‘సుప్రీం’ పీఠం ఎప్పటికీ కొందరికేనా? | will dalits and backward classes get chief justice post | Sakshi
Sakshi News home page

‘సుప్రీం’ పీఠం ఎప్పటికీ కొందరికేనా?

Published Wed, Nov 11 2015 1:47 AM | Last Updated on Sun, Sep 3 2017 12:20 PM

ఏకైక భారత ప్రధాన న్యాయమూర్తి కె.జి. బాలకృష్ణన్

ఏకైక భారత ప్రధాన న్యాయమూర్తి కె.జి. బాలకృష్ణన్

 సందర్భం

 

కొలీజియం వ్యవస్థ కొనసాగింపు దళితులు, వెనుకబడిన కులాలు, మైనారిటీలు, ఆధిపత్య కులాలకు చెందని ఇతరులను సుప్రీం న్యాయమూర్తులను చేసే అవకాశాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కల్పిస్తోంది. వీరికి చిత్తశుద్ధి ఉంటే ఆ వర్గాల వారి నుంచి యువ వయస్కులను హైకోర్టు న్యాయమూర్తులను చేస్తే చాలు. మరి తెలుగు ముఖ్యమంత్రులు ఈ అవకాశాన్ని సవాలుగా స్వీకరించి వెనుకబడిన వర్గాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోగలరా?

 

జాతీయ న్యాయ కమిషన్ (ఎన్‌సీఏ) ఏర్పాటునకు ఉద్దేశించిన చట్టం చెల్లదని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. న్యాయమూర్తుల నియామకాల బాధ్యతను ఎన్‌సీఏకు అప్పగించడానికి ఉద్దేశించిన ఆ చట్టం అమల్లోకి వస్తే సుప్రీం కోర్టు కొన్ని అధికారాలను కోల్పోయి ఉండేది. దీంతో న్యాయ మూర్తుల నియామకాల్లో ప్రభుత్వాల పాత్రే లేకుండా సుప్రీం కోర్టే సర్వశక్తివంతమైన అంతిమ అధికారంగా ఉండే కొలీజియం వ్యవస్థ తిరిగి అమల్లోకి వస్తోంది. కొలీజియం వ్యవస్థకంటే ఎన్‌సీఏ అయితేనే న్యాయమూర్తుల నియామకాలు మరింత పారదర్శకంగా ఉండేవనే వాదన ఉంది. అదలా ఉంచితే, పాత పద్ధతికే తిరిగి రావడం రెండు తెలుగు రాష్ట్రాలకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే దళితులు, వెనుకబడిన కులాలు, మైనారిటీల వారిని, ఆధిపత్యకులాలు కాని కొన్ని ఇతర కులాలవారిని సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా పంపించగలుగుతాయి.

 

ప్రభుత్వాల పాత్రేలేని, సుప్రీంకోర్టు మాటే తిరుగులేనిదిగా ఉండే ఈ కొలీజియం వ్యవస్థ మహా నిగూఢమైనది. సాధారణ న్యాయవాదులు హైకోర్టు న్యాయమూర్తులై, ఆ తదుపరి సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగానే కాదు.. భారత ప్రధాన న్యాయమూర్తులుగా కూడా ఎలా అయిపోతుం టారనేది ఓ గొప్ప రహస్యం. కానీ వాస్తవం మాత్రం అత్యంత సరళమైనది. తెలుగు ప్రభుత్వాలు నిజంగానే బహుజనుల, మైనారిటీలకు సాధికారతను కల్పించడంలో చిత్తశుద్ధి ఉంటే...ఇంతవరకూ ఎన్నడూ తెలుగు రాష్ట్రాల నుంచి సుప్రీం కోర్టు న్యాయపీఠాన్ని అధిష్టించలేకపోయిన వారిని, కనీసం నలుగురు దళితులను, ఇద్దరు ఆదివాసులను, మైనారిటీలు తదితర విభాగాలకు చెందినవారిని ఆ అవకాశాన్ని అందుకునేలా చేయగలుగుతుంది.

 

ఎవరైనాగానీ ఏ వయసులో హైకోర్టు న్యాయమూర్తి కాగలుగుతారనే దానిమీద ఆధారపడే... వారు సుప్రీం కోర్టు న్యాయమూర్తి కాగలుగుతారా? లేదా అనేది తేలిపోతుంది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు కలసి కొన్ని పేర్లను చర్చించిన  మీదట అవి ఆ జాబితాను సుప్రీం కోర్టుకు పంపుతాయి. ఏ వివాదమూ లేకపోతే అది ఆ జాబితాను ఆమోదిస్తుంది. దాన్ని ఆమోదించడం తప్ప కేంద్ర ప్రభుత్వం చేయగలిగేది ఏమీ లేదు. ఇంతవరకు అగ్ర, అభివృద్ధి చెందిన కులాల నుంచి యువ న్యాయమూర్తుల పేర్లను హైకోర్టు న్యాయమూర్తులుగా ఖరారు చేస్తున్నారు. సీనియారిటీ ప్రాతిపదికలో ముందుండటం వల్ల వారిలో అత్యధికులు ఆటోమేటిక్‌గానే సుప్రీం కోర్టు న్యాయమూర్తులవుతున్నారు. ఇక ఇతరుల విషయంలో వారు సాధారణంగా వయసు మీరిన తర్వాతనే హైకోర్టు న్యాయమూర్తులు కాగలుగుతున్నారు. కాబట్టి సుప్రీం న్యాయపీఠాన్ని అధిష్టించేలోగానే వారు పదవీ విరమణ చేయాల్సి వస్తోంది.

 

1950 నుంచి ఇంతవరకు 42 మంది సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తులయ్యారు. వారిలో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ ఒక్కరే దళితుడు. ఇక ఏ ఆదివాసీ ప్రధాన న్యాయమూర్తి కానే లేదు. కోయల వంటి ఆదివాసుల నుంచైతే ఒక్కరైనా సుప్రీం న్యాయమూర్తి కాలేకపోయారు. ఏపీ, తెలంగాణలలో దళిత, ఆదివాసీ, మైనారిటీ న్యాయవాదులు చాలామందే ఉన్నారు. అయినా ఒకే ఒక్క దళితుడు సుప్రీం కోర్టు న్యాయమూర్తి కాగలిగారు. మన ప్రభుత్వాలు అతి తెలివిగా తాము కోరుకునే కులాల, వర్గాల వారినుంచి తక్కువ వయస్కులనే హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తున్నాయి. వారికి ప్రతిభ ఉన్నదని రుజువుచేయడం కోసం వారిని ముందుగా ఢిల్లీలో అదనపు అడ్వొకేట్ జనరళ్లుగా లేదా అసిస్టెంట్ సొలిసిటర్ జనర ళ్లుగా నియమిస్తోంది. అలా వారు ప్రతిభావంతులై హైకోర్టు న్యాయ మూర్తులుగా ఎంపికవుతున్నారు.

 

ఆ తరువాత తాము ఎంపిక చేసిన అభ్యర్థులకు ఎక్కువ అనుభవం ఉందంటూ వారి పేర్లను హైకోర్టుకు పంపిస్తున్నాయి. దేశవ్యాప్తంగానే ఇలా పాలకులకు ప్రీతిపాత్రమైన కులాలు, వర్గాల వారు తక్కువ వయసుకే హైకోర్టు న్యాయమూర్తులవుతున్నారని, దళితులు, ఆదివాసులు, మైనారి టీలు తదితరులు వయసు మీద పడ్డాక కానీ హైకోర్టు న్యాయమూర్తులు కావడం లేదని ఏ కాస్త పరిశోధన చేపట్టినా తెలుస్తుంది. ఎవరు సుప్రీం న్యాయమూర్తులు కాగలుగుతారు, ఎవరు కారో నిర్ణయించేది ఈ వయసే.

 

సుప్రీం న్యాయమూర్తి కావాలంటే ఏంచేయాలి?

 నేటి కొలీజియం పద్ధతి ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలసి హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల కోసం ఖరారు చేసిన జాబితాను ఐదుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులే సభ్యులుగా ఉండే కొలీజియం ఆమోదించడమే ఆనవాయితీ. ఆ జాబితాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోయినా కొలీజియం మాటే అంతిమమైనది. కాబట్టి సుప్రీం కోర్టు న్యాయమూర్తి కావాలంటే ముందుగా తక్కువ వయసులో హైకోర్టు న్యాయమూర్తి కావాలి. అందుకు కావాల్సింది రాష్ట్ర ప్రభుత్వం అనుగ్రహం. అది సంపాదించగలిగి, తక్కువ వయసులో ఆ మొదటి మెట్టు ఎక్కేస్తే చాలు ఇక ఎలాంటి పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలూ ఏమీ లేకుండానే సీనియారిటీ ప్రాతిపదికపైనే సుప్రీం న్యాయమూర్తులైపోతారు. దళితులు, వెనుకబడిన కులాలు, మైనారిటీలు తదితరులంతా ‘సీనియారిటీ’ సంపాదించి, హైకోర్టు గడప దాటి సుప్రీం న్యాయ పీఠంపైకి చేరేలోగానే  పదవీ విరమణ చేయాల్సి వస్తోంది. కాబట్టేవారు సుప్రీం న్యాయమూర్తులూ కాలేరు, ప్రధాన న్యాయ మూర్తులు అంతకన్నా కాలేరు. అందుకు ఎవరు కారణమో చెప్పనక్కర్లేదు.

 

సీనియారిటీ ఒక్కటే కొలబద్ధ కాబట్టే 1991 నవంబర్ నుంచి 1993 ఫిబ్రవరి వరకు నలుగురు భారత ప్రధాన న్యాయమూర్తులయ్యారు. అలాగే 2001 నవంబర్ నుంచి 2002 డిసెంబర్ వరకు నలుగురు ప్రధాన న్యాయ మూర్తులయ్యారు. చీఫ్ జస్టిస్ కేఎన్ సింగ్ 1991లో కేవలం 18 రోజులే ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. దళితులు, ఆదివాసులు హైకోర్టు న్యాయ మూర్తులుగానే పదవీ విర మణ చేస్తారు. మరి కేజీ బాలకృష్ణన్ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎలా కాగలిగారు? 1985లో బాలకృష్ణన్ నలభయ్యవ ఏటనే నాటి కేరళ ముఖ్యమంత్రి కే కరుణాకరన్ ఆయనను హైకోర్టు న్యాయ మూర్తిగా ఎంపిక చేసి, అందుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించేలా చేశారు కాబట్టి. 1993లో కొలీజియం వ్యవస్థ అమల్లోకి రాకముందు జరిగిందది. ఆ తర్వాత ఇంత వరకు దళిత లేదా ఆదివాసీ లేదా పలు ఇతర కులాల మైనారిటీలను ఎవరినీ యువకులుగా ఉండగా ఎంపిక చేసింది లేదు. ఉమ్మడి ఏపీ జాబితాలనే తీసుకుంటే అందులో దళితులు, ఆదివాసీలు, తదితర వెనుకబడిన వర్గాల వారెవరూ కనిపించరు. వాళ్లు మరీ ముసలివాళ్లు కావడంతో ఎప్పటికీ సుప్రీం కోర్టు పీఠం ఎక్కలేరు. అదంతే.

 

గత అరవై ఐదేళ్లలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తులైన 42 మందిలో నులుగురు ముస్లింలు. వారిలో జస్టిస్ హిదయతుల్లా 1947 నాటికే న్యాయమూర్తి కాబట్టే సీనియారిటీ ప్రకారం ప్రధాన న్యాయమూర్తి కాగలిగారు. జస్టిస్ అల్మాస్ కబీర్ ప్రముఖ బెంగాలీ కుటుంబం నుంచి వచ్చి సీనియారిటీ ద్వారానే ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. కేజీ బాలకృష్ణన్ 40 ఏళ్లకు హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు కాబట్టే ప్రధాన న్యాయమూర్తి కాగలిగారని చూశాం. కానీ సుప్రీం న్యాయమూర్తులు కాగలిగిన దళితులు చాలా తక్కువ. ఇప్పుడిక మైనారిటీలవారు కూడా హైకోర్టు న్యాయ మూర్తులయ్యే సరికే వయసుపైబడినవారైపోతున్నారు, సుప్రీంకు వెళ్లేలోగానే పదవీ విర మణ చేసేస్తున్నారు!

 

కొలీజియం వ్యవస్థ కొనసాగింపు అనేది దళితులు, వెనుకబడిన కులాలు, మైనారిటీలను, ఆధిపత్యకులాలకు చెందని ఇతరులను సుప్రీం న్యాయమూర్తులను చేసే అవకాశాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు  కల్పిస్తోంది. వీరికి చిత్తశుద్ధి ఉంటే ఆ వర్గాల వారి నుంచి యువ వయస్కులను హైకోర్టు న్యాయమూర్తులను చేస్తే చాలు. న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించే వ్యవస్థ సీనియారిటీని బట్టి వారిని సుప్రీంకు ఎంపిక చేసేస్తుంది. మరి తెలుగు ముఖ్యమంత్రులు ఈ అవకాశాన్ని సవాలుగా స్వీకరించి వెనుకబడిన వర్గాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోగలరా?  

 

 - పెంటపాటి పుల్లారావు

వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, ఈమెయిల్: drpullarao@hayoo.co.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement