హైదరాబాద్ సిటీః పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం, పునరావాసం కల్పించకుండా వారిని బలవంతంగా ఉన్న చోటు నుంచి ఖాళీ చేయిస్తున్నారని, దీనిని అడ్డుకోవాలంటూ సామాజిక కార్యకర్త డాక్టర్ పెంటపాటి పుల్లారావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇందులో పోలవరం ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్, కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర గ్రామీణాభివృద్ధి, గిరిజన వ్యవహారాలు, పర్యావరణ మంత్రిత్వశాఖల కార్యదర్శులను, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం విచారించనున్నది.
మారిన పరిస్థితుల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు ప్లానింగ్, డిజైన్‌ల దగ్గర నుంచీ పూర్తిస్థాయిలో తిరిగి అధ్యయనం నిర్వహించేలా పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోను ఆదేశించాలన్నారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, నిర్వాసితులకు కొత్త చట్ట ప్రకారం పరిహారం అందచేసే పునరావాసం కల్పించేందుకు వీలుగా ఈ ప్రాజెక్టు బాధ్యతలను పోలవరం అథారిటీకి అప్పగించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. నిర్వాసితులను ఖాళీ చేయించే చర్యలో భాగంగా వారి ఇళ్లకు విద్యుత్, నీటి కనెక్షన్లతో అత్యవసర సేవలను నిలపుదలను చేస్తున్నారని, ఈ చర్యలను అడ్డుకోవాలని పుల్లారావు తన పిటిషన్‌లో కోర్టును కోరారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు జాతీయ ప్రాజెక్టు అని, దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ సంబంధం లేకపోయినా కూడా నిర్వాసితులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారన్నారు. నిర్వాసితులకు కొత్త భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. నిర్వాసితులను ఖాళీ చేయించేందుకు ప్రైవేటు భద్రతా సిబ్బందిని వాడుతున్నారని, దీనిపై ప్రభుత్వాన్ని నిరోధించాలని అభ్యర్థించారు.
బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు
Published Sat, Jun 20 2015 11:40 PM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement