
సాక్షి, రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేల బృందం 5 లక్షల నిర్వాసితుల సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమని ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ పెంటపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల పోలవరం పర్యటన కర్ఫ్యూను తలపించిందని వ్యాఖ్యానించారు. పోలవరం వస్తున్న ఎమ్మెల్యేల బృందానికి సమస్యలు చెప్పుకుందామని భావించిన నిర్వాసితులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు చేసి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు.
బ్రిటీష్ హయాంలో లండన్ నుంచి భారతదేశానికి ఎంపీలు వచ్చినపుడు వ్యవహరించిన విధంగా ఏపీ ప్రభుత్వం నిర్వాసితులను నిర్బంధించిందన్నారు. దీనిపై త్వరలోనే న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎంను పొగడటానికి ఇచ్చిన ప్రాధాన్యత పోలవరం నిర్వాసితుల సమస్యలపై పెట్టలేదని విమర్శించారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్లడంతో నిర్వాసితులను పోలీసులు ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు.