
కేసీఆర్ సదసత్సంశయం
టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలిపేస్తే కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ముగిసినట్టే. అంతేకాదు టీఆర్‌ఎస్ కథ సమాప్తమవుతుంది. కాంగ్రెస్ గడప తొక్కిన తర్వాత వందలాదిమంది నాయకుల్లో తాను ఒకడిగా ఉంటానన్న విషయం కేసీఆర్‌కు తెలుసు. ఆయనకు ఏ ప్రత్యేకతా ఉండదు. మునిగిపోతున్న కాంగ్రెస్ పడవలో కాలుపెట్టేందుకు కేసీఆర్ సిద్ధంగా లేరు.
తెలంగాణ కల సాకారమై టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు విజయోత్సవంతో హైదరాబాద్ చేరుకున్న తర్వాత అందరి మెదళ్లలోనూ ఒకటే ప్రశ్న తొలుస్తోంది. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం సజావుగా జరుగుతుందా? లేదా అవి రెండూ శత్రుపక్షాలుగా మారిపోతాయా అన్న దానిపై అందరూ చర్చించుకుంటున్నారు.
ముందుగా కుదిరిన అవగాహన ప్రకారం కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం కావాలి. అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తుంది. కేసీఆర్‌నూ, ఆయన అనుచరులనూ సంతోషపెట్టేందుకు తగిన సంఖ్యలో టికెట్లు ఇస్తుంది. ప్రస్తుత ఎమ్మెల్యే, ఎంపీ సిట్టింగ్ అభ్యర్థులందరికీ టికెట్లు ఇస్తుంది. అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రధాన శక్తిగా అవతరిస్తుందన్న మాట. ఈ ఫార్ములా ప్రకారం 50 దాకా ఎమ్మెల్యే, కొన్ని ఎంపీ ఓపెన్ సీట్లు ఉంటాయి. ఇవన్నీ టీడీపీ, ఇతర పార్టీలు గెలుచుకున్నవి. అలాంటి సీట్లలో కొన్నింటిని కేసీఆర్ కోరుకుంటే కాంగ్రెస్ కేటాయిస్తుంది కూడా. అయితే ఇవన్నీ ఓడిపోయే సీట్లే.
కాంగ్రెస్ వ్యూహమిదే. ఎన్నికల తర్వాత కేసీఆర్ రాజకీయాల నుంచి నిష్ర్కమించవచ్చు. తొలిసారి ఎన్నికలు జరిగిన తర్వాత తెలంగాణ రాజకీయాలలో పెనుమార్పులు చోటుచేసుకుంటాయన్న విషయం ఆయనకు బాగా తెలుసు. నూతన రాష్ట్రంలో కొత్త శక్తులు.... కుల ప్రాతిపదికగా ఆవిర్భవించవచ్చు. వాటిని నియంత్రించే శక్తి ఆయనకు ఉండదు. అవినీతికి వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్ ఉద్యమం నడిపినట్టుగా తెలంగాణ కోసం పోరాడడం సులభమే. కాని ఒకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలు డిమాండ్లు చేయడం, ప్రశ్నించడం ప్రారంభిస్తారు. వాగ్దానాలను నిలబెట్టుకోలేనివారిని ప్రజలు శిక్షిస్తారు. ఈ ఏడాదిలో ఏదో ఒక రాష్ట్రంలోనైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని అనిపించుకోవడం కోసం కాంగ్రెస్ తంటాలు పడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారును ఏర్పాటు చేయలేకపోతే ఆంధ్రప్రదేశ్‌ను విభజించడంలో అర్థం లేదు.
కేసీఆర్ వెనకడుగు
తెలంగాణ ఏర్పడిన తక్షణం కాంగ్రెస్‌లో తమ పార్టీని విలీనం చేస్తామని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు తటపటాయించడానికి కారణాలు లేకపోలేదు. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలిపేస్తే కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ముగిసినట్టే. అంతేకాదు టీఆర్‌ఎస్ కథ సమాప్తమవుతుంది. ఆయనకు ఏ ప్రత్యేకతా ఉండదు. మునిగిపోతున్న పడవలో కాలుపెట్టేందుకు కేసీఆర్ సిద్ధంగా లేరు. మరోవైపు ఎల్‌జేపీ నేత రామ్‌విలాస్ పాశ్వాన్ కూడా గాలివాటాన్ని గ్రహించి కాంగ్రెస్‌కు దూరంగా జరిగిపోయినప్పుడు... కేసీఆర్ కాంగ్రెస్ పడవలో ఎందుకు ఎక్కుతారు? అది రాజకీయ ఆత్మహత్యాసదృశం అవుతుంది.
టీఆర్‌ఎస్ విలీనం జరిగితే బీజేపీకి సహజంగానే ఆగ్రహం కలిగిస్తుంది. సూత్రరీత్యా తెలంగాణకు బీజేపీ అనుకూలమైనప్పటికీ తాము కాంగ్రెస్‌లో విలీనం కాబోమని టీఆర్‌ఎస్ ఆ పార్టీకి లోపాయికారీగా చెపుతూ వచ్చింది. విభజన బిల్లును ఆపాల్సిందిగా సీమాంధ్ర నాయకుల నుంచి బీజేపీ నాయకత్వంపై తీవ్రఒత్తిడి వచ్చిన దరిమిలా కమలనాథులు కూడా ఒకదశలో డైలమాలో పడ్డారు. ఎన్నికల తర్వాత బీజేపీతో చేతులు కలిపేందుకు టీఆర్‌ఎస్ హామీ ఇచ్చి ఉండవచ్చు. వచ్చే ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నందున కాంగ్రెస్‌లో విలీనమై బీజేపీతో శత్రుత్వం కొనితెచ్చుకునేందుకు టీఆర్‌ఎస్ సిద్ధంగా లేదు.
ఓడిపోయే కాంగ్రెస్ పార్టీలో టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తే జరిగే మేలు ఏమిటి? ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీ పంచన చేరడానికి సైతం వెనకాడరు. హస్తం పార్టీలో విలీనమైతే పూర్తిగా ఓటమి తప్పదని భావిస్తున్న టీఆర్‌ఎస్ అందుకు ఎంతమాత్రం సిద్ధంగా లేదు. కాంగ్రెస్ గడప తొక్కిన తర్వాత వందలాదిమంది నాయకుల్లో తాను ఒకడిగా ఉంటానన్న విషయం కేసీఆర్‌కు తెలుసు. ఉద్యమాన్ని తెలివిగా నియంత్రించవచ్చుకానీ, సర్కారును నడపడం, ఎమ్మెల్యేలను అదుపులో పెట్టడం అంత సులభమేమీ కాదు. తెలివైన ముఖ్యమంత్రే రాష్ట్రాన్ని చక్కదిద్దగలడు.
ఒకవేళ విలీనం జరిగితే తన ఎమ్మెల్యేలు, ఎంపీలకు కావాలనుకున్న సీట్లను ఆయన సాధించుకోలేరు. సహజంగా కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే అన్ని స్థానాల్లోనూ, అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని పది సీట్లలో ఈ రెండు పార్టీలు గెలిచే అవకాశం లేదు. కాని విలీనం జరగకపోతే టీఆర్‌ఎస్ అన్ని సీట్లకూ పోటీ పెట్టుకోవచ్చు. తెలంగాణలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టీఆర్‌ఎస్ తరఫున వేలాది మంది ఉన్నారు. టికెట్లు దొరకని వారంతా తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలుస్తారు. నిజామాబాద్, ఇంకా కొన్ని ఎంపీ సీట్లపై టీఆర్‌ఎస్ దృష్టి పెట్టింది. అలాంటప్పుడు కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీల పరిస్థితి ఏమిటి? కాబట్టి కాంగ్రెస్ వల నుంచి తప్పించుకోవడం టీఆర్‌ఎస్‌కు మంచిది. కాంగ్రెస్‌లో విలీనమైతే టీఆర్‌ఎస్ పరిస్థితి రేపోమాపో ఉద్యోగం ఊడే పెళ్లికొడుకుతో పెళ్లికి సిద్ధమైన పెళ్లికూతురు చందంగా ఉంటుంది.
నిజానికి కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్ పొత్తును మాత్రమే కోరుకుంటోంది. అదికూడా మహారాష్ట్రలో శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ-కాంగ్రెస్ మాదిరి పొత్తులా ఉండాలని భావిస్తోంది. అలా అయితే మొత్తం 119 అసెంబ్లీ స్థానాలలో కచ్చితంగా గెలిచే 50 శాతం సీట్లను తాను ఎంపిక చేసుకుని ఓడిపోయే సీట్లను కాంగ్రెస్‌కు ఇవ్వవచ్చు.
ఎంజీఆర్ ఫార్ములా
తమిళనాడులో చాలాకాలం ఎంజీఆర్ ఫార్ములా నడిచింది. తెలంగాణలోని మూడింట రెండొంతుల ఎంపీ సీట్లు కాంగ్రెస్‌కు ఇచ్చి, శాసనసభలోని మూడింట రెండొంతుల స్థానాలు తాము తీసుకునేలా ఈ ఫార్ములాను టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌కు ప్రతిపాదించింది. ఈ వ్యూహం వల్ల తమిళనాడులో కాంగ్రెస్ భూస్థాపితమయ్యింది. సోనియాగాంధీ ఇలాంటి ఆత్మహత్యాసదృశ నిర్ణయం తీసుకోరు.
విలీనం కన్నా ఒంటరిగా పోటీ చేయడమే మేలని టీఆర్‌ఎస్ భావించవచ్చు. 60 సీట్లకు పోటీ చేసి 20 నుంచి 30 సీట్లలో గెలిస్తే ప్రయోజనం ఏముంటుంది? పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా అలాంటి ఫలితాలు వస్తే ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్ పెద్ద ప్రభావం చూపలేదు. రాష్ట్రాల ఆవిర్భావం కోసం ఉద్యమించిన పార్టీలు అవి ఏర్పడిన తర్వాత నామరూపాలు లేకుండా కనుమరుగయ్యాయి. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ ఏర్పాటు కోసం పోరాడిన సిసలైన పార్టీలను ఎవరు గుర్తుంచుకున్నారు? చరిత్ర చెప్పే పాఠాలు సరైనవే అయితే రేపు టీఆర్‌ఎస్ కూడా అదృశ్యం కావచ్చు.
మూడు మార్గాలు
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో గెలిచే అవకాశం ఉన్న సీట్లలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడమే టీఆర్‌ఎస్‌కు ఉన్న మంచి మార్గం. అది కాని పక్షంలో ఒంటరిగా పోటీ చేయాలి. ఈ రెండు సాధ్యం కానప్పుడు మూడో మార్గం విలీనం. తమ పార్టీ విలీనమైతే టీడీపీ-బీజేపీ ఏకమై కాంగ్రెస్‌ను ఓడిస్తాయంటూ టీఆర్‌ఎస్ కొత్త వాదనను తెరపైకి తెస్తోంది. ఈ వాదన ద్వారా కాంగ్రెస్‌ను భయపెట్టాలని చూస్తోంది. ఇలాంటి ఒత్తిళ్లకు సోనియా సులభంగా తలొగ్గుతారు కాబట్టి టీఆర్‌ఎస్ నాయకులు ఇలా నరుక్కుని వస్తున్నారు.
టీఆర్‌ఎస్‌ను తనలో కలిపేసుకునేందుకు కాంగ్రెస్ చతురతను ప్రదర్శిస్తోంది. ఒకవేళ ఆ పార్టీ మొండికేస్తే బెదరగొడుతుంది. టీఆర్‌ఎస్ విలీనానికి ఒప్పుకోదన్న విషయం కూడా ఆ పార్టీకి తెలుసు. తన దారికి రాకపోతే విమర్శలకు దిగుతుంది. తర్వాత ప్రజాక్షేత్రంలోకి కూడా దిగుతుంది. తెలంగాణ ఇచ్చిన తాము కావాలో, ఎలాంటి భవిష్యత్తులేని టీఆర్‌ఎస్ కావాలో తేల్చుకొమ్మని ప్రజలకు చెపుతుంది. తెలంగాణ ఇచ్చినందుకు తమకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రజలను కోరుతుంది. కాని కాంగ్రెస్‌లో కలిసిపోతే టీఆర్‌ఎస్ రాజకీయ అస్తిత్వం కోల్పోతుంది. బీజేపీ అంతా గమనిస్తోంది. టీఆర్‌ఎస్ తనకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని బీజేపీ కోరుతుంది. ఇదో తెలుగు సినిమా కథలా ఉంటుంది. మాటను నిలబెట్టుకునేందుకు ఓడిపోయే పార్టీలో విలీనం కావాలా? భవిష్యత్తులో బీజేపీతో చేతులు కలపాలా? లేదా తటస్థంగా కొనసాగాలా?ఏదీ అంత సులభం కాదు. ఇది ముంగిస, పాము మధ్య కొట్లాట లాంటిది. ఈ పోరులో ఏదో ఒకటే బతుకుతుంది.
విశ్లేషణ: పెంటపాటి పుల్లరావు (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు)