విశ్లేషణ
తిరుగులేదనుకున్న గుజరాత్‌లో వ్యతిరేక పవనాలు అటు ప్రధాని మోదీని, ఇటు బీజేపీని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. గెలుపుకు ఢోకా లేనప్పటికీ అక్కడ పరిస్థితి మారిందన్నదే ఈ కలవరపాటుకు కారణం.
గుజరాత్ లోని తన స్వస్థలమైన వాద్‌నగర్‌ని 2017 అక్టోబర్ 8న సందర్శించిన ప్రధాని నరేంద్రమోదీ దేవుళ్లు తనను రక్షిస్తారంటూ భావోద్వేగం ప్రదర్శిం చారు. మోదీ తీవ్రంగా కలవరపడుతున్నారని, తన భవిష్యత్తు పట్ల ఆందోళన చెందుతున్నారని చెప్పడానికి ఇదొక స్పష్టమైన సంకేతం. సొంత రాష్ట్రాన్ని పదేపదే సందర్శించడం, ఎన్నికలకు ముందు వరాలు గుప్పించడం చూస్తుంటే గుజరాత్ ఎన్నికలు మోదీని తీవ్రంగా కలవరపెడుతున్నట్లు స్పష్టమవుతోంది. గుజరాత్‌లో గౌరవప్రదమైన విజయం మోదీకి ఇప్పుడు చాలా అవసరం. 2012 గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాల స్థాయి తాజా ఎన్నికల్లో పొందకుంటే ఢిల్లీలో మోదీ పాలన సంక్లిష్టమవుతుంది. ఈ పరిస్థితి మోదీ స్వయంగా కొనితెచ్చుకున్నదే. గుజరాత్‌లో బీజేపీ విజయానికి ఢోకా లేకపోవచ్చు కానీ నరేంద్రమోదీ పట్ల గుజరాత్ ఇప్పుడు కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నట్లుంది. మోదీ ప్రధానిగా తమకు మంచి చేస్తారా లేదా అనే విషయంపైనే గుజరాత్ ప్రజలు కలవరపడుతున్నారు.
గుజరాత్ శాసనసభకు 2017 డిసెంబర్ నెలలో జరగనున్న ఎన్నికలు మోదీకి, అమిత్ షాకు అతి పెద్ద సవాలుగా మారాయి. తన రాజకీయ రాజధానిపై మోదీ పెద్దగా ఖర్చుపెట్టకుండానే, గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ సునాయాస విజయాన్ని సాధించాల్సి ఉండె. కానీ దురదృష్టవశాత్తూ మోదీ, షాలు విజయాలను వినమ్రంగా స్వీకరించి వాటినుంచి నేర్చుకోవడం లేదు. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత అసొం, ఈశాన్య భారత్, హరియాణా, ఉత్తరాంచల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో మోదీ, షా ద్వయం బీజేపీకి ఘన విజయాలు సాధించిపెట్టారు. కానీ ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాల్లో కూడా ప్రధాని కనిపించడం మోదీ ప్రతిష్టను మసకబార్చింది. 7 నెలల క్రితం జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోదీ సునాయాస విజయం సాధిస్తారని అందరూ అంగీకరించారు. కానీ ఇప్పుడు మోదీ–బీజేపీ శిబిరంలో చాలా కలవరపాటు కనిపిస్తోంది.
ప్రమాద సంకేతాలు గుజరాత్ నుంచే మొదటగా వచ్చాయి. 2017 సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ జపనీస్ ప్రధానితో కలసి గుజరాత్‌లో లక్ష కోట్ల రూపాయల విలువైన బుల్లెట్ రైలుకు ప్రారంభోత్సవం చేసినప్పుడు ఇది స్పష్టమైంది. భారత్ భారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుతుంది కాబట్టి ఇది చాలా మంచి ప్రాజెక్టు. కానీ ఈ ఇద్దరు నేతలూ రోడ్ షో చేసిన సందర్భంలో ప్రజలు ఎలాంటి ఆసక్తిని ప్రదర్శించలేదు. దేశంలో కూడా ఈ ఘటనను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ప్రజల్లో ఈ నిరాసక్తి మోదీని దిగ్భ్రాంతికి గురిచేసింది. గుజరాత్ తనను తీవ్రంగా కలవరపాటుకు గురిచేయవచ్చని మోదీ ఎట్టకేలకు గుర్తించారు. కాగా, గుజరాత్‌లో మోదీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఒక తాటికి తెచ్చే ప్రయత్నాలను కాంగ్రెస్ చేపట్టింది. ఓబీసీలకు చెందిన యువ నేత అల్పేష్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హార్దిక్ పటేల్, దళిత నేత జిగ్నేష్ మెవానీలు మోదీకి వ్యతిరేకులుగా ఉన్నారు. వీరి మద్దతును కాంగ్రెస్ పొందవచ్చు కూడా. హార్దిక్, మెవానీ, ఠాకూర్ వంటి వారు కేవలం మీడియా సృష్టిమాత్రమేనా అనేది కాలమే చెబుతుంది. కానీ కాంగ్రెస్ చుట్టూ చేరుతున్న ఈ కొత్త స్నేహితులు కచ్చితంగా మోదీని బీజేపీని ప్రస్తుతం కలవరపాటుకు గురిచేస్తున్నారన్నది వాస్తవం.
మోదీ కలవరపాటుకు కారణాలు :
1. పెద్దనోట్ల రద్దుతో మోదీ అనేక తప్పులు చేశారనడంలో సందేహమే లేదు. వ్యాపార రాష్ట్రమైన గుజరాత్ దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే ఎక్కువగానే పెద్దనోట్ల రద్దుతో తీవ్రంగా నష్టపోయిందని మోదీ గ్రహించారు. లక్షలాదిమందికి ఉపాధి కల్పించిన గుజరాత్ నగల పరిశ్రమలో జీఎస్టీ తర్వాత తీవ్ర నిరసనలు చెలరేగాయి. గుజ రాత్ ఆగ్రహాన్ని పసిగట్టిన మోదీ జీఎస్టీలో కాస్త మార్పులు చేయించినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
2. గత మూడేళ్లలో మోదీ దేశ వ్యవసాయ రంగ ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపయ్యేలా చేస్తానని పదే పదే చెబుతూ వచ్చారు. భూసార నాణ్యతా కార్డు, కిసాన్ పరపతి కార్డుల గురించి ప్రతి నీటి చుక్కనూ ఒడిసిపట్టి మరిన్ని పంటలు పండించడం గురించి ప్రధాని నిర్విరామంగా ప్రచారం చేస్తూవచ్చారు. కానీ వీటిలో ఏ ఒక్కటీ పనిచేయలేదని మోదీకి అర్థమైంది.
3. నిన్నా మొన్నటి వరకు మోదీ పెద్దనోట్ల రద్దు, జీఎస్టీకి సంబంధించి మొత్తం ఘనత తనదేనని చెప్పుకుంటూ వచ్చారు. ఉన్నట్లుండి జీఎస్టీ అనేది దేశంలోని అన్ని రాష్ట్రాలు, రాజకీయ నేతల ఏకాభిప్రాయ ఫలితమేనని మాట మార్చారు.
బీజేపీ గుజరాత్ ఎన్నికల్లో గెలవచ్చు కానీ మెజారిటీ ఎంత వస్తుందన్నదే ప్రశ్న. గుజరాత్‌లో విఫలమైతే, బీజేపీలో మోదీకి వ్యతిరేకంగా చిన్నపాటి తిరుగుబాటు రావచ్చు. ఒక వైపు మోదీ, మరొకవైపు తెలుగు రాష్ట్రాల సీఎంలిద్దరు ఈ విషయంలో పాఠాలు నేర్వాలి. మోదీ గుజరాత్‌లో అభివృద్ధి, ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ వచ్చారు. కానీ గుజరాత్ ప్రజలు ఇప్పుడు ఆయనను ఎందుకు కలవరపాటుకు గురిచేస్తున్నారన్నది ప్రశ్న.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాతే అనూహ్య ఘటనలు జరిగిపోతుంటాయి. వాస్తవం ఏమిటంటే.. సొంత రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ తన ఆధిక్యతను కోల్పోయారు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికలు మోదీపై మరిన్ని డిమాండ్లను విధించవచ్చు. బుల్లెట్ రైళ్లు, నర్మదా డ్యామ్‌లు, అమరావతిలు ఆ ఎన్నికలకు అసందర్భం, అప్రస్తుతం కావచ్చు.
పెంటపాటి పుల్లారావు
వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు
ఈ–మెయిల్ : ppr193@gmail.com
Comments
Please login to add a commentAdd a comment