చైనాను దీటుగా ఎదుర్కొనాల్సిందే | india should react strongly on dokalam issue, writes pentapati pullarao | Sakshi
Sakshi News home page

చైనాను దీటుగా ఎదుర్కొనాల్సిందే

Published Wed, Jul 12 2017 4:47 AM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM

చైనాను దీటుగా ఎదుర్కొనాల్సిందే

చైనాను దీటుగా ఎదుర్కొనాల్సిందే

విశ్లేషణ
భూటాన్‌లోని దోక్‌ లామ్‌ సమస్యపై చైనాతో యుద్ధానికి భారత్‌ సిద్ధం కావాలి. చిన్న పొరుగు దేశాలకు భారత్‌ రక్షణ కల్పించలేదని చూపడమే చైనా లక్ష్యం.

భూటాన్, భారత్‌ రక్షణను వదులుకుని తమ దేశంలో దౌత్య కార్యాలయాన్ని తెరవాలని చైనా కోరుకుంటోంది. పెద్ద శత్రువు చేతిలో ఓటమికి గురికావడం అవమానకరమేమీ కాదు. అసలు పోరాటానికి ఇచ్ఛగించకపోవడమే అవమానకరం. చిన్న పొరుగు దేశాలను వంచించేది లేదని భారత్‌ స్పష్టం చేయాల్సి ఉంది.

అంతా అనుకునేదానికి భిన్నంగా చైనా నేరుగా మనకు ఎన్నడూ పొరుగు దేశంగా లేదు. 1950 అక్టోబర్‌ 7న చైనా సైన్యం టిబెట్‌ను స్వాధీనం చేసుకుంది. ఇక అప్పట్నుంచీ చైనా మనకు పొరుగు దేశమైంది. అప్పటి నుంచి భారత్‌కు అత్యంత చెడు కాలం ప్రారంభమైంది. చైనా పొరుగు దేశం కావడం కంటే పాకిస్తాన్‌ ఏర్పాటే మనకు తక్కువ హానికరమైనది. గత 60 ఏళ్లుగా చైనాతో మన దేశం సమస్యలను ఎదుర్కొంటూనే ఉంది. మనం మిత్రులను ఎంచుకోగలమే గానీ ఇరుగు పొరుగులను ఎంచుకోలేం.

1947 వరకు బ్రిటిష్‌ వారు మన దేశంలో ఉన్నంత వరకు చైనా, టిబెట్‌కు వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. టిబెట్‌ తనదేనని అననూ లేదు. కానీ, బ్రిటిష్‌వారు వెళ్లిపోవడంతోనే, టిబెట్‌ను ఆక్రమించినా భారత్‌ అభ్యంతరం చెప్పదని అది గ్రహించింది. టిబెట్, భారతదేశమంత పెద్దది, ప్రపంచంలోని అతి పెద్ద నదులకు పుట్టినిల్లు. భారత్‌తో దానికి 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దు ఉండేది. హఠాత్తుగా అది భారత–చైనా సరిహద్దుగా మారిపోయింది. ఇలా భారత్‌ మంచి పొరుగును కోల్పోయింది. దాని స్థానంలో సుదీర్ఘ సరిహద్దుగల దురాక్రమణదారు మనకు పొరుగు దేశంగా మారింది.

చైనా ఆలోచనా విధానమే వేరు
భూటాన్‌ సరిహద్దుల్లో ఇటీవల భారత–చైనా ఉద్రిక్తతలు రాజుకున్నప్పటినుంచి మీడియా వ్యాఖ్యాతలు ఇరు దేశాల సైనిక బలాలను పోల్చి చూపుతున్నారు. మనకు ఇన్ని విమానాలు, ఇంత మంది సైనికులు ఉన్నారని లెక్కలు చెబుతున్నారు. మనం ఇక్కడ పోరాడగలం, అక్కడ పోరాడగలం అంటున్నారు. ఇదేమీ 1962 కాదని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ వాస్తవానికి సైనికపరమైన బలం కేవలం ఒక అంశం మాత్రమే. సౌదీ అరేబియా వద్ద అత్యంత అధునాతనమైన సైనిక సాధన సంపత్తి ఉంది. అయినా, చిన్న దేశం యెమె న్‌ను అది ఓడించలేదు.

2017 నాటి భారత్, 1962 నాటిది కాదని రక్షణ మంత్రి అరుణ్‌ జైట్లీ చేసిన వ్యాఖ్య సరైనది కాదు. భారత్‌ ఆలోచనా విధానం నేడు మారిపోయిందని జైట్లీ అనగలరా? చైనా వద్ద ఆధునిక ఆయుధాలు ఉండటమే కాదు, అది 2,000 ఏళ్ల క్రితం నాటి తమ ఆలోచనా విధానాన్ని కొనసాగిస్తూ వస్తోంది. మనస్తత్వం రీత్యా భారతీయులు, చైనీయులకంటే చాలా భిన్నమైనవారు. వేల ఏళ్లుగా మనకు విభిన్నమైన అనుభవాలు కలి గాయి. కాగా చైనీయుల బలం వారి సైనిక శక్తిలో కంటే వారి మానసిక శక్తిసామర్థ్యాలలోను, మానసిక శిక్షణలోనూ ఉంది. అత్యంత శక్తివంతమైన సైన్యాలు సైతం చాలా సందర్భాల్లో విజయం సాధించలేవని చరిత్ర ఎన్నోసార్లు బోధించింది.

చైనీయుల బలాలు, ఆలోచనా విధానాల స్పష్టమైన లక్షణాలివి:
1. ప్రపంచానికి కేంద్రం చైనా : చైనీయులు తమ దేశం ప్రపంచానికి కేంద్రమని (మిడిల్‌ కింగ్‌డమ్‌) విశ్వసిస్తారు. వారి చక్రవర్తులు వేల ఏళ్లుగా ‘‘నిషిద్ధ నగరి’’ని వీడి బయటకు రాలేదు. బీజింగ్‌లోని రాజప్రాసాద ప్రాంతాన్ని ‘ఫర్‌బిడెన్‌ సిటీ’ అంటారు. చైనా చక్రవర్తుల జీవితం ఎంత నిగూఢంగా సాగేదంటే వారి మరణ వార్తను సైతం... వారసుడు సింహాసనంపై ఓ రెండేళ్లయినా సురక్షితంగా గడిపేంత వరకు బయటకు పొక్కనిచ్చేవారు కారు. చైనా రాచరికం అధికారానికి సంబంధించిన అనిశ్చితిని ప్రజలకు తెలియనిచ్చేది కాదు. భారతదేశంలో దీనికి విరుద్ధమైనదే శతాబ్దాల తరబడి సాగుతూ వస్తోంది. మొగల్‌ చక్రవర్తులు, రాజాలు తామింకా సజీవంగానే ఉన్నామని ప్రజలకు తెలియడం కోసం రోజూ దర్బారులు నిర్వహించేవారు!

2. శతాబ్దాల గురించి ఆలోచిస్తుంది: చైనీయులకు ఎప్పుడూ సుదీర్ఘ కాలపు వ్యూహాలు ఉండేవి. ఇష్టానుసారం దండెత్తి వచ్చే మంగోలులను అదుపు చేయగలిగిన శక్తి చైనా చక్రవర్తులకు ఉండేది కాదు. దీంతో వారు సముద్ర తీరం నుంచి రాజధాని పెకింగ్‌కు, అక్కడి నుంచి అత్యున్నత పర్వత శ్రేణుల వరకు మహా కుడ్యాన్ని (గ్రేట్‌ వాల్‌) నిర్మించారు. అందుకు వందల ఏళ్లు పట్టింది. ప్రతి చక్రవర్తీ ఆ పనిని కొనసాగించేవాడు. చక్రవర్తులు మారినంత మాత్రాన చైనా విధానాలు మారేవి కావు. భారత్‌లో మనం గత 65 ఏళ్లుగా సరిహద్దుల వెంబడి ముళ్ల కంచెను నిర్మించలేకపోతున్నాం.

3. వందల ఏళ్ల జగడాలకైనా అది సిద్ధమే: వివాదం అంటే అదేదో తక్షణమే పరిష్కారం కావాల్సినదని చైనీయులు భావించరు. వందల ఏళ్లయినా అది సాగగలుగుతుంది. శత్రువును పదే పదే రెచ్చగొడుతూ అది ఆ వివాదాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. నేటికి 65 ఏళ్లుగా భారత–చైనా వివాదం అలాగే కొనసాగుతోంది. తాత్కాలికమైన శాంతి సాధ్యంకావచ్చునేమో గానీ ఆ వివాదం మాత్రం తరాలు గడుస్తున్నా పరిష్కారం కాదు. చైనీయుల నుంచి నేర్చుకుని మనం కూడా పరిష్కారాల కోసం వందల ఏళ్లు వేచి చూడాలి.

4. అంతర్జాతీయ అభిప్రాయాన్ని బేఖాతరు చేస్తుంది: చైనాకు నేడు వియత్నాం, ఫిలిప్పీన్స్, తదితర దేశాలతో ఉన్న దక్షిణ చైనా వివాదం మంచి ఉదాహరణ. అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పినా, ఐరాస చెప్పినా చైనా విని పించుకోదు. ఆ సముద్రం అంతా తమదేనంటూ, అది ధిక్కారంతో ఆ సముద్రంలోని కొన్ని దీవులలో వందల కోట్ల డాలర్లను కుమ్మరిస్తోంది.

5. చైనా విద్యా విధానం: చైనా విద్యా విధానం వారి ప్రాచీన జ్ఞాన సంపదను, గ్రంథాలను, తత్వవేత్తల బోధనలను విద్యార్థులకు బోధిస్తుంది. అవన్నీ చైనీయుల ఆలోచనా విధానాన్ని మలచడానికి తోడ్పడతాయి. భారత్‌లో మనకు కోట్లాది మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ఐఐటీలలో ప్రవేశాల కోసం కోచింగ్‌ను ఇచ్చే ప్రైవేట్‌ సంస్థలే ఉన్నాయి.

6. చక్రవర్తుల కాలం నాటి పాలనా వ్యవస్థే: నేడు కమ్యూనిస్టు ప్రభుత్వం పాలిస్తున్నా చక్రవర్తుల పాలనా వ్యవస్థే చైనాలో కొనసాగుతోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా చైనా చక్రవర్తిలాగే సకల శక్తివంతుడు. చక్రవర్తుల శైలిలోనే, అంతే రహస్యంగా జీవిస్తాడు. తన మాటకు తిరుగేలేని ప్రధాన కార్యదర్శి గురించి పదేళ్ల పదవీ కాలం ముగిశాక ఒక్క మాట కూడా తిరిగి వినిపించదు. మన మాజీ మంత్రులు తిరిగి పదవిలోకి రావడానికి పథకాలు పన్నుతూనే ఉంటారు.

7. భూభాగం కోసం ఇరుగు పొరుగులందరితోనూ జగడమే: చైనాకు 14 దేశాలతో (పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ సహా) భూసరిహద్దులు ఉన్నాయి. ఇక జపాన్, ఫిలిప్పీన్స్, మలేసియాలతో సముద్ర వివాదాలున్నాయి. రష్యా, దక్షిణ కొరియా, జపాన్, భారత్‌ , వియత్నాంలతో అది సైనిక ఘటనలకు సైతం దిగింది. శత్రువులకు తమ తడాఖా చూపడానికి చైనా ఎప్పుడూ సైనిక బలాన్ని ప్రదర్శిస్తుంటుంది.

చరిత్ర పొడవునా చైనాకు ఇరుగుపొరుగులతో సమస్యలు ఉంటూనే ఉన్నాయి. పొరుగువారు బలహీనంగాఉంటే అది వారిని జయించేస్తుంది. మంగోలులలాగా శత్రువులు బలవంతులైతే అది రక్షణ కోసం మహా కుడ్యాన్ని నిర్మించుకుంటుంది. గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా, తమ సరిహద్దుల సంరక్షణ కోసం ఏమైనా చేయడానికి సిద్ధమనే చైనా వైఖరిని సూచిస్తుంది. సైనిక స్థావరాలలోకి చొరబాటుదార్లు ప్రవేశిస్తున్నా భారత్‌ నిలవరించలేకపోతోంది.

భారత్‌ ఏం చేయాలి?
1. భూటాన్‌లోని దోక్‌ లామ్‌ భూభాగం సమస్యపై చైనాతో యుద్ధానికి భారత్‌ సంసిద్ధం కావాలి. పొరుగున ఉన్న చిన్న దేశాలకు భారత్‌ రక్షణ కల్పించలేదని చూపడమే చైనా లక్ష్యం. భారత్‌తో భూటాన్‌కు ప్రత్యేక ఒప్పందం ఉంది. చైనాలో భూటాన్‌కు దౌత్య కార్యాలయం లేదు. భూటాన్, భారత్‌ రక్షణను వదులుకుని తమ దేశంలో దౌత్య కార్యాలయాన్ని తెరవాలని చైనా కోరుకుంటోంది. ఓటమిని ఎదుర్కొనాల్సి వచ్చినా యుద్ధం చేయడానికి సిద్ధమేనని చాటగలిగితే ప్రపంచం భారత్‌ను గౌరవిస్తుంది. పెద్ద శత్రువు చేతిలో ఓటమికి గురికావడం అవమానకరమేమీ కాదు. పోరాటానికే ఇచ్ఛగించకపోవడమే అవమానకరం. చిన్న పొరుగు దేశాలను వంచించేది లేదని భారత్‌ సుస్పష్టం చేయాల్సి ఉంది.

2. చైనాతో ఈ వివాదం వందల ఏళ్లపాటూ సాగుతూనే ఉంటుందనే అంశంపై భారత్‌ ప్రజలను సంసిద్ధం చేయాలి. భారత్, చైనాతో వందల ఏళ్ల శతృత్వాన్ని ఎదుర్కొనడానికి సిద్ధం కావాలి. లొంగి వచ్చేటంతగా భారత్‌ అలసిపోయేలా చేయాలని చైనా ప్రయత్నిస్తుంది. అయితే, భారత్‌ అలా అలసిపోయేదేమీ కాదని దానికి తప్పక తెలిసి రావాలి. సుదీర్ఘ కాలానికి మన ప్రభుత్వం దేశాన్ని సంసిద్ధం చేయాలి. చైనాకు ఆ సందేశం తప్పక చేరుతుంది.

3. భూటాన్‌ను, ఇతర చిన్న పొరుగు దేశాలను చైనా బెదిరించడానికి ప్రయత్నిస్తోందని, భారత్‌ గౌరవప్రదంగా పోరాడుతుందని వివరిస్తూ మన దేశం ప్రపంచవ్యాప్తంగా దౌత్య కృషిని కూడా చేపట్టాలి. మనం శాంతి కోసమే ప్రయత్నించాలి కానీ, యుద్ధానికైనా సిద్ధమేననే సుస్పష్టమైన సందేశాన్ని పంపాలి. యూరప్, అమెరికాలలో అత్యంత విశిష్ట దేశంగా భూటాన్‌కు మంచి పేరుంది. భూటాన్‌ విషయంలో చైనా, భారత్‌తో యుద్ధానికి దిగితే... శాంతియుత దేశంగా అది తగిలించుకున్న ముసుగు తొలగిపోతుంది.

4. మన గొప్ప ప్రాచీన పండితులు, గణిత శాస్త్రవేత్తలు, నిర్మాణకర్తలు, తత్వవేత్తలు, పాలకుల గురించి బోధించేలా మన విద్యావ్యవస్థను మార్చాలి. అలా అని కుహనా విజ్ఞానాన్ని, బూటకపు ప్రాచీన గాథలను చెప్పాలని కాదు.

5. జపాన్, ఫిలిప్పీన్స్, మలేసియా, వియత్నాంలు చైనాకు కొత్త శత్రువులు. చైనాతో జరగడానికి అవకాశం ఉన్న యుద్ధం నుంచి భారత్‌ వెనక్కు తగ్గుతుందా, లేదా అని అవి గమనిస్తున్నాయి. భూటాన్‌ కోసం భారత్‌ పోరాటానికి దిగితే ఆ దేశాలకు కూడా ధైర్యం వస్తుంది.

6. చైనా నేడు ఆర్థిక మాంద్యంలో ఉన్న దృష్ట్యా యుద్ధాలు దాని దృష్టిని మరలుస్తాయి. చైనా తనది ‘‘శాంతియుతంగా బలపడే’’ విధానమని చెప్పుకుంటోంది. భూటాన్‌పై అది భారత్‌తో పోరాటానికి తలపడితే ప్రమాదకర దురాక్రమణదారుగా అది తన స్వభావాన్ని బయటపెట్టుకుంది.

భారత్, చైనాల మధ్య హిమాలయాలున్నాయి. పైగా మధ్యన టిబెట్‌ ఉంది. చైనా, భారత్‌ల మధ్య యుద్ధమే జరిగితే ప్రతి దేశమూ చైనాను నమ్మదగని, ప్రమాదకర దేశంగా చూస్తుంది. చైనాకు సంబంధించి ఇది చాలా పెద్ద దుష్పర్యవసానం. అయితే భారత్‌ యుద్ధానికి తప్పక సన్నద్ధం కావాలి. అయినా శాంతి కోసం ప్రయత్నించాలి. యుద్ధం, శాంతి కలసి సాగుతాయి. సైన్యాలు తప్పనిసరిగా యుద్ధం చేయాలని లేదు, కానీ యుద్ధంవస్తే చేయడానికి సిద్ధంగా ఉండి తీరాలి.


- పెంటపాటి పుల్లారావు

వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు ppr193@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement