు ఇరు దేశాల సైనిక బలాలను పోల్చి చూపుతున్నారు. మనకు ఇన్ని విమానాలు, ఇంత మంది సైనికులు ఉన్నారని లెక్కలు చెబుతున్నారు. మనం ఇక్కడ పోరాడగలం, అక్కడ పోరాడగలం అంటున్నారు. ఇదేమీ 1962 కాదని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ వాస్తవానికి సైనికపరమైన బలం కేవలం ఒక అంశం మాత్రమే. సౌదీ అరేబియా వద్ద అత్యంత అధునాతనమైన సైనిక సాధన సంపత్తి ఉంది. అయినా, చిన్న దేశం యెమె న్ను అది ఓడించలేదు. 2017 నాటి భారత్, 1962 నాటిది కాదని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్య సరైనది కాదు. భారత్ ఆలోచనా విధానం నేడు మారిపోయిందని జైట్లీ అనగలరా? చైనా వద్ద ఆధునిక ఆయుధాలు ఉండటమే కాదు, అది 2,000 ఏళ్ల క్రితం నాటి తమ ఆలోచనా విధానాన్ని కొనసాగిస్తూ వస్తోంది. మనస్తత్వం రీత్యా భారతీయులు, చైనీయులకంటే చాలా భిన్నమైనవారు. వేల ఏళ్లుగా మనకు విభిన్నమైన అనుభవాలు కలి గాయి. కాగా చైనీయుల బలం వారి సైనిక శక్తిలో కంటే వారి మానసిక శక్తిసామర్థ్యాలలోను, మానసిక శిక్షణలోనూ ఉంది. అత్యంత శక్తివంతమైన సైన్యాలు సైతం చాలా సందర్భాల్లో విజయం సాధించలేవని చరిత్ర ఎన్నోసార్లు బోధించింది. చైనీయుల బలాలు, ఆలోచనా విధానాల స్పష్టమైన లక్షణాలివి: 1. ప్రపంచానికి కేంద్రం చైనా : చైనీయులు తమ దేశం ప్రపంచానికి కేంద్రమని (మిడిల్ కింగ్డమ్) విశ్వసిస్తారు. వారి చక్రవర్తులు వేల ఏళ్లుగా ‘‘నిషిద్ధ నగరి’’ని వీడి బయటకు రాలేదు. బీజింగ్‌లోని రాజప్రాసాద ప్రాంతాన్ని ‘ఫర్బిడెన్ సిటీ’ అంటారు. చైనా చక్రవర్తుల జీవితం ఎంత నిగూఢంగా సాగేదంటే వారి మరణ వార్తను సైతం... వారసుడు సింహాసనంపై ఓ రెండేళ్లయినా సురక్షితంగా గడిపేంత వరకు బయటకు పొక్కనిచ్చేవారు కారు. చైనా రాచరికం అధికారానికి సంబంధించిన అనిశ్చితిని ప్రజలకు తెలియనిచ్చేది కాదు. భారతదేశంలో దీనికి విరుద్ధమైనదే శతాబ్దాల తరబడి సాగుతూ వస్తోంది. మొగల్ చక్రవర్తులు, రాజాలు తామింకా సజీవంగానే ఉన్నామని ప్రజలకు తెలియడం కోసం రోజూ దర్బారులు నిర్వహించేవారు! 2. శతాబ్దాల గురించి ఆలోచిస్తుంది: చైనీయులకు ఎప్పుడూ సుదీర్ఘ కాలపు వ్యూహాలు ఉండేవి. ఇష్టానుసారం దండెత్తి వచ్చే మంగోలులను అదుపు చేయగలిగిన శక్తి చైనా చక్రవర్తులకు ఉండేది కాదు. దీంతో వారు సముద్ర తీరం నుంచి రాజధాని పెకింగ్‌కు, అక్కడి నుంచి అత్యున్నత పర్వత శ్రేణుల వరకు మహా కుడ్యాన్ని (గ్రేట్ వాల్) నిర్మించారు. అందుకు వందల ఏళ్లు పట్టింది. ప్రతి చక్రవర్తీ ఆ పనిని కొనసాగించేవాడు. చక్రవర్తులు మారినంత మాత్రాన చైనా విధానాలు మారేవి కావు. భారత్‌లో మనం గత 65 ఏళ్లుగా సరిహద్దుల వెంబడి ముళ్ల కంచెను నిర్మించలేకపోతున్నాం. 3. వందల ఏళ్ల జగడాలకైనా అది సిద్ధమే: వివాదం అంటే అదేదో తక్షణమే పరిష్కారం కావాల్సినదని చైనీయులు భావించరు. వందల ఏళ్లయినా అది సాగగలుగుతుంది. శత్రువును పదే పదే రెచ్చగొడుతూ అది ఆ వివాదాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. నేటికి 65 ఏళ్లుగా భారత–చైనా వివాదం అలాగే కొనసాగుతోంది. తాత్కాలికమైన శాంతి సాధ్యంకావచ్చునేమో గానీ ఆ వివాదం మాత్రం తరాలు గడుస్తున్నా పరిష్కారం కాదు. చైనీయుల నుంచి నేర్చుకుని మనం కూడా పరిష్కారాల కోసం వందల ఏళ్లు వేచి చూడాలి. 4. అంతర్జాతీయ అభిప్రాయాన్ని బేఖాతరు చేస్తుంది: చైనాకు నేడు వియత్నాం, ఫిలిప్పీన్స్, తదితర దేశాలతో ఉన్న దక్షిణ చైనా వివాదం మంచి ఉదాహరణ. అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పినా, ఐరాస చెప్పినా చైనా విని పించుకోదు. ఆ సముద్రం అంతా తమదేనంటూ, అది ధిక్కారంతో ఆ సముద్రంలోని కొన్ని దీవులలో వందల కోట్ల డాలర్లను కుమ్మరిస్తోంది. 5. చైనా విద్యా విధానం: చైనా విద్యా విధానం వారి ప్రాచీన జ్ఞాన సంపదను, గ్రంథాలను, తత్వవేత్తల బోధనలను విద్యార్థులకు బోధిస్తుంది. అవన్నీ చైనీయుల ఆలోచనా విధానాన్ని మలచడానికి తోడ్పడతాయి. భారత్‌లో మనకు కోట్లాది మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ఐఐటీలలో ప్రవేశాల కోసం కోచింగ్‌ను ఇచ్చే ప్రైవేట్ సంస్థలే ఉన్నాయి. 6. చక్రవర్తుల కాలం నాటి పాలనా వ్యవస్థే: నేడు కమ్యూనిస్టు ప్రభుత్వం పాలిస్తున్నా చక్రవర్తుల పాలనా వ్యవస్థే చైనాలో కొనసాగుతోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా చైనా చక్రవర్తిలాగే సకల శక్తివంతుడు. చక్రవర్తుల శైలిలోనే, అంతే రహస్యంగా జీవిస్తాడు. తన మాటకు తిరుగేలేని ప్రధాన కార్యదర్శి గురించి పదేళ్ల పదవీ కాలం ముగిశాక ఒక్క మాట కూడా తిరిగి వినిపించదు. మన మాజీ మంత్రులు తిరిగి పదవిలోకి రావడానికి పథకాలు పన్నుతూనే ఉంటారు. 7. భూభాగం కోసం ఇరుగు పొరుగులందరితోనూ జగడమే: చైనాకు 14 దేశాలతో (పాక్ ఆక్రమిత కశ్మీర్ సహా) భూసరిహద్దులు ఉన్నాయి. ఇక జపాన్, ఫిలిప్పీన్స్, మలేసియాలతో సముద్ర వివాదాలున్నాయి. రష్యా, దక్షిణ కొరియా, జపాన్, భారత్ , వియత్నాంలతో అది సైనిక ఘటనలకు సైతం దిగింది. శత్రువులకు తమ తడాఖా చూపడానికి చైనా ఎప్పుడూ సైనిక బలాన్ని ప్రదర్శిస్తుంటుంది. చరిత్ర పొడవునా చైనాకు ఇరుగుపొరుగులతో సమస్యలు ఉంటూనే ఉన్నాయి. పొరుగువారు బలహీనంగాఉంటే అది వారిని జయించేస్తుంది. మంగోలులలాగా శత్రువులు బలవంతులైతే అది రక్షణ కోసం మహా కుడ్యాన్ని నిర్మించుకుంటుంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, తమ సరిహద్దుల సంరక్షణ కోసం ఏమైనా చేయడానికి సిద్ధమనే చైనా వైఖరిని సూచిస్తుంది. సైనిక స్థావరాలలోకి చొరబాటుదార్లు ప్రవేశిస్తున్నా భారత్ నిలవరించలేకపోతోంది. భారత్ ఏం చేయాలి? 1. భూటాన్‌లోని దోక్ లామ్ భూభాగం సమస్యపై చైనాతో యుద్ధానికి భారత్ సంసిద్ధం కావాలి. పొరుగున ఉన్న చిన్న దేశాలకు భారత్ రక్షణ కల్పించలేదని చూపడమే చైనా లక్ష్యం. భారత్‌తో భూటాన్‌కు ప్రత్యేక ఒప్పందం ఉంది. చైనాలో భూటాన్‌కు దౌత్య కార్యాలయం లేదు. భూటాన్, భారత్ రక్షణను వదులుకుని తమ దేశంలో దౌత్య కార్యాలయాన్ని తెరవాలని చైనా కోరుకుంటోంది. ఓటమిని ఎదుర్కొనాల్సి వచ్చినా యుద్ధం చేయడానికి సిద్ధమేనని చాటగలిగితే ప్రపంచం భారత్‌ను గౌరవిస్తుంది. పెద్ద శత్రువు చేతిలో ఓటమికి గురికావడం అవమానకరమేమీ కాదు. పోరాటానికే ఇచ్ఛగించకపోవడమే అవమానకరం. చిన్న పొరుగు దేశాలను వంచించేది లేదని భారత్ సుస్పష్టం చేయాల్సి ఉంది. 2. చైనాతో ఈ వివాదం వందల ఏళ్లపాటూ సాగుతూనే ఉంటుందనే అంశంపై భారత్ ప్రజలను సంసిద్ధం చేయాలి. భారత్, చైనాతో వందల ఏళ్ల శతృత్వాన్ని ఎదుర్కొనడానికి సిద్ధం కావాలి. లొంగి వచ్చేటంతగా భారత్ అలసిపోయేలా చేయాలని చైనా ప్రయత్నిస్తుంది. అయితే, భారత్ అలా అలసిపోయేదేమీ కాదని దానికి తప్పక తెలిసి రావాలి. సుదీర్ఘ కాలానికి మన ప్రభుత్వం దేశాన్ని సంసిద్ధం చేయాలి. చైనాకు ఆ సందేశం తప్పక చేరుతుంది. 3. భూటాన్‌ను, ఇతర చిన్న పొరుగు దేశాలను చైనా బెదిరించడానికి ప్రయత్నిస్తోందని, భారత్ గౌరవప్రదంగా పోరాడుతుందని వివరిస్తూ మన దేశం ప్రపంచవ్యాప్తంగా దౌత్య కృషిని కూడా చేపట్టాలి. మనం శాంతి కోసమే ప్రయత్నించాలి కానీ, యుద్ధానికైనా సిద్ధమేననే సుస్పష్టమైన సందేశాన్ని పంపాలి. యూరప్, అమెరికాలలో అత్యంత విశిష్ట దేశంగా భూటాన్‌కు మంచి పేరుంది. భూటాన్ విషయంలో చైనా, భారత్‌తో యుద్ధానికి దిగితే... శాంతియుత దేశంగా అది తగిలించుకున్న ముసుగు తొలగిపోతుంది. 4. మన గొప్ప ప్రాచీన పండితులు, గణిత శాస్త్రవేత్తలు, నిర్మాణకర్తలు, తత్వవేత్తలు, పాలకుల గురించి బోధించేలా మన విద్యావ్యవస్థను మార్చాలి. అలా అని కుహనా విజ్ఞానాన్ని, బూటకపు ప్రాచీన గాథలను చెప్పాలని కాదు. 5. జపాన్, ఫిలిప్పీన్స్, మలేసియా, వియత్నాంలు చైనాకు కొత్త శత్రువులు. చైనాతో జరగడానికి అవకాశం ఉన్న యుద్ధం నుంచి భారత్ వెనక్కు తగ్గుతుందా, లేదా అని అవి గమనిస్తున్నాయి. భూటాన్ కోసం భారత్ పోరాటానికి దిగితే ఆ దేశాలకు కూడా ధైర్యం వస్తుంది. 6. చైనా నేడు ఆర్థిక మాంద్యంలో ఉన్న దృష్ట్యా యుద్ధాలు దాని దృష్టిని మరలుస్తాయి. చైనా తనది ‘‘శాంతియుతంగా బలపడే’’ విధానమని చెప్పుకుంటోంది. భూటాన్‌పై అది భారత్‌తో పోరాటానికి తలపడితే ప్రమాదకర దురాక్రమణదారుగా అది తన స్వభావాన్ని బయటపెట్టుకుంది. భారత్, చైనాల మధ్య హిమాలయాలున్నాయి. పైగా మధ్యన టిబెట్ ఉంది. చైనా, భారత్‌ల మధ్య యుద్ధమే జరిగితే ప్రతి దేశమూ చైనాను నమ్మదగని, ప్రమాదకర దేశంగా చూస్తుంది. చైనాకు సంబంధించి ఇది చాలా పెద్ద దుష్పర్యవసానం. అయితే భారత్ యుద్ధానికి తప్పక సన్నద్ధం కావాలి. అయినా శాంతి కోసం ప్రయత్నించాలి. యుద్ధం, శాంతి కలసి సాగుతాయి. సైన్యాలు తప్పనిసరిగా యుద్ధం చేయాలని లేదు, కానీ యుద్ధంవస్తే చేయడానికి సిద్ధంగా ఉండి తీరాలి. - పెంటపాటి పుల్లారావు వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు ppr193@gmail.com -
బీజేపీ వగలు, టీడీపీ దిగులు
విశ్లేషణ ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రం ముఖ్యమంత్రి పదవిని యోగి ఆదిత్యనాథ్‌కు అప్పగించి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పెద్ద సాహసమే చేశారు. ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మూడేళ్లలో తీసుకున్న నిర్ణయాలలో ఇది నిస్సందేహంగా కీలకమైనది. భవి ష్యత్తులో జరగబోయే ఇలాంటి సాహసాలకు బహుశా ఇదొక సంకేతం కావచ్చు. సమీప భవిష్యత్తులో బీజేపీ సాధించవలసిన పెద్ద విజయాలు ఏమీ కానరావు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో భవిష్యత్ ప్రణాళిక గురించి ఒక కీలక నిర్ణయం తీసుకోవలసిన పని మాత్రం మిగిలి ఉంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలోను బీజేపీ పట్టు సాధించడానికి అవకాశాలు అందీఅందకుండా ఉండి పోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రెండు చోట్లా కూడా చిగురంత ఆశ కూడా లేదు. ఏదిఏమైనా తెలుగు ప్రాంతాలలో విస్తరించడానికి బీజేపీ పట్టుదలతో ఉందని మాత్రం చెప్పవచ్చు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో సాధించిన ఘన విజయం ఆ పార్టీలో పట్టుదలను మరింత పెంచింది. చరిత్రను చూడండి! అందులో అలెగ్జాండర్ అనే యువ విజేత విజయా లను చూడండి! తన తండ్రి శత్రువులందరినీ ఆయన ఓడించి, గ్రీస్‌ను గెలిచాడు. అక్కడితో ఆగిపోలేదు. పర్షియాను కూడా ఓడించాడు. ఆపై ప్రపంచాన్ని జయించి విశ్వవిజేతగా చరిత్రకెక్కాడు. తన జైత్రయాత్రలో అలెగ్జాండర్ ఎప్పుడూ ఒక్క శత్రువు మీదే దృష్టిని కేంద్రీకరించిన సంగతి అర్థమవుతుంది. శత్రువులందరినీ ఏకకాలంలో తుదముట్టించాలన్న ఆలోచన చేయలేదు. మోదీ, షాలు కూడా ఒక రాష్ట్రం తరువాత ఒక రాష్ట్రం మీద దృష్టి సారిస్తు న్నారు. తన విస్తరణ కార్యకలాపాలకు పదును పెట్టవలసిన రాష్ట్రాలు ఆ పార్టీకి రెండు మాత్రమే మిగిలి ఉన్నాయి. అవే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీజేపీకి మిత్రులంటే మిత్రులూ కాదు. శత్రువులు కూడా కాదు. మిత్రులంటే మిత్రులు. శత్రువులంటే శత్రువులు. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాలలో బీజే పీని ఒక నిర్దిష్ట రాజకీయ శక్తిగా నిర్మించాలా, లేదా ఏదో ఒక ప్రాంతీయ పార్టీకి తోక పార్టీగా కొనసాగించాలా అనే అంశాన్ని నిర్ణయించడానికి మాత్రం ఇదే సరైన సమయం. తోక పార్టీలా మిగిలిపోవడం సాధ్యమా? అంతర్జాతీయ మార్కెట్లో ‘నో కంపీట్’ (పోటీ రహితం) అనే షరతు ఒకటి ఉంది. అంటే మార్కెట్లో మరో కంపెనీ ఉత్పత్తులతో పోటీకి దిగకుండా ఉండి పోవడం. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీతో బీజేపీ అలాంటి ఒప్పందాన్నే చేసుకుంది. 2014లో అనివార్య పరిస్థితుల నడుమ బీజేపీ ఈ తరహా ఒప్పందం చేసుకుంది. కానీ ఉత్తరప్రదేశ్‌లో తాజా విజయం తరువాత ఈ ఒప్పందం మీద పునరాలోచనలో పడింది. కొత్త దారులవైపు చూడడం ఆరంభించింది. నిజానికి 2004లో పార్టీ పరాజయం పాలైన తరువాత తెలుగుదేశం ఎలాంటి వైఖరిని ప్రదర్శించిందో బీజేపీ నేతలకు గుర్తుంది. 2002లో గోద్రా పరిణామాల అనం తరం తనను గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ చంద్ర బాబు ఇచ్చిన పిలుపు గురించి కూడా మోదీ మరచిపోలేదు. అసలు 2004లో తమ పార్టీ ఓటమికి కారణం మోదీయేనని కూడా చంద్రబాబు భాష్యం చెప్పారు. తమిళనాడులో కూడా బీజేపీకి మిత్రులు ఉన్నారు. డీఎంకే మొదలు ఏడీఎంకే వరకు కమలం పార్టీ ద్రవిడ పార్టీలతో మైత్రిని నెరపింది. అంతా అనుకూలించినప్పుడు బీజేపీ తన మిత్రులను వెంటనే మార్చివేస్తుంది. హరి యాణాలో ఓం ప్రకాశ్ చౌతాలాను, జార్ఖండ్‌లో జార్ఖండ్ ముక్తిమోర్చాను, అసోంలో అసోం గణ పరిషద్‌ను ‘ఉపయోగించుకోవడం, వదిలిపెట్టడం’ అన్న రీతిలో పక్కన పెట్టేసింది. పాత మిత్రుడిని మించి ప్రయోజనం చేకూర్చే కొత్త భాగస్వామి దొరికినా బీజేపీ పాతవారిని వదిలించుకుంటుంది. నరేంద్ర మోదీ ఆశీస్సులతోనే షా బీజేపీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నా రని దేశంలో చాలామంది అభిప్రాయం. కానీ షా లేకపోతే మోదీకి కూడా కష్టమే. అమిత్‌షా స్థాయిలో నైపుణ్యం కలిగిన, ఎత్తుగడలను, వజ్రసదృశ నిర్ణయాలను అమలు చేయగలిగిన రాజకీయవేత్త ఇటీవల కాలంలో ఏ పార్టీలోనూ కనిపిం చరు. అందుకే ఆంధ్రప్రదేశ్ ద్వారా బీజేపీకి ఒనగూడే ప్రయోజనాలు ఎలా ఉంటాయో ముందుగానే షా ఊహించగలిగారు. నిజానికి ఉత్తరప్రదేశ్‌ను మించి ఆంధ్రప్రదేశ్‌లో కుల సమీకరణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ మనుగడ ఎలా ఉంది? 2014 ఎన్నికలలో తెలుగు దేశం ఇస్తే బీజేపీ ఎనిమిది అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసి, నాలుగు గెలుచు కుంది. నాలుగు ఎంపీ స్థానాలకు పోటీ చేసి రెండు సాధించుకుంది. అప్పటి పరిస్థితులలో బీజేపీకి అంతకు మించి అవకాశాలు ఏమీలేవు. పొత్తు పెట్టు కోవడానికి ఇతర పార్టీ ఏదీ ముందుకు రాలేదు. అందుకే టీడీపీ ఇచ్చిన వాటా తోనే సరిపెట్టుకుంది. నిజానికి ఆ సమయానికి అమిత్‌షాకు కూడా ఆంధ్రప్రదేశ్ పరిస్థితులతో అంతగా పరిచయం లేదు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో కులాలు, సంపద, అవినీతి, వైరి శిబిరాల రూపురేఖలు అన్నీ షాకు తెలుసు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదల నిలిచిపోయిన పరమ వాస్తవం కూడా ఆయనకు తెలుసు. ఈ మధ్య ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలలో సీట్ల పంపకం గురించి షా ఒక కీలక ప్రకటన చేశారు. గతంలో టికెట్ ఇచ్చిన 280 మందిలో ఏ ఒక్కరికీ ఇప్పుడు అవకాశం ఇవ్వబోవడం లేదని ఆయన తేల్చి చెప్పారు. అంతా కొత్తవారితోనే పార్టీ బరిలోకి దిగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పాత నాయకత్వంతో పార్టీ ఎదిగే అవకాశమే లేదని ఆయన అంచనా. కొత్త నాయకత్వం; రాజకీయ పునాది, ప్రజాబలం ఉన్న నాయకులు కావాలని ఆయనకు తెలుసు. క్షేత్రస్థాయిలో ఎలాంటి బలమూ లేని కొందరు కేంద్ర స్థాయి నాయకులే ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖను శాసిస్తున్నారని అమిత్‌షాకు తెలుసు. బీజేపీ కనుక పుంజుకుంటే, తెలుగుదేశం తిరోగమిస్తుం దని ఆ కేంద్ర నాయకులు భావిస్తున్న వాస్తవం కూడా అమిత్‌షాకు తెలిసినదే. రాష్ట్రంలోని ఒక వర్గం ఈ సిద్ధాంతాన్ని బాగా ఒంట పట్టించుకుంది. కాబట్టి బీజేపీ బలహీనంగా మిగిలిపోవడం ద్వారా తెలుగుదేశం బలంగా ఉండాలని ఆకాంక్షించే కొందరు తమ పార్టీలోనే ఉన్నారన్న వాస్తవం జాతీయ అధ్యక్షునికి తెలియనిది కూడా కాదు. దీనిని షా పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రస్తుత బీజేపీ అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కె అడ్వాణీల నాటి పార్టీ కాదు. తెలుగు దేశాన్ని నిరోధించడం ద్వారా మాత్రమే బీజేపీ వికసిస్తుందని షాకు తెలుసు. తెలుగుదేశం భవిష్యత్తు గురించి షాకు పెద్ద పట్టింపు కూడా లేదు. మహారాష్ట్రలో చిరకాల మైత్రి నెరపిన శివసేన భవిష్యత్తు గురించే ఆలోచించడం మానేసిన బీజేపీకి తెలుగుదేశం భవిష్యత్తుకు గురించిన ఆలోచన ఎందుకు? 2014 ఎన్ని కల సమయానికి ఉన్న బలం తెలుగుదేశానికి ఇప్పుడు లేదు. ఆంధ్రప్రదేశ్ ఇప్పు డొక చిన్న రాష్ట్రం. ఈ రాష్ట్రం నుంచి ఉన్న మద్దతు జారిపోయినా షా పట్టిం చుకునే స్థితిలో లేరు. మోదీ ప్రభుత్వానికి వచ్చిన బెడద ఏమీ ఉండదు. నిజానికి కాంగ్రెస్‌ను ఇకపై జాతీయ పార్టీ స్థాయిలో ఉంచరాదన్న తమ ఆశయం అమలు కావాలంటే ఆంధ్రప్రదేశ్‌లో తోక పార్టీలాగా కాక, ప్రబల శక్తిగా అవతరించక తప్పదు. సమీకరణలు మారితేనే... ఏపీలో ప్రాబల్యం కలిగిన కొన్ని కులాలు ఉన్నా, వాటికి మంత్రివర్గంలో తగిన ప్రాతినిధ్యం లేని సంగతి కూడా షాకి తెలుసు. కొన్ని కులాలను సమీకరించడం ద్వారా ఉత్తరప్రదేశ్‌లో సాధించిన తీరులోనే ఏపీలో కూడా విజయం సాధించ వచ్చునని బీజేపీ యోచన. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ విజయం తరువాత తెలుగు దేశంలో కొంత దిగులు కనిపించింది. నిజానికి ఆ ఎన్నికలలో బీజేపీ ఓడిపోతే, 2019 ఎన్నికలలో కమలాన్ని దూరంగా పెట్టి, ఎన్నికల బరిలోకి దిగాలని టీడీపీ ఆలోచించింది. బీజేపీ విస్తరించడమంటే తెలుగుదేశాన్ని బలహీనపరచడం ద్వారానే సాధ్యమని ఈ పార్టీ నేతలకు తెలియనిది కాదు. ప్రస్తుతం బీజేపీకి నాయకత్వం వహిస్తున్నవారు కూడా సామాజికంగా ప్రాబల్యం కలిగిన కులాల వారు కాదు. దీనితో గడచిన మూడేళ్లుగా పార్టీ బాగా బలహీనపడింది. రాష్ట్రంలో విస్తారంగా ఉన్న కులాల వారికి అధికారం దక్కడం లేదన్న సంగతి బీజేపీ అధి నాయకత్వానికి తెలుసు. కులాల మధ్య విభజన తేవడం ద్వారా, మీడియాను అదుపులో ఉంచుకోవడం ద్వారా, ధనబలంతో తక్కువ సంఖ్యాకులైన కులాల వారే ఆధిపత్యం చెలాయిస్తున్న సంగతి కూడా వారికి ఎరుకే. అందుకే ఒక్కసారి బీజేపీ నాయకత్వం రాష్ట్రం మీద దృష్టి పెడితే ఈ దృశ్యాన్ని మార్చడం కష్టం కాకపోవచ్చు. బీజేపీని దూరం చేసుకోవడం ఇష్టం లేకపోతే తెలుగుదేశం 2019 ఎన్నికలలో మరిన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు ఎర వేయవచ్చు. కానీ అమిత్ షా వేరు అడ్వాణీ వేరు. టీడీపీ మరింత అప్రతిష్ట పాలైతే ఆ పార్టీతో కలసి బీజేపీ కూడా ఎందుకు మునిగిపోవాలి? బీజేపీ తన దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉండాలన్నదే చంద్రబాబు కోరిక. ఇది కూడా అమిత్‌షాకు బాగా తెలుసు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 403 స్థానాలు ఉన్నాయి. 18 శాతం ముస్లింలు, మాయావతికి చెందిన జాతవ్ కులస్థులు 6 శాతం, యాదవులలో 8 శాతం బీజేపీకి ఓటు వేయరని అమిత్‌షా అంచనా వేశారు. అందుకే మిగిలిన 68 శాతం ఓట్ల మీద ఆయన దృష్టి సారించారు. మొత్తం పోలైన ఓట్లలో 41 శాతం సాధిం చారు. చిత్రంగా యాదవుల, ముస్లింల ఓట్లు కూడా కొన్ని బీజేపీ సాధించు కుంది. వాస్తవానికి ఏపీలో పరిస్థితి మరింత నల్లేరు మీద నడక. జనాభాలో నాలుగు శాతం ఉన్న కులాల మద్దతుతోనే టీడీపీ మనుగడ సాగిస్తున్నది. మిగిలి నది 96 శాతం ఓటర్లు. ఇందులో 35 శాతం ఓట్లను ఆకట్టుకోగలిగితే తమ బలం విశేషంగా పెరుగుతుందని ఆ పార్టీ ఆశ. ఇది అమలు కావాలంటే కొత్త నాయ కత్వం కావాలి. మోదీ లేదా షా నేతలలో విధేయతను ఆశించరు, విజయాలను తెచ్చే వారినే ఎంచుకుంటారు. అవసరమైతే ఇతర పార్టీల నుంచి దిగుమతి చేస్తారు. ఏపీలో కొన్ని ఇతర మార్గాలు కూడా బీజేపీకి ఉన్నాయి. టీ డీపీతో పాత బంధాన్ని కొనసాగించడం అందులో ఒకటి. టీడీపీ కూడా కొన్ని స్థానాలను అద నంగా కేటాయించవచ్చు. కానీ ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా టీడీపీతో పాటు బీజేపీ కూడా నష్టపోవచ్చు. కొన్ని ప్రభావాలను బట్టి ప్రస్తుతం బీజేపీ నుంచి నెగ్గిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు యథాతథ స్థితిని ఆకాంక్షించే అవ కాశం ఉంది. ఎందుకంటే బీజేపీ ఎదిగితే తమకు ఒరిగేది ఏమీ ఉండదు. కాబట్టి బీజేపీ రాష్ట్రంలో బలహీన ంగానే ఉండిపోవాలని వారు కోరుకుంటారు. ఇందుకు కేంద్ర స్థాయిలోని కొందరి ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఇదంతా బహిరంగ రహస్యమే. ఒంటరి పోరే శరణ్యం బీజేపీ పాత బంధాన్ని తెంచుకుని కొత్త మిత్రుల కోసం అన్వేషించవచ్చు. కేంద్రంలో బలంగా ఉన్న పార్టీ కాబట్టి ఆ పార్టీలు కూడా చేయి కలపడానికి ముందుకు రావచ్చు. బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగడం మరో మార్గం. వాస్త వానికి టీడీపీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా బీజేపీ తీర్థం తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. కాబట్టి ఈ సమయంలో టీడీపీతో కలసి మళ్లీ పోటీ చేయాలా? లేదా ఒంటరి పోరాటం చేయాలా అన్నది బీజేపీ నిర్ణయించుకోక తప్పదు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయం దరిమిలా తెలుగుదేశం పార్టీ ఎంత దిగులుగా ఉందో ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన చంద్రబాబు హావభావాలు చెప్పకనే చెప్పాయి. 2019 నాటికి ఏపీలో బీజేపీ బలోపేతం కావాలని గట్టిగా కోరుకున్నట్టయితే, తరువాత తెలంగాణలో పాగా వేయడం పెద్ద కష్టం కాదు. 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రబల రాజకీయ శక్తిగా అవతరించే అవకాశం బీజేపీకి వచ్చింది కూడా. కానీ రెండు దశాబ్దాల పాటు ప్రాంతీయ పార్టీలకు తోకగా మిగిలిపోవడంతో ఆ అవకాశాలు సన్నగిల్లాయి. మోదీ, షా ఉన్నత స్థానాలలో ఉండగా అలాంటి అవకాశం కనిపిస్తే బీజేపీ వదులుకునే అవ కాశాలు ఉండవు. - పెంటపాటి పుల్లారావు వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు ppr193@gmail.com -
కొత్త రాజకీయ చిత్రానికి శ్రీకారం
యూపీ ఎన్నికలలో ముస్లింలు వ్యూహాత్మకంగా ఓటు వేశారన్న మాట నిజం. తాము ఓటు వేసే అభ్యర్థి బీజేపీ అభ్యర్థిని ఓడించాలి. గెలిచే అభ్యర్థి ఎస్పీకి చెందినవారైనా అభ్యంతరం లేదు. బీఎస్పీని పక్కన పెట్టి ఎస్పీ అభ్యర్థికి వారు ఓటు వేశారని చెబుతున్నారు. ఇక్కడే ఒక వాస్తవం కూడా చెప్పుకోవాలి. మాయావతి నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు కాబట్టి, ఆమెకంటూ దళితులలో ఒక ఓటు బ్యాంకు ఉందని అంతా నమ్ముతున్నారు. కానీ ఈ అభిప్రాయం స్థిరమైనది కాదు. ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికలు చరిత్రాత్మ కమనడానికి అనేక కారణాలు కనిపిస్తాయి. శాసనసభల ఎన్నికలకు ఇంత ప్రాధాన్యం రావడం కూడా బహుశా ఇప్పుడే. రెండు రోజుల తరువాత వెలు వడబోతున్న ఈ ఎన్నికల ఫలితాల కోసం దేశమంతా ఎదురుచూడడం ఇందుకే. ఈ ఫలితాలు, ఇంకా చెప్పాలంటే ఉత్తరప్రదేశ్ ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీ భవిష్యత్తు మీద త్వరితంగా ప్రభావం చూపుతాయి. అంతే కాదు, 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల వరకు, అంటే ఈ ముప్పయ్ మాసాల కాలంలో మన దేశం, బీజేపీ ఆయన మీద ఎలాంటి విశ్వాసాన్ని ఉంచబోతున్నాయన్న విషయాన్ని కూడా ఆ ఫలితాలు స్పష్టం చేయను న్నాయి. అఖిలేశ్ అడుగు ఎటో! ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ టిక్కెట్‌తో ప్రమేయం లేని ప్రథమ తరగతి ప్రయాణం సాగించారు. 403 స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 103 స్థానాలను అఖిలేశ్ కేటాయించారు. ఆయన ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తండ్రి ములాయం సింగ్‌ను, పినతండ్రి శివ్‌పాల్ యాదవ్‌ను కూడా పార్టీ నుంచి తప్పించి, తిరుగులేని నేతగా ఆవిర్భవించిన యువనేత. ఈ ఎన్నికల ఫలితాలు ఆయన భవిష్యత్తును ఏ వైపు మళ్లిస్తాయో నిజంగానే ఆసక్తికరం. ఎస్పీ విజయం సాధించినా, సాధించకున్నా భవిష్యత్తులో ఇక ములాయం లేదా ఆయన అనుచరులు పార్టీ వైపు చూసే పని ఉండదు. నామినేషన్ల ఘట్టానికి కాస్త ముందు తండ్రీ కొడుకుల మధ్య జరిగిన ఘర్షణలో తండ్రినీ, ఆయన అనుచరులనూ అఖిలేశ్ బయటకు పంపగలిగారు. ఇంత వేడిలో కూడా తండ్రి ఢిల్లీ ప్రయాణమైతే, ఒక సంస్థతో మాట్లాడి ప్రైవేట్ చార్టర్ విమానాన్ని ఏర్పాటు చేశారు. ఇంతకీ ములాయం ఎందుకు ఢిల్లీ వెళ్లినట్టు? అఖిలేశ్ మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి. అలాంటి అవసరానికి కూడా ఎవరైనా ఇతరులకు విమాన సౌకర్యాన్ని కల్పిస్తారని ఊహించగలమా? నిజానికి అఖిలేశ్ మృదు భాషిగా కనిపించాలనీ, మీడియా సన్నిహితునిగా అవతరించాలనీ ఆరాటప డుతున్నారు. రాజకీయంగా చూస్తే రాష్ట్రంలో ఉన్న 18 శాతం ముస్లింలలో బీజేపీ పట్ల భయాన్ని రెచ్చగొట్టడానికి ఆయన తన వంతు కృషి చేశారు. ముస్లిం ఓట్లు ఎస్పీ–కాంగ్రెస్ కూటమికి, లేదా మాయావతి నాయకత్వంలోని బీఎస్పీకి పడతాయన్న వాస్తవం అఖిలేశ్‌కు తెలుసు. కాంగ్రెస్‌తో ఎన్నికల మైత్రిని నెరపడం ద్వారా మరిన్ని ఓట్లు సాధించవచ్చునని ఆయన నమ్మకం. ఈ ఎన్నికలలో విజయం సాధిస్తే ఆయన దేశ రాజకీయాలలో వెలిగిపోతారు. నరేంద్ర మోదీకి బలమైన ప్రత్యర్థిగా అవతరిస్తారు. ఓడితే పోయిందేమీ లేదు. అయితే ఒకటి– ములాయం తన జీవితకాలంలో చేయని పని– కాంగ్రె స్తో జత కట్టడం, అఖిలేశ్ అలవోకగా చేశారు. ఆ విధంగా రాష్ట్రంలో కార్య కర్తలు గానీ, ఓటర్లు గానీ లేని కాంగ్రెస్‌కు ఊపిరి పోశారు. కాంగ్రెస్ ఇంకా మునుగుతుందా? కాస్త తేలుతుందా? అఖిలేశ్ స్నేహ హస్తం అందించడానికి ముందు కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? 2014 లోక్‌సభ ఎన్నికలలో 80 స్థానాలకు గాను కేవలం రెండు గెలుచుకున్న పార్టీ అది. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితి ఇంకా దిగజారి పోకుండా ఎవరి అండ దొరుకుతుందా అని అప్పటి నుంచి కాంగ్రెస్ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తోంది. ఈ లోపున పార్టీకి పునర్ వైభవం తేవ డానికి రాహుల్ నాయకత్వంలో జరిగిన ప్రయోగాలు దారుణంగా విఫల మయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో అఖిలేశ్ నుంచి పిలుపు రావడం కాంగ్రెస్ పాలిట జాక్‌పాట్ అయింది. 1989 నుంచి అధికారం లేకుండా అలమటిస్తున్న కాంగ్రెస్‌కు అఖిలేశ్ మంత్రివర్గం ఏర్పాటు చేస్తే ఇప్పుడు పదవులు దొర కవచ్చు. పార్టీకి అంతో ఇంతో వైభవం కూడా సంప్రాప్తించవచ్చు. ఈ కూట మికి మూడో స్థానం దక్కితే ఎస్పీ కూడా మళ్లీ కాంగ్రెస్ దరిచేరదు. కాబట్టి కాంగ్రెస్ కోణం నుంచి చూస్తే, ఏది ఏమైనా ఈ ఎన్నికలలో అఖిలేశ్ విజయం సాధించి తీరాలి. ఇందుకు రెండు కారణాలు– ఒకటి ఇన్నేళ్ల తరువాత లభించే అధికార యోగం. రెండు–ఓటమికి అఖిలేశ్ కాంగ్రెస్‌ను కూడా దుయ్య బట్టవచ్చు. ఒకవేళ యూపీ ఓటర్లు మరోసారి తిరస్కరిస్తే, అఖిలేశ్ తమను మోసం చేశారని కాంగ్రెస్ కూడా గగ్గోలు పెడుతుంది. నిజానికి ఇప్పుడు ఆ రాష్ట్రంలో నిజమైన విజేత కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే కొత్తగా కోల్పో వడానికి ఆ పార్టీకి ఏమీ మిగల్లేదు. మాయావతి దశ మారుతుందా? ఉత్తరప్రదేశ్ అనే అతిపెద్ద రాష్ట్రానికి నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన నాయకురాలు మాయావతి. కానీ 2012 శాస నసభ ఎన్నికలు, 2014 లోక్‌సభ ఎన్నికలు మాయావతినీ, ఆమె పార్టీ బీఎ స్పీనీ కకావికలు చేశాయి. లోక్‌సభ ఎన్నికలలో అయితే ఆమె పార్టీ ఒక్క స్థానం కూడా దక్కించుకోలేదు. పలువురు పార్టీ ప్రముఖులు బీజేపీలో లేదా ఎస్పీలో చేరిపోయారు. దళిత ఓట్లను కూడా బీజేపీ చీల్చింది. కానీ బిహార్‌లో ఆగర్భ శత్రువులు లాలూ ప్రసాద్, నితీశ్‌కుమార్ ఏకమైనట్టు ఉత్తర ప్రదేశ్‌లో మాయావతి పార్టీ వెళ్లి ఎస్పీతో చేరలేదు. మాయావతికి ఒక అంచనా ఉంది. రాష్ట్రంలో దళితులు, ముస్లిం ఓట్లు కలిపి దాదాపు 38 శాతం. ముక్కోణపు పోటీలో 30 శాతం ఓట్లు ఎవరికి వస్తే వారే అధికారం చేపడతారు. ఆమె ముస్లింలకు 100 టిక్కెట్లు ఇవ్వడానికి కారణం ఇదే. కానీ మాయావతి అంచనా నిజమవుతుందా? లేదా? రెండు రోజులలోనే తేలనుంది. మరొక వాస్తవం కూడా ఉంది. ఈ ఎన్నికలలో ముస్లింలు వ్యూహాత్మకంగా ఓటు వేశా రన్న మాట నిజం. తాము ఓటు వేసే అభ్యర్థి బీజేపీ అభ్యర్థిని ఓడించాలి. గెలిచే అభ్యర్థి ఎస్పీకి చెందిన వారైనా అభ్యంతరం లేదు. బీఎస్పీని పక్కన పెట్టి ఎస్పీ అభ్యర్థికి వారు ఓటు వేశారని చెబుతున్నారు. ఇక్కడే ఒక వాస్తవం కూడా చెప్పుకోవాలి. ఆమె నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు కాబట్టి, ఆమెకంటూ దళితులలో ఒక ఓటు బ్యాంకు ఉందని ఆమె నమ్ముతున్నారు. కానీ ఈ అభిప్రాయం స్థిరమైనది కాదు. దళిత ఓట్లను గంప గుత్తగా తెచ్చుకునే ఆకర్షణ ఇప్పుడు మాయావతికి లేదు. ఈ ఎన్నికల తరు వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకుంటే మాయావతి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారవుతుంది. కానీ ఒక అభిప్రాయం కూడా ఉంది. రాజకీయాలలో ఏదైనా సంభవించవచ్చు అన్న సూత్రం ఆధారంగా వచ్చిన అభిప్రాయమిది. హంగ్ ఏర్పడి, అఖిలేశ్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తే, ఆ సంకీర్ణ ప్రభుత్వంలో బీఎస్పీ భాగస్వామి అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా మాయావతి అటు వైపు అడుగులు వేయవచ్చు. అయితే ఇంత కీలకమైన రాజకీయ శక్తిగా ఎదగాలంటే ఆమె కనీసం వంద అసెంబ్లీ స్థానాలు సాధించాలి. ఇది సాధ్యం కాకపోతే బీఎస్పీ నిష్క్రమణ ముహూర్తం దగ్గర పడుతుంది. కాబట్టి ఈ ఎన్నికలు మాయా వతికి కీలకమే. యూపీ, మోదీ, బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో 2002 తరువాత బీజేపీ తన ప్రభను కోల్పోయింది. 2012 అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీకి ప్రజలు ఇచ్చిన స్థానాలు కేవలం 50. అయితే 2014 లోక్‌సభ ఎన్నికలలో 80 స్థానాలకు గాను 73 చోట్ల గెలిచింది. ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ విజయ దుందుభి మోగిస్తే జాక్‌పాట్ కొట్టినట్టే. ఒకవేళ ఎదురుదెబ్బ తింటే ఆ పార్టీకి గానీ, ఢిల్లీ ప్రభుత్వానికి గానీ వెంటనే వచ్చే నష్టం ఏమీలేదు. మోదీ ప్రధానిగా కొనసాగుతారు కూడా. కానీ ఆయ నకు ఇబ్బందులు మొదలవుతాయి. కానీ ఒకటి. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలి తాల మీదే ఆ పార్టీ పూర్తిగా ఆధారపడాలని అనుకోవడం లేదని వ్యూహాలను బట్టి అర్థమవుతుంది. పరిపూర్ణమైన జాతీయ పార్టీగా అవతరించేందుకు ఆ పార్టీ కృషి చేస్తోంది. పార్టీకి ప్రాధాన్యం లేని తూర్పు రాష్ట్రాలలోను, దక్షిణా దిన బలపడాలని యత్నిస్తున్నది. అందుకే అసోంతో పాటు బెంగాల్, ఒడి శాలలో కూడా బలోపేతం కావడానికి అడుగులు వేస్తోంది. దక్షిణాదిన ఒక్క కర్ణాటకలోనే ఆ పార్టీ బలంగా ఉంది. లోక్‌సభలో బలం కోసం ఒక్క ఉత్తరాది రాష్ట్రాల మీదే ఆధార పడకూడదన్న ఆ పార్టీ వ్యూహం కూడా దూరదృష్టితో కూడుకున్నదే. 2014లో యూపీ, బిహార్లలో ఉన్న 120 లోక్‌సభ స్థానాలకు గాను 101 స్థానాలు కైవసం చేసుకుంది. ఇదే పరిస్థితి ఎప్పుడూ ఉండదు. 2019 ఎన్నికల నాటికి బిహార్‌లో బలమైన ప్రత్యర్థి ఏర్పడవచ్చు. ఉత్తర ప్రదేశ్‌లో కూడా అలాంటి వాతావరణం ఏర్పడవచ్చు. అంటే ఉత్తరాదిన ఆ పార్టీకి స్థానాలు తగ్గుతాయి. కాబట్టి ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలుపే ధ్యేయంగా ఆ పార్టీ వ్యూహాలు రచిస్తున్నది. ప్రతి ఎన్నికను సవాలుగా తీసు కుంటున్నది.కానీ ఇది సరైన వైఖరి అనిపించుకుంటుందా? అసెంబ్లీ ఎన్నికలు ఎక్కడ జరిగినా మోదీని తీసుకురావడం మంచి సంప్రదాయమే అవు తుందా? బిహార్, బెంగాల్, జార్ఖండ్, అసోంలలో బీజేపీని ఎదుర్కొన గల గట్టి విపక్ష శిబిరాలు ఉన్నాయి. ఈ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ ఫలితాలను బట్టి అక్కడ కూడా విపక్షం బలపడవచ్చు. ఆ రాష్ట్రంలో బీజేపీకి చేరువయ్యే పార్టీ కూడా లేదు. ప్రతిపక్షాల మీద విరుచుకుపడే మోదీ ధోరణి ఇందుకు కారణం. మోదీ పదవి చేపట్టిన తరువాత విపక్ష ఎంపీలకు సాయంచేసే చర్యలు ఏనాడూ తీసుకోలేదు. శత్రువులను తగ్గించుకోవడం, విభజించి పాలించడం చతురుడైన రాజకీయవేత్త లక్షణం. యూపీలో బీజేపీ బలహీన పడిన క్షణంలో మోదీ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ సహజ పరిణామం. ఏ పార్టీని చూసినా... ప్రస్తుతం యూపీ అధికారం కోసం తీవ్రంగా పోరాడిన నాలుగు పార్టీలు కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించలేదంటే అతిశయోక్తి కాదు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికలలో కూడా అదే ధోరణి వ్యక్తమైంది. మితిమీరిన ధన వ్యయం, కులమతాల కార్డులు ఆ పార్టీలు యథేచ్ఛగా ఉపయోగించాయి. ఇది దేశ క్షేమానికి మంచిది కాదు. ప్రచారం కోసం, నాయకుల పర్యటన కోసం వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చయింది. ఏదో ఒక పార్టీ ఎన్నికలలో నెగ్గు తుంది. కానీ ఈ క్రమంలో పతనమైన విలువల మాటేమిటి? వచ్చే పద కొండో తేదీ వీరికి ఏదైనా గుణపాఠం నేర్పగలదేమో చూద్దాం! - పెంటపాటి పుల్లారావు వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు ఈ–మెయిల్ : ppr193@gmail.com -
కథా నాయకుడా? కలల నాయకుడా?
విశ్లేషణ పంజాబ్ ఎన్నికలలో కేజ్రీవాల్ తన సత్తా చూపితే పరిస్థితులు ఏ విధంగా మార తాయి? అదే జరిగితే దేశం మార్పు దిశగా కదులుతుంది. కొత్త నాయకత్వం, కొత్త పార్టీలు ఏర్పడి మార్పును తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. మార్చి 15వ తేదీని ‘ఐడస్ ఆఫ్ మార్చి’ అని ఐదు వందల ఏళ్ల క్రితం షేక్స్పియర్ పిలి చాడు. అదే రోజున రోమ్ చక్ర వర్తి జూలియస్ సీజర్‌ను హత మారుస్తారని ఒక జ్యోతిష్కుడు చెప్పాడట. అలాగే జరిగిందట. అంత కాకపోయినా, వచ్చే 15వ తేదీకి భారతదేశ చరి త్రలో ముమ్మాటికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఎన్ని కలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలోను ఆ రోజునే ఫలి తాలు వెలువడుతున్నాయి. అంటే చాలామంది నేతల తలరాతలు–నరేంద్ర మోదీ, రాహుల్‌గాంధీ, అఖిలేశ్ యాదవ్, మరీ ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్‌ల భవి ష్యత్తు తేలబోతున్నది. రాహుల్, అఖిలేశ్‌లు కుటుంబ పాలన నుంచి వచ్చినవారు. మోదీ నేపథ్యం అలాంటిది కాకున్నా, ఆయన ఎదురుగాలిలో ప్రయాణిస్తున్నారు. మోదీ జాతీయ రాజకీయాలలో కొత్త గాలి. అయినా కేజ్రీవాల్ మాదిరిగా ఆయనది ఒంటరి పోరాటం కాదు. ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పరిస్థితి వేరు. జాతీయ రాజ కీయ చిత్రంలో ఆయన ఇప్పుడొక ఆకర్షణ. అందుకే అందరి దృష్టి ఆయన మీదే ఉంది. పైగా కొత్త వారికి రాజకీయంగా ఎదిగే అవకాశం ఇస్తున్న నాయకుడు ఆయనే. గోవా, పంజాబ్ ఎన్నికల ఫలితాల గురించి ఇప్పుడు పెరుగుతున్న ఆసక్తికి కారణం కూడా ఆయనే. ఢిల్లీ ఎన్నికలలో కేజ్రీవాల్ విజయాలు చరిత్రా త్మకం. కేంద్రంలో, ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఆయన ఆ పార్టీని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో మట్టి కరిపించారు. ఆదాయపు పన్ను శాఖ ఉద్యోగం వదిలి అన్నా హజారే ఉద్యమంలో చేరిన కేజ్రీవాల్ ఆప్‌ను స్థాపించి 2013 నాటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో 28 (మొత్తం 70)స్థానాలు గెలిచారు. కానీ ఎనిమిది వారాలకే ఆయన ప్రభుత్వం పతనమైంది. తరువాత 2014 ఎన్నికలలో 67 సీట్లు గెలిచారు. మూడు చోట్ల గెలిచి బీజేపీ కకావికలైంది. కాంగ్రెస్ అధఃపాతాళానికి పోయింది. అందుకే ఆ రెండు జాతీయ పార్టీల లక్ష్యం ఆయనే. కేజ్రీవాల్ కనుక అప్రతిహతంగా కొనసాగిపోతే ఢిల్లీ, హరియాణా, పంజాబ్, హిమాచల్, గోవా వంటి చిన్న రాష్ట్రాలలో తమ చిరునామా కూడా ఉండదని కాంగ్రెస్ భయం. చిన్న రాష్ట్రాల ఎన్నికలలో పోరాడే సత్తా ఆయనకు ఉంది. పైగా ఈ చిన్న రాష్ట్రాలలో కాంగ్రెస్ లేదా బీజేపీలదే ఆధిపత్యం. ప్రస్తుతం ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నా, కేజ్రీవాల్ పార్టీ గట్టిగా పోరాడుతున్నది మాత్రం రెండు అసెంబ్లీల వరకే. అవే పంజాబ్, గోవా. ఇప్పటిదాకా అక్కడ బీజేపీ–అకాలీదళ్, కాంగ్రెస్ పార్టీలకే స్థానం. ఇప్పుడు ఆప్ కొత్త ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది. భారత రాజకీయాలలో ఆప్ పెను కంపాలను సృష్టిం చడం ఆరంభించినది పంజాబ్‌తోనే. 14 స్థానాలతో ఆ రాష్ట్రానికి లోక్‌సభలో పెద్ద ప్రాధాన్యం లేకున్నా, ఆ రాష్ట్రంలో ప్రధాన వర్గం సిక్కుల ప్రాధాన్యం మాత్రం ప్రపంచ వ్యాప్తమైనది. అలాంటి చోట బయటివారి నాయకత్వంలోని పార్టీ ఆప్ ప్రవేశించింది. ఎన్నికలు సక్రమంగా జరిగితే 30 శాతం ఓట్లతో ఆప్ పార్టీకి 40 ఎమ్మెల్యే స్థానాలు (మొత్తం 117) దక్కుతాయని అంచనా. ఇదే నిజమైతే దేశ రాజకీయాలకు ఇదొక కుదుపు కాగలదు. కాంగ్రెస్, బీజేపీతో విసిగిపోయిన చోట ఆప్‌ను ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు ప్రజలు. పంజాబ్‌లో వందేళ్ల నాటి అకాలీదళ్ మత పార్టీ స్థాయి నుంచి బాదల్ కుటుంబ పార్టీ స్థాయికి దిగ జారింది. పంజాబ్ కాంగ్రెస్ అంటే పాటియాలా సంస్థా నాధీశుల వంశీకుడు అమరీందర్ సింగ్ జేబు సంస్థ. అవి నీతి బంధుప్రీతి విషయంలో ఆ రెండు పార్టీలు ఒక్కటే. ఇంతకీ పంజాబ్ ఎన్నికలలో కేజ్రీవాల్ తన సత్తా చూపితే పరిస్థితులు ఏ విధంగా మారతాయి? అదే జరి గితే దేశం మార్పు దిశగా కదులుతుంది. కొత్త నాయ కత్వం, కొత్త పార్టీలు ఏర్పడి మార్పును తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. వంశ పారంపర్య పాలనకు బెడ దగా మారుతుంది. యువతరం ముందుకు వస్తుంది. దేశం పట్టణీకరణ చెందుతున్న కారణంగా యువత రంలో కుల ప్రభావం తగ్గి, నిజమైన రాజకీయ పార్టీల వైపు మొగ్గుతారు. ఈ దశలో బాదల్ కుటుంబీకులను ఓటర్లు నిరాకరించినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకుంటే అది రాహుల్‌కు పెద్ద దెబ్బగా మిగులుతుంది. అంటే కాంగ్రెస్కీ, రాహుల్కీ కూడా పెద్దగా ప్రజాకర్షణ లేదనీ, ప్రభుత్వ వ్యతిరేకత అన్న అంశంతో తప్ప గెలవలేరనీ నిర్ధారణ అవుతుంది. అదే సమయంలో కేజ్రీవాల్ ప్రతిష్ట పెరుగుతుంది. భవి ష్యత్తులో మరిన్ని అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఆయన విజయం సాధించగలుగుతారు. పంజాబ్ ఓటర్లు కేజ్రీ వాల్ పట్ల మొగ్గు చూపారంటే, దానర్థం దేశ ప్రజలు కూడా మార్పును కోరుతున్నారనే. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో సత్తా చూపాలని కేజ్రీవాల్ ఇప్పటికే ఆలో చిస్తున్నారు. ఆ పోరులో పటేల్ వర్గ నేత హార్దిక్ పటే ల్కూ, యువ దళితనేత జిగ్నేశ్కూ కేజ్రీవాల్ స్నేహ హస్తం అందిస్తారు. పంజాబ్‌లో ఆప్ విజయం గుజరాత్ ఓటర్లను కూడా చైతన్యవంతం చేస్తుంది. గుజరాత్ కాంగ్రెస్ 1996 నుంచి అహ్మద్ పటేల్ చేతిలో బందీ అయి ఉంది. బీజేపీలో కొత్త నాయకులు లేరు. అయితే ఇప్పటికే కేజ్రీవాల్ అక్కడ తన ఉనికిని చాటుకున్నారు. పంజాబ్‌లో కేజ్రీవాల్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తే కాంగ్రె స్కు గుదిబండగా తయారవుతారు. ప్రస్తుత అంచనా లను బట్టి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్‌కు ఉన్నట్టు అంచనా. ఆ అవకాశం తప్పితే, హంగ్ తప్పదు. అప్పుడైనా కేజ్రీవాల్ పెద్ద శక్తే. ఇదంతా మార్చి 15 తరువాత స్పష్టమవుతుంది. షేక్స్పియర్ మాట నిజమో కాదో తేలేది కూడా అప్పుడే. (వ్యాసకర్త : పెంటపాటి పుల్లారావు రాజకీయ విశ్లేషకులు ఈ–మెయిల్ : ppr193@gmail.com) -
ఊతమైనా.. శరాఘాతమైనా..!
విశ్లేషణ ఒకవేళ అఖిలేశ్ ఓడినా అదొక పెద్ద విషయమేమీ కాదు. కానీ బీజేపీ ఓడితే మాత్రం పెద్ద పరిణామాల కోసం ఎదురు చూడవచ్చు. ప్రస్తుతానికి బీజేపీ విజయ పథంలో ఉండవచ్చు. కానీ 2019 నాటికి అఖిలేశ్ అనే జాతీయ స్థాయి నేతతో బెడదను ఎదుర్కొనక తప్పకపోవచ్చు. ఐదు రాష్ట్రాలకు ఎన్నికల కమిషన్ ఎన్ని కల షెడ్యూలు ప్రకటించింది. ఆ ఐదిం టిలో ప్రస్తుతం పంజాబ్ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి. గోవాలో ఆ పార్టీదే ప్రభుత్వం. ఉత్తరాంచల్ కాంగ్రెస్ ఏలు బడిలో ఉంది. కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ఉంది. ఈశా న్యంలోని మణిపూర్‌లో ప్రాంతీయ పార్టీల పట్టు కొనసాగుతోంది. ఈ అసెంబ్లీ ఎన్ని కలలో విజయం సాధించాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పట్టుదలతో ఉంది. దీనినొక సవాలుగా చేసుకుంది. రెండు అంశా లతో ఇప్పుడు అందరి దృష్టి ఉత్తరప్రదేశ్ మీదే ఉంది. ఒకటి– 2014 లోక్‌సభ ఎన్నికలలో 80 స్థానాలకు గాను 71 చోట్ల బీజేపీ విజయం సాధించింది. రెండు–ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎస్పీలో ఇటీ వల తలెత్తిన సంక్షోభం. 80 స్థానాలకు గాను, 71 చోట్ల విజయం సాధిస్తే అసెంబ్లీ ఎన్నికలలో కూడా బీజేపీయే పాగా వేస్తుందని ఎవ రైనా భావిస్తారు. కానీ వాతావరణం అలా ఉందా? మరో పదేళ్ల పాటు కేంద్రంలో తామే అధికారంలో ఉంటామని 2016 సంవత్సరం ఆరంభంలో మోదీ, బీజేపీ ఘంటాపథంగా ప్రకటించడం కనిపించేది. కానీ 2017 ఆరంభం నుంచే అలాంటి అట్టహాసపు జోస్యాలు ఆగిపోయాయి. నవంబర్ 8, 2016న ప్రక టించిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారం అనూహ్యంగా వ్యవస్థను సంక్షుభితం చేసింది. బీజేపీ ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఈ సంగతి పార్టీ నేతలు కూడా గుర్తించారు. అదే సమయంలో ఈ సమ స్యకు పరిష్కారం లేదన్న వాస్తవాన్ని కూడా గుర్తించారు. అయితే మోదీ తన ఎజెండాను ఇంకా పూర్తి చేయవలసి ఉంది. ఆ విధంగా అయినా ఉన్న బలాన్ని కాపాడుకోవాలి. స్వచ్ఛభారత్, వాణిజ్యానికి అనువైన వాతావరణం కల్పించడం, ఇరుగు పొరుగుతో సత్సం బంధాలు, ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించడం వంటి కొన్ని మంచి పను లను మోదీ సాధించారు. ఇంత సజావుగా సాగుతున్న మోదీ ప్రభుత్వాన్ని హఠాత్తుగా చావోరేవో స్థితికి తీసుకువచ్చినదే నోట్ల రద్దు చర్య. బ్యాంకులలో ఉన్న తమ సొమ్మునే తాము తీసుకోవడా నికి సాధ్యం కాని ఒక దుస్థితిలో భారతీయులు పడిపోయిన క్షణ మది. ‘మీ ఖాతాలలో సొమ్మును మీరు వెనక్కి తీసుకునే అవకాశం లేని మరో దేశాన్ని ఎక్కడైనా చూపించండి!’ అని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ వ్యాఖ్యానించారు. అరవై రోజులలో గట్టి ఎన్నికల సవాలును ఎదుర్కొంటున్న బీజేపీని ఈ వాక్యమే వెంటాడుతోంది. నోట్ల రద్దు ముందు రోజు వరకు గోవా, ఉత్తరాంచల్, ఉత్తరప్రదే శ్లలో విజయం తమదేననీ, అకాలీల అసమర్ధ పాలన వల్ల పంజాబ్ చేజారిపోవచ్చుననీ బీజేపీ నేతల అంచనా. ఉత్తరప్రదేశ్‌లో ఈసారి గట్టి పోటీ తప్పదని అంతా అనుకుంటున్నదే. కానీ విజయం మాత్రం తమదేనని బీజేపీ చెప్పుకుంది. బీజేపీ చూపించిన ఈ అత్యుత్సాహం ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లలో చురు కును పెంచింది. బీజేపీతో పోరాటానికి కనీసం రెండు ప్రతిపక్షాల మధ్య సయోధ్య అవసరమని అవి గుర్తించాయి. ఉత్తరప్రదేశ్ రాజకీయ వ్యవహారాలలో అమిత్‌షా అంత చొరవ ప్రదర్శించి ఉండకపోతే, విపక్షాలు తమలో తామే కుమ్ములాడుకునేవి. నిజానికి అమిత్‌షా అసాధారణమైన నిర్వహణ సామర్థ్యం కలిగిన నాయకుడు. ఉత్తర ప్రదేశ్‌తో పాటు, ఇతర చోట్ల కూడా అందుకు తగిన యంత్రాం గాన్ని రూపొందించి పెట్టుకున్నారు. కానీ ఆయన అతిగా ప్రచారం చేశారు. నోట్ల రద్దు చర్యతో ఆగ్రహించిన జనం ఇప్పుడు ప్రతిపక్షం వైపు చూస్తున్నారు. బహుళ రాజకీయ పక్షాలు ఉన్న భారత్ వంటి దేశంలో ఎన్నికలలో ఓటమికి ఐదు శాతం ఓట్లు అటూ ఇటూ అయితే చాలు. కాబట్టి ప్రస్తుతం నరేంద్ర మోదీ ఉన్న బలం చెదిరి పోకుండా జాగ్రత్త పడడానికే కష్టించవలసి ఉంది. ఏ విధంగా చూసినా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ తాను పన్నిన ఉచ్చులో తానే పడింది. మణిపూర్, ఉత్తరాంచల్, పంజాబ్, గోవాలలో విజయం మోదీకి లెక్క కాదు. ఇంకా చెప్పాలంటే, ఉత్తరప్రదేశ్ తప్ప ఈ నాలుగు రాష్ట్రాలలో విజయం సాధించినా అదేమీ లెక్కలోకి రాదు. ఈ నాలుగు రాష్ట్రాలు కోల్పోయినా, ఉత్తరప్రదేశ్‌లో కమల వికాసం జరిగితే మోదీకి అసలైన విజయం కాగలదు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 403 స్థానాలు ఉన్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. 325 అసెంబ్లీ స్థానాలలో స్పష్టమైన ఆధిక్యం కనిపించింది. నరేంద్ర మోదీ గెలిచిన వారణాసి స్థానం కూడా ఆ రాష్ట్రంలోనిదే. అందుకే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఈసారి మా ఖాతాలోనే పడుతుందని 2014 నుంచి బీజేపీ ప్రకటించుకుంటున్నది. కానీ ఇప్పుడు పరిస్థితి అస్థిరంగానే ఉంది. ఒకటి వాస్తవం 2014లో జరిగినవి పార్లమెంట్ ఎన్నికలు. దేశమంతటా మోదీ గాలి వీచింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఓటర్లు ముఖ్యమంత్రిని ఎన్నుకుం టారు. అక్కడ ఇటీవలి మరో పెద్ద పరిణామం, ఎస్పీ అధినేత ములాయం, ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేశ్‌కు మధ్య రగడ. ఇది అఖిలేశ్ భవిష్యత్తుకు చేటు చేసేది కాదు. పైగా ఆయన ప్రతిష్టను పెంచింది. అంతే కాకుండా అఖిలేశ్ తండ్రి కంటే ఎంతో ముందంజలో ఉన్నారు. ఇప్పుడు ఆయన తిరుగులేని నేత. అజాత శత్రువుగా పేర్గాంచారు. ఈ ఎన్నికలలో మోదీ ఓడితే ఇక్కట్లు ప్రారంభం కావడం తథ్యం. ఇక పార్లమెంటుకు వెళ్లే పనే ఉండదు. ప్రస్తుతానికి మౌనం దాల్చిన శత్రుఘ్ను సిన్హా వంటివారు గళం విప్పుతారు. అయితే రాహుల్, మాయావతి ప్రస్తుతం చలామణీలో లేని నేతలుగా మిగిలారు. వారు ప్రజలకు చేసిందేమీ లేదు. కాబట్టి మోదీకి అసలైన సవాలు అఖిలేశ్ నుంచే. బీజేపీకి పోటీ ఇవ్వగల నేతగా ఆయన ఎదగడమే ఇందుకు నిదర్శనం. మరొక వాస్తవం ఉంది. ఒకవేళ అఖిలేశ్ ఓడినా అదొక పెద్ద విషయమేమీ కాదు. కానీ బీజేపీ ఓడితే మాత్రం పెద్ద పరిణామాల కోసం ఎదురు చూడ వచ్చు. ప్రస్తుతానికి బీజేపీ విజయ పథంలో ఉండవచ్చు. కానీ 2019 నాటికి అఖిలేశ్ అనే జాతీయ స్థాయి నేతతో బెడదను ఎదు ర్కొనక తప్పకపోవచ్చు. (వ్యాసకర్త : పెంటపాటి పుల్లారావు రాజకీయ విశ్లేషకులు ఈ–మెయిల్ : ppr193@gmail.com ) -
‘సుప్రీం’ పీఠం ఎప్పటికీ కొందరికేనా?
సందర్భం కొలీజియం వ్యవస్థ కొనసాగింపు దళితులు, వెనుకబడిన కులాలు, మైనారిటీలు, ఆధిపత్య కులాలకు చెందని ఇతరులను సుప్రీం న్యాయమూర్తులను చేసే అవకాశాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కల్పిస్తోంది. వీరికి చిత్తశుద్ధి ఉంటే ఆ వర్గాల వారి నుంచి యువ వయస్కులను హైకోర్టు న్యాయమూర్తులను చేస్తే చాలు. మరి తెలుగు ముఖ్యమంత్రులు ఈ అవకాశాన్ని సవాలుగా స్వీకరించి వెనుకబడిన వర్గాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోగలరా? జాతీయ న్యాయ కమిషన్ (ఎన్సీఏ) ఏర్పాటునకు ఉద్దేశించిన చట్టం చెల్లదని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. న్యాయమూర్తుల నియామకాల బాధ్యతను ఎన్సీఏకు అప్పగించడానికి ఉద్దేశించిన ఆ చట్టం అమల్లోకి వస్తే సుప్రీం కోర్టు కొన్ని అధికారాలను కోల్పోయి ఉండేది. దీంతో న్యాయ మూర్తుల నియామకాల్లో ప్రభుత్వాల పాత్రే లేకుండా సుప్రీం కోర్టే సర్వశక్తివంతమైన అంతిమ అధికారంగా ఉండే కొలీజియం వ్యవస్థ తిరిగి అమల్లోకి వస్తోంది. కొలీజియం వ్యవస్థకంటే ఎన్సీఏ అయితేనే న్యాయమూర్తుల నియామకాలు మరింత పారదర్శకంగా ఉండేవనే వాదన ఉంది. అదలా ఉంచితే, పాత పద్ధతికే తిరిగి రావడం రెండు తెలుగు రాష్ట్రాలకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే దళితులు, వెనుకబడిన కులాలు, మైనారిటీల వారిని, ఆధిపత్యకులాలు కాని కొన్ని ఇతర కులాలవారిని సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా పంపించగలుగుతాయి. ప్రభుత్వాల పాత్రేలేని, సుప్రీంకోర్టు మాటే తిరుగులేనిదిగా ఉండే ఈ కొలీజియం వ్యవస్థ మహా నిగూఢమైనది. సాధారణ న్యాయవాదులు హైకోర్టు న్యాయమూర్తులై, ఆ తదుపరి సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగానే కాదు.. భారత ప్రధాన న్యాయమూర్తులుగా కూడా ఎలా అయిపోతుం టారనేది ఓ గొప్ప రహస్యం. కానీ వాస్తవం మాత్రం అత్యంత సరళమైనది. తెలుగు ప్రభుత్వాలు నిజంగానే బహుజనుల, మైనారిటీలకు సాధికారతను కల్పించడంలో చిత్తశుద్ధి ఉంటే...ఇంతవరకూ ఎన్నడూ తెలుగు రాష్ట్రాల నుంచి సుప్రీం కోర్టు న్యాయపీఠాన్ని అధిష్టించలేకపోయిన వారిని, కనీసం నలుగురు దళితులను, ఇద్దరు ఆదివాసులను, మైనారిటీలు తదితర విభాగాలకు చెందినవారిని ఆ అవకాశాన్ని అందుకునేలా చేయగలుగుతుంది. ఎవరైనాగానీ ఏ వయసులో హైకోర్టు న్యాయమూర్తి కాగలుగుతారనే దానిమీద ఆధారపడే... వారు సుప్రీం కోర్టు న్యాయమూర్తి కాగలుగుతారా? లేదా అనేది తేలిపోతుంది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు కలసి కొన్ని పేర్లను చర్చించిన మీదట అవి ఆ జాబితాను సుప్రీం కోర్టుకు పంపుతాయి. ఏ వివాదమూ లేకపోతే అది ఆ జాబితాను ఆమోదిస్తుంది. దాన్ని ఆమోదించడం తప్ప కేంద్ర ప్రభుత్వం చేయగలిగేది ఏమీ లేదు. ఇంతవరకు అగ్ర, అభివృద్ధి చెందిన కులాల నుంచి యువ న్యాయమూర్తుల పేర్లను హైకోర్టు న్యాయమూర్తులుగా ఖరారు చేస్తున్నారు. సీనియారిటీ ప్రాతిపదికలో ముందుండటం వల్ల వారిలో అత్యధికులు ఆటోమేటిక్‌గానే సుప్రీం కోర్టు న్యాయమూర్తులవుతున్నారు. ఇక ఇతరుల విషయంలో వారు సాధారణంగా వయసు మీరిన తర్వాతనే హైకోర్టు న్యాయమూర్తులు కాగలుగుతున్నారు. కాబట్టి సుప్రీం న్యాయపీఠాన్ని అధిష్టించేలోగానే వారు పదవీ విరమణ చేయాల్సి వస్తోంది. 1950 నుంచి ఇంతవరకు 42 మంది సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తులయ్యారు. వారిలో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ ఒక్కరే దళితుడు. ఇక ఏ ఆదివాసీ ప్రధాన న్యాయమూర్తి కానే లేదు. కోయల వంటి ఆదివాసుల నుంచైతే ఒక్కరైనా సుప్రీం న్యాయమూర్తి కాలేకపోయారు. ఏపీ, తెలంగాణలలో దళిత, ఆదివాసీ, మైనారిటీ న్యాయవాదులు చాలామందే ఉన్నారు. అయినా ఒకే ఒక్క దళితుడు సుప్రీం కోర్టు న్యాయమూర్తి కాగలిగారు. మన ప్రభుత్వాలు అతి తెలివిగా తాము కోరుకునే కులాల, వర్గాల వారినుంచి తక్కువ వయస్కులనే హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తున్నాయి. వారికి ప్రతిభ ఉన్నదని రుజువుచేయడం కోసం వారిని ముందుగా ఢిల్లీలో అదనపు అడ్వొకేట్ జనరళ్లుగా లేదా అసిస్టెంట్ సొలిసిటర్ జనర ళ్లుగా నియమిస్తోంది. అలా వారు ప్రతిభావంతులై హైకోర్టు న్యాయ మూర్తులుగా ఎంపికవుతున్నారు. ఆ తరువాత తాము ఎంపిక చేసిన అభ్యర్థులకు ఎక్కువ అనుభవం ఉందంటూ వారి పేర్లను హైకోర్టుకు పంపిస్తున్నాయి. దేశవ్యాప్తంగానే ఇలా పాలకులకు ప్రీతిపాత్రమైన కులాలు, వర్గాల వారు తక్కువ వయసుకే హైకోర్టు న్యాయమూర్తులవుతున్నారని, దళితులు, ఆదివాసులు, మైనారి టీలు తదితరులు వయసు మీద పడ్డాక కానీ హైకోర్టు న్యాయమూర్తులు కావడం లేదని ఏ కాస్త పరిశోధన చేపట్టినా తెలుస్తుంది. ఎవరు సుప్రీం న్యాయమూర్తులు కాగలుగుతారు, ఎవరు కారో నిర్ణయించేది ఈ వయసే. సుప్రీం న్యాయమూర్తి కావాలంటే ఏంచేయాలి? నేటి కొలీజియం పద్ధతి ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలసి హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల కోసం ఖరారు చేసిన జాబితాను ఐదుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులే సభ్యులుగా ఉండే కొలీజియం ఆమోదించడమే ఆనవాయితీ. ఆ జాబితాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోయినా కొలీజియం మాటే అంతిమమైనది. కాబట్టి సుప్రీం కోర్టు న్యాయమూర్తి కావాలంటే ముందుగా తక్కువ వయసులో హైకోర్టు న్యాయమూర్తి కావాలి. అందుకు కావాల్సింది రాష్ట్ర ప్రభుత్వం అనుగ్రహం. అది సంపాదించగలిగి, తక్కువ వయసులో ఆ మొదటి మెట్టు ఎక్కేస్తే చాలు ఇక ఎలాంటి పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలూ ఏమీ లేకుండానే సీనియారిటీ ప్రాతిపదికపైనే సుప్రీం న్యాయమూర్తులైపోతారు. దళితులు, వెనుకబడిన కులాలు, మైనారిటీలు తదితరులంతా ‘సీనియారిటీ’ సంపాదించి, హైకోర్టు గడప దాటి సుప్రీం న్యాయ పీఠంపైకి చేరేలోగానే పదవీ విరమణ చేయాల్సి వస్తోంది. కాబట్టేవారు సుప్రీం న్యాయమూర్తులూ కాలేరు, ప్రధాన న్యాయ మూర్తులు అంతకన్నా కాలేరు. అందుకు ఎవరు కారణమో చెప్పనక్కర్లేదు. సీనియారిటీ ఒక్కటే కొలబద్ధ కాబట్టే 1991 నవంబర్ నుంచి 1993 ఫిబ్రవరి వరకు నలుగురు భారత ప్రధాన న్యాయమూర్తులయ్యారు. అలాగే 2001 నవంబర్ నుంచి 2002 డిసెంబర్ వరకు నలుగురు ప్రధాన న్యాయ మూర్తులయ్యారు. చీఫ్ జస్టిస్ కేఎన్ సింగ్ 1991లో కేవలం 18 రోజులే ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. దళితులు, ఆదివాసులు హైకోర్టు న్యాయ మూర్తులుగానే పదవీ విర మణ చేస్తారు. మరి కేజీ బాలకృష్ణన్ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎలా కాగలిగారు? 1985లో బాలకృష్ణన్ నలభయ్యవ ఏటనే నాటి కేరళ ముఖ్యమంత్రి కే కరుణాకరన్ ఆయనను హైకోర్టు న్యాయ మూర్తిగా ఎంపిక చేసి, అందుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించేలా చేశారు కాబట్టి. 1993లో కొలీజియం వ్యవస్థ అమల్లోకి రాకముందు జరిగిందది. ఆ తర్వాత ఇంత వరకు దళిత లేదా ఆదివాసీ లేదా పలు ఇతర కులాల మైనారిటీలను ఎవరినీ యువకులుగా ఉండగా ఎంపిక చేసింది లేదు. ఉమ్మడి ఏపీ జాబితాలనే తీసుకుంటే అందులో దళితులు, ఆదివాసీలు, తదితర వెనుకబడిన వర్గాల వారెవరూ కనిపించరు. వాళ్లు మరీ ముసలివాళ్లు కావడంతో ఎప్పటికీ సుప్రీం కోర్టు పీఠం ఎక్కలేరు. అదంతే. గత అరవై ఐదేళ్లలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తులైన 42 మందిలో నులుగురు ముస్లింలు. వారిలో జస్టిస్ హిదయతుల్లా 1947 నాటికే న్యాయమూర్తి కాబట్టే సీనియారిటీ ప్రకారం ప్రధాన న్యాయమూర్తి కాగలిగారు. జస్టిస్ అల్మాస్ కబీర్ ప్రముఖ బెంగాలీ కుటుంబం నుంచి వచ్చి సీనియారిటీ ద్వారానే ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. కేజీ బాలకృష్ణన్ 40 ఏళ్లకు హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు కాబట్టే ప్రధాన న్యాయమూర్తి కాగలిగారని చూశాం. కానీ సుప్రీం న్యాయమూర్తులు కాగలిగిన దళితులు చాలా తక్కువ. ఇప్పుడిక మైనారిటీలవారు కూడా హైకోర్టు న్యాయ మూర్తులయ్యే సరికే వయసుపైబడినవారైపోతున్నారు, సుప్రీంకు వెళ్లేలోగానే పదవీ విర మణ చేసేస్తున్నారు! కొలీజియం వ్యవస్థ కొనసాగింపు అనేది దళితులు, వెనుకబడిన కులాలు, మైనారిటీలను, ఆధిపత్యకులాలకు చెందని ఇతరులను సుప్రీం న్యాయమూర్తులను చేసే అవకాశాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కల్పిస్తోంది. వీరికి చిత్తశుద్ధి ఉంటే ఆ వర్గాల వారి నుంచి యువ వయస్కులను హైకోర్టు న్యాయమూర్తులను చేస్తే చాలు. న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించే వ్యవస్థ సీనియారిటీని బట్టి వారిని సుప్రీంకు ఎంపిక చేసేస్తుంది. మరి తెలుగు ముఖ్యమంత్రులు ఈ అవకాశాన్ని సవాలుగా స్వీకరించి వెనుకబడిన వర్గాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోగలరా? - పెంటపాటి పుల్లారావు వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, ఈమెయిల్: drpullarao@hayoo.co.in -
తప్పులు సరిదిద్దుకుంటారా?
ఆయనా, ఆయన ప్రభుత్వమూ పనిచేస్తున్న తీరును చూస్తే ఆయనకు ఆయనే సవాళ్లను సృష్టించుకుంటున్నట్టుంది. ప్రజలు తమ నిత్యజీవిత అనుభవం నుంచే పాలకులపై తీర్పు చెబుతారు. వీధిలోకి మంచి మరుగుదొడ్డి వస్తే గౌరవిస్తారు. మార్కెట్లో మామూలు వస్తువులే ఖరీదైనవైపోతే తప్పుబడతారు. ఓడ ఎంత పెద్దదైనా అడుగున పడ్డ చిన్న చిల్లు ముంచేస్తుంది. నరేంద్ర మోదీ గత ఏడాది జూలైలో ప్రభుత్వాన్ని ఏర్పర చినప్పటి నుంచి తీవ్ర సవాళ్లేవీ ఆయనకు ఎదురుకాలేదు. అదే నెలలో చమురు ధరలు పడిపోవడం మొద లు కావడం ఆయనకో వరమైంది. ద్రవ్యో ల్బణం దానికదే దిగివచ్చింది, ఏటా రెండులక్షల కోట్ల రూపా యల సబ్సిడీ భారం తగ్గింది. విజయం సాధించడానికి కావాల్సింది ‘అదృష్టవంతులైన సైనికాధిపతుల’ని నెపో లియన్ అన్నాడు. అదృష్టం ఇప్పుడు మోదీ వెంట ఉంది. ఆర్థిక వ్యవస్థ వికసించడం ప్రారంభమైంది. మనం భారీ ఎత్తున దిగుమతి చేసుకునే బొగ్గు తదితర ఖనిజాల అం తర్జాతీయ ధరలు తగ్గడమూ లాభించింది. గత ప్రభు త్వం వారసత్వంగా ఇచ్చిపోయిన సమస్యలు ఏమీ చేయ కుండానే మాయమయ్యాయి. మోదీ జరిపిన విదేశీ పర్య టనలు ప్రాముఖ్యతగలవి. ఆయన చేపట్టిన స్వచ్ఛ భార త్ వంటి కార్యక్రమాలు చాలా మంచివే, కానీ వాటిని ఆయన ఎంత చాకచక్యంగా అమలు చేయగలుగుతారనే ది కీలకమైనది. నెహ్రూ, ఇందిరాగాంధీ, పీవీ నరసింహా రావు వంటి పూర్వ ప్రధానులు బలమైన రాజకీయ ప్రతి పక్షాన్ని ఎదుర్కొన్నారు. వామపక్షాల బలం క్షీణించిపో యిన స్థితిలోని ప్రతిపక్షమే నేడు మోదీకి ఉంది. కాంగ్రె స్లో ఉన్నవారంతా లాయర్లు, వ్యాపారవేత్తలు, పార్ట్ టైం రాజకీయవేత్తలు, అధికార ప్రతినిధులే. దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్ వంటి వారంతా దాదాపు ప్రజాపునాది లేనివారే. కాబట్టి మోదీకి నిజమైన ప్రతిపక్షం లేదు. ఈ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చిన మాట నిజమే. గత ప్రభుత్వ పర్యావరణ శాఖ వద్ద నిలి చిపోయిన నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు అనుమతులను జారీ చేసింది. కాంగ్రెస్‌కు భిన్నంగా ఈ ప్రభుత్వం ఉపాధికల్పన, ఆర్థిక వ్యవస్థల గురించి మాట్లాడటమైనా చేస్తోంది. బీజేపీకి ధైర్యమూ, తెలివితేటలూగల అధ్యక్షుడు అమిత్‌షా కూడా ఉన్నారు. కానీ ప్రభుత్వం సక్రమంగా పనిచేయలేకపోతే అధ్యక్షు డు చేయగలిగేదేమీ ఉండదు. విమానాన్ని ఆటోమేటిక్ పైలట్ వ్యవస్థతో నడపొచ్చు. కానీ దేశానికి ఆటోపైలట్ వ్యవస్థ ఉండదు. హఠాత్తుగా ఊహించని సవాళ్లు ఎదుర వుతాయి. మోదీకి ఇంకా అలాంటివి ఎదురుకాలేదు. కానీ ఆయనా, ఆయన ప్రభుత్వమూ పనిచేస్తున్న తీరు ను చూస్తే ఆయనకు ఆయనే సవాళ్లను సృష్టించుకుంటు న్నట్టుంది. ఆయన చాలా తెలివైన ప్రాంతీయ రాజకీయ వేత్త. మహాచురుకుకైనవాడేగానీ అంతర్జాతీయ రివాజు లు, పనిచేసే తీరుతెన్నులపై ఇంకా పట్టు సాధించలేదు. కొం దరు మినహా మోదీ మంత్రివ ర్గంలో ఉన్నవారంతా అనుభవం, పరిపాలనాదక్షత లేనివారు లేదా ప్రాపంచిక జ్ఞానం సైతం లేనివారు. సుష్మాస్వరాజ్, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కారీ, ప్రకాశ్ జవదేకర్ల వంటి విజయవంత మైన మంత్రులు కొందరున్నారు. అరుణ్‌జైట్లీ గొప్ప పార్లమెంటేరియనేగానీ చిదంబరం, ప్రణబ్‌ల వలే అ ధ్వానమైన ఆర్థికమంత్రి. మోదీ కనీసం పది మంది మం త్రులను తొలగించాల్సి ఉంటుంది. లేకపోతే ప్రభుత్వం విఫలమౌతుంది. భూసేకరణ చట్టానికి సవరణ తేవా లని సలహా ఇచ్చిన మంత్రి ఎవరైనా తొలగించాల్సిందే. మోదీ, అమిత్‌షాలు ప్రతి పోరాటంలోనూ జోక్యం చేసుకుంటూ తమ ప్రతిష్టను కోల్పోతున్నారు. ఢిల్లీ ఎన్ని కల్లో అరవింద్ కేజ్రీవాల్‌దే గెలుపని అందరికీ తెలిసినా మోదీని ఆ పోరులోకి ఈడ్చి ఆయన ప్రతిష్టకు భంగం కలిగించారు. రేపు బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడినా అదే జరుగుతుంది. పీవీ ప్రధానిగా ఉండగా పలు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడింది. వాటికి దూరంగా ఉన్నారు కాబట్టే పీవీ ప్రతిష్టకు ఏ నష్టమూ వాటిల్లలేదు. జనాద రణ చాలా అస్థిరమైనది. తన స్థాయికి తగని పోరాటా లతో మోదీ ప్రతిష్టను కోల్పోతున్నారు. పీవీ 225 మంది ఎంపీలతోనే ఐదేళ్లూ అధికారంలో ఉన్నారు. ప్రతిపక్షా లను ప్రసన్నం చేసుకోవడం ద్వారానే అది సాధ్యమైంది. పార్లమెంటులో పరిగణనలోకి వచ్చేవి అంకెలు కావు, ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నామ నేదే. ఒబా మాతో అరగంట సమావేశానికే మోదీ ఆయన తనకు గొప్ప స్నేహితుడని అంటుంటారు. రోజూ కలుసుకునే ప్రతిపక్ష నాయకులతో స్నేహం చేయకపోతే ఎలా? చమురు ధరలు తగ్గుతున్నా ఆహార ధరలు ఎం దుకు పెరుగుతున్నాయని ప్రజలే కాదు, ఆర్బీఐ సైతం ప్రశ్నిస్తోంది. ఉల్లి ధరలు కిలో రూ.70కి చేరేవరకు వేచి చూసిన తర్వాత దిగుమతులేమిటి? ఒక నెల ముందే ఆ పని చేసి ఉండొచ్చు. చిన్నవిగా కనిపించే విషయాల్లోనే తప్పులు చేస్తున్నారు. లాయర్లకు మాట్లాడటమంటే మహా ఇష్టం. మోదీ ప్రభుత్వంలో అలాంటి వారు ఎక్కు వగా ఉండి, అతిగా మాట్లాడి నష్టం కలిగిస్తున్నారు. ఏ ప్రభుత్వానికైనా అనుకోని సమస్యలు ఎదురుకావడమే అతిపెద్ద సవాలు. వాటిని ఎదుర్కోగలగాలి. ప్రజలు తమ నిత్యజీవిత అనుభవం నుంచే ప్రభుత్వాలపై తీర్పు చెబుతారు. తమ వీధిలోకి ఒక మంచి మరుగుదొడ్డి వస్తే మోదీని గౌరవిస్తారు. మార్కెట్లోకి వెళ్తే చాలా మామూలు వస్తువులే ఖరీదైనవైపోతే మోదీని తప్పుబడతారు. ఓడ ఎంత పెద్దదైనా అడుగున పడ్డ చిన్న చిల్లు ముంచేస్తుం ది. చురుకైన రాజకీయవేత్త తప్పులను దిద్దుకుంటాడు. తప్పులను దిద్దుకోడానికి మోదీకి ఇంకా సమయం ఉం ది. కానీ ఆయన ఆ పని చే యగలరా? పెంటపాటి పుల్లారావు (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) e-mail:Drpullarao1948@gmail.com -
బిహార్‌లో కమల వికాసం
విశ్లేషణ బిహార్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక కూటమి గెలుపొందుతుందని భావించారు. లౌకిక కూటమి సంబరాలు మొదలెట్టేసింది. బీజేపీ కూటమి 15 స్థానాలను, లౌకిక కూటమి 9 స్థానాలను చేజిక్కించుకోవడం ప్రకంపనలు సృష్టించింది. బిహార్‌లో 24 ఎంఎల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలను జూలై 11న ప్రకటించారు. అనూహ్యంగా ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి 15 స్థానాలు గెల్చుకోగా, కాంగ్రెస్, లాలూ, నితీష్ కుమార్ (లౌకిక) కూటమి 9 స్థానాలు మాత్రమే గెల్చు కుంది. పైగా లౌకిక కూటమి నుంచి ఒక్క మైనారిటీ ముస్లిం అభ్యర్థి మాత్రమే గెలుపొందారు. ఢిల్లీలో ఈ ఫలితాలు ప్రకంపనలు సృష్టించాయి. బిహార్‌లో అనూహ్యంగా బీజేపీ మానసిక విజయం సాధించింది. గత రెండు నెలలుగా కాంగ్రెస్ ఎలా మాట్లాడుతూ వచ్చిందంటే, బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో ప్రకటించినట్లు, బీజేపీ ఓడిపోయి నట్లు వ్యవహరించింది. నితీష్ కుమార్ సైతం అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి తాను మళ్లీ ముఖ్యమంత్రి అయినట్లు నమ్మసాగారు. ఇక లాలూ ముగ్గురు కుమారులూ ఇప్పటికే తమను తాము మంత్రులుగా ఊహించుకోసాగారు. బిహార్ ప్రస్తుత సీఎం నితీష్ కుమార్, లాలూప్రసాద్ యాదవ్ గత 22 ఏళ్లుగా బద్ధ శత్రువులుగా ఉన్నారు. లాలూను జైలుకు పంపడానికి, ఎన్నికలలో పోటీకి అనర్హుడిని చేయడా నికి మూలకారకుడు నితీష్. లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, నితీష్ 1989 నుంచి బిహార్ ముఖ్యమంత్రులుగా ఆధిపత్యం చలాయిస్తూ వచ్చారు. బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీని ప్రకటించగానే నితీష్ 2013లో ఎన్డీయే కూటమి నుంచి తప్పుకున్నారు. అయితే 2014 పార్లమెంట్ ఎన్నికల్లో నితీష్ ఘోరంగా దెబ్బతిన్నారు. అలాగే బిహార్‌లో లాలూ కూడా దెబ్బతిన్నారు. దీంతో మనుగడ కోసం కలసి పోరాడాలని ఇరువురూ నిర్ణయించుకున్నారు. బీజేపీని అడ్డుకోవడానికి తాను విషం తాగడానికైనా సిద్ధమేనని లాలూ జూన్ 7న ప్రకటించారు. ఇద్దరి మధ్య సయోధ్య అప్పుడే కుదిరింది. తమ కూటమి తరపున ముఖ్య మంత్రిగా నితీష్‌కు లాలూ మద్దతు పలికారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, లాలూ, నితీష్లకు కలిపి దాదాపు 45 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 38 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. విడిగా కాకుండా లౌకిక పార్టీలు ఒక్కటైతే బీజేపీని ఓడించవచ్చని వీరు లక్ష్యం పెట్టుకున్నారు. ఇది ఒక అద్భుత గణితమే కానీ రాజకీయాలు గణిత శాస్త్రం కాదు. 2014 ఆగస్టు 24న బిహార్‌లో 10 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా, లాలూ, నితీష్ కూటమి వాటిలో ఆరింటిని గెలుచుకుంది. నితీష్ కుమార్‌ను కూటమి తరపున ఉమ్మడి సీఎంగా ఈ సంవత్సరం జూన్ 7న ప్రకటించగానే నరేంద్రమోదీ ఓడిపో యారనే రీతిలో కాంగ్రెస్ వ్యవహరించింది. మోదీ అంతానికి ఇదే నాంది అనీ కాంగ్రెస్ కలగనింది. 2019లో బీజేపీ ఓడిపోతుందని భారత పాలకవర్గాలు అంచనావేస్తే, ప్రజలలో అధిక సంఖ్యాకులు మోదీకి మద్దతివ్వడం నిలిపివేస్తారని కాంగ్రెస్‌కు తెలుసు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో తాను గెలవ లేనని కాంగ్రెస్‌కు తెలుసు. కానీ, తను బీజేపీని నిలువరించి నట్లయితే, అది కూటమికి దారితీసి మళ్లీ లేచినిలబడవచ్చు. అధికారం లేకుంటే కాంగ్రెస్ సర్వనాశనమవుతుంది. అందుచేత 2019 ఎన్నికల్లో ఏవిధంగానైనా సరే బీజేపీని కాంగ్రెస్ నిలువరించాలి లేదా పదేళ్లపాటు అధికారానికి దూరమైన స్థితిలో కాంగ్రెస్ కుప్పకూలిపోతుంది. బీజేపీని నిలువరించే క్రమంలో బిహార్ ఎన్నికలు తొలి దశ. బీజేపీ గనుక బిహార్‌లో ఓడిపోయినట్లయితే 2019 ఎన్ని కల్లో బీజేపీ ఓటమి ఖాయమని, ఇక మోదీకి మద్దతు ఉపసం హరించుకోవడం మంచిదంటూ భారత పాలక వర్గాలకు, కులీ నవర్గాలకు కాంగ్రెస్ పార్టీ సందేశం పంపగలుగుతుంది. అప్పు డు సంపన్న వ్యాపార వర్గం, రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌తో మళ్లీ అధికారం పంచుకోవాలని కోరుకుంటారు. ఈ వ్యూహం లో భాగంగానే బిహార్ తమకు అనుకూలిస్తుందని కాంగ్రెస్ భావిస్తూ వచ్చింది. బద్ధశత్రువులైన నితీష్, లాలూ ఇద్దరూ పొత్తు కుదుర్చుకోవడమే గొప్ప విజయ సూచకం మరి. బిహార్‌లో ముస్లింల జనాభాయే ఎక్కువ. బీజేపీకి వ్యతి రేకంగా ఏ పార్టీనయినా వారు బలపరుస్తారు. ఇది కూడా లౌకిక పార్టీలకు అనుకూలమే. నితీష్‌కు మంచి గుర్తింపు ఉంది కానీ ఓట్లు లేవు. లాలూకు చెడ్డ గుర్తింపు ఉంది కానీ కొన్ని ఓట్లే ఉన్నాయి. కాంగ్రెస్‌కు ఏ ఓట్లూ లేవు కానీ జాతీయ గుర్తింపు ఉంది. ఈ ముగ్గురి మనుగడకు గెలుపు అవసరం. బీజేపీ ఇటీవల అనేక వివాదాల్లో కూరుకుపోయింది. ప్రతిపక్షానికి ఇది ఊతమిచ్చింది. సుష్మాస్వరాజ్ వంటి కేంద్ర మంత్రులూ, రాజస్తాన్ సీఎం వసుంధరారాజే వంటి వారిని వివాదాలు చుట్టుముట్టాయి. బీజేపీకి చెందిన పలువురు మంత్రులు తమ విధులను పేలవంగా నిర్వహిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పలువురు మంత్రులు అసమర్థులే కాకుండా వివాదాల్లో చిక్కుకున్నారు. మరోవైపు ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నప్పటికీ మోదీ ప్రభుత్వం ఆర్థిక ఫలితాలను అందివ్వడానికి సమయం తీసుకుంటోంది. భూ చట్టంలో మార్పులకు ప్రయత్నిస్తూ మోదీ ప్రభుత్వం వివాదాలను కొని తెచ్చుకుంటోంది. బీజేపీ గనుక బిహార్‌లో ఓటమి పాలయితే, మీడియాలో కాంగ్రెస్ తన దాడిని పెంచగలుగుతుంది. ఈ రోజుల్లో మీడియానే సర్వస్వం కదా. బిహార్‌లో 24 ఎంఎల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక కూటమి కచ్చితంగా విజయం సాధిస్తుందని భావించారు. ఫలితాలు ప్రకటించకముందే లౌకిక కూటమి సంబరాలు మొదలెట్టేసింది. రాహుల్ గాంధీ, నితీష్ కుమార్, లాలూ సాహస ప్రకటనలు ఇవ్వడంలో పోటీ పడ్డారు. బిహార్ లో లౌకిక పార్టీలకు విజయం తప్పదన్న అంచనా ఢిల్లీలోనూ, బిహార్‌లోనూ బీజేపీని మరింతగా దిగజారుస్తుంది. కానీ 24 ఎంఎల్సీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి 15 స్థానాల ను, బీజేపీ వ్యతిరేక కూటమి కేవలం 9 స్థానాలను చేజిక్కించు కోవడం ప్రకంపనలు సృష్టించింది. ఫలితాలు బీజేపీకి గొప్ప ప్రోత్సాహం ఇవ్వగా బీజేపీ వ్యతిరేక కూటమి కుప్పకూలి పోయింది. కొన్ని సార్లు ఒకే ఒక్క స్థానం సైతం ప్రకంపనలు సృష్టిస్తుంది. బీజీపే ఎంఎల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా గెలుపొంద డానికి కారణాలు బోలెడు. బీజేపీ మంత్రులు, సీఎంల వ్యవ హారం ఎలా ఉన్నప్పటికీ మోదీకి ప్రజాదరణ వెనుకపట్టు పట్ట లేదు. బీజేపీ బిహార్‌లో ఎన్నడూ అధికారంలో లేదు. గత 40 ఏళ్లుగా అధికారంలో ఉన్న లాలూ, నితీష్లకు పెద్ద ఎత్తున ఏర్పడిన వ్యక్తిగత శత్రువులు గంపగుత్తగా బీజేపీ ని బలపర్చా రు. లౌకిక కూటమికి, మైనారిటీలకు వ్యతిరేకంగా ముస్లిమేత రులను కూడగట్టడంలో బీజేపీ సఫలమైంది. లాలూ కుటుం బం మొత్తం అధికార స్థానాలు కైవసం చేసుకునేందుకు వెంప ర్లాడటంతో ప్రజలకు ఏవగింపు కలిగింది. దీంతో ఒక్కరోజులో బిహార్ రాజకీయ ముఖచిత్రం పెనుమార్పుకు గురయింది. ఒక వారం క్రితం బీజేపీకి పరాజయం తప్పదనిపించిన చోట ఇప్పుడు బీజేపీయే గెలుస్తుందన్న భావం బలపడిపోయింది. నోబెల్ గ్రహీత, రచయిత రాబర్ట్ స్టెయిన్బెక్ ఒకమాటం టారు. మనుషుల పథకాలు ఎల్లవేళలా విఫలమవుతుంటాయి అని. కోరికలే గుర్రాలయితే ఊహలకు రెక్కలొస్తాయని తెలుగు సామెత. ఏదేమైనా బిహార్ ఎన్నికలు ఇప్పుడు ఆసక్తికరం గానూ, ఆశ్చర్యకరంగానూ మారాయి. గతవారం కంటే బీజేపీ లో మరింత ఆశాభావం ఏర్పడింది. అయితే ఇదంతా తన ప్రజాదరణ ప్రభావమని మోదీ భావించకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇది బీజేపీ ప్రత్యర్థులైన లాలూ, నితీష్ వంటి వారి అప్రతిష్టే ఈ అనూహ్య పరిణామానికి కారణం. పెంటపాటి పుల్లరావు (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు ఈమెయిల్: Drpullarao1948@gmail.com) -
బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు
హైదరాబాద్ సిటీః పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం, పునరావాసం కల్పించకుండా వారిని బలవంతంగా ఉన్న చోటు నుంచి ఖాళీ చేయిస్తున్నారని, దీనిని అడ్డుకోవాలంటూ సామాజిక కార్యకర్త డాక్టర్ పెంటపాటి పుల్లారావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇందులో పోలవరం ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్, కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర గ్రామీణాభివృద్ధి, గిరిజన వ్యవహారాలు, పర్యావరణ మంత్రిత్వశాఖల కార్యదర్శులను, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం విచారించనున్నది. మారిన పరిస్థితుల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు ప్లానింగ్, డిజైన్ల దగ్గర నుంచీ పూర్తిస్థాయిలో తిరిగి అధ్యయనం నిర్వహించేలా పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోను ఆదేశించాలన్నారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, నిర్వాసితులకు కొత్త చట్ట ప్రకారం పరిహారం అందచేసే పునరావాసం కల్పించేందుకు వీలుగా ఈ ప్రాజెక్టు బాధ్యతలను పోలవరం అథారిటీకి అప్పగించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. నిర్వాసితులను ఖాళీ చేయించే చర్యలో భాగంగా వారి ఇళ్లకు విద్యుత్, నీటి కనెక్షన్లతో అత్యవసర సేవలను నిలపుదలను చేస్తున్నారని, ఈ చర్యలను అడ్డుకోవాలని పుల్లారావు తన పిటిషన్లో కోర్టును కోరారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు జాతీయ ప్రాజెక్టు అని, దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ సంబంధం లేకపోయినా కూడా నిర్వాసితులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారన్నారు. నిర్వాసితులకు కొత్త భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. నిర్వాసితులను ఖాళీ చేయించేందుకు ప్రైవేటు భద్రతా సిబ్బందిని వాడుతున్నారని, దీనిపై ప్రభుత్వాన్ని నిరోధించాలని అభ్యర్థించారు. -
‘కోటా’ రాజకీయాలకు తెర?
విశ్లేషణ చారిత్రక అన్యాయాలను వెనుకబాటుతనానికి ప్రధాన కొలబద్ధగా తీసుకొని రిజర్వేషన్లను కల్పించడాన్ని సుప్రీం కోర్టు అంగీకరించలేదు. అర్హులైన ప్రజా సమూహాలను కొత్తగా గుర్తించి రిజర్వేషన్లను కల్పించాలని స్పష్టం చేసింది. అంటే ‘ట్రాన్స్జెండర్లు’, వికలాంగులు వంటి కొత్త వర్గాలకు రిజర్వేషన్లు వర్తింపజేసే అవకాశాలు తెరచుకున్నట్టే. ఇంతవరకు వివిధ ప్రజా సమూహాలు రిజర్వేషన్ల కోసం పోరాడుతుంటే, అందుకు భిన్నంగా సుప్రీం కోర్టు ప్రభుత్వమే రిజర్వేషన్లను కల్పించాల్సిన వర్గాలను కొత్తగా గుర్తించాలని చెప్పింది. జాట్లకు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు వర్తించవంటూ సుప్రీం కోర్టు ఈ నెల 17న వెలువరించిన తీర్పును రాజకీయవేత్తలూ, మీడియా పెద్దగా పట్టించుకోలేదు. ఉత్తరాది రాష్ట్రలంతటా విస్తరించిన ఈ పెద్ద రైతాంగ కులా న్ని ప్రసన్నం చేసుకోవాలని యూపీఏ ప్రభుత్వం జాట్లకు రిజర్వేషన్లను కల్పిం చింది. వాటిని రద్దు చేస్తూ సుప్రీం ఇచ్చిన తాజా తీర్పు జాట్లపైనే గాక మొత్తం గా రిజర్వేషన్ల అంశంపైనే ప్రభావం చూపుతుంది. కొన్ని కులాలను రిజర్వుడు కేటగిరీల్లో చేర్చాలని రాజకీయవేత్తలు, ఎన్జీఓలు ఎప్పటికప్పుడు కోరడం జరుగుతూనే ఉంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో చేర్చితే వారికి విద్యా, ఉద్యోగ అవకాశాలతోపాటూ రాజకీయ రిజర్వేషన్లు కూడా లభిస్తాయి. వెనుకబడిన తరగతుల్లో చేరిస్తే విద్య, ఉద్యోగ అవకాశాల్లోనూ, స్థానిక సంస్థల్లోనూ మా త్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయి. ప్రతి మతం, కులం రిజర్వుడు కేటగిరీలో చేరాలనే కోరుకుంటాయి. వెనుకబడిన కులాలు కొన్ని ఎస్సీ లేదా ఎస్టీ కేటగిరీలకు ప్రమోషన్‌ను కోరుకుంటాయి. బీసీలుగా ఉన్న మేదర కులస్తులు తమకు ఎలాంటి మేలు జరగడం లేదు కాబట్టి, తమకు ఎస్టీ గుర్తింపు కావా లని కోరుతుంటారు. డాక్టర్ అంబేద్కర్ వాస్తవంగా ప్రతిపాదించిన రిజర్వే షన్ల కాల పరిమితి పదేళ్లు మాత్రమే. 1952 నుంచి ప్రతి పదేళ్లకు వాటిని పొడిగిస్తూ వస్తున్నారు. 1989లో వీపీ సింగ్ ప్రధాని అయిన తర్వాతనే బీసీల కు రిజర్వేషన్లను కల్పించారు. అప్పట్లో వాటికి వ్యతిరేకంగా పెద్ద ఆందోళనలు కూడా సాగాయి. గత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో ముస్లింలకు రిజ ర్వేషన్లను కల్పించింది. జనాభాలో ముస్లింలు 14% ఉన్నా ప్రభుత్వం వారికి 5% రిజర్వేషన్లను మాత్రమే కల్పించింది. వ్యతిరేకులు కోర్టులను ఆశ్రయిం చారు. పలు హైకోర్టులు రిజర్వేషన్లకు మతప్రాతిపదిక చెల్లదని, ముస్లింల లోని కులాలకు రిజర్వేషన్లు కల్పించవచ్చే తప్ప, మొత్తం మతానికి కాదని ఆ రిజర్వేషన్లను రద్దు చేశాయి. మహారాష్ట్రలో సరిగ్గా శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మరాఠాలకు, ముస్లింలకు రిజర్వేషన్లను కల్పిం చింది. కానీ కోర్టులు వాటిని రద్దు చేశాయి. రిజర్వేషన్లపై సుప్రీం నూతన తాత్విక దృష్టి కొన్ని కులాలు తమ సంఖ్యాబలం ఆధారంగా రిజర్వేషన్లను కోరి సాధించు కుంటున్నాయని, అది ఆమోదయోగ్యం కాదని సుప్రీం భావించింది. అంటే నూతన మార్గదర్శకాలను ఆమోదించే వరకు కొత్తగా ఎవరికైనా రిజర్వేషన్లను కల్పించడంపై ఈ తీర్పు నిషేధం విధించినట్టేనని భావించవచ్చు. చారిత్రక అన్యాయాలను వెనుకబాటుతనానికి ప్రధాన కొలబద్ధగా తీసుకొని రిజర్వే షన్లను కల్పించడాన్ని కోర్టు అంగీకరించలేదు. అర్హులైన ప్రజా సమూహాలను కొత్తగా గుర్తించి, వారికి రిజర్వేషన్లను కల్పించాలే తప్ప ఎవరికి వారు డిమాం డు చేసి రిజర్వేషన్లు సాధించుకోడాన్ని అనుమతించరాదని స్పష్టం చేసింది. అంటే ప్రభుత్వం అర్హులను అన్వేషించాలే తప్ప రాజకీయ డిమాండ్లకు, ఆందోళనలకు తలొగ్గి రిజర్వేషన్లను కల్పించరాదు. పైగా, వివిధ జాతీయ కమిషన్లు కుల రిజర్వేషన్లపై వ్యక్తపరచిన అభిప్రాయాలతో ప్రభుత్వం ఎందువలన ఏకీభవించలేకపోయిందో కారణాలను తెలపాలని కూడా కోర్టు కోరింది. అలాగే కొన్ని కులాలకు రిజర్వేషన్ల వర్తింపునకు సమర్థనగా సమర్పించే అధ్య యనాలు యథాలాపమైనవిగా ఉండరాదని కోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్లకు పాత అర్హతలు నేడు పొసగేవి కావని కూడా అది భావిం చింది. కుల, మతాలను అధిగమించిన ‘వెనుకబడినతనాన్ని పట్టుకోవ డానికి’ కొత్త భావనలను ఉపయోగించాలని చెబుతూ కోర్టు ‘‘ట్రాన్స్ జెండర్స్’’ను (హిజ్రాలు) ఉదాహరణగా చూపింది. అంటే కోర్టు కుల, మత ప్రమేయం లేకుండా ట్రాన్స్జెండర్లు, వికలాంగులు వంటి కొత్త వర్గాలను చేర్చాలని కోర్టు భావిస్తుందనేది స్పష్టమే. ఇంతవరకు వివిధ ప్రజా సమూ హాలు రిజర్వేషన్ల కోసం పోరాడుతుంటే, అందుకు భిన్నంగా సుప్రీం కోర్టు ప్రభుత్వమే రిజర్వేషన్లను కల్పించాల్సిన ప్రజా సమూహాలను కొత్తగా గుర్తించాలని చెప్పింది. ఇది కోర్టు నూతన తాత్విక దృష్టి. సుప్రీం తీర్పు...‘‘క్రీమీ లేయర్’ తాజా తీర్పు వల్ల ప్రభుత్వాలు లేదా రాజకీయ పార్టీలు ఇక తమ ఇష్టాను సారం ఒక కులానికో లేదా మతానికో రిజర్వేషన్లను వాగ్దానం చేయలేవు. ఈ తీర్పు ఆచరణలో ఆ అధికారాన్ని వాటి చేతుల్లోంచి తొలగించింది. ఈ తీర్పుతో సుప్రీం కోర్టే అన్ని సామాజిక సమస్యలపైనా అత్యున్నత అధికార సంస్థగా మారింది. రిజర్వేషన్లపైన కూడా దానిదే అధికారం. రిజర్వేషన్ విధానాలు, చట్టాలన్నిటిలో సమూలమైన మార్పులను తేవాలని ఈ తీర్పు ఆదేశించినట్టే అయింది. ఇక రాజకీయ పార్టీల రిజర్వేషన్ల క్రీడకు తెరపడినట్టే. 2014 మార్చి 3న, అంటే సరిగ్గా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడానికి ముందు వరకు వేచి చూచి మరీ... కాంగ్రెస్ ప్రభుత్వం జాట్లను వెనుకబడిన తరగతుల్లో చేర్చింది. ఇక ఇవి పునరావృతం కాజాలవు. సుప్రీం కోర్టు చాలా కాలంగా కొన్ని కులాల్లోని ‘‘క్రీమీ లేయర్’’ లేదా పై పొరకు చెందినవారు మాత్రమే రిజర్వేషన్ల వల్ల లబ్ధిని అనుభవిస్తున్నారని, వారిని రిజర్వేషన్ల నుంచి మినహాయించడం అవసరమనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ వచ్చింది. తీర్పు నేపథ్యంలో ‘‘క్రీమీ లేయర్’’ను మినహాయిం చాలనే డిమాండు తలెత్తవచ్చు. ఉదాహరణకు రెండు లేదా మూడు తరాల పాటూ రిజర్వేషన్ల వల్ల లబ్ధి పొందిన కుటుంబం రిజర్వేషన్లకు అనర్హమైనదిగా నిర్దేశించాలని డిమాండు తలెత్తవచ్చు. రాజస్థాన్‌లో మీనా అనే ఎస్టీలున్నారు. ఐఏఎస్ వంటి అఖిల భారత సర్వీసులు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఎస్టీ కోటా లో అత్యధిక భాగం వారే దక్కించుకున్నారు. ఉత్తర భారతంలోని యాదవులు బీసీ ఉద్యోగాలను ఎక్కువగా దక్కించుకున్నారు. ఈ తీర్పు అలాంటి కులాల పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముస్లింల రిజర్వేషన్ల మాటేమిటి? ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపైన కూడా ఈ తీర్పు గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కొన్ని కులాలకు, మైనారిటీలకు రిజర్వేషన్లను వాగ్దానం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లను కల్పించనూవచ్చు, వాటివి కేంద్రం ఆమోదించనూ వచ్చు. కానీ ఎవరైనా వాటిని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లవచ్చు. కోర్టు ఆ రిజర్వేషన్లు చెల్లవని చెప్పవచ్చు. పైగా ట్రాన్స్జెండర్లు, వికలాంగులు, కొన్ని మహిళా గ్రూపులు రిజర్వేషన్లకు అర్హులుగా మారవచ్చు. ఇక ఏపీలో కాపులను బీసీల్లో చేర్చాలనేది ప్రధాన డిమాండు. కాపులు నేటి ఏపీలో అతి పెద్ద కులంగా ఉన్నారు. తెలంగాణలో మున్నూరు కాపులకు, రాయలసీమలో బలి జలకు బీసీ హోదా లభించింది. కాగా కోస్తా కాపు లేదా తెలగ కులస్తులకు ఆ హోదా లభించలేదు. చాలా ఏళ్ల క్రితం కాంగ్రెస్ కాపులను బీసీల్లో చేరుస్తా మని వాగ్దానం చేసింది. కానీ నెరవేర్చలేదు. ఒకప్పుడు కాపులను బీసీల్లో చేర్చడాన్ని తెలుగుదేశం మౌనంగా వ్యతిరేకించింది. ఇప్పుడు ఆ పార్టీయే ఈ వాగ్దానం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో సైతం కాపులకు బీసీ హోదా కల్పిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడది ఆయన చేతులు దాటిపోయినట్టే. నూతన వ్యూహంతోనే కాపు రిజర్వేషన్లు కానీ కాపుల ప్రధాన డిమాండే అది. నూతన రాజధాని నగరాలు, పెద్ద సాగు నీటి ప్రాజెక్టులు లేదా ఇతర ప్రాజెక్టులలో వారికి ఆసక్తి లేదు. ఎందుకంటే వారిలో పెద్ద కాంట్రాక్టర్లు లేదా రియల్ ఎస్టేట్ కుబేరులు లేరు. వారికి కావల సింది, విద్య, ఉద్యోగ అవకాశాలే. కాబట్టి టీడీపీ ప్రభుత్వం కాపులను బీసీల్లో చేర్చమని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సిఫారసు చేయవచ్చు. అది ఆమో దించి బీసీలుగా ప్రకటించనూవచ్చు. కానీ కోర్టులు అడ్డు చెప్పే అవకాశం ఉండనే ఉంది. కాబట్టి సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా, దాని డిమాండ్లకు లోబడి టీడీపీ నూతన వ్యూహ రచన చేయడం అవసరం. కాపులకు సుప్రీం కోర్టు తీర్పు ప్రభావాన్ని వివరించి, ఏ ముఖ్యమంత్రి, ప్రధాని ఆ పని చేయ లేరని వివరించాల్సి ఉంటుంది. లేదా ప్రభుత్వానికి కాపులకు బీసీ హోదా కల్పించాలనే చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి అగ్రశ్రేణి వ్యూహం అవసరం. నూతన మార్గనిర్దేశకాలను అనుసరించి కాపులను విభిన్న వర్గాలుగా విభ జించి వారికి బీసీ హోదాను కోరవచ్చు. జాట్లు, ముస్లింలు, మరాఠాలను కాంగ్రెస్ మాయ చేసినట్టుగా అది చేయలేదు. వారికి తాము కల్పిస్తున్న రిజర్వే షన్లను సుప్రీం కోర్టు రద్దు చేస్తుందని తెలిసే కాంగ్రెస్ ఆ పని చేసి ఉండవచ్చు. ఆ పార్టీ ఇప్పుడు సుప్రీం కోర్టును తప్పుబడుతుంది. ఏపీలో టీడీపీ ఆ మోసకారి మార్గాన్ని అనుసరించలేదు. అలాంటి కుయుక్తులు కాపుల వద్ద సాగవు. అవి వారు బాగా ఎరిగినవే. అలాంటి ప్రయత్నాలు ఏవైనా వారికే బెడిసి కొడతాయి. సమూలమైన వ్యూహాత్మక మార్పులను చేయనిదే రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదు. రెండు తెలుగు ప్రభుత్వాలకు అంతటి మేధోపరమైన సామర్థ్యం ఉన్నదా? ప్రభుత్వ నేతలకు తమ వాగ్దానాల అమలుకు పరిష్కారాలను కనుగొనగలిగేటంతటి ప్రగాఢ నిబద్ధత ఉన్నదా? నాకైతే అనుమానమే. పెంటపాటి పుల్లారావు, రాజకీయ విశ్లేషకులు ఈమెయిల్: drpullarao1948@gmail.com -
పంథా మారేనా! పరువు దక్కేనా!
రెండువేల ఏళ్ల క్రితం రోమన్ చక్రవర్తి ఒకరి దగ్గర ఎప్పుడూ ఒక బంటు ఉండేవాడట. అతని బాధ్యత - ‘మీరు దేవుడు కాదు, మానవమాత్రులే సుమా!’ అని సదా చక్రవర్తికి గుర్తు చేస్తూ ఉండడమే. ఇలాంటి స్పృహ కలిగించడం మన నేతలకు కూడా అవసరం. అయితే మోదీకి ప్రతిపక్షాల విమర్శలు ఒక వరంలా పరిణమించే అవకాశమే ఎక్కువ. ‘శత్రువు తప్పు చేస్తూ ఉంటే అడ్డుపడకు’ అంటాడు నెపోలియన్ బోనాపార్టి. విపక్షాలు నిరంతరం మోదీని విమర్శిస్తూ పప్పులో కాలు వేయకుండా జాగ్రత్త పడేటట్టు మాత్రం చేస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ, నరేంద్ర మోదీలకు ఒక హెచ్చరిక గానే వెలువడ్డాయి. ఆ ఎన్నికలూ, వాటి ఫలితాలూ గొప్ప ప్రాధాన్యం ఉన్నవి కావు. అయినా వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకోక తప్పని ఒక వ్యూహంలోకి బీజేపీని దింపారు. దారుణమైన మూల్యాన్ని చెల్లించి తెచ్చుకునే విజయానికే చరిత్రలో ‘పైరిక్ విజయం’ అన్న పేరు. శక్తికి మించిన మూల్యాన్ని చెల్లించి విజయం కోసం పాకులాడనక్కరలేదని పురాతన గ్రీకుల భావన. పైరిక్ విజ యం అంటే అలాంటిదే. ఢిల్లీ ఎన్నికలలో స్వయంగా నరేంద్ర మోదీ కూడా ప్రచారానికి పూనుకున్నారు. సర్వశక్తులు ఒడ్డారు. నిజానికి అక్కడ గెలిచినంత మాత్రాన బీజేపీకి కొత్తగా ఒరిగేదేమీ ఉండదు. భిన్నాభిప్రాయాలు నరేంద్ర మోదీ పనితీరు ఇంతవరకు విజయవంతంగానే ఉన్నదని జనాభి ప్రాయం. అదే సమయంలో వ్యవహార శైలిని ఆయన మార్చుకోవడం అవసర మన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. లేకపోతే ఆయన వైఫల్యాల పర్వం ప్రారంభం కాక తప్పదు. ప్రఖ్యాత న్యాయవాది రాం జఠ్మలానీ మోదీకి పెద్ద మద్దతుదారుడు. ‘వైఫల్యాలు తొలిదశలోనే మోదీ దృష్టికి వెళ్లడం ఆయన అదృష్టం, ఆ వైఫల్యాలతో పతనం కావడానికి ముందే సరిదిద్దుకోగలరు’ అన్నారాయన. నిజానికి గడచిన ఐదేళ్లలో భారత ఆర్థికవ్యవస్థ కుదేలైంది. విదే శాంగ విధానాన్ని పూర్తిగా విస్మరించారు. ఓట్లు ఎలా సాధించాలి? జాతీయ సలహా మండలి వంటి అంశాలను గురించి మాత్రమే కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఆలోచించారు. స్వప్రయోజనాలు, రాజకీయ మనుగడ గురించి తప్ప, దేశం కోసం ఆమెకు ప్రత్యేకమైన వ్యూహం కూడా ఏదీ లేదు. కానీ మోదీ అధి కారం చేపట్టాక గడచిన 9 మాసాలలో ఆర్థిక వ్యవస్థ పుంజుకో వడం ప్రారం భించింది. జైరాం రమేశ్, జయంతి నటరాజన్‌లు పర్యావరణ మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించినపుడు ఐదు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన పథకాలు అతీగతీ లేకుండా ఉండిపోయాయి. వారి అసమ ర్థత, అవినీతి వల్ల మన్మోహన్ సింగ్ ప్రభుత్వ ప్రతిష్టతో పాటు దేశ ప్రతిష్ట కూడా దిగజారింది. ఆర్థిక వ్యవస్థ మరింత పతనం కాకుండా మోదీ నిలువరించగలిగారు. అలాగే దేశ సమస్యలకు శాశ్వత పరిష్కారాలను వెతకడం ప్రారంభించారు. మోదీ ఇచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదంతో పరిశ్రమలపైన, చైనాలో ఉద్యోగాల కల్పన జరిగిన తీరు గురించీ భారతీయులు దృష్టి పెట్టేలా చేసింది. ఇక్కడ కూడా ఇలాంటి ప్రయత్నం జరగాలన్న ఆలోచన ఆరంభమైంది. స్వచ్ఛ భారత్ కూడా మంచి కార్యక్రమం. ఎనిమిది, తొమ్మిది మాసాల మోదీ హయాంలో విదేశీ వ్యవహారాలు కూడా విజయవంతమైనాయి. భారత్ ఉనికిని ప్రపంచ దేశాలకు చాటడంలో ఆయన విజయం సాధించారు. మోదీ అమెరికా పర్యటన; అమెరికా, చైనా దేశాల అధ్యక్షుల భారత పర్యటన కూడా విజయవంతంగానే జరిగాయి. ఆర్థిక, భద్రత వంటి అంశాలలో విజయవం తమైన ఫలితాలు సాధించడానికి భారత్‌కు పటిష్టమైన విదేశాంగ విధానం అవసరం. మన ఇరుగు పొరుగు అంతా శత్రువులు తప్పితే మిత్రులు కాన రారు. దీనికి పరిష్కారం మంచి విదేశాంగ విధానమే. ఈ విషయంలో మోదీ ధైర్యంగా ముందడుగు వేశారు. ఎల్.కె. అద్వానీ, మురళీమనోహర్ జోషి వంటి నాయకులకు విశ్రాంతి ఇచ్చి ఉండవలసింది కాదని ఒక వర్గం మీడియా అభిప్రాయపడుతోంది. కానీ అలాంటి నాయకులతో పార్టీకి ఒనగూడిన గొప్ప ప్రయోజనం ఏమీ లేదు. వారు ప్రజాదరణ కోల్పోయారు కూడా. నాలుగు దశాబ్దాల పాటు అధికారం లో ఉండి, కొత్తవారికి అవకాశం లేకుండా వారు చేశారు. కానీ మోదీ కొత్త తరానికి అవకాశం ఇచ్చారు. మోదీ పగ్గాలు చేపట్టిన తరువాత, ఇంతవరకు ఆట్టే ఉనికి లేని రాష్ట్రాలకు సైతం పార్టీని విస్తరించారు. కేరళ మొదలుకొని తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం- ఈశాన్య రాష్ట్రాలలో కూడా పార్టీ ఉనికిని చాటుకోగలిగింది. ఈ రాష్ట్రాలన్నిం టిలోను 250 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. కానీ వాటిలో బీజేపీ ఖాతాలో జమ అయినవి కేవలం పదిహేను. 2014 మే నెల నుంచి ఆయా ప్రాంతాల లో కమలం తన ఉనికిని చాటుకునే క్రమం మొదలైంది. ఇటీవల అసోం, బెంగాల్ రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికలు లేదా స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ నిలబడింది. ఒడిశాలో ఇప్పటికే ప్రతిపక్షం. ఇలాంటి విజయాలు పాతతరం నేతలు సాధించి ఉండేవారా? తప్పిదాలను అంగీకరించాలి! మంచి రాజకీయవేత్తలు తప్పిదాలను అంగీకరించడానికి వెనుకాడరు. ఈ విషయంలో గాంధీజీ నుంచి మోదీ నేర్చుకోవాలి. బీజేపీ ప్రభుత్వం మోదీ అనే ఏక వ్యక్తి తమాషాగా కనపడుతున్న మాట వాస్తవం. నియంతృత్వాలలో ఇలాంటిది సాగినా, ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపికైన ప్రధాని అందుకు తగిన రీతిలో వ్యవహరించడం అవసరం. నిజానికి ప్రజా స్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానుల వ్యవహార శైలి అంతా నియంతల శైలినే మరిపిస్తుంది. అన్ని అంశాలు వారి కనుసన్నలలో సాగాలనీ, తనను మించి ఎవరూ మిన్నగా కనిపించరాదన్నట్టూ వారు కనిపిస్తూ ఉంటారు. కానీ ఇలాం టి ముద్ర ప్రజాస్వామ్యంలో సరికాదు. నిజం చెప్పాలంటే అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్నది కూడా ఏక వ్యక్తి తమాషాయే! కేజ్రీవాల్ మాదిరిగా ప్రజల దృష్టిలో ఉండాలని మోదీ భావించకున్నా, ఆయన ఎవరి మాట ఆలకించరు అన్న అపప్రథ మాత్రం లేకుండా చూసుకోవాలి. ఎవరు ఏమి చెప్పినా ఆయన వింటారన్న భావన ఉండాలి. బీజేపీ మంత్రిమండలి చాలా బలహీనమైనది. మంత్రులు మంచి ఫలితాలను సాధించలేకపోతున్నారు. ఈ వైఫల్యానికి బాధ్యత మాత్రం మోదీదే అవుతున్నది. సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కారీ, రాజ్‌నాథ్‌సింగ్‌లు తప్ప మిగిలినవారు అత్తెసరు మార్కులు కూడా తెచ్చుకోవడం లేదు. ఇతర మంత్రులలో చాలామంది మీడియాతో చక్కగా మాట్లాడడం తప్పిస్తే, పాలనానుభవం లేనివారే. ఈ మంత్రులను మార్చకుంటే, మోదీ వైఫల్యం మొదలైపోతుంది. మోదీ ధరించే దుస్తుల విషయం కూడా వివాదాస్పదంగా తయారైంది. ఖరీదైన ‘సూటు’ వ్యవహారం ఇంతవరకు ఆయన మీద ఉన్న సదభిప్రా యాన్ని మారుస్తోంది. యథాతథంగా కాకున్నా, తనకు పూర్తి భిన్నంగా ఉండే ‘మఫ్లర్ మ్యాన్’ కేజ్రీవాల్‌ను మోదీ గమనంలోకి తీసుకోవాలి. అలా అని రాహుల్ గాంధీ శైలిలో అతి నాటకీయత జోలికి మాత్రం మోదీ వెళ్లవలసిన అవసరం లేదు. రాహుల్ ఒక రాత్రి పూరి గుడిసెలో నిద్రిస్తారు. కానీ నెల నెలా విదేశాలకు విహారయాత్రలకు వెళతారు. పార్లమెంటులో మోదీ, ఆయన మంత్రివర్గ సహచరుల నైపుణ్యం కూడా విజయవంతంగా లేదు. ప్రతిపక్షాల దాడిని వారు అధిగమించలేకపోతున్నారు. మోదీ కూడా ప్రతిపక్ష నేతలకు దగ్గర కావాలి. వారిని గౌరవించాలి. లాలూ ప్రసాద్, ములాయం వంటి వారిని ఇరుకున పెట్టాలని భావించడం సరైన రాజకీయం కాదు. ఇలాంటి వైఖరిని మార్చుకోకుంటే మోదీ ప్రభుత్వ పతనం మొదలైపోతుంది. పార్ల మెంటరీ ప్రజాస్వామ్యం అంటే, పార్లమెంటులో మనకి ఆధిక్యం ఉన్నప్పటికీ ప్రతిపక్షాలతో సర్దుకుపోవడమనే సంప్రదాయం పాటించాలి. ఈ వైఖరి మారాలి భారీ వ్యాపార, వాణిజ్య వర్గాలను సంతృప్తి పరచడానికి మోదీ చేస్తున్న ప్రయ త్నం ప్రమాదకరమైనది. వారు ప్రభుత్వం నుంచి ఆశించేది వారి పరిశ్రమ లకు భూములు, ప్రభుత్వం నుంచి రాయితీలు, విదేశాల నుంచి పెట్టుబడు లు. మోదీ ఆదరాబాదరా తీసుకువచ్చిన భూసేకరణ చట్టంతో దేశంలో చాలా గందరగోళమే మొదలైంది. చాలా వాస్తవాలను పరిగణనలోనికి తీసుకోకుం డానే మోదీ దేశంలోని భారీ వాణిజ్య, వర్తక వర్గాల మెప్పు కోసం ప్రయత్నిసు ్తన్నారని అనిపిస్తుంది. ఈ విధానాన్ని కూడా మోదీ ఆపివేయాలి. అలాగే ఆయ న భావిస్తున్నట్టు ఇతర దేశాల నేతలు మోదీకి మిత్రులు కారు. మోదీని వారం తా గౌరవిస్తున్నారంటే, అందుకు కారణం వారి మధ్య వ్యక్తిగత మైత్రి కాదు, మోదీ ఈ దేశానికి ప్రధాని. ‘దేశాలకు శాశ్వత మిత్రులు లేదా శత్రువులు ఉండరు, కేవలం శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి’ అని రెండు వందల ఏళ్ల క్రితం నాటి బ్రిటిష్ ప్రధాని మార్ల్‌బరో చెప్పాడు. ఇటీవల బరాక్ ఒబామా వచ్చినప్పుడు మోదీ ఆయనను పేరు పెట్టి పిలవడం దేశ ప్రజలకు ఇబ్బందిక రంగా తోచింది. రెండువేల ఏళ్ల క్రితం రోమన్ చక్రవర్తి ఒకరి దగ్గర ఎప్పుడూ ఒక బంటు ఉండేవాడట. అతని బాధ్యత - ‘మీరు దేవుడు కాదు, మానవమా త్రులే సుమా!’ అని సదా చక్రవర్తికి గుర్తు చేస్తూ ఉండడమే. ఇలాంటి స్పృహ కలిగించడం మన నేతలకు కూడా అవసరం. అయితే మోదీకి ప్రతిపక్షాల విమర్శలు ఒక వరంలా పరిణమించే అవకాశమే ఎక్కువ. ‘శత్రువు తప్పు చేస్తూ ఉంటే అడ్డుపడకు’ అంటాడు నెపోలియన్. విపక్షాలు నిరంతరం మోదీ ని విమర్శిస్తూ పప్పులో కాలు వేయకుండా జాగ్రత్త పడేటట్టు చేస్తున్నాయి. పెంటపాటి పుల్లారావు (వ్యాసకర్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మొబైల్ :9868233111) -
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి
మోదీ ప్రధాని అభ్యర్థి అయినప్పుడు నితీష్ బీజేపీతో తెగతెంపులు చేసుకోవాల్సిన అవసరం లేదు. సార్వత్రిక ఎన్నికల ఓటమికి రాజీనామా చేయాల్సిన అవసరమూ లేదు. కానీ ఆయన తాను అత్యంత సూత్రబద్ధమైన వాడిననే అబద్ధాన్ని నిజంగా ప్రదర్శించాలనుకున్నారు. రాముడు వనవాసానికి వెళ్లినప్పుడు భరతుడు అయోధ్యలో సింహాసనాన్ని కాపాడిన ట్టే మంఝి కూడా ప్రవర్తిస్తారనుకున్నారు. కానీ నితీష్‌ను అతి సన్నిహితంగా ఎరిగిన మంఝికి ఆయన రాముడేమీ కాడని బాగా తెలుసు. కాబట్టే తిరుగుబాటు చేశారు. దేశం చూపంతా కేజ్రీవాల్‌పైనే ఉండగా అంత కంటే గంభీరమైన రాజకీయ నాటకం బిహార్‌లో ప్రదర్శితమవుతోంది. ఢిల్లీలో ఫిబ్రవరి 10న బీజేపీ ఓటమి పాలు కాబోతుండగా, బిహార్‌లోని కొత్త రాజకీయ సమీకరణలు దానికి అనుకూలంగా మారబోతున్నాయి. బిహార్ నేటి ముఖ్యమంత్రి జీతన్‌రామ్ మంఝికి, మాజీ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు మధ్య పోరు ఓ ప్రహసనంగా మారింది. అందులో నితీష్ విదూషకుడయ్యారు. బిహార్ పరిణామాలను ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బెంగాల్, ఒడిశాలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. నితీష్ అనుయాయులలోనే ఒకరు ఆయనపై తిరుగుబాటు చేయడంతో గొప్ప నాయకుడనుకున్న నేత కాస్తా మహా ఇబ్బందికరమైన పరిస్థితిలో పడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చే శారు. యావద్భారతం ఆయన సూత్రబద్ధతను హర్షించింది. మెత్తని మనిషి, తనకు విధేయుడు అయిన దళిత నేత జీతన్ రామ్ మంఝికి నితీష్ అధికారం అప్పగించారు. శరద్‌యాదవ్ వంటి సీనియర్ నేతను కాదని ముఖ్యమంత్రి పదవికి ఒక దళిత నేతను ఎంపిక చేయడం తెలివైన ఎత్తుగడ అని అంతా ప్రశంసించారు. మంఝి అప్పటికే పలుమార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన వారు, జనతాదళ్-యూలో చేరడానికి ముందు కాంగ్రెస్, జనతాదళ్, రాష్ట్రీయ జనతాదళ్లలో పనిచేసిన సీనియర్ నేత. ఆ దళిత నేతనే నితీష్ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని చూస్తున్నారు. మంఝి, నితీష్ చేతి కీలుబొమ్మగా ఉండటానికి నిరాకరించి, రోజురోజుకూ స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభించారు. దీంతో నితీష్‌కు ఆందోళన పట్టుకుంది. స్వయంగా తానే ఎంపిక చేసిన వ్యక్తే తిరుగుబాటు చేయడంతో ఆయన నవ్వులపాలయ్యారు. నిజానికి నితీష్ నేడు పులి మీద స్వారీ చేస్తున్నారు. మంఝిని తొలగిస్తే దళితులకు కోపం వస్తుంది. ఆయననే ముఖ్యమంత్రిగా కొనసాగనిస్తే బిహార్‌లో నితీష్ ప్రజాపునాదిని కోల్పోతారు, రాజకీయ భవిష్యత్తే లేకుండా పోతుంది. ఎట్టకేలకు ముఖ్యమంత్రిని తొలగించి తానే తిరిగి అధికారం చేపట్టాలని నితీష్ నిర్ణయించారు. తొమ్మిది నెలలు మాత్రమే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని ఆయన తొలగించగలరా? అనేదీ అనుమానమే. ఎందుకంటే మంఝికి మద్దతు తెలపడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. పైగా ఆగ్రహంతో ఉన్న మంఝి శాసనసభను రద్దు చేయమని గవర్నరుకు సిఫారసు చేస్తానని బెదిరిస్తున్నారు. ‘బలహీనులే’ తిరగబడేది పెద్ద పెద్ద రాజకీయవేత్తలంతా మెత్తగా, బలహీనంగా, అణగిమణగి ఉండి, మూఢుల్లా కనిపించే అనుచరులనే ఇష్టపడతారు. అదే అసలు సమస్య. బలహీనులని ఎంపిక చేసిన వారసులే పదవి లభించాక తిరగబడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజా ఉదాహరణ జయంతీ నటరాజన్. తమిళనాడులో ఎలాంటి పునాది లేకపోయినా ముఖస్తుతితో తెలివిగా ఆమె 27 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యురాలు, చాలా ఏళ్లపాటే మంత్రి కాగలిగారు. గాంధీ కుటుంబానికి విధేయురాలిగా భావించడం వలనే ఆమెకు ఆ ప్రాధాన్యం లభించింది. చివరికి గాంధీ కుటుంబం వల్ల తనకిక ఒరిగేదేమీ లేదనుకున్నాక తిరుగుబాటు చేశారు. అత్యున్నత స్థానంలోని బలహీన నేత చేసిన తిరుగుబాటుకు అత్యుత్తమ ఉదాహరణ సీతారామ్ కేసరి. 1996 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తదుపరి పీవీ నరసింహారావు ప్రధాని పదవికి రాజీనామా చేసి, పార్టీ అధ్యక్షునిగా, ప్రతిపక్ష నేతగా కొనసాగారు. ఏవో కొన్ని చిల్లర మల్లర కేసుల విషయమై ఆయన రాజీనామా చేయాలనే డిమాండు రావడంతో పీవీ 1997 జనవరిలో సీతారామ్ కేసరికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత పదవిని కట్టబెట్టారు. కేసరి కొద్ది రోజుల్లోను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పీవీ రాజీనామా చేసేలా చేశారు. పీవీకి శరద్‌పవార్ లేదా సీతారామ్ కేసరిలలో ఎవరో ఒకర్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నా.. బలవంతునికి భయపడి భజనపరుణ్ణే ఎంచుకున్నారు. పవార్ అయితే ఆయనను అలా ఎన్నటికీ రాజకీయంగా నాశనం చేసి ఉండేవారే కారు. కొందరు నేతలది మరో ఫార్ములా. దృఢ వ్యక్తిత్వమున్న ఇతర సహచరులందరినీ దూరం చేసుకుంటారు. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడానికి ముందే షాజియా ఇల్మీ, ప్రశాంత్‌భూషణ్, శాంతిభూషణ్ తదితరులను పార్టీ నుంచి వెళ్ల గొట్టేశారు.1989 నుంచి చాలా ఏళ్లు లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. అవినీతి కేసుల వల్ల రాజీనామా చేయాల్సిరాగా, ఆయన తన భార్య రబ్రీదేవిని వారసురాలిని చేశారు. సహచరులందరిపైనా ఆయనకున్న అవిశ్వాసానికి అదే నిదర్శనం. దాంతో ఆయన పతనం ప్రారంభమైంది. నితీష్ అత్యంత రాజకీయ చతురత గలిగిన నేత. 1977 నుంచి ఆయన చాలా పదవులనే అధిరోహించారు. అయితే లాలూ బాస్‌గా ఉన్న పార్టీలో తాను నిస్సహాయుడినని భావించి, ఆర్జేడీని వీడారు. జార్జి ఫెర్నాండెజ్‌తో కలిసి సమతా పార్టీని ఏర్పాటు చేశారు. అటల్ బిహారి వాజ్‌పేయి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. బీజేపీతో కూటమిని ఏర్పరచి 2005లో బిహార్ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. 2010లో తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. రెండో దఫా ముఖ్యమంత్రిగా ఉండగానే నరేంద్ర మోదీ బీజేపీకి నేతృత్వం వహించడం పట్ల సందేహాన్ని వ్యక్తం చేయడం ప్రారంభించారు. మోదీయే బీజేపీ ప్రధాని అభ్యర్థి కావాలనే డిమాండు పెరిగే సరికి, అదే జరిగితే జీజేపీతో పొత్తుకు స్వస్తి పలుకుతానని అనడం మొదలుపెట్టారు. ఆర్ఎస్ఎస్పై ఒత్తిడి తెచ్చి మోదీ బీజేపీ ప్రధాని అభ్యర్థి కాకుండా నిలవరించాలనే లక్ష్యంతో అద్వానీ తదితర సీనియర్ నేతలు నితీష్‌ను వాడుకున్నారనే బలమైన అభిప్రాయమూ ఉంది. ఏదేమైనా 2013 సెప్టెంబర్‌లో మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో నితీష్ బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. అయినా లాలూ, కాంగ్రెస్‌ల మద్దతుతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లోని 40 ఎంపీ స్థానాల్లో బీజేపీ, దాని మిత్రులు 33 గెలుచుకున్నారు. వెంటనే నితీష్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. జీతన్ రామ్ మంఝిని ముఖ్యమంత్రిని చేశారు. ఆయన పదవిలోనే కొనసాగుతానంటూ ఇప్పుడు నితీష్‌ను సవాలు చేస్తున్నారు. కాబట్టి మంఝిని తొలగించడానికి నితీష్ ఎమ్మెల్యేలను సమావేశపరచారు. ఎత్తుకు పై ఎత్తువేసి మంఝి శాసనసభను రద్దు చేయిస్తానని బెదిరించారు. ఇద్దరి సయోధ్య కోసం జరిగిన భేటీలో ఇక తన రాజీనామా ప్రసక్తి తేవడానికి వీల్లేదని మంఝి తేల్చేయడంతో నితీష్ దిగ్భ్రాంతి చెందారు. మరో బిహారీ సీతారామ్ కేసరి పీవీకి ఇదే చేశారు. లాలూ, నితీష్‌లు గత 20 ఏళ్లుగా నిత్యమూ ఒకరినొకరు తిట్టుకుంటూనే ఉన్న బద్ధ శ త్రువులు. కాబట్టి లాలూపై ఆధారపడాల్సి రావడం నితీష్‌కు అత్యంత అవమానకర ం. ఈ ప్రహసనాన్ని బిహార్ ప్రజలు ఉత్సాహంగా తిలకిస్తున్నారు. 1994 నుంచి నితీష్, లాలూను వేధిస్తూనే ఉన్నారు. ఆయన వల్లనే లాలూ కటకటాల పాలయ్యారు. కాబట్టి లాలూ ఆయనపై ఏ మాత్రం దయ చూపరు. భార్య రాజ్యసభ సభ్యురాలు, కూతురు ఎమ్మెల్సీ కావడంతోనే లాలూ నితీష్ పుట్టి ముంచేస్తారు. నితీష్‌కు ఇప్పుడు బద్ధ శత్రువు నితీషే. రాజకీయవేత్తలందరిలాగే ఆయనకూ అధికారం కావాలి. కాకపోతే ఆయన కపటి. అధికారం అవసరం లేనట్టు నటిస్తారు. చాలా సూత్రబద్ధమైన వాడినని చెప్పుకుంటారు. ప్రపంచంలోకెల్లా అత్యంత అవినీతిపరుడంటూ తానే దుయ్యబట్టిన లాలూతో నిస్సంకోచంగా చెయ్యి కలుపుతారు. ఆయన అంత సూత్రబద్ధమైనవారే అయితే 2002 గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడే వాజ్‌పేయి మంత్రివర్గం నుంచి నితీష్ వైదొలగి ఉండేవారు. కానీ 2013 నుంచే ఆయన మోదీని వ్యతిరేకించడం ప్రారంభించారు. ప్రాథమికంగా నితీష్‌ది ప్రధాని కావాలనే కాంక్ష. 20 మంది ఎంపీలు ఉండి ఉంటే బీజేపీయేతర పార్టీలకు ఆయన ఆమోదయోగ్యుడైన ప్రధాని అయ్యేవారే. కానీ ఆయనకు ఉన్నది ఇద్దరు ఎంపీలే. అబద్ధాల బతుకు అనర్ధం మీ గురించి మీరు అబద్ధాలు చెప్పుకుంటూ ఉంటే, ఇక మీరు ఆ అబద్ధాలను నిజం చేస్తూనే బతకాల్సి ఉంటుంది. మోదీ బీజేపీ ప్రధాని అభ్యర్థి అయినప్పుడు నితీష్ బీజేపీతో తెగతెంపులు చేసుకోవాల్సిన అవసరం లేదు. సార్వత్రిక ఎన్నికల ఓటమికి రాజీనామా చేయాల్సిన అవసరమూ లేదు. కానీ ఆయన తాను అత్యంత సూత్రబద్ధమైన వాడిననే అబద్ధాన్ని నిజంగా ప్రదర్శించాలనుకున్నారు. రాముడు వనవాసానికి వెళ్లినప్పుడు భరతుడు అయోధ్య సింహాసనాన్ని కాపాడినట్టు మంఝి తన సింహాసనాన్ని పరిరక్షిస్తారని భావించారు. కానీ 15 ఏళ్లుగా ఆయనను అతి సన్నిహితంగా ఎరిగిన మంఝికి నితీష్ రాముడేమీ కాడని బాగా తెలుసు. కాబట్టే తిరుగుబాటు చేశారు. ఈ తొమ్మిది నెలల్లో ఆయన దళితుల్లోనే గాక, ఇతర వర్గాల్లో కూడా మంచి నేతగా గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? లేదా? లేక అధ్యక్ష పాలనే శరణ్యమా? అనే వాటి సంగతి ఎలా ఉన్నా... నితీష్ ముందున్నది ముళ్ల బాటే. అందుకు ఆయన తన అతి తెలివినే తిట్టుకోవాలి. విశ్లేషణ: పెంటపాటి పుల్లారావు, (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు మొబైల్ నం:9868233111) -
మసకబారుతున్న మోదీ ప్రభ
పార్లమెంటు సక్రమంగా పనిచేయడం భారత ప్రజాస్వామ్యానికి ముఖ్యం. ప్రధాని పార్లమెంటు అభిమానాన్ని, గౌరవాన్ని చూరగొనాలి. ఉభయ సభలలోనూ మెజారిటీ ఉన్నా జవహర్లాల్ నెహ్రూ ప్రతిపక్షం పట్ల అత్యంత గౌరవం చూపేవారు, పీవీకి లోక్‌సభలో మెజారిటీ లేకున్నా పార్లమెంటు నుండి తాను కావాలనుకున్నదల్లా సాధించుకోగలిగారు. పార్లమెంటుకు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం రాజీలకు సిద్ధపడి సభ సజావుగా సాగేందుకు హామీని కల్పించాలి. ప్రధాని మోదీ చేపట్టాల్సింది రాజీ వైఖరే తప్ప సంఘర్షణాత్మక వైఖరి కాదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం సజావుగా సాగుతోంది. హర్యానా మహారాష్ట్ర, జార్ఖండ్, కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ దిగ్భ్రాంతికరమైన విజయాలను సాధించింది. కాబట్టి గత సంవత్సరం విజయోత్సాహభరితంగా ముగిసి ఉండాల్సింది. కానీ పార్లమెంటు శీతాకాల సమావేశాలు విజయవంతం కాలేదు. బీజేపీకి లోక్‌సభ లో మెజారిటీ ఉందిగానీ రాజ్యసభలో లేదు. అలాంటి పరిస్థితుల్లో చట్టం చేయా లంటే ప్రభుత్వం ఉభయ సభలను కలిపి సమావేశపరచి ఆమోదముద్ర వేయిం చుకోవాలి. అయితే అది అరుదైన, తీవ్ర పరిష్కారం. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవ డానికి దోహదపడేపలు బిల్లులకు బీజేపీ రాజ్యసభ ఆమోదాన్ని పొందాలను కుంది. ప్రభుత్వ తక్షణావశ్యకతను గుర్తించిన ప్రతిపక్షం ఏదో ఒక సాకుతో అందుకు అడ్డంకులను సృష్టించడం ప్రారంభించింది. మరింత ప్రజా వ్యతిరేకత ను మూటగట్టుకోవాల్సి వస్తుందనే భయంతో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సమావేశాలకు విఘాతం కలిగించడానికి తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల వంటి చిన్న పార్టీలను వాడుకుంది. విశ్వ హిందూ పరిషత్ చేపట్టిన మతమార్పి డుల సమస్యలో మోదీ ప్రతిష్టను మసకబరచే అవకాశాన్ని పసిగట్టిన ప్రతి పక్షాలు ప్రధాని ఆ అంశంపై మాట్లాడాలని పట్టుబట్టాయి. బీజేపీ సహజంగానే రాజ్యసభలో మోదీ మాట్లాడకుండా చూసింది. కానీ ప్రభుత్వం ఆర్థిక సంస్క రణలు, బీమా, భూసేకరణలకు సంబంధించిన చట్టాలను తేవాల్సి ఉంది. కాబట్టి ఆర్డినెన్స్‌లకు జారీ చేసి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయించుకుంది. ఆర్డినెన్స్ కూడా చట్టమేగానీ, ఆరు నెలలలోగా అది పార్లమెంటు ఆమోదం పొందాలి. అత్యంత జరూరైతే తప్ప ఆర్డినె న్స్‌లను జారీ చేయకూడదు. ఇలా ఆర్డినెన్సులను జారీ చేయడం ద్వారా పార్లమెంటును నియంత్రించలేని తన బలహీనతను బీజేపీ బయటపెట్టుకుంది. ప్రతిపక్షాల పట్ల మన్నన చూపడమే రాజనీతి సాధారణంగా అసహనాన్ని చూపే ప్రజలు సైతం సామాన్యుల కోసం పనిచేసే ప్రభుత్వం ఏర్పడిందని మోదీపట్ల సంతృప్తితోనే ఉన్నారు. పెద్ద చదువుగానీ, అనుభవంగానీ లేని మోదీ విదే శీ వ్యవహారాలను చక్కబెట్టలేరని చాలా మంది తక్కువగా అంచనా వేశారు. అది తప్పని రుజువైంది. దేశాన్ని నడపడం అంటే కేవ లం అధికారులను నియంత్రించడం కాదు. కొత్త చట్టాలను చేయాల్సిందే. కానీ పార్లమెంటు, అది సక్రమంగా పనిచేయడం భారత ప్రజాస్వామ్యానికి ముఖ్యం. ప్రధాని పార్లమెంటు అభిమానాన్ని, గౌరవాన్ని చూరగొనాలి. ప్రతి పక్షం చిన్నదే అయినా, ప్రధాని పార్లమెంటును తోసిపుచ్చకూడదు. ఉభయ సభలలోనూ మెజారిటీ ఉన్నా జవహర్లాల్ నెహ్రూ ప్రతిపక్షం పట్ల అత్యంత గౌరవం చూపేవారు, వారి కోరికలను మన్నించడానికి ఎప్పుడూ ప్రయత్నించే వారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు (1991-96) లోక్‌సభలో మెజారిటీ లేదు. అయినాగానీ పార్లమెంటు నుండి తాను కావాలనుకున్నదల్లా ఆయన సాధించుకోగలిగారు. ఆయన హయాంలో దేశం ఆర్థిక సంక్షోభాన్ని, పంజాబు తిరుగుబాటును, కశ్మీర్ సమస్యను, అస్సాం హింసకాండను ఎదుర్కో వాల్సి వచ్చింది. అయినా ఆయన పార్లమెంటును తనతోపాటు నడిపించ గలిగారు. విడిగాఎంపీల పట్ల, పార్టీల పట్ల సానుకూల వైఖరి చూపేవారు. ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజపేయిని ఐరాస ప్రతినిధి బృందాలకు నేతగా నియమిం చారు. ప్రతిపక్ష ఎంపీల పట్ల మన్నన చూపాలని పీవీ తన మంత్రివర్గ సహచ రులకు చెప్పేవారు. అలా ఆయన పార్లమెంటు అభిమానాన్ని చూరగొన బట్టే 225 మంది ఎంపీలతో ఐదేళ్లూ పదవిలో ఉన్నారు. మోదీకి 280 మందికి పైగా ఎంపీలున్నారు. కానీ ఆయన పార్లమెంటులో ఉన్నది లేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన విజయవంతమై ఉండవచ్చు. కానీ పార్లమెంటు, ఢిల్లీలో అధికారం నెరపడం పూర్తిగా భిన్నమైనవి. ఎంపీలకు ప్రధాని తప్పక అప్పయింట్మెంట్లు ఇవ్వాలి. చట్టం పరిధిలో వారు అడిగేవాటిని నెరవేర్చా ల్సి ఉంటుంది. పీవీ ఉదాహణను మోదీ ఏ కొద్దిగా పాటించి ఉన్నా ఆయనకు పార్లమెంటులో సమస్యే ఉండేది కాదు. ప్రతిపక్ష నేతలు సమస్యలు సృష్టించాల నుకున్నా పార్లమెంటు సభ్యులు పాల్గొనేవారు కారు. సభ సజావుగా సాగాలంటే... 1. ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాన్ని గౌరవించాలని, వారు తమ విధానాలను ఆమోదించేలా చేసుకోవాలని మోదీ, బీజేపీలు అర్థం చేసుకోవాలి, నచ్చజెప్పే పద్ధతుల్లో వారితో రాజీ పడాలి. లేకపోతే సమస్యలు ఎదుర్కోక తప్పదు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతిపక్షం మద్దతును కూడగట్టడంలో, దానితో క్రియాశీల సంబంధాలను నెలకొల్పుకోవడంలో విఫలమయ్యారు. కాబట్టే ఇటీవలి కాలంలో కొత్త చట్టాలను చేయలేకపోయారు. ఇక్కడా అదే జరుగుతోంది. 2. బీజేపీ తానిప్పుడు ప్రతిపక్షంలో లేనని అర్థం చేసుకోవాలి. పార్లమెంటు చర్చల్లో గెలవడమే ప్రధానమని అది భావిస్తోంది. కానీ వాస్తవానికి ప్రతిపక్షాలన్నీ దానికి వ్యతిరేకంగా ఐక్యమవుతున్నాయి, ప్రతిపక్షంతో సుహృద్భావ పూర్వకంగా సంభాషించగల నేతే బీజేపీలో లేనట్టుం ది. 3. బీజేపీ మంత్రుల్లో చాలా మంది వృత్తి రాజకీయవేత్తలు కారు. పైగా వారిలో ఎక్కువ మంది ఎలాంటి ప్రజాపునాది లేనివారు, రాజ్యసభ సభ్యులు. ప్రతిపక్ష ఎంపీల పట్ల మన్నన చూపాలని, వారి ఓటర్ల కోరికలను కూడా మన్నిం చి ప్రభుత్వానికి వారి మద్దతును కూడగట్టాలని తెలియదు. 4. మాజీ మంత్రులను, ఓటమిపాలైన ఎంపీలను అధికారిక నివాసాల నుండి ఖాళీ చేయించడాన్ని ప్రభుత్వం పెద్ద సమస్యను చేసి, మొత్తంగా ఢిల్లీ రాజకీయ వర్గమంతటికీ ఆగ్రహం కలిగేలా చేసింది. అది చేయాల్సిన పనే అయినా సున్నితంగా చేయవలసినది. ప్రత్యర్థి రాజకీయవేత్తలను అవమా నిస్తున్నట్టుగా గాక, 62 ఏళ్లుగా నెలకొన్న సంప్రదాయాలను పాటిస్తున్నట్టుగా ఉండాల్సింది. 5. విజయవంతమైన ప్రతి ప్రభుత్వానికి ప్రతిపక్షంతో సంబం ధాలు నెరపే దొడ్డిదారులు ఉంటాయి. బీజేపీకి ప్రతిపక్షాన్ని ఒప్పించడంలో నైపుణ్యం, లౌక్యం పూర్తిగా కొరవడ్డాయి. భారీ మెజారిటీ ఉన్నా ఇందిరాగాంధీ ప్రతిపక్షం ఆమోదాన్ని పొందడంలో విఫలమై, అప్రతిష్టపాలయ్యారు. మెజారి టీ లేకున్నా పీవీ ఆమెలా ఎన్నడూ ప్రతిపక్షాల దాడులకు గురై ఎరుగరు. అదీ తేడా. 6. మోదీ రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటున్నారు. ప్రతిపక్ష ఎంపీలకు అందుబాటులో లేకుండా, సహాయాన్ని అందించని వైఖరిని అవలంబి స్తున్నారు. ఆయన ఆ వైఖరిని మార్చుకోవాలి. రాజ్యసభలో మెజారిటీ లభిస్తే చాలు, ఏమైనా చేయవచ్చని ఆయన అనుకుంటున్నారు. పార్లమెంటరీ వ్యవస్థ పనిచేసేది అలా కాదు. ఎంత గొప్ప మెజారిటీ ఉన్నా ప్రభుత్వం ప్రతిపక్షాన్ని కూడా తన వెంట తీసుకుపోవాలి. అదెంత కష్టమైనా చేయక తప్పదు. 7. బీజేపీ 2004 నుండి 2014 వరకు ప్రతిపక్షంలో ఉండి నిరంతరం పార్లమెంటుకు ఆటం కం కలిగించింది. ప్రతిపక్షాలకు ఉదాహరణగా మారింది. బడా కార్పొరేట్లు సైతం పార్లమెంటుతో సరిగా వ్యవహరిచలేకపోతోందని ప్రభుత్వాన్ని తప్పు పడుతుండటం ఆసక్తిదాయకం. పార్లమెంటుకు బాధ్యత వహించాల్సిన ప్రభు త్వం తీవ్ర రాజీలకు సిద్ధపడి మరీ సభ సజావుగా సాగేందుకు హామీని కల్పించా లి. పార్లమెంటు నడిచేలా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్షానిది కాదు. పలువురు మంత్రులు మోదీని పొగడ్తలతో ముంచెత్తుతూ తప్పుటడుగులు వేసేలా చేస్త్తు న్నారనే అభిప్రాయం కూడా ఉంది. నెహ్రూ, పీవీల బాటలో సాగాల్సిందే... ప్రధాని మోదీకి ఎంత జనాదరణ ఉన్నాగానీ ఆయన నెహ్రూ, పీవీల వంటి పూర్వ ప్రధానుల లాగే ప్రతిపక్షాల ఆమోదాన్ని సంపాదించుకోవాలి. మరో గుజరాతీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌కి 1977లో 377 మంది లోక్‌సభ ఎంపీలుండే వారు. కానీ పట్టువిడుపులు, రాజీలేని ఆయన ధోరణి వల్ల ప్రభుత్వం మూడేళ్ల లోగానే కుప్పకూలిందని మోదీ గుర్తుంచుకోవాలి. బీజేపీ తన గెలుపుతో ఇక రాజకీయాలన్నీ అంతమైపోయాయని భావిస్తోంది. ప్రజాస్వామ్యంలో అదెన్న టికీ జరిగేది కాదు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స ఎన్నికల వరకు తనకు ఎదురే లేదనుకున్నారు. కానీ పదిహేనేళ్లుగా ఆయనకు సన్నిహితులైన మంత్రులు సైతం ఆయనను వీడుతున్నారు. రాజకీయవేత్తలు ఎప్పుడూ దెబ్బ తీయడానికి సరైన సమయం కోసం వేచి చూస్తుంటారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమ ప్రత్యర్థులు పలువురిని తమ పక్షానికి తె చ్చుకోగలిగారు. కాబట్టే విజయాలు సాధించారు. బీజేపీ పార్లమెంటులో కూడా అదే వ్యూహాన్ని అనుసరించాలి. ఇప్పుడు దానికి పార్లమెంటు సజావుగా సాగేలా చేసే ఒక అమిత్ షా అవసరం. మోదీ పార్లమెంటులో తన వైఫల్యం ఎక్కడుందో, ఎందుకో సమీక్షించుకోవాల్సి ఉంది. పార్లమెంటు గౌరవాన్ని సంపాదించుకోలేకపోవడం వల్లే గొప్ప విజయా లు సాధిస్తున్నా గానీ ఆయన ప్రతిష్ట దెబ్బతింటోంది. ప్రధానిగా మోదీ తన పదవీ కాలం మొదట్లో చేపట్టాల్సింది రాజీ వైఖరే తప్ప, సంఘర్షణాత్మక వైఖరి కాదని గ్రహించాలి. సలహాదారులను పక్కకు నెట్టి, ఆయన రాజీలు చేసుకోవాలి. సమస్యాత్మకమైన అంతర్జాతీయ నేతలతో అంత బాగా వ్యవ హరించగలుగుతున్న ఆయన మన రాజకీయ నేతలతో అదే పని ఎందుకు చేయలేరు? - (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) -
తప్పులు మానకపోతే తప్పవు తిప్పలు
కొద్ది కాలానికి రాజకీయ నేతలందరూ అపకీర్తి పొందవచ్చు. గాంధీలతో విసుగెత్తిపోయిన ప్రజలకు కొంత కాలం తర్వాత మోదీపై కూడా విసుగు పుట్టవచ్చు. అలాంటి పరిస్థితి ఎవరికి అనుకూలం? రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రాలకు మాత్రం కాదు. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాలను గందరగోళంలోకి నెట్టేశాయి. బీజేపీ ఘన విజయం సాధిస్తే, కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. ఈ రెండు కీలక రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలంగా పాలిస్తోంది. బీజేపీ ఇప్పుడు రెండు చోట్లా అధికారం చేపట్టబోతోంది. కాంగ్రెస్ బతికి బట్ట కట్టగలగాలంటే సరికొత్త వ్యూహాలను కనిపె ట్టాల్సి ఉంటుంది. జపాన్ వాళ్లు తమ ఫ్యాక్టరీలలో ‘సున్నా తప్పులు’ విధానాన్ని అనుసరించి తప్పులు జరిగే అవకాశమే లేకుండా చూసుకుంటారు. కానీ తాను మారాల్సిన అవసరం లేదని తనకు ప్రత్యా మ్నాయమేమీ లేదనే భావనను కలిగించాలని కాం గ్రెస్ చూస్తోంది. మచ్చుకు కొన్ని ఉదాహరణలు. పార్లమెంటు ఎన్నికల అనంతరం తాను తప్పులు చేశా నని, సరిదిద్దుకుంటానని అంటూ ఒక్క ప్రకటనైనా చేయని కాంగ్రెస్ ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వాన్ని పదేపదే తిట్టిపో స్తోంది. కాంగ్రెస్, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ తమ పాలనపై ఏమాత్రం విచారం వెలిబుచ్చి ఎరుగరు. గత పదేళ్లూ దేశం అద్భుతంగా ఉందని అంటారు. ఇది ఆ పార్టీ అతి పెద్ద తప్పు. కాంగ్రెస్ 2014 ఎన్నికల ప్రచారమంతా నరేంద్రమోదీకి వ్యతిరేకంగానే సాగించింది. మోదీ పట్ల ప్రజల్లో అనుమా నాలను రేకె త్తిస్తే ఆయనకు వ్యతిరేకంగా ఓటు చేస్తారని అది భావించింది. కానీ బీజేపీ పార్లమెంటులో మెజారిటీ సాధిం చింది. వెంటనే కాంగ్రెస్ మోదీపై వ్యక్తిగత విమర్శలను కట్టిపెట్టాల్సింది. మోదీ విదేశీ పర్యటనలు విజయవంత మయ్యాయని, విదేశాల్లో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశా యని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. అయినా కాంగ్రెస్ ఆయనను ప్రశంసించలేదు. అమెరికాలోని ప్రవాస భారతీయులతో మోదీ సమావేశానికి మంచి స్పందన వచ్చింది. ఎన్ఆర్ ఐలు భారతదేశం పట్ల అంత గొప్ప సౌహార్ద్రతను చూపినందుకు కాంగ్రెస్ అభినందించి ఉండాల్సిం ది. కానీ కాంగ్రెస్, మోదీపై దాడి చేసి సమయాన్ని వృథా చేసుకుంది. ఇందిరాగాంధీ హయాంలో, ఏ నేతా అతి శక్తి మంతుడు కాకుండా కాంగ్రెస్ జాగ్రత్తపడేది. హర్యా నాలో సీఎం హూడా పార్టీపై సంపూర్ణ అజమాయిషీ చలాయించేందుకు సోనియాగాంధీ అనుమతించా రు. ఫలితం.. తాజా ఎన్నికల్లో హర్యానాలోని 90 స్థానాల్లో కాం గ్రెస్ కేవలం 15 సీట్లను గెల్చుకుంది. పైగా హర్యానాలో కాంగ్రె స్కు అతిపెద్ద సమస్య సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా. అతడి భూదందాకు హుడా ప్రభుత్వం అనుమతించిందని ప్రతి పక్షం దునుమాడుతుంటే వాద్రాకు కాంగ్రెస్ మద్దతివ్వడం హర్యానా ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలించింది. తన అల్లుడు ఇబ్బం దుల్లో ఇరుక్కుంటాడన్న భయంతో సోనియాగాంధీ, సీఎం హూడా కోరిందల్లా కట్టబెట్టడానికి అంగీకరించారు. వాద్రా వ్యవహారం గాంధీ కుటుంబం పరువును గంగలో కలిపింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ గత 15 ఏళ్లుగా శరద్‌పవార్ పార్టీ ఎన్సీపీతో పొత్తు సాగిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ చేజేతులా పొత్తును జారవిడుచుకుంది. తనకు మరిన్ని స్థానాలు కావాలని ఎన్సీపీ చేసిన డిమాండ్‌ను కాంగ్రెస్ తిరస్కరించి మూల్యం చెల్లించింది. బీజేపీ, శివసేన కూటమి విడిపోయినప్పుడు సీట్ల విషయంలో రాజీపడి ఉంటే కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి ఎన్ని కల్లో మంచి అవకాశం లభించేది. శరద్‌పవార్‌ను కోల్పోవడం కాంగ్రెస్ చేసిన అతి పెద్ద పొరపాటు. ఈ రెండు పార్టీల మధ్య చీలికే బీజేపీ అవకాశాలను అమాంతంగా పెంచివేసింది. గతం లో ఎన్నడూ 119 స్థానాలకు మించి పోటీ చేయని బీజేపీ అసెం బ్లీ ఎన్నికల్లో 124 స్థానాలను సొంతంగా గెల్చుకుంది. 2004లో రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్‌కి తెలిసిందల్లా అధికారమే. తన మాటే శాసనం. తను కోరుకున్నదల్లా జరిగిం ది. పదేళ్లు దేశ ప్రధానిగా ఉన్న మన్మోహన్సింగ్ యువ రాహు ల్కు దాదాపు కింది ఉద్యోగిలా వ్యవహరించారు. అంత అధికా రాన్ని ఇప్పుడు కోల్పోయాక, రాహుల్‌కి ఏం చేయాలో, ఎలా స్పందించాలో కూడా తెలియటం లేదు. అధికారం ఉన్నప్పుడు అణకువను కోల్పోవడం సహజమే కావచ్చుకానీ, దాన్ని కోల్పో యాక మాత్రం పరిస్థితులతో సర్దుబాటు కావలసి ఉంటుంది. బదులుగా మోదీ, బీజేపీలపై రాహుల్ అపరిణత విమర్శలకు లంకించుకున్నారు. అధికారానికి దూరంగా ఉండేందుకు ఆయ న అలవాటుపడాలి. ఇతర ప్రతిపక్ష నేతలతో కలిసి కూర్చోవ డం తను నేర్చుకోవాలి. శరద్‌పవార్ సైతం రాహుల్ ప్రవర్తనను తప్పుపట్టారు. వినాశకాలే విపరీత బుద్ధి అని మన పూర్వీకులు చెప్పారు. కష్టకాలం ఎదురైనప్పుడు జాగ్రత్తగా ఉండాలని దానర్థం. నీ శత్రువులు తప్పులు చేస్తున్నప్పుడు వారిని ఎన్న డూ అడ్డుకోవద్దు అన్నాడు నెపోలియన్ చక్రవర్తి. బీజేపీ, నరేం ద్రమోదీ తప్పులు చేయడానికి కాంగ్రెస్ అవకాశమివ్వాలి. వారికి కాస్త సమయాన్ని ఇవ్వాలి. ఏదో ఒక సందర్భంలో మీరు ప్రజలను మోసగించవచ్చు కానీ అన్ని వేళల్లో మోసగించలేరని అబ్రహాం లింకన్ 175 ఏళ్ల క్రితం చెప్పారు. కాని తెలివిగా జిత్తులకు దిగితే విజయం సాధించవచ్చని సోనియా గాంధీ విశ్వసిస్తుంటారు. దీనికి అతి పెద్ద ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ విభజన. అయినా ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 42 ఎంపీ సీట్లకు ఆ పార్టీ సాధించింది 2 స్థానాలు మాత్రమే (నాగర్‌కర్నూలు, నల్లగొండ). యూపీఏ పదేళ్ల కాలంలో నిరుద్యోగంపై, మధ్యతరగతిపై సోనియా గాంధీ ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఇది పెద్ద ఎత్తున జనం వ్యతిరేకమవడానికి దారితీసింది. అపకీర్తి పొందిన వారసత్వ పాలకులు ప్రజారంజక నేత లకు పగ్గాలప్పగించే ఇండోనేసియా తరహా నమూనాను రాజ కీయ పండితులు ఫ్రాంచైజింగ్ డైనాస్టీస్ అంటున్నారు. పాకి స్థాన్, బంగ్లాదేశ్, భారత్ వంటి దేశాల్లో ఇది ఇప్పటికే కొనసా గుతోంది. సోనియా, రాహుల్ కాంగ్రెస్ రాజకీయ అభ్యర్థులను ఇలా ఫ్రాంచైజ్ చేయడం ద్వారా మనుగడ సాధించవచ్చు. ప్రజాదరణ ఉన్న నేతను ఎన్నుకుని, తాము గెలిస్తే వారే ప్రధాన మంత్రి అవుతారని ప్రకటించవచ్చు. గాంధీ కుటుంబం తప్ప కుండా వెనక్కుతగ్గి ఇతర అభ్యర్థులను ఎంచుకోవలసి ఉంటుం ది. వారు రిమోట్ కంట్రోల్‌గా మాత్రమే ఉంటారు. గాంధీలు మారరని, వారు పాఠాలు నేర్చుకోరని, ఇతరులు తమకు పాఠా లు చెప్పడాన్ని అనుమతించరని హర్యానా, మహారాష్ట్ర ఎన్ని కలు మనకు బాగా చూపించాయి. ఆల్కహాల్ కంటే ముఖస్తుతి మరింత మత్తు గొలుపుతుంది. దీనికి ఇండోనేసియా తరహా రాజకీయ ప్రాంచైజీ నమూనా ఒక పరిష్కారం కావచ్చు. (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) పెంటపాటి పుల్లరావు -
‘పులి’స్వారీకి బీజేపీ ఇక సరి
మహారాష్ట్రులు శివసేనను మాత్రమే ఆదరిస్తారనీ, గుజరాత్‌కు చెందిన మోదీ, అమిత్‌షాల ఆధిపత్యాన్ని అంగీకరించబోరనీ శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ వ్యాఖ్యానించింది. ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలు చూస్తే మోదీ గాలి లేదని తేలిపోయిందని కూడా శివసేన నేతలు భాష్యాలు ఆరంభించారు. అక్టోబర్ 15న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో అనూహ్యమైన పరిణామాలు సంభవించాయి. ఆ రెండు రాష్ట్రాలలో తన మిత్ర పక్షాలకు బీజేపీ మొట్టికాయ వేసింది. హర్యానా జనహిత పార్టీ నాయకుడు కుల్దీప్ బిష్ణోయి గొంతెమ్మ కోర్కెలను నిష్కర్షగా తోసిపుచ్చింది. ఇంకో అడుగు ముందుకు వేసి మహారాష్ట్రలో పాతికేళ్లుగా శివసేనతో నెరపుతున్న మైత్రికి కూడా మంగళం పాడింది. మిత్రపక్షాలు ఆడమన్నట్టు ఆడే ందుకు బీజేపీ నిరాకరించింది. ఆ పార్టీల చేతులలో అవమానాలు పొందడానికీ, అవి చేస్తున్న బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగడానికీ బీజేపీ సిద్ధంగా లేదు. నిజానికి కొన్ని సందర్భాలలో బెదిరింపులు అనుకున్న ఫలితాలను ఇవ్వలేవు. మిత్రులకు మొట్టికాయ శివసేన ప్రస్తుత నేత ఉద్ధవ్ ఠాక్రే, హర్యానా జనహిత పార్టీ నాయ కుడు కుల్దీప్ ఇద్దరూ తండ్రుల నుంచి రాజకీయాలను వారసత్వంగా పుచ్చుకున్నవారే. ఉద్ధవ్ పార్టీ కోసం ఏ రోజూ ఏమీ చేయలేదు. తండ్రి బాల్ ఠాక్రే ఆయన కోసం సర్వం సిద్ధం చేసిపెట్టారు. ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే. 24 సంవత్సరాల ఈ యువకుడు తనను ప్రధాని నరేంద్ర మోదీ, లేదంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతోనూ సమ స్థాయిలో చూడాలని ఆశపడుతున్నాడు. కుల్దీప్ అల నాటి కాంగ్రెస్ నేత భజన్‌లాల్ తనయుడే. తాను మహా పురుషుల కోవలోనివాడినని కుల్దీప్ ప్రగాఢ విశ్వాసం. ఎవరూ అంగీకరించలేని డిమాండ్లను బీజేపీ ముందు పెట్టాడు. ఒకటి వాస్తవం- బీజేపీ ఢిల్లీ పీఠం మీద ఉన్నప్పటికీ మహారాష్ట్రలో అధికారం చేపట్టాలంటే శివసేన చేయూతనీ, హర్యానా ఎన్నికలలో విజయం సాధించాలంటే కుల్దీప్ మద్దతునూ తీసుకోకతప్పదు. ఆ రెండు రాష్ట్రాలలోనూ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారం చేపట్టకుండా చేయడం బీజేపీకి అనివార్యం. ఈ కృషిలో విఫలమైతే అది ఆ పార్టీకి ఎదురుదెబ్బే. నిజానికి బాగా ధనికులైన వ్యాపార వేత్తలతో పాటు, కోట్లకు పడగలెత్తిన రాజకీయ నాయకులు కూడా ఆ రెండు రాష్ట్రాలలోనే ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ కనుక మళ్లీ అధికారంలోకి రాగలిగితే అది పార్టీకి గొప్ప సాంత్వన కలిగించే పరిణామమే. సేనతో పాతికేళ్ల పొత్తుకు స్వస్తి ఈ నేపథ్యంలో శివసేనతో బీజేపీ తన చిరకాల మైత్రికి స్వస్తి పలకడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. నిజానికి శివసేన లేకుండా ఎన్నికలకు వెళ్లడం ఎంత కష్టమో బీజేపీకి తెలియనిది కాదు. దీనివల్ల చేదు ఫలితాలు తప్పవని కూడా తెలుసు. అయినా మైత్రికి స్వస్తి పలకక తప్పని పరిస్థితులు ఏర్పడినాయి. ఆ రెండు పార్టీలది విజయవంతమైన పొత్తు. ఆ కూటమి 1994లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఎన్డీయే ప్రభుత్వానికి ఈ కలయిక వల్ల ఎంతో లబ్ధి చేకూరింది. ఆఖరికి 2014 సాధారణ ఎన్నికలలో అక్కడి 48 లోక్‌సభ స్థానాలకు గాను 42 ఈ కూటమే హస్తగతం చేసుకుంది. ఈ విజయం మోదీ వల్లనే సాధ్యమైందని బీజేపీ సహజంగానే భావిస్తోంది. అందుకే, ఇంతకాలం అక్కడి రాజకీయాలలో శివసేన తరువాతి స్థానానికే పరిమితమైన బీజేపీ ఇప్పుడు పదో న్నతిని కోరుకుంటోంది. దీనితో పాటు ఉద్ధవ్ నాయకత్వంలో శివసేన బలహీన పడింది. వెరసి ఈసారి అసెంబ్లీ పోరులో తమకు ఎక్కువ స్థానాలు కేటాయిం చాలనీ, ఆఖరికి ముఖ్యమంత్రి పదవి కూడా తమ పార్టీ అభ్యర్థికి దక్కాలనీ బీజేపీ భావించింది. అదే సమయంలో ఉద్ధవ్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శివసేన ప్రకటనలు గుప్పించింది. దీనితో ఆ రెండు పార్టీల మధ్య పెరిగిన అగాధం ఎంతటిదో వెల్లడైంది. శివసేనతో సరైన పద్ధతిలో వ్యవహరించగల నేర్పు ఉన్న గోపీనాథ్ ముండే వంటి నాయకుడి హఠాన్మరణం కూడా బీజేపీకి పెద్ద లోటు. కానీ సీనియర్లు లేని లోపం శివసేనకు ఉంది. గడచిన ఎనిమిదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కారణంగా శివసైనికులలో ఏర్పడిన నైరాశ్యాన్ని పారద్రోలాలన్నా ఆ పార్టీకి ఇప్పుడు అధికారం అవసరం. పైగా శివసేన నాయకత్వం కోసం పోటీ పడి గత కొద్దికాలం నుంచి ఉద్ధవ్‌కి పోటీగా మారిన సోదరుడి వరస నాయకుడు రాజ్ ఠాక్రే కూడా పార్టీని బలహీనపరిచాడు. నిజానికి బాల్ ఠాక్రే మరణంతోనే శివసేన ప్రాభవం పోయిందని చాలామంది అభిప్రాయం. అలాగే ఉద్ధవ్ కాంగ్రెస్‌ను గానీ, శరద్‌పవార్ ఎన్సీపీని గానీ నిలువరించగల దీటైన నేత కాదు. కానీ 2014లో బీజేపీ విజయం శివసేనలో ఆశలు రేపింది. మోదీతో మారిన దృశ్యం పదిహేను మంది ఎంపీలు మాత్రమే ఉన్నప్పటికీ వాజపేయి హయాంలో శివసేన పలు మంత్రి పదవులతో పాటు, లోక్‌సభ స్పీకర్ పదవిని కూడా దక్కించుకోగలి గింది. ఇప్పుడు 22 మంది ఎంపీలు ఉన్నప్పటికీ మోదీ మంత్రివర్గంలో శివసేనకు చిన్న మంత్రిత్వ శాఖ మాత్రమే లభించింది. మోదీ మిగిలిన బీజేపీ నాయకుల మాదిరిగా కాదని శివసేనకు అనుభవానికి వచ్చింది. దీనితో పాటు మహారాష్ట్రలో తమ పార్టీ ప్రాధాన్యాన్ని ఇకపై తగ్గిస్తారన్న అనుమానం కూడా వారిలో మొదలైంది. అందుకే మరోసారి తమ పార్టీ అభ్యర్థి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడాలని శివసేన భావిస్తోంది. దూషణ పర్వంలో మిత్రపక్షం పొత్తు చెడిన తరువాత శివసేన మీడియా యుద్ధం ఆరంభించింది. మోదీ ప్రభా వం పార్లమెంటు ఎన్నికలకే పరిమితమనీ, మహారాష్ట్ర ఎన్నికలలో ఆ ప్రభావం ఉండదనీ ఆ పార్టీ నాయకులు ప్రచారం ప్రారంభించారు. మహారాష్ట్ర బీజేపీ నేత లకు ఒక స్థాయి అంటూ ఏమీలేదని కూడా శివసేన విమర్శలు మొదలుపెట్టింది. మహారాష్ట్రులు శివసేనను మాత్రమే ఆదరిస్తారనీ, గుజరాత్‌కు చెందిన మోదీ, అమిత్‌షాల ఆధిపత్యాన్ని అంగీకరించబోరనీ శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ వ్యాఖ్యానించింది. ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలు చూస్తే మోదీ గాలి లేదని తేలి పోయిందని కూడా శివసేన నేతలు భాష్యాలు ఆరంభించారు. బీజేపీ ద్రవ్యో ల్బణాన్ని అరికట్టలేకపోయిందని కూడా ఎద్దేవా చేశారు. గడచిన నెలలో శివసేన నాయకులు బీజేపీ మీద చేసిన విమర్శలు విరోధులు కూడా చేయలేదంటే అతి శయోక్తి కాదు. మొత్తంగా ఒక అపరిపక్వ ధోరణిని శివసేన ప్రదర్శించింది. అనుభవశూన్యులతో తంటా ప్రధాని అభ్యర్థిగా మోదీని బీజేపీ ప్రకటించినప్పటికీ శివసేన ఆయనకు మద్దతు ప్రకటించలేదు. అప్పుడు ఎల్కే అద్వానీ, సుష్మాస్వరాజ్‌ల వైపు శివసేన మొగ్గు చూపడమే కాకుండా, మోదీ మీద పలు విమర్శలు కూడా సంధించింది. కానీ శివ సేన అంచనాలు తారుమారైనాయి. ఇప్పుడు ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే పెద్ద సమస్యగా పరిణమించాడు. ఇతడొక మేధావి అని ఉద్ధవ్ నిశ్చితాభిప్రా యం. కానీ ఇతడికి రాజకీయ అనుభవం లేకపోవడం అటుంచి, చాలా దూకుడు స్వభావం కలిగినవాడని పేరుంది. బీజేపీతో కఠినంగా వ్యవహరించవలసినదని తండ్రికి సలహా ఇచ్చినది ఇతడే. శివసేన అధికారం చేపట్టి తీరాలనీ, బీజేపీకి ముఖ్యమంత్రి పీఠం దక్కితే ఇక శివసేనకు భవిష్యత్తు లేదనీ, బీజేపీ బతకనివ్వ దనీ ఆదిత్య తండ్రికి నూరిపోశాడని చెబుతారు. శివసేన మినహా బీజేపీకి గత్యం తరం లేదని కూడా ఆదిత్య నమ్మకం. పొత్తు సమస్య పరిష్కారానికి బీజేపీ జాతీ య కార్యదర్శి ఓమ్ మాథుర్ ముంబై వస్తే ఆయన చర్చలకు వచ్చినది ఒక ఎమ్మె ల్యేనో, ఎంపీనో కాదు, ఆదిత్య వచ్చాడు. చివరికి దూకుడు స్వభావం కలిగిన ఉద్ధవ్‌ను ముఖ్యమంత్రిని చేయడం కంటె, మహారాష్ట్రను కోల్పోవడమే మంచి దన్న అభిప్రాయానికి బీజేపీ వచ్చింది. అందుకే బీజేపీకి మరో మార్గం లేకపో యింది. అపరిపక్వ, అనుభవ రాహిత్యంతో కూడిన సలహాలు విన్నందుకు శివ సేన సర్వం కోల్పోయే అవకాశమే ఎక్కువ. ఏమైనా బీజేపీ ఇప్పుడు పులి (శివ సేన గుర్తు) స్వారీ దిగుతోంది. స్వారీ చేయడం కాదు, దిగడమే అసలు సవాలు. (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) - పెంటపాటి పుల్లారావు -
మూడు రాజధానులైతే మేలు
కొత్త రాష్ట్రంలో కనీసం మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు వీలుంది. గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు నగరాలకు ఈ హోదా కల్పిస్తే మూడు ప్రాంతాల ప్రజలు సంతృప్తి చెందుతారు. ఈ నగరాలను విస్మరిస్తే భవిష్యత్తులో సమస్యలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్‌కు సింగపూర్ స్థాయి రాజ ధానిని నిర్మిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు చాలా కాలంగా చెబుతున్నారు. కొత్త రాజధాని ఎలా ఉండబోతున్నదో తెలియదు కానీ, దానిని ఎంపిక చేసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం ఉరుకులూ పరు గులూ పెట్టడం చాలా మందిలో గుబులు పుట్టిస్తున్నది. గుంటూరు దగ్గర రాజధాని నిర్మాణం కాబోతున్నదని వార్తలు వస్తు న్నాయి. చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసిన మరుక్షణం నుంచి గుంటూరు పేరు తెరపై వచ్చింది. చంద్రబాబు, ఆయన వ్యాపార సలహాదారులు సాగి స్తున్న గుంటూరు మార్కెటింగ్‌లో రాజధాని కంటే ‘రియల్ ఎస్టేట్’ మర్మమే ఎక్కువగా కనపడుతున్నదన్న విమర్శ ఉంది. కాంగ్రెస్ నాయకులంతా గుంటూరు దరిదాపుల్లో భారీగా భూములు కొనుగోలు చేస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ కూడా ఆరోపించారు. రాజధాని ఎంపిక కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ భూముల ధరలు విపరీ తంగా పెరిగిన విషయం అంగీకరించారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఆంధ్ర ప్రదేశ్‌కు ‘సూపర్ క్యాపిటల్’ వద్దని సలహా ఇస్తున్నారు. పదిహేనేళ్ల కిందట ఏర్పడిన ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్త రాంచల్ రాష్ట్రాలకు రాజధానుల ఏర్పాటులో వాటి సర్కార్లు ఒక్కొక్క మార్గం ఎంచుకున్నాయి. రాష్ట్రంలో పెద్ద నగరమైన రాయ్‌పూర్‌ను ఛత్తీస్‌గఢ్ రాజధానిగా ఎంచుకుంది. జార్ఖండ్ లో పెద్ద నగరమైన రాంచీ ఆ రాష్ట్ర రాజధాని అయింది. ఉత్త రాంచల్లో రాజధాని సెగ రగులుతూనే ఉంది. కుమావ్ ప్రాంత ప్రజలను తృప్తి పరిచేందుకు కొత్త ప్రభుత్వం హైకో ర్టును అక్కడి నైనిటాల్లో ఏర్పాటు చేసింది. గాయిర్సెయిన్లో అసెంబ్లీని నెలకొల్పారు. డెహ్రాడూన్ తాత్కలిక రాజ ధాని. ఆంధ్రప్రదేశ్ కంటే ఉత్తరాంచల్ చాలా చిన్నది. ఆ చిన్న రాష్ట్రమే మూడు రాజధానులను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అలాంటి ప్రయోగం ఎందుకు చేయకూడదు? కాశ్మీర్‌కు శీతాకాలంలో జమ్మూ, వేసవిలో శ్రీనగర్ రాజ ధానిగా ఉంటాయి. ఉత్తరప్రదేశ్‌లో రాజధాని లక్నోలో ఉంటే, హైకోర్టు అలహాబాద్‌లో ఉంది. పక్కనున్న మహా రాష్ట్రలో ముంబై రాజధాని అయితే, ప్రతి సంవత్సరం నాగపూర్‌లో కూడా అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉంటాయి. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక ఉరుకుల పరు గుల మీద చేయాల్సిన అవసరం లేదు. కొత్త రాజధానికి తర లిపోయేందుకు పదేళ్ల గడువుంది. ఈ కాల పరిమితిని పొడి గించే వీలు కూడా ఉంది. రాజధాని ఎంపిక ప్రాంతీయ ఉద్రి క్తతలకు దారి తీయకుండా, రాజకీయ సమస్య కాకుండా టీడీపీ ప్రభుత్వం మొదట 13 జిల్లాల సమగ్రాభివృద్ధికి చర్య లు మొదలు పెట్టాలి. అప్పుడు రాజధాని సూపర్ క్యాపిటల్ అయ్యే అవకాశమే ఉండదు. గతంలో వలెనే కర్నూలును రాజధానిని చేయాలని కోరుతున్న వారూ ఉన్నారు. కొత్త రాష్ట్రంలో కనీసం మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు వీలుంది. గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు నగరాలకు ఈ హోదా కల్పిస్తే మూ డు ప్రాంతాల ప్రజలు సంతృప్తి చెందుతారు. ఈ నగరాలను విస్మరిస్తే, ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో సమస్యలు వస్తాయి. విశాఖపట్నంలో 20వేల ఎకరాల దాకా ఉక్కు కర్మా గారం భూములున్నాయి. ఈ భూములను రాజధాని కోసం వెనక్కు తీసుకోవచ్చు. కర్నూలు సమీపంలో కూడా సమృ ద్ధిగా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని చెబు తున్నారు. గుంటూరు భౌగోళికంగా శ్రీకాకుళం, అనంత పురం మధ్య ఉంటుంది. రాజధాని విషయంలో ఒక్క గుంటూరుకే ప్రాధాన్యం ఇస్తే చంద్రబాబు ఉద్దేశాలను రాయలసీమ ప్రజలు శంకించే ప్రమాదం ఉంది. పరిపూర్ణ రాజధానికి గుంటూరు అర్హమైనది కాదు. అం దువల్ల గుంటూరు రాజధానిని చేసే అంశం మీద రాష్ట్రమం తా చర్చ జరగాలి. అన్నిప్రాంతాల ప్రజల ప్రతిపాదనల మీద చర్చ జరిగాక అప్పుడు సూపర్ క్యాపిటల్ కాకుండా బహుళ రాజధాని విధానాన్ని పాటించి అన్నిప్రాంతాల అభివృద్ధికి సహకారం అందించవచ్చు. ఒక రాష్ట్రానికి రెండు మూడు రాజధానుల ఉండరాదనే నియమమేమీ లేదు. చంద్రబాబు వ్యాపార సలహాదారులను పక్కన బెట్టి ప్రజలతో సంబంధాలున్న వారి సలహాలను తీసుకోవాలి. (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు)