ఊతమైనా.. శరాఘాతమైనా..!
విశ్లేషణ
ఒకవేళ అఖిలేశ్ ఓడినా అదొక పెద్ద విషయమేమీ కాదు. కానీ బీజేపీ ఓడితే మాత్రం పెద్ద పరిణామాల కోసం ఎదురు చూడవచ్చు. ప్రస్తుతానికి బీజేపీ విజయ పథంలో ఉండవచ్చు. కానీ 2019 నాటికి అఖిలేశ్ అనే జాతీయ స్థాయి నేతతో బెడదను ఎదుర్కొనక తప్పకపోవచ్చు.
ఐదు రాష్ట్రాలకు ఎన్నికల కమిషన్ ఎన్ని కల షెడ్యూలు ప్రకటించింది. ఆ ఐదిం టిలో ప్రస్తుతం పంజాబ్ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి. గోవాలో ఆ పార్టీదే ప్రభుత్వం. ఉత్తరాంచల్ కాంగ్రెస్ ఏలు బడిలో ఉంది. కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ఉంది. ఈశా న్యంలోని మణిపూర్‌లో ప్రాంతీయ పార్టీల పట్టు కొనసాగుతోంది. ఈ అసెంబ్లీ ఎన్ని కలలో విజయం సాధించాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పట్టుదలతో ఉంది. దీనినొక సవాలుగా చేసుకుంది. రెండు అంశా లతో ఇప్పుడు అందరి దృష్టి ఉత్తరప్రదేశ్ మీదే ఉంది. ఒకటి– 2014 లోక్‌సభ ఎన్నికలలో 80 స్థానాలకు గాను 71 చోట్ల బీజేపీ విజయం సాధించింది. రెండు–ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎస్పీలో ఇటీ వల తలెత్తిన సంక్షోభం. 80 స్థానాలకు గాను, 71 చోట్ల విజయం సాధిస్తే అసెంబ్లీ ఎన్నికలలో కూడా బీజేపీయే పాగా వేస్తుందని ఎవ రైనా భావిస్తారు. కానీ వాతావరణం అలా ఉందా? మరో పదేళ్ల పాటు కేంద్రంలో తామే అధికారంలో ఉంటామని 2016 సంవత్సరం ఆరంభంలో మోదీ, బీజేపీ ఘంటాపథంగా ప్రకటించడం కనిపించేది. కానీ 2017 ఆరంభం నుంచే అలాంటి అట్టహాసపు జోస్యాలు ఆగిపోయాయి.
నవంబర్ 8, 2016న ప్రక టించిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారం అనూహ్యంగా వ్యవస్థను సంక్షుభితం చేసింది. బీజేపీ ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఈ సంగతి పార్టీ నేతలు కూడా గుర్తించారు. అదే సమయంలో ఈ సమ స్యకు పరిష్కారం లేదన్న వాస్తవాన్ని కూడా గుర్తించారు. అయితే మోదీ తన ఎజెండాను ఇంకా పూర్తి చేయవలసి ఉంది. ఆ విధంగా అయినా ఉన్న బలాన్ని కాపాడుకోవాలి. స్వచ్ఛభారత్, వాణిజ్యానికి అనువైన వాతావరణం కల్పించడం, ఇరుగు పొరుగుతో సత్సం బంధాలు, ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించడం వంటి కొన్ని మంచి పను లను మోదీ సాధించారు. ఇంత సజావుగా సాగుతున్న మోదీ ప్రభుత్వాన్ని హఠాత్తుగా చావోరేవో స్థితికి తీసుకువచ్చినదే నోట్ల రద్దు చర్య. బ్యాంకులలో ఉన్న తమ సొమ్మునే తాము తీసుకోవడా నికి సాధ్యం కాని ఒక దుస్థితిలో భారతీయులు పడిపోయిన క్షణ మది. ‘మీ ఖాతాలలో సొమ్మును మీరు వెనక్కి తీసుకునే అవకాశం లేని మరో దేశాన్ని ఎక్కడైనా చూపించండి!’ అని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ వ్యాఖ్యానించారు. అరవై రోజులలో గట్టి ఎన్నికల సవాలును ఎదుర్కొంటున్న బీజేపీని ఈ వాక్యమే వెంటాడుతోంది. నోట్ల రద్దు ముందు రోజు వరకు గోవా, ఉత్తరాంచల్, ఉత్తరప్రదే శ్‌లలో విజయం తమదేననీ, అకాలీల అసమర్ధ పాలన వల్ల పంజాబ్ చేజారిపోవచ్చుననీ బీజేపీ నేతల అంచనా. ఉత్తరప్రదేశ్‌లో ఈసారి గట్టి పోటీ తప్పదని అంతా అనుకుంటున్నదే. కానీ విజయం మాత్రం తమదేనని బీజేపీ చెప్పుకుంది. బీజేపీ చూపించిన ఈ అత్యుత్సాహం ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లలో చురు కును పెంచింది.
బీజేపీతో పోరాటానికి కనీసం రెండు ప్రతిపక్షాల మధ్య సయోధ్య అవసరమని అవి గుర్తించాయి. ఉత్తరప్రదేశ్ రాజకీయ వ్యవహారాలలో అమిత్‌షా అంత చొరవ ప్రదర్శించి ఉండకపోతే, విపక్షాలు తమలో తామే కుమ్ములాడుకునేవి. నిజానికి అమిత్‌షా అసాధారణమైన నిర్వహణ సామర్థ్యం కలిగిన నాయకుడు. ఉత్తర ప్రదేశ్‌తో పాటు, ఇతర చోట్ల కూడా అందుకు తగిన యంత్రాం గాన్ని రూపొందించి పెట్టుకున్నారు. కానీ ఆయన అతిగా ప్రచారం చేశారు. నోట్ల రద్దు చర్యతో ఆగ్రహించిన జనం ఇప్పుడు ప్రతిపక్షం వైపు చూస్తున్నారు. బహుళ రాజకీయ పక్షాలు ఉన్న భారత్ వంటి దేశంలో ఎన్నికలలో ఓటమికి ఐదు శాతం ఓట్లు అటూ ఇటూ అయితే చాలు. కాబట్టి ప్రస్తుతం నరేంద్ర మోదీ ఉన్న బలం చెదిరి పోకుండా జాగ్రత్త పడడానికే కష్టించవలసి ఉంది. ఏ విధంగా చూసినా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ తాను పన్నిన ఉచ్చులో తానే పడింది. మణిపూర్, ఉత్తరాంచల్, పంజాబ్, గోవాలలో విజయం మోదీకి లెక్క కాదు. ఇంకా చెప్పాలంటే, ఉత్తరప్రదేశ్ తప్ప ఈ నాలుగు రాష్ట్రాలలో విజయం సాధించినా అదేమీ లెక్కలోకి రాదు. ఈ నాలుగు రాష్ట్రాలు కోల్పోయినా, ఉత్తరప్రదేశ్‌లో కమల వికాసం జరిగితే మోదీకి అసలైన విజయం కాగలదు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 403 స్థానాలు ఉన్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. 325 అసెంబ్లీ స్థానాలలో స్పష్టమైన ఆధిక్యం కనిపించింది. నరేంద్ర మోదీ గెలిచిన వారణాసి స్థానం కూడా ఆ రాష్ట్రంలోనిదే. అందుకే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఈసారి మా ఖాతాలోనే పడుతుందని 2014 నుంచి బీజేపీ ప్రకటించుకుంటున్నది. కానీ ఇప్పుడు పరిస్థితి అస్థిరంగానే ఉంది. ఒకటి వాస్తవం 2014లో జరిగినవి పార్లమెంట్ ఎన్నికలు. దేశమంతటా మోదీ గాలి వీచింది.
ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఓటర్లు ముఖ్యమంత్రిని ఎన్నుకుం టారు. అక్కడ ఇటీవలి మరో పెద్ద పరిణామం, ఎస్పీ అధినేత ములాయం, ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేశ్‌కు మధ్య రగడ. ఇది అఖిలేశ్ భవిష్యత్తుకు చేటు చేసేది కాదు. పైగా ఆయన ప్రతిష్టను పెంచింది. అంతే కాకుండా అఖిలేశ్ తండ్రి కంటే ఎంతో ముందంజలో ఉన్నారు. ఇప్పుడు ఆయన తిరుగులేని నేత. అజాత శత్రువుగా పేర్గాంచారు. ఈ ఎన్నికలలో మోదీ ఓడితే ఇక్కట్లు ప్రారంభం కావడం తథ్యం. ఇక పార్లమెంటుకు వెళ్లే పనే ఉండదు. ప్రస్తుతానికి మౌనం దాల్చిన శత్రుఘ్ను సిన్హా వంటివారు గళం విప్పుతారు. అయితే రాహుల్, మాయావతి ప్రస్తుతం చలామణీలో లేని నేతలుగా మిగిలారు. వారు ప్రజలకు చేసిందేమీ లేదు. కాబట్టి మోదీకి అసలైన సవాలు అఖిలేశ్ నుంచే. బీజేపీకి పోటీ ఇవ్వగల నేతగా ఆయన ఎదగడమే ఇందుకు నిదర్శనం. మరొక వాస్తవం ఉంది. ఒకవేళ అఖిలేశ్ ఓడినా అదొక పెద్ద విషయమేమీ కాదు. కానీ బీజేపీ ఓడితే మాత్రం పెద్ద పరిణామాల కోసం ఎదురు చూడ వచ్చు. ప్రస్తుతానికి బీజేపీ విజయ పథంలో ఉండవచ్చు. కానీ 2019 నాటికి అఖిలేశ్ అనే జాతీయ స్థాయి నేతతో బెడదను ఎదు ర్కొనక తప్పకపోవచ్చు.
(వ్యాసకర్త : పెంటపాటి పుల్లారావు రాజకీయ విశ్లేషకులు
ఈ–మెయిల్ : ppr193@gmail.com )