మార్పుల వెనుక మతలబు! | what is behind cabinet shuffle | Sakshi
Sakshi News home page

మార్పుల వెనుక మతలబు!

Published Tue, Sep 5 2017 1:41 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

మార్పుల వెనుక మతలబు! - Sakshi

మార్పుల వెనుక మతలబు!

విశ్లేషణ
భారత వృద్ధి రేటు చైనా వృద్ధి రేటు కంటే హెచ్చుగా ఉందని మోదీ ప్రభుత్వం చెబుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మాత్రం చైనా భారత వృద్ధి రేటును అధిగమించి ముందుకు వెళుతోంది. దీనితో మోదీలో కలవరం ఆరంభమై సరైన ఫలితాలు తీసుకురాలేకపోయిన మంత్రులను తొలగిస్తానని, మంచి ఫలితాలు సాధించిన వారికి పదోన్నతి కల్పిస్తానని ప్రకటించారు. అయితే మంత్రులంతా విఫలమైనారని మాత్రం మోదీ చెప్పలేరు. ఎందుకంటే, అలా చెబితే తాను కూడా విఫలమైనట్టే.

మంత్రిమండలి పునర్‌ వ్యవస్థీకరణ అవసరం వచ్చిందంటే, అది వైఫ ల్యాన్ని అంగీకరించడమే. మరో మాటలో చెప్పాలంటే, నీ మంత్రిమండలి సభ్యుల ఎంపికలో నీ నిర్ణయం సరికాదన్నమాటే. నీవు అనర్హులను మంత్రు లుగా చేర్చుకున్నట్టే. రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన మూడో మంత్రిమండలి పునర్‌ వ్యవస్థీకరణ సమాధానాలు లేని చాలా ప్రశ్నలను మిగిల్చింది. వ్యక్తిగతంగా మోదీ ప్రభ వెలుగుతూనే ఉంది. ఆయన ప్రభుత్వం మీద ఎలాంటి అవినీతి మచ్చ పడలేదు. బీజేపీ జాతీయ అధ్య క్షుడు అమిత్‌ షా అకుంఠిత, నిరంతర కృషితో చాలా రాష్ట్రాలలో ఆ పార్టీ ప్రభుత్వాలు ఏర్పడినాయి కూడా. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా చాలా ప్రాంతీయ పార్టీల మద్దతు బీజేపీ సాధించింది. ఇక ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ సాధించిన అసాధారణ విజయం దేశమంతా విస్తుపో యేటట్టు చేసింది.

మార్పులు అవసరమా?
రాజకీయంగా చూస్తే బీజేపీ, ఆ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ అప్రతి హతంగా సాగుతున్నారని చెప్పాలి. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, తమిళనాడుకు చెందిన అన్నా డీఎంకే వంటి ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు బీజేపీ వెంటే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో వైఎస్సార్‌ సీపీ, టీఆర్‌ఎస్‌లు కూడా బీజేపీతో స్నేహబంధం నెరపుతున్నాయి. ఇంత పటిష్టంగా ఉన్న సమయంలో మోదీ మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరించవలసిన అవసరం ఏమొచ్చింది? కొందరు మంత్రులను ఎందుకు తొలగించవలసి వచ్చింది? ఇది చాలా మందికి వచ్చిన సందేహం. నిజానికి మోదీ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ గురించిన ఊహాగానాలు ఆగస్టు 25, 2017 నుంచి ఆరం భమైనాయి. పెద్ద నోట్ల రద్దు తరువాత ఆర్థికవృద్ధి వేగం తగ్గిందంటూ రిజర్వు బ్యాంక్, ఇతర ఆర్థిక సంస్థలు లెక్కలు చెప్పడం ఆరంభించినది కూడా అప్పుడే. దానితోనే పునర్‌ వ్యవస్థీకరణ అంచనాలు శ్రీకారం చుట్టుకున్నాయి.

వృద్ధి రేటు 5.7 శాతానికి దిగిపోయిందని ప్రభుత్వ గణాంక విభాగం అధిపతి టీసీఏ అనంత్‌ ధ్రువీకరించారు. పెద్ద నోట్ల రద్దు ఫలితంగా లక్షలాది ఉద్యోగాలు మాయ మైనాయని కొన్ని సంస్థలు వెల్లడించాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చతికిల పడింది. దేశంలో నిర్మాణం పూర్తి చేసుకున్న 50 లక్షల గృహాలు అమ్ముడు పోకుండా మిగిలి ఉన్నాయి. వ్యవసాయ రంగం మీద కూడా చాలా చెడు ప్రభావం పడింది. రైతుల బలవన్మరణాలు కొనసాగు తూనే ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి నత్తనడక నడవడం గురించీ, నిరుద్యోగం గురించి ప్రజలు ప్రశ్నించడం ఆరంభించారు. 2014 ఎన్నికల సభలలో మోదీ ఇచ్చిన వాగ్దా నాలలో ఇదే ప్రధానమైనది. దేశం రూపురేఖలు మార్చి, సంవ త్సరానికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని ఆయన ఢంకా బజాయించేవారు. కానీ ఈ వాగ్దానాలేవీ అమలుకు నోచుకోలేదు.
 
అయితే మోదీ మంత్రిమండలి సాధించిన కొన్ని అద్భుతమైన విజ యాలు కూడా ఉన్నాయి. స్వచ్ఛభారత్‌ కార్యక్రమం అలాంటిదే. మరుగు దొడ్లను అనివార్యం చేస్తూ, దేశంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చిన ఈ కార్యక్రమంతో ఒక కొత్త స్పృహ మొదలయింది. విదేశీ వ్యవహరాలలో కూడా మోదీ ప్రభుత్వం ఎంతో చురుకైన పాత్ర పోషించింది. మౌలిక సదుపాయాల కల్పన రంగం అభివృద్ధి, రోడ్ల నిర్మాణం కూడా పటిష్టంగా జరుగుతున్నాయి. జీఎస్టీని ప్రవేశపెట్టినది కూడా ఈ ప్రభుత్వమే. అయితే ఈ వస్తుసేవల చట్టం ఫలితాలు వెంటనే కానరావు. కానీ వెంటనే జరిగిన మేలు ఏమిటంటే, రాష్ట్రాల సరిహద్దులలో సరుకులతో ఉన్న భారీ వాహనాలు ఇప్పుడు రోజుల తరబడి నిలిచిపోవడం లేదు. ఇది కూడా చెప్పుకోదగిన విజయమే. మోదీ ప్రభుత్వంలో కనిపించే మరో సుగుణం–విమర్శలకు సాను కూలంగా స్పందించడం. వెంటనే సవరణ చర్యలు చేపట్టడం కూడా.  అంటే మోదీ తన తప్పులను దిద్దుకునే సదవకాశం విపక్షమే కల్పిస్తున్నది.

మోదీ ప్రభుత్వంలో బలహీనతల గురించిన ప్రమాద ఘంటికలు రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు రాజీనామా చేయడంతోను, దానిని ప్రధాని ఆమోదిం చడంతోను బయటపడ్డాయి. వరసగా జరిగిన రైలు ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ సురేశ్‌ ప్రభు పదవికి రాజీనామా ఇచ్చారు. వాస్తవం ఏమిటంటే నిరుద్యోగ సమస్యను పరిష్కరించే యత్నం సరిగా జరగలేదు. అంటే కార్మిక, నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖల వైఫల్యం ఉంది. రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అఖిల భారత స్థాయిలో జరుగుతున్న వీరి అలజడులు మోదీ సర్కారును కలత పెడుతున్నాయి.

మోదీ కలవరం ఫలితం
భారత వృద్ధి రేటు చైనా వృద్ధి రేటు కంటే హెచ్చుగా ఉందని మోదీ ప్రభుత్వం చెబుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మాత్రం చైనా భారత వృద్ధి రేటును అధిగమించి ముందుకు వెళుతోంది. దీనితో మోదీలో కలవరం ఆరంభమై సరైన ఫలితాలు తీసుకురాలేకపోయిన మంత్రులను తొలగిస్తానని, మంచి ఫలితాలు సాధించిన వారికి పదోన్నతి కల్పిస్తానని ప్రకటించారు. అయితే మంత్రులంతా విఫలమైనారని మాత్రం మోదీ చెప్పలేరు. ఎందుకంటే, అలా చెబితే తాను కూడా విఫలమైనట్టే. ఫలితంగానే మంచి ఫలితాలు సాధించిన మంత్రులు, విఫలురైన మంత్రుల కోసం అన్వేషణ ఆరంభించడం జరిగింది. నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్‌ప్రతాప్‌ రూడీ, కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయల మీద ఉద్వాసన వేటు చాలా సులభంగానే పడింది. అయితే ఆర్థికవృద్ధి వెనుకబడిందని ప్రభుత్వం కనుక ప్రకటిస్తే, ఆ తప్పు సీనియర్‌ మంత్రులకు చెందుతుంది. వాస్తవం ఏమిటంటే, అంత బలవంతుడైన మోదీకి కూడా సీనియర్‌ మంత్రులను తప్పించడం అంత సులభం కాదు. అందుకే బలహీనులైన వారి మీద ఉద్వాసన వేటు పడింది. రూడీ, దత్తాత్రేయలతో పాటు, అంతగా పేరు ప్రఖ్యాతులు లేని వారినే తొలగిం చారు. ఉమాభారతిని తొలగించాలన్న ప్రయత్నం ఆరంభించగానే ఆమె తిరుగుబాటు జెండా ఎత్తారు. దానితో ఆమె కొనసాగారు. దీనర్థం బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన గంగా ప్రక్షాళన పథకం కూడా విఫలమైనట్టే.
 
నిజానికి బీజేపీ నుంచి, పార్లమెంటు నుంచి మాత్రమే కాకుండా బయట నుంచి కూడా ప్రతిభావంతులను కేంద్ర మంత్రిమండలిలో చేర్చుకోవలసిన అవసరం ఉంది. దేశంలో ఇలాంటి ప్రతిభ ఎంతో ఉంది. విప్రో అధినేత ఆజీం ప్రేమ్‌జీ, ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి వంటివారి సేవలను ఉపయో గించుకోవచ్చు. అంటే కొన్ని దేశాలలో ఆచరిస్తున్నట్టు బయటి వారిని మంత్రి మండలిలో చేర్చుకోవాలి.

మంత్రివర్గ మార్పు ముఖ్యఫలితాలు:
ఎ. నలుగురు మాజీ ఉన్నతాధికారులను చేర్చుకోవడం అంటే వారు ఏదో అద్బుతాలు చేసేస్తారని కాదు. కాంగ్రెస్‌ పార్టీ కూడా గతంలో నట్వర్‌ సింగ్, మణిశంకర్‌ అయ్యర్‌ తదితరులను మంత్రులుగా తీసుకొచ్చింది కానీ వారు ఘోరంగా వైఫల్యం చెందారు. ఇటీవల కాలంలో మంత్రులుగా నియ మితులైన ఏ రిటైర్డ్‌ అధికారి కూడా గొప్పగా ఊడపొడిచింది లేదు. ఇదే పరిణామం ఇప్పుడు పునరావృతం కాదని చెప్పలేము.
బి. రాజీవ్‌ రూడీని పదవినుంచి తొలగించి, ఉమాభారతిని సాగనంపిన తర్వాత రాజనాథ్‌ సింగ్‌ తిరుగుబాటు చేశారు. సెప్టెంబర్‌ 2న రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాసంలో ఆకస్మిక భేటీ జరిగింది. అరుణ్‌ జైట్లీ, సుష్మా స్వరాజ్, నితిన్‌ గడ్కరీ అక్కడికి పరుగులు తీశారు. దాని తర్వాతే ఉమా భారతి, తదితరులు తమ పదవులు కాపాడుకున్నారన్నది స్పష్టం. బహుశా రాజ్‌నాథ్‌ సింగ్‌ కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పును నిలిపివేసి ఉండవచ్చు. మోదీ పర్యవసానాల గురించి భయపడి ఉండవచ్చు. దీంతోనే వ్యవసాయ మంత్రి రాధా మోహన్‌ సింగ్‌ వంటి పలువురు విఫల మంత్రులను తొలగించలేదు.
సి. జేడీయూ, ఏడీఎమ్‌కెలను మంత్రివర్గంలో చేర్చుకోలేదంటేనే మంత్రి వర్గ విస్తరణ పూర్తి కాలేదని అర్థం. ఇంకా ఏడు ఖాళీలు మాత్రమే ఉన్నందున తదుపరి విస్తరణ సమయం నాటికి మరికొందరు మంత్రులను తొలగించ వచ్చు కూడా.
డి. కేంద్రప్రభుత్వంలో ప్రస్తుతానికి అరుణ్‌ జైట్లీ శక్తివంతమైన మంత్రిగా ఆవిర్భవించారు. ఆయన అనుచరుల్లో కొందరిని ప్రమోట్‌ చేశారు. కొందరిని కాపాడారు. ప్రభుత్వం వెనుక ఉన్న అసలైన శక్తి నిస్సందేహంగా అరుణ్‌ జైట్లీనే.
ఇ. ఇక నిర్మలా సీతారామన్‌ ఏకంగా రక్షణ మంత్రి కావడం మరీ విశేషం. ఆమెకు శుభాభినందనలు తెలుపుతూనే గతంలో స్వరణ్‌ సింగ్, జగ్జీవన్‌ రామ్, ఏకే ఆంటోనీ, బన్సీలాల్, జార్జి ఫెర్నాండజ్, వీపీ సింగ్, వైబీ చవాన్, పీవీ నరసింహారావు, ప్రణబ్‌ ముఖర్జీ, ఎస్బీ చవాన్‌ వంటి ప్రము ఖులు అధిష్టించిన కుర్చీలో ఆమె కూర్చుంటున్నారని గుర్తు చేయాలి.

మిగిలివున్న సమస్యలు:
ఆర్థిక వ్యవస్థ వైఫల్యం కొనసాగుతోంది. దాని అస్వస్థతకు నివారణే కనిపిం చటం లేదు. ఆర్థిక మంత్రులలో మార్పూ కనిపించడం లేదు. రూడీ, దత్తా త్రేయ వంటి మంత్రులను తొలగించాక, కొత్త మంత్రులు ఇక చేసేదే ముంటుంది? ప్రమాదాల సాకు చెప్పి రైల్వే మంత్రి సురేష్‌ ప్రభును తొల గించారు సరే.. కానీ అదేరకమైన ప్రమాదాలు ఇక ముందూ జరిగితే రైల్వే కొత్త మంత్రి పీయూష్‌ గోయల్‌ను కూడా అలాగే తొలగిస్తారా?

తెలుగు రాష్ట్రాలు :
బండారు దత్తాత్రేయ తెలంగాణలో ఓబీసీలకు చెందినవారు. కచ్చితంగా ఆయన స్థానంలో ఒక ఓబీసీకి లేక దళితుడికే మంత్రిపదవి కేటాయించవలసి ఉంది. తొమ్మదిమంది కొత్త కేంద్ర మంత్రుల్లో 8మంది అగ్రకులాలకు చెందినవారు. ప్రమోట్‌ చేసిన మంత్రులందరూ అగ్రకులాలవారే. ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి బీజేపీకి చెందిన హరిబాబుకు మంత్రిగా అవకాశం రావచ్చని బాగా ప్రచారం జరిగింది. కానీ హరిబాబు కోసం ఎన్ని వత్తిళ్లు వచ్చినప్పటికీ, మోదీ, అమిత్‌ షాలు సోషల్‌ ఇంజనీరింగ్‌నే నమ్ముతారు. పైగా ప్రస్తుతం ఏపీకి చెందిన ఇద్దరు టీడీపీ కేంద్రమంత్రులూ అగ్రకులాలకు సంబంధిం చినవారేనని వారికి తెలుసుకూడా.

ప్రజల్లో తన ఇమేజీ చక్కగా ఉన్నప్పటికీ, తన ప్రభుత్వం సరిగా లేదని మోదీకి పూర్తిగా తెలుసు. తన ప్రభుత్వం వచ్చే 18 నెలల్లో ఏం చేస్తుందన్నది కాలమే చెబుతుంది. ఉపాధికి సంబంధించి గత 36 నెలల్లో జరగని అద్భుతం వచ్చే 18 నెలల్లో జరిగిపోతుందంటే సందేహపడాల్సిందే.

వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు ppr193@gmail.com
పెంటపాటి పుల్లారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement