ముందు నుయ్యి.. వెనుక గొయ్యి
మోదీ ప్రధాని అభ్యర్థి అయినప్పుడు నితీష్ బీజేపీతో తెగతెంపులు చేసుకోవాల్సిన అవసరం లేదు. సార్వత్రిక ఎన్నికల ఓటమికి రాజీనామా చేయాల్సిన అవసరమూ లేదు. కానీ ఆయన తాను అత్యంత సూత్రబద్ధమైన వాడిననే అబద్ధాన్ని నిజంగా ప్రదర్శించాలనుకున్నారు. రాముడు వనవాసానికి వెళ్లినప్పుడు భరతుడు అయోధ్యలో సింహాసనాన్ని కాపాడిన ట్టే మంఝి కూడా ప్రవర్తిస్తారనుకున్నారు. కానీ నితీష్‌ను అతి సన్నిహితంగా ఎరిగిన మంఝికి ఆయన రాముడేమీ కాడని బాగా తెలుసు. కాబట్టే తిరుగుబాటు చేశారు.
దేశం చూపంతా కేజ్రీవాల్‌పైనే ఉండగా అంత కంటే గంభీరమైన రాజకీయ నాటకం బిహార్‌లో ప్రదర్శితమవుతోంది. ఢిల్లీలో ఫిబ్రవరి 10న బీజేపీ ఓటమి పాలు కాబోతుండగా, బిహార్‌లోని కొత్త రాజకీయ సమీకరణలు దానికి అనుకూలంగా మారబోతున్నాయి. బిహార్ నేటి ముఖ్యమంత్రి జీతన్‌రామ్ మంఝికి, మాజీ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు మధ్య పోరు ఓ ప్రహసనంగా మారింది. అందులో నితీష్ విదూషకుడయ్యారు. బిహార్ పరిణామాలను ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బెంగాల్, ఒడిశాలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. నితీష్ అనుయాయులలోనే ఒకరు ఆయనపై తిరుగుబాటు చేయడంతో గొప్ప నాయకుడనుకున్న నేత కాస్తా మహా ఇబ్బందికరమైన పరిస్థితిలో పడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చే శారు. యావద్భారతం ఆయన సూత్రబద్ధతను హర్షించింది. మెత్తని మనిషి, తనకు విధేయుడు అయిన దళిత నేత జీతన్ రామ్ మంఝికి నితీష్ అధికారం అప్పగించారు. శరద్‌యాదవ్ వంటి సీనియర్ నేతను కాదని ముఖ్యమంత్రి పదవికి ఒక దళిత నేతను ఎంపిక చేయడం తెలివైన ఎత్తుగడ అని అంతా ప్రశంసించారు. మంఝి అప్పటికే పలుమార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన వారు, జనతాదళ్-యూలో చేరడానికి ముందు కాంగ్రెస్, జనతాదళ్, రాష్ట్రీయ జనతాదళ్‌లలో పనిచేసిన సీనియర్ నేత. ఆ దళిత నేతనే నితీష్ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని చూస్తున్నారు. మంఝి, నితీష్ చేతి కీలుబొమ్మగా ఉండటానికి నిరాకరించి, రోజురోజుకూ స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభించారు. దీంతో నితీష్‌కు ఆందోళన పట్టుకుంది. స్వయంగా తానే ఎంపిక చేసిన వ్యక్తే తిరుగుబాటు చేయడంతో ఆయన నవ్వులపాలయ్యారు.
నిజానికి నితీష్ నేడు పులి మీద స్వారీ చేస్తున్నారు. మంఝిని తొలగిస్తే దళితులకు కోపం వస్తుంది. ఆయననే ముఖ్యమంత్రిగా కొనసాగనిస్తే బిహార్‌లో నితీష్ ప్రజాపునాదిని కోల్పోతారు, రాజకీయ భవిష్యత్తే లేకుండా పోతుంది. ఎట్టకేలకు ముఖ్యమంత్రిని తొలగించి తానే తిరిగి అధికారం చేపట్టాలని నితీష్ నిర్ణయించారు. తొమ్మిది నెలలు మాత్రమే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని ఆయన తొలగించగలరా? అనేదీ అనుమానమే. ఎందుకంటే మంఝికి మద్దతు తెలపడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. పైగా ఆగ్రహంతో ఉన్న మంఝి శాసనసభను రద్దు చేయమని గవర్నరుకు సిఫారసు చేస్తానని బెదిరిస్తున్నారు.
‘బలహీనులే’ తిరగబడేది
పెద్ద పెద్ద రాజకీయవేత్తలంతా మెత్తగా, బలహీనంగా, అణగిమణగి ఉండి, మూఢుల్లా కనిపించే అనుచరులనే ఇష్టపడతారు. అదే అసలు సమస్య. బలహీనులని ఎంపిక చేసిన వారసులే పదవి లభించాక తిరగబడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజా ఉదాహరణ జయంతీ నటరాజన్. తమిళనాడులో ఎలాంటి పునాది లేకపోయినా ముఖస్తుతితో తెలివిగా ఆమె 27 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యురాలు, చాలా ఏళ్లపాటే మంత్రి కాగలిగారు. గాంధీ కుటుంబానికి విధేయురాలిగా భావించడం వలనే ఆమెకు ఆ ప్రాధాన్యం లభించింది. చివరికి గాంధీ కుటుంబం వల్ల తనకిక ఒరిగేదేమీ లేదనుకున్నాక తిరుగుబాటు చేశారు. అత్యున్నత స్థానంలోని బలహీన నేత చేసిన తిరుగుబాటుకు అత్యుత్తమ ఉదాహరణ సీతారామ్ కేసరి. 1996 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తదుపరి పీవీ నరసింహారావు ప్రధాని పదవికి రాజీనామా చేసి, పార్టీ అధ్యక్షునిగా, ప్రతిపక్ష నేతగా కొనసాగారు. ఏవో కొన్ని చిల్లర మల్లర కేసుల విషయమై ఆయన రాజీనామా చేయాలనే డిమాండు రావడంతో పీవీ 1997 జనవరిలో సీతారామ్ కేసరికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత పదవిని కట్టబెట్టారు. కేసరి కొద్ది రోజుల్లోను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పీవీ రాజీనామా చేసేలా చేశారు. పీవీకి శరద్‌పవార్ లేదా సీతారామ్ కేసరిలలో ఎవరో ఒకర్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నా.. బలవంతునికి భయపడి భజనపరుణ్ణే ఎంచుకున్నారు. పవార్ అయితే ఆయనను అలా ఎన్నటికీ రాజకీయంగా నాశనం చేసి ఉండేవారే కారు. కొందరు నేతలది మరో ఫార్ములా. దృఢ వ్యక్తిత్వమున్న ఇతర సహచరులందరినీ దూరం చేసుకుంటారు. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడానికి ముందే షాజియా ఇల్మీ, ప్రశాంత్‌భూషణ్, శాంతిభూషణ్ తదితరులను పార్టీ నుంచి వెళ్ల గొట్టేశారు.1989 నుంచి చాలా ఏళ్లు లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. అవినీతి కేసుల వల్ల రాజీనామా చేయాల్సిరాగా, ఆయన తన భార్య రబ్రీదేవిని వారసురాలిని చేశారు. సహచరులందరిపైనా ఆయనకున్న అవిశ్వాసానికి అదే నిదర్శనం. దాంతో ఆయన పతనం ప్రారంభమైంది.
నితీష్ అత్యంత రాజకీయ చతురత గలిగిన నేత. 1977 నుంచి ఆయన చాలా పదవులనే అధిరోహించారు. అయితే లాలూ బాస్‌గా ఉన్న పార్టీలో తాను నిస్సహాయుడినని భావించి, ఆర్జేడీని వీడారు. జార్జి ఫెర్నాండెజ్‌తో కలిసి సమతా పార్టీని ఏర్పాటు చేశారు. అటల్ బిహారి వాజ్‌పేయి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. బీజేపీతో కూటమిని ఏర్పరచి 2005లో బిహార్ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. 2010లో తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. రెండో దఫా ముఖ్యమంత్రిగా ఉండగానే నరేంద్ర మోదీ బీజేపీకి నేతృత్వం వహించడం పట్ల సందేహాన్ని వ్యక్తం చేయడం ప్రారంభించారు. మోదీయే బీజేపీ ప్రధాని అభ్యర్థి కావాలనే డిమాండు పెరిగే సరికి, అదే జరిగితే జీజేపీతో పొత్తుకు స్వస్తి పలుకుతానని అనడం మొదలుపెట్టారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై ఒత్తిడి తెచ్చి మోదీ బీజేపీ ప్రధాని అభ్యర్థి కాకుండా నిలవరించాలనే లక్ష్యంతో అద్వానీ తదితర సీనియర్ నేతలు నితీష్‌ను వాడుకున్నారనే బలమైన అభిప్రాయమూ ఉంది. ఏదేమైనా 2013 సెప్టెంబర్లో మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో నితీష్ బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. అయినా లాలూ, కాంగ్రెస్‌ల మద్దతుతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లోని 40 ఎంపీ స్థానాల్లో బీజేపీ, దాని మిత్రులు 33 గెలుచుకున్నారు. వెంటనే నితీష్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. జీతన్ రామ్ మంఝిని ముఖ్యమంత్రిని చేశారు. ఆయన పదవిలోనే కొనసాగుతానంటూ ఇప్పుడు నితీష్‌ను సవాలు చేస్తున్నారు. కాబట్టి మంఝిని తొలగించడానికి నితీష్ ఎమ్మెల్యేలను సమావేశపరచారు. ఎత్తుకు పై ఎత్తువేసి మంఝి శాసనసభను రద్దు చేయిస్తానని బెదిరించారు. ఇద్దరి సయోధ్య కోసం జరిగిన భేటీలో ఇక తన రాజీనామా ప్రసక్తి తేవడానికి వీల్లేదని మంఝి తేల్చేయడంతో నితీష్ దిగ్భ్రాంతి చెందారు. మరో బిహారీ సీతారామ్ కేసరి పీవీకి ఇదే చేశారు. లాలూ, నితీష్‌లు గత 20 ఏళ్లుగా నిత్యమూ ఒకరినొకరు తిట్టుకుంటూనే ఉన్న బద్ధ శ త్రువులు. కాబట్టి లాలూపై ఆధారపడాల్సి రావడం నితీష్‌కు అత్యంత అవమానకర ం. ఈ ప్రహసనాన్ని బిహార్ ప్రజలు ఉత్సాహంగా తిలకిస్తున్నారు. 1994 నుంచి నితీష్, లాలూను వేధిస్తూనే ఉన్నారు. ఆయన వల్లనే లాలూ కటకటాల పాలయ్యారు. కాబట్టి లాలూ ఆయనపై ఏ మాత్రం దయ చూపరు. భార్య రాజ్యసభ సభ్యురాలు, కూతురు ఎమ్మెల్సీ కావడంతోనే లాలూ నితీష్ పుట్టి ముంచేస్తారు.
నితీష్‌కు ఇప్పుడు బద్ధ శత్రువు నితీషే. రాజకీయవేత్తలందరిలాగే ఆయనకూ అధికారం కావాలి. కాకపోతే ఆయన కపటి. అధికారం అవసరం లేనట్టు నటిస్తారు. చాలా సూత్రబద్ధమైన వాడినని చెప్పుకుంటారు. ప్రపంచంలోకెల్లా అత్యంత అవినీతిపరుడంటూ తానే దుయ్యబట్టిన లాలూతో నిస్సంకోచంగా చెయ్యి కలుపుతారు. ఆయన అంత సూత్రబద్ధమైనవారే అయితే 2002 గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడే వాజ్‌పేయి మంత్రివర్గం నుంచి నితీష్ వైదొలగి ఉండేవారు. కానీ 2013 నుంచే ఆయన మోదీని వ్యతిరేకించడం ప్రారంభించారు. ప్రాథమికంగా నితీష్‌ది ప్రధాని కావాలనే కాంక్ష. 20 మంది ఎంపీలు ఉండి ఉంటే బీజేపీయేతర పార్టీలకు ఆయన ఆమోదయోగ్యుడైన ప్రధాని అయ్యేవారే. కానీ ఆయనకు ఉన్నది ఇద్దరు ఎంపీలే.
అబద్ధాల బతుకు అనర్ధం
మీ గురించి మీరు అబద్ధాలు చెప్పుకుంటూ ఉంటే, ఇక మీరు ఆ అబద్ధాలను నిజం చేస్తూనే బతకాల్సి ఉంటుంది. మోదీ బీజేపీ ప్రధాని అభ్యర్థి అయినప్పుడు నితీష్ బీజేపీతో తెగతెంపులు చేసుకోవాల్సిన అవసరం లేదు. సార్వత్రిక ఎన్నికల ఓటమికి రాజీనామా చేయాల్సిన అవసరమూ లేదు. కానీ ఆయన తాను అత్యంత సూత్రబద్ధమైన వాడిననే అబద్ధాన్ని నిజంగా ప్రదర్శించాలనుకున్నారు. రాముడు వనవాసానికి వెళ్లినప్పుడు భరతుడు అయోధ్య సింహాసనాన్ని కాపాడినట్టు మంఝి తన సింహాసనాన్ని పరిరక్షిస్తారని భావించారు. కానీ 15 ఏళ్లుగా ఆయనను అతి సన్నిహితంగా ఎరిగిన మంఝికి నితీష్ రాముడేమీ కాడని బాగా తెలుసు. కాబట్టే తిరుగుబాటు చేశారు. ఈ తొమ్మిది నెలల్లో ఆయన దళితుల్లోనే గాక, ఇతర వర్గాల్లో కూడా మంచి నేతగా గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? లేదా? లేక అధ్యక్ష పాలనే శరణ్యమా? అనే వాటి సంగతి ఎలా ఉన్నా... నితీష్ ముందున్నది ముళ్ల బాటే. అందుకు ఆయన తన అతి తెలివినే తిట్టుకోవాలి.
విశ్లేషణ: పెంటపాటి పుల్లారావు, (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు మొబైల్ నం:9868233111)