కొత్త రాజకీయ చిత్రానికి శ్రీకారం | UP elections results will make new political image | Sakshi
Sakshi News home page

కొత్త రాజకీయ చిత్రానికి శ్రీకారం

Published Thu, Mar 9 2017 12:47 AM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

కొత్త రాజకీయ చిత్రానికి శ్రీకారం - Sakshi

కొత్త రాజకీయ చిత్రానికి శ్రీకారం

యూపీ ఎన్నికలలో ముస్లింలు వ్యూహాత్మకంగా ఓటు వేశారన్న మాట నిజం. తాము ఓటు వేసే అభ్యర్థి బీజేపీ అభ్యర్థిని ఓడించాలి. గెలిచే అభ్యర్థి ఎస్పీకి చెందినవారైనా అభ్యంతరం లేదు. బీఎస్పీని పక్కన పెట్టి ఎస్పీ అభ్యర్థికి వారు ఓటు వేశారని చెబుతున్నారు. ఇక్కడే ఒక వాస్తవం కూడా చెప్పుకోవాలి. మాయావతి నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు కాబట్టి, ఆమెకంటూ దళితులలో ఒక ఓటు బ్యాంకు ఉందని అంతా నమ్ముతున్నారు. కానీ ఈ అభిప్రాయం స్థిరమైనది కాదు.

ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికలు చరిత్రాత్మ కమనడానికి అనేక కారణాలు కనిపిస్తాయి. శాసనసభల ఎన్నికలకు ఇంత ప్రాధాన్యం రావడం కూడా బహుశా ఇప్పుడే. రెండు రోజుల తరువాత వెలు వడబోతున్న ఈ ఎన్నికల ఫలితాల కోసం దేశమంతా ఎదురుచూడడం ఇందుకే. ఈ ఫలితాలు, ఇంకా చెప్పాలంటే ఉత్తరప్రదేశ్‌ ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీ భవిష్యత్తు మీద త్వరితంగా ప్రభావం చూపుతాయి. అంతే కాదు,  2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల వరకు, అంటే ఈ ముప్పయ్‌ మాసాల కాలంలో మన దేశం, బీజేపీ ఆయన మీద ఎలాంటి విశ్వాసాన్ని ఉంచబోతున్నాయన్న విషయాన్ని కూడా ఆ ఫలితాలు స్పష్టం చేయను న్నాయి.

అఖిలేశ్‌ అడుగు ఎటో!
ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు అఖిలేశ్‌ యాదవ్, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ టిక్కెట్‌తో ప్రమేయం లేని ప్రథమ తరగతి ప్రయాణం సాగించారు. 403 స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 103 స్థానాలను అఖిలేశ్‌ కేటాయించారు. ఆయన ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తండ్రి ములాయం సింగ్‌ను, పినతండ్రి శివ్‌పాల్‌ యాదవ్‌ను కూడా పార్టీ నుంచి తప్పించి, తిరుగులేని నేతగా ఆవిర్భవించిన యువనేత. ఈ ఎన్నికల ఫలితాలు ఆయన భవిష్యత్తును ఏ వైపు మళ్లిస్తాయో నిజంగానే ఆసక్తికరం. ఎస్పీ విజయం సాధించినా, సాధించకున్నా భవిష్యత్తులో ఇక ములాయం లేదా ఆయన అనుచరులు పార్టీ వైపు చూసే పని ఉండదు. నామినేషన్ల ఘట్టానికి కాస్త ముందు తండ్రీ కొడుకుల మధ్య జరిగిన ఘర్షణలో తండ్రినీ, ఆయన అనుచరులనూ అఖిలేశ్‌ బయటకు పంపగలిగారు. ఇంత వేడిలో కూడా తండ్రి ఢిల్లీ ప్రయాణమైతే, ఒక సంస్థతో మాట్లాడి ప్రైవేట్‌ చార్టర్‌ విమానాన్ని ఏర్పాటు చేశారు. ఇంతకీ ములాయం ఎందుకు ఢిల్లీ వెళ్లినట్టు? అఖిలేశ్‌ మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి. అలాంటి అవసరానికి కూడా ఎవరైనా ఇతరులకు విమాన సౌకర్యాన్ని కల్పిస్తారని ఊహించగలమా? నిజానికి అఖిలేశ్‌ మృదు భాషిగా కనిపించాలనీ, మీడియా సన్నిహితునిగా అవతరించాలనీ ఆరాటప డుతున్నారు. రాజకీయంగా చూస్తే రాష్ట్రంలో ఉన్న 18 శాతం ముస్లింలలో బీజేపీ పట్ల భయాన్ని రెచ్చగొట్టడానికి ఆయన తన వంతు కృషి చేశారు. ముస్లిం ఓట్లు ఎస్పీ–కాంగ్రెస్‌ కూటమికి, లేదా మాయావతి నాయకత్వంలోని బీఎస్పీకి పడతాయన్న వాస్తవం అఖిలేశ్‌కు తెలుసు. కాంగ్రెస్‌తో ఎన్నికల మైత్రిని నెరపడం ద్వారా మరిన్ని ఓట్లు సాధించవచ్చునని ఆయన నమ్మకం. ఈ ఎన్నికలలో విజయం సాధిస్తే ఆయన దేశ రాజకీయాలలో వెలిగిపోతారు. నరేంద్ర మోదీకి బలమైన ప్రత్యర్థిగా అవతరిస్తారు. ఓడితే పోయిందేమీ లేదు. అయితే ఒకటి– ములాయం తన జీవితకాలంలో చేయని పని– కాంగ్రె స్‌తో జత కట్టడం, అఖిలేశ్‌ అలవోకగా చేశారు. ఆ విధంగా రాష్ట్రంలో కార్య కర్తలు గానీ, ఓటర్లు గానీ లేని కాంగ్రెస్‌కు ఊపిరి పోశారు.

కాంగ్రెస్‌ ఇంకా మునుగుతుందా? కాస్త తేలుతుందా?
అఖిలేశ్‌ స్నేహ హస్తం అందించడానికి ముందు కాంగ్రెస్‌ పరిస్థితి ఏమిటి? 2014 లోక్‌సభ ఎన్నికలలో 80 స్థానాలకు గాను కేవలం రెండు గెలుచుకున్న పార్టీ అది. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితి ఇంకా దిగజారి పోకుండా ఎవరి అండ దొరుకుతుందా అని అప్పటి నుంచి కాంగ్రెస్‌ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తోంది. ఈ లోపున పార్టీకి పునర్‌ వైభవం తేవ డానికి రాహుల్‌ నాయకత్వంలో జరిగిన ప్రయోగాలు దారుణంగా విఫల మయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో అఖిలేశ్‌ నుంచి పిలుపు రావడం కాంగ్రెస్‌ పాలిట జాక్‌పాట్‌ అయింది. 1989 నుంచి అధికారం లేకుండా అలమటిస్తున్న కాంగ్రెస్‌కు అఖిలేశ్‌ మంత్రివర్గం ఏర్పాటు చేస్తే ఇప్పుడు పదవులు దొర కవచ్చు. పార్టీకి అంతో ఇంతో వైభవం కూడా సంప్రాప్తించవచ్చు. ఈ కూట మికి మూడో స్థానం దక్కితే ఎస్పీ కూడా మళ్లీ కాంగ్రెస్‌ దరిచేరదు. కాబట్టి కాంగ్రెస్‌ కోణం నుంచి చూస్తే, ఏది ఏమైనా ఈ ఎన్నికలలో అఖిలేశ్‌ విజయం సాధించి తీరాలి. ఇందుకు రెండు కారణాలు– ఒకటి ఇన్నేళ్ల తరువాత లభించే అధికార యోగం. రెండు–ఓటమికి అఖిలేశ్‌ కాంగ్రెస్‌ను కూడా దుయ్య బట్టవచ్చు. ఒకవేళ యూపీ ఓటర్లు మరోసారి తిరస్కరిస్తే, అఖిలేశ్‌ తమను మోసం చేశారని కాంగ్రెస్‌ కూడా గగ్గోలు పెడుతుంది.  నిజానికి ఇప్పుడు ఆ రాష్ట్రంలో నిజమైన విజేత కాంగ్రెస్‌ పార్టీయే. ఎందుకంటే కొత్తగా కోల్పో వడానికి ఆ పార్టీకి ఏమీ మిగల్లేదు.

మాయావతి దశ మారుతుందా?
ఉత్తరప్రదేశ్‌ అనే అతిపెద్ద రాష్ట్రానికి నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన నాయకురాలు మాయావతి. కానీ 2012 శాస నసభ ఎన్నికలు, 2014 లోక్‌సభ ఎన్నికలు మాయావతినీ, ఆమె పార్టీ బీఎ స్పీనీ కకావికలు చేశాయి. లోక్‌సభ ఎన్నికలలో అయితే ఆమె పార్టీ ఒక్క స్థానం కూడా దక్కించుకోలేదు. పలువురు పార్టీ ప్రముఖులు బీజేపీలో లేదా ఎస్పీలో చేరిపోయారు. దళిత ఓట్లను కూడా బీజేపీ చీల్చింది. కానీ బిహార్‌లో ఆగర్భ శత్రువులు లాలూ ప్రసాద్, నితీశ్‌కుమార్‌ ఏకమైనట్టు ఉత్తర ప్రదేశ్‌లో మాయావతి పార్టీ వెళ్లి ఎస్పీతో చేరలేదు. మాయావతికి ఒక అంచనా ఉంది. రాష్ట్రంలో దళితులు, ముస్లిం ఓట్లు కలిపి దాదాపు 38 శాతం. ముక్కోణపు పోటీలో 30 శాతం ఓట్లు ఎవరికి వస్తే వారే అధికారం చేపడతారు. ఆమె ముస్లింలకు 100 టిక్కెట్లు ఇవ్వడానికి కారణం ఇదే. కానీ మాయావతి అంచనా నిజమవుతుందా? లేదా? రెండు రోజులలోనే తేలనుంది. మరొక వాస్తవం కూడా ఉంది. ఈ ఎన్నికలలో ముస్లింలు వ్యూహాత్మకంగా ఓటు వేశా రన్న మాట నిజం. తాము ఓటు వేసే అభ్యర్థి బీజేపీ అభ్యర్థిని ఓడించాలి. గెలిచే అభ్యర్థి ఎస్పీకి చెందిన వారైనా అభ్యంతరం లేదు. బీఎస్పీని పక్కన పెట్టి ఎస్పీ అభ్యర్థికి వారు ఓటు వేశారని చెబుతున్నారు. ఇక్కడే ఒక వాస్తవం కూడా చెప్పుకోవాలి. ఆమె నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు కాబట్టి, ఆమెకంటూ దళితులలో ఒక ఓటు బ్యాంకు ఉందని ఆమె నమ్ముతున్నారు. కానీ ఈ అభిప్రాయం స్థిరమైనది కాదు. దళిత ఓట్లను గంప గుత్తగా తెచ్చుకునే ఆకర్షణ ఇప్పుడు మాయావతికి లేదు. ఈ ఎన్నికల తరు వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకుంటే మాయావతి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారవుతుంది. కానీ ఒక అభిప్రాయం కూడా ఉంది. రాజకీయాలలో ఏదైనా సంభవించవచ్చు అన్న సూత్రం ఆధారంగా వచ్చిన అభిప్రాయమిది. హంగ్‌ ఏర్పడి, అఖిలేశ్‌ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తే, ఆ సంకీర్ణ ప్రభుత్వంలో బీఎస్పీ భాగస్వామి అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా మాయావతి అటు వైపు అడుగులు వేయవచ్చు. అయితే ఇంత కీలకమైన రాజకీయ శక్తిగా ఎదగాలంటే ఆమె కనీసం వంద అసెంబ్లీ స్థానాలు సాధించాలి. ఇది సాధ్యం కాకపోతే బీఎస్పీ నిష్క్రమణ ముహూర్తం దగ్గర పడుతుంది. కాబట్టి ఈ ఎన్నికలు మాయా వతికి కీలకమే.

యూపీ, మోదీ, బీజేపీ
ఉత్తరప్రదేశ్‌లో 2002 తరువాత బీజేపీ తన ప్రభను కోల్పోయింది. 2012 అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీకి ప్రజలు ఇచ్చిన స్థానాలు కేవలం 50. అయితే 2014 లోక్‌సభ ఎన్నికలలో 80 స్థానాలకు గాను 73 చోట్ల గెలిచింది. ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ విజయ దుందుభి మోగిస్తే జాక్‌పాట్‌ కొట్టినట్టే. ఒకవేళ ఎదురుదెబ్బ తింటే ఆ పార్టీకి గానీ, ఢిల్లీ ప్రభుత్వానికి గానీ వెంటనే వచ్చే నష్టం ఏమీలేదు. మోదీ ప్రధానిగా కొనసాగుతారు కూడా. కానీ ఆయ నకు ఇబ్బందులు మొదలవుతాయి. కానీ ఒకటి. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలి తాల మీదే ఆ పార్టీ పూర్తిగా ఆధారపడాలని అనుకోవడం లేదని వ్యూహాలను బట్టి అర్థమవుతుంది. పరిపూర్ణమైన జాతీయ పార్టీగా అవతరించేందుకు ఆ పార్టీ కృషి చేస్తోంది. పార్టీకి ప్రాధాన్యం లేని తూర్పు రాష్ట్రాలలోను, దక్షిణా దిన బలపడాలని యత్నిస్తున్నది. అందుకే అసోంతో పాటు బెంగాల్, ఒడి శాలలో కూడా బలోపేతం కావడానికి అడుగులు వేస్తోంది. దక్షిణాదిన ఒక్క కర్ణాటకలోనే ఆ పార్టీ బలంగా ఉంది. లోక్‌సభలో బలం కోసం ఒక్క ఉత్తరాది రాష్ట్రాల మీదే ఆధార పడకూడదన్న ఆ పార్టీ వ్యూహం కూడా దూరదృష్టితో కూడుకున్నదే. 2014లో యూపీ, బిహార్‌లలో ఉన్న 120 లోక్‌సభ స్థానాలకు గాను 101 స్థానాలు కైవసం చేసుకుంది. ఇదే పరిస్థితి ఎప్పుడూ ఉండదు. 2019 ఎన్నికల నాటికి బిహార్‌లో బలమైన ప్రత్యర్థి ఏర్పడవచ్చు. ఉత్తర ప్రదేశ్‌లో కూడా అలాంటి వాతావరణం ఏర్పడవచ్చు. అంటే ఉత్తరాదిన ఆ పార్టీకి స్థానాలు తగ్గుతాయి. కాబట్టి ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలుపే ధ్యేయంగా ఆ పార్టీ వ్యూహాలు రచిస్తున్నది. ప్రతి ఎన్నికను సవాలుగా తీసు కుంటున్నది.కానీ ఇది సరైన వైఖరి అనిపించుకుంటుందా? అసెంబ్లీ ఎన్నికలు ఎక్కడ జరిగినా మోదీని తీసుకురావడం మంచి సంప్రదాయమే అవు తుందా? బిహార్, బెంగాల్, జార్ఖండ్, అసోంలలో బీజేపీని ఎదుర్కొన గల గట్టి విపక్ష శిబిరాలు ఉన్నాయి. ఈ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌ ఫలితాలను బట్టి అక్కడ కూడా విపక్షం బలపడవచ్చు. ఆ రాష్ట్రంలో బీజేపీకి చేరువయ్యే పార్టీ కూడా లేదు. ప్రతిపక్షాల మీద విరుచుకుపడే మోదీ ధోరణి ఇందుకు కారణం. మోదీ పదవి చేపట్టిన తరువాత విపక్ష ఎంపీలకు సాయంచేసే చర్యలు ఏనాడూ తీసుకోలేదు. శత్రువులను తగ్గించుకోవడం, విభజించి పాలించడం చతురుడైన రాజకీయవేత్త లక్షణం. యూపీలో బీజేపీ బలహీన పడిన క్షణంలో మోదీ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ సహజ పరిణామం.

ఏ పార్టీని చూసినా...
ప్రస్తుతం యూపీ అధికారం కోసం తీవ్రంగా పోరాడిన నాలుగు పార్టీలు కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించలేదంటే అతిశయోక్తి కాదు. ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలలో కూడా అదే ధోరణి వ్యక్తమైంది. మితిమీరిన ధన వ్యయం, కులమతాల కార్డులు ఆ పార్టీలు యథేచ్ఛగా ఉపయోగించాయి. ఇది దేశ క్షేమానికి మంచిది కాదు. ప్రచారం కోసం, నాయకుల పర్యటన కోసం వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చయింది. ఏదో ఒక పార్టీ ఎన్నికలలో నెగ్గు తుంది. కానీ ఈ క్రమంలో పతనమైన విలువల మాటేమిటి? వచ్చే పద కొండో తేదీ వీరికి ఏదైనా గుణపాఠం నేర్పగలదేమో చూద్దాం!


- పెంటపాటి పుల్లారావు

వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు
ఈ–మెయిల్‌ : ppr193@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement