Samajwadi Party Conflicts
-
ఒకే వేదికపై అఖిలేష్-ములాయం
సాక్షి, లక్నో : దాదాపు ఏడాది తరువాత సమాజ్‌వాదీ వ్యవస్థాపకనేత ములాయం సింగ్ యాదవ్, పార్టీ ప్రస్తుతం అధ్యక్షుడు, ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ గురువారం ఒకే వేదికమీద కనిపించారు. ఒకే వేదికమీద ఇద్దరు నేతలు కనిపించడం.. పక్కపక్కనే కూర్చోవడం వంటి దృశ్యాలతో సమాజ్ వాదీ కార్యకర్తల్లో ఆనందం వ్యక్తం చేశారు. ఇద్దరు నేతల మధ్య మళ్లీ తత్సంబంధాలు ఏర్పడేందుకు ఇది దోహదం చేస్తుందని సమాజ్‌వాదీ కీలక నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకూ ఏం జరిగిందంటే.. గురువారం నాడు ప్రముఖ సోషలిస్ట్ నేత రామ్ మనోహర్ లోహియా 50వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిలేష్, ములాయం పక్కపక్కనే కూర్చుకున్నారు. ఈ ఇద్దరినీ ఇలా చూడ్డంతో కార్యకర్తలు ఒక్కసారిగా ఉద్వేగానికిలోనయ్యారు. కొద్దిసేపటి తరువాత ఇరువురు నేతలు లోహియా విగ్రహానికి నివాళులర్పించి వెళ్లిపోయారు. -
ఎస్పీ అధినేతగా అఖిలేష్
సాక్షి, న్యూఢిల్లీ : సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) జాతీయ అధ్యక్షుడిగా ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ సీనియర్ నేత రాంగోపాల్ యాదవ్ గురువారం ప్రకటించారు. గురువారం ఆగ్రాలో జరిగిన ఎస్పీ జాతీయ సదస్సులో అధినేత ఎన్నిక జరిగింది. అఖిలేష్ యాదవ్ పార్టీ అధ్యక్షుడిగా ఐదేళ్ల పాటు కొనసాగుతారని ఆయన తెలిపారు. అఖిలేష్ యాదవ్ నాయత్వంలోనే 2019 లోక్‌సభ, 2022 ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. అయితే సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, అఖిలేష్ తండ్రి అయిన ములాయం సింగ్ యాదవ్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడి పదవీకాలం గతంలో మూడేళ్లు ఉండగా.. దానిని పార్టీ రాజ్యాంగాన్ని సవరించి ఐదేళ్లకు పెంచినట్లు రాంగోపాల్ యాదవ్ తెలిపారు. యూపీ ఎన్నికల సమయంలో ములాయంకు, అఖిలేష్‌కు మధ్య విభేధాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. సమయంలోనే ములాయంను పార్టీ అధ్యక్షుడిగా తొలగించి ఆ స్థానాన్ని అఖిలేష్ ఆక్రమించారు. దీంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు ములాయం దూరంగా ఉంటున్నారు. ఈ కారణం వల్లనే అఖిలేష్ యాదవ్ స్వయంగా ఆహ్వానించినప్పటికీ ములాయం సింగ్ యాదవ్ ఆగ్రా సమావేశానికి రాలేదనే వ్యాఖ్యలు వస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై స్వయంగా అఖిలేష్ స్పందిస్తూ.. నేతాజీ ’ములాయం‘ నన్ను ఫోన్లోనే ఆశీర్వదించారని చెప్పారు. అలాగే శివపాల్ యాదవ్ కూడా నన్ను ప్రత్యేకంగా అభినందించారని ఆయన తెలిపారు. -
ఊతమైనా.. శరాఘాతమైనా..!
విశ్లేషణ ఒకవేళ అఖిలేశ్ ఓడినా అదొక పెద్ద విషయమేమీ కాదు. కానీ బీజేపీ ఓడితే మాత్రం పెద్ద పరిణామాల కోసం ఎదురు చూడవచ్చు. ప్రస్తుతానికి బీజేపీ విజయ పథంలో ఉండవచ్చు. కానీ 2019 నాటికి అఖిలేశ్ అనే జాతీయ స్థాయి నేతతో బెడదను ఎదుర్కొనక తప్పకపోవచ్చు. ఐదు రాష్ట్రాలకు ఎన్నికల కమిషన్ ఎన్ని కల షెడ్యూలు ప్రకటించింది. ఆ ఐదిం టిలో ప్రస్తుతం పంజాబ్ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి. గోవాలో ఆ పార్టీదే ప్రభుత్వం. ఉత్తరాంచల్ కాంగ్రెస్ ఏలు బడిలో ఉంది. కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ఉంది. ఈశా న్యంలోని మణిపూర్‌లో ప్రాంతీయ పార్టీల పట్టు కొనసాగుతోంది. ఈ అసెంబ్లీ ఎన్ని కలలో విజయం సాధించాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పట్టుదలతో ఉంది. దీనినొక సవాలుగా చేసుకుంది. రెండు అంశా లతో ఇప్పుడు అందరి దృష్టి ఉత్తరప్రదేశ్ మీదే ఉంది. ఒకటి– 2014 లోక్‌సభ ఎన్నికలలో 80 స్థానాలకు గాను 71 చోట్ల బీజేపీ విజయం సాధించింది. రెండు–ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎస్పీలో ఇటీ వల తలెత్తిన సంక్షోభం. 80 స్థానాలకు గాను, 71 చోట్ల విజయం సాధిస్తే అసెంబ్లీ ఎన్నికలలో కూడా బీజేపీయే పాగా వేస్తుందని ఎవ రైనా భావిస్తారు. కానీ వాతావరణం అలా ఉందా? మరో పదేళ్ల పాటు కేంద్రంలో తామే అధికారంలో ఉంటామని 2016 సంవత్సరం ఆరంభంలో మోదీ, బీజేపీ ఘంటాపథంగా ప్రకటించడం కనిపించేది. కానీ 2017 ఆరంభం నుంచే అలాంటి అట్టహాసపు జోస్యాలు ఆగిపోయాయి. నవంబర్ 8, 2016న ప్రక టించిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారం అనూహ్యంగా వ్యవస్థను సంక్షుభితం చేసింది. బీజేపీ ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఈ సంగతి పార్టీ నేతలు కూడా గుర్తించారు. అదే సమయంలో ఈ సమ స్యకు పరిష్కారం లేదన్న వాస్తవాన్ని కూడా గుర్తించారు. అయితే మోదీ తన ఎజెండాను ఇంకా పూర్తి చేయవలసి ఉంది. ఆ విధంగా అయినా ఉన్న బలాన్ని కాపాడుకోవాలి. స్వచ్ఛభారత్, వాణిజ్యానికి అనువైన వాతావరణం కల్పించడం, ఇరుగు పొరుగుతో సత్సం బంధాలు, ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించడం వంటి కొన్ని మంచి పను లను మోదీ సాధించారు. ఇంత సజావుగా సాగుతున్న మోదీ ప్రభుత్వాన్ని హఠాత్తుగా చావోరేవో స్థితికి తీసుకువచ్చినదే నోట్ల రద్దు చర్య. బ్యాంకులలో ఉన్న తమ సొమ్మునే తాము తీసుకోవడా నికి సాధ్యం కాని ఒక దుస్థితిలో భారతీయులు పడిపోయిన క్షణ మది. ‘మీ ఖాతాలలో సొమ్మును మీరు వెనక్కి తీసుకునే అవకాశం లేని మరో దేశాన్ని ఎక్కడైనా చూపించండి!’ అని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ వ్యాఖ్యానించారు. అరవై రోజులలో గట్టి ఎన్నికల సవాలును ఎదుర్కొంటున్న బీజేపీని ఈ వాక్యమే వెంటాడుతోంది. నోట్ల రద్దు ముందు రోజు వరకు గోవా, ఉత్తరాంచల్, ఉత్తరప్రదే శ్లలో విజయం తమదేననీ, అకాలీల అసమర్ధ పాలన వల్ల పంజాబ్ చేజారిపోవచ్చుననీ బీజేపీ నేతల అంచనా. ఉత్తరప్రదేశ్‌లో ఈసారి గట్టి పోటీ తప్పదని అంతా అనుకుంటున్నదే. కానీ విజయం మాత్రం తమదేనని బీజేపీ చెప్పుకుంది. బీజేపీ చూపించిన ఈ అత్యుత్సాహం ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లలో చురు కును పెంచింది. బీజేపీతో పోరాటానికి కనీసం రెండు ప్రతిపక్షాల మధ్య సయోధ్య అవసరమని అవి గుర్తించాయి. ఉత్తరప్రదేశ్ రాజకీయ వ్యవహారాలలో అమిత్‌షా అంత చొరవ ప్రదర్శించి ఉండకపోతే, విపక్షాలు తమలో తామే కుమ్ములాడుకునేవి. నిజానికి అమిత్‌షా అసాధారణమైన నిర్వహణ సామర్థ్యం కలిగిన నాయకుడు. ఉత్తర ప్రదేశ్‌తో పాటు, ఇతర చోట్ల కూడా అందుకు తగిన యంత్రాం గాన్ని రూపొందించి పెట్టుకున్నారు. కానీ ఆయన అతిగా ప్రచారం చేశారు. నోట్ల రద్దు చర్యతో ఆగ్రహించిన జనం ఇప్పుడు ప్రతిపక్షం వైపు చూస్తున్నారు. బహుళ రాజకీయ పక్షాలు ఉన్న భారత్ వంటి దేశంలో ఎన్నికలలో ఓటమికి ఐదు శాతం ఓట్లు అటూ ఇటూ అయితే చాలు. కాబట్టి ప్రస్తుతం నరేంద్ర మోదీ ఉన్న బలం చెదిరి పోకుండా జాగ్రత్త పడడానికే కష్టించవలసి ఉంది. ఏ విధంగా చూసినా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ తాను పన్నిన ఉచ్చులో తానే పడింది. మణిపూర్, ఉత్తరాంచల్, పంజాబ్, గోవాలలో విజయం మోదీకి లెక్క కాదు. ఇంకా చెప్పాలంటే, ఉత్తరప్రదేశ్ తప్ప ఈ నాలుగు రాష్ట్రాలలో విజయం సాధించినా అదేమీ లెక్కలోకి రాదు. ఈ నాలుగు రాష్ట్రాలు కోల్పోయినా, ఉత్తరప్రదేశ్‌లో కమల వికాసం జరిగితే మోదీకి అసలైన విజయం కాగలదు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 403 స్థానాలు ఉన్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. 325 అసెంబ్లీ స్థానాలలో స్పష్టమైన ఆధిక్యం కనిపించింది. నరేంద్ర మోదీ గెలిచిన వారణాసి స్థానం కూడా ఆ రాష్ట్రంలోనిదే. అందుకే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఈసారి మా ఖాతాలోనే పడుతుందని 2014 నుంచి బీజేపీ ప్రకటించుకుంటున్నది. కానీ ఇప్పుడు పరిస్థితి అస్థిరంగానే ఉంది. ఒకటి వాస్తవం 2014లో జరిగినవి పార్లమెంట్ ఎన్నికలు. దేశమంతటా మోదీ గాలి వీచింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఓటర్లు ముఖ్యమంత్రిని ఎన్నుకుం టారు. అక్కడ ఇటీవలి మరో పెద్ద పరిణామం, ఎస్పీ అధినేత ములాయం, ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేశ్‌కు మధ్య రగడ. ఇది అఖిలేశ్ భవిష్యత్తుకు చేటు చేసేది కాదు. పైగా ఆయన ప్రతిష్టను పెంచింది. అంతే కాకుండా అఖిలేశ్ తండ్రి కంటే ఎంతో ముందంజలో ఉన్నారు. ఇప్పుడు ఆయన తిరుగులేని నేత. అజాత శత్రువుగా పేర్గాంచారు. ఈ ఎన్నికలలో మోదీ ఓడితే ఇక్కట్లు ప్రారంభం కావడం తథ్యం. ఇక పార్లమెంటుకు వెళ్లే పనే ఉండదు. ప్రస్తుతానికి మౌనం దాల్చిన శత్రుఘ్ను సిన్హా వంటివారు గళం విప్పుతారు. అయితే రాహుల్, మాయావతి ప్రస్తుతం చలామణీలో లేని నేతలుగా మిగిలారు. వారు ప్రజలకు చేసిందేమీ లేదు. కాబట్టి మోదీకి అసలైన సవాలు అఖిలేశ్ నుంచే. బీజేపీకి పోటీ ఇవ్వగల నేతగా ఆయన ఎదగడమే ఇందుకు నిదర్శనం. మరొక వాస్తవం ఉంది. ఒకవేళ అఖిలేశ్ ఓడినా అదొక పెద్ద విషయమేమీ కాదు. కానీ బీజేపీ ఓడితే మాత్రం పెద్ద పరిణామాల కోసం ఎదురు చూడ వచ్చు. ప్రస్తుతానికి బీజేపీ విజయ పథంలో ఉండవచ్చు. కానీ 2019 నాటికి అఖిలేశ్ అనే జాతీయ స్థాయి నేతతో బెడదను ఎదు ర్కొనక తప్పకపోవచ్చు. (వ్యాసకర్త : పెంటపాటి పుల్లారావు రాజకీయ విశ్లేషకులు ఈ–మెయిల్ : ppr193@gmail.com ) -
‘సైకిల్’ సమరంలో ఇద్దరు కోడళ్లు!
-
‘సైకిల్’ సమరంలో ఇద్దరు కోడళ్లు!
► సమాజ్ వాది పార్టీ ముసలంలో ములాయం కోడళ్ల పాత్ర ఏమిటి? ► అఖిలేశ్ కు పోటీగా చిన్న కోడలు అపర్ణను రంగంలోకి దించిన సాధన ► ‘ముప్పు’ను పసిగట్టి భర్తకు అండగా నిలిచిన పెద్ద కోడలు డింపుల్ (సాక్షి నాలెడ్జ్ సెంటర్) సమాజ్ వాదీ పార్టీ ‘కుటుంబం’లో ముదిరిన ముసలంలో ములాయం కోడళ్ల పాత్ర ఏమిటి? పార్టీలో ఆధిపత్యం కోసం తండ్రీ కొడుకుల మధ్య సాగుతున్న పోరాటంలో కోడళ్లు ఎటు ఉన్నారు? పార్టీని తండ్రి చేతుల్లోంచి తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న పెద్ద కొడుకు అఖిలేశ్ యాదవ్‌కు ఆయన భార్య డింపుల్ అండగా నిలిచారు. ములాయం చిన్న కొడుకు ప్రతీక్ భార్య అపర్ణ.. ములాయం శిబిరంలో ఇంకా ఖచ్చితంగా చెప్తే శివ్‌పాల్ శిబిరంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘ప్రమాదాన్ని’ ముందే పసిగట్టిన డింపుల్..: వాస్తవానికి.. అఖిలేశ్‌ను 2012లో ముఖ్యమంత్రిగా ప్రకటించే సమయంలోనే.. ములాయం రెండో భార్య, అఖిలేశ్ సవతి తల్లి అయిన సాధనాగుప్తా.. తన కుమారుడైన ప్రతీక్‌ను ములాయం వారసుడిగా ప్రతిష్టించాలని కోరుకున్నారు. అయితే ప్రతీక్ రాజకీయాలను కాదని, రియల్ఎస్టేట్ వ్యాపారాన్ని ఎంచుకున్నారు. దీంతో ప్రతీక్ భార్య, తన కోడలు అపర్ణను అఖిలేశ్‌కు పోటీగా దించాలని సాధనాగుప్తా నిర్ణయించారు. ఈ వ్యూహాన్ని పసిగట్టిన డింపుల్ తన భర్త అఖిలేశ్‌ను అప్రమత్తం చేశారు. దీంతో ఆయన తన తండ్రి ములాయంను ప్రతి రోజూ కలుస్తూ జాగ్రత్తలు తీసుకునేవారు. అయినా కూడా తండ్రి నివాసం నుంచి సాధనాగుప్తాతో పాటు తన బాబాయి శివ్‌పాల్‌లు తనకు ఇబ్బందులు సృష్టించగలరని తేటతెల్లమయ్యాక అఖిలేశ్ తన నివాసాన్ని ఏకంగా ములాయం ఇంటి పక్కకే మార్చేశారు. శివపాల్-అపర్ణల శిబిరం వ్యూహాలను ప్రతిఘటిస్తూ వచ్చారు. రాజకీయాల్లోకి రాకముందే దూకుడు..: ములాయం పెద్ద కోడలు డింపుల్ పెద్దగా మాట్లాడరు. రాజకీయాల్లోకి వచ్చాకే పరిణతి సాధించారు. చిన్నకోడలు అపర్ణ తీరు ఇందుకు విరుద్ధమైనది. రాజకీయాల్లోకి ప్రవేశించకముందే తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఎక్కడైనా సరే తనను తాను ప్రతిష్టించుకోవడం ఎలాగో ఆమెకు బాగా తెలుసు. ములాయం దృష్టిని ఆకర్షించడానికి ఆమె 2014లో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కీర్తించటం మొదలుపెట్టారు. అఖిలేశ్‌ను ఎదుర్కోవడానికి ములాయం కుటుంబం నుంచి ఒక వ్యక్తి కావాలని కోరుకుంటున్న శివ్‌పాల్.. అపర్ణ శక్తిసామర్థ్యాలను గుర్తించారు. ఈ నేపథ్యంలోనే.. రాబోయే శాసనసభ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి అపర్ణ పోటీ చేస్తారని ఏడాది కిందటే ప్రకటించారు. ఇటీవల ములాయం ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ఆ సీటుకు అపర్ణ పేరును ఖరారు చేశారు. ములాయం జాబితాను కాదంటూ సీఎం అఖిలేశ్ ప్రకటించిన రెబెల్ అభ్యర్థుల జాబితాలో లక్నో కంటోన్మెంట్ స్థానానికి ఏ పేరునూ ప్రకటించలేదు. దీనినిబట్టి.. అక్కడ అపర్ణ పోటీకి అఖిలేశ్ కూడా వ్యూహాత్మకంగానే అయినా వ్యతిరేకం కాదన్నది అర్థమవుతోంది. అపర్ణకు రాజ్నాథ్ఆశీర్వాదం..: డింపుల్ సమాజ్‌వాది పార్టీకి సంప్రదాయమైన రాజకీయాల పరిధిలోనే ఉంటే.. అపర్ణ తరచుగా ఆ పరిధిని దాటిపోయారు. ములాయం అన్న మనవడు తేజ్‌పాల్ వివాహం లాలుప్రసాద్ కుమార్తె రాజ్ లక్ష్మితో జరిగినపుడు.. తిలక్ వేడుకకు హాజరైన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో అపర్ణ సెల్ఫీ తీసుకున్నారు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ దేశంలో అసహనం పెరుగుతోందంటూ చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగినపుడు కూడా ఆమె బీజేపీని సమర్థిస్తూ మాట్లాడటం ద్వారా.. ఎస్పీ సైద్ధాంతిక పరిధిని మళ్లీ అతిక్రమించారు. అంతేకాదు.. గత అక్టోబర్‌లో అపర్ణ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి ఆయన పాదాలను తాకి నమస్కరించారు. యూపీలో బీజేపీకి ఠాకూర్ ప్రతినిధి అయిన రాజ్‌నాథ్.. అసెంబ్లీ ఎన్నికల విషయంలో అపర్ణను ‘ఆశీర్వదించార’ని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ఏదేమైనా సమాజ్ వాదీ పార్టీలో ఆధిపత్యం కోసం కుటుంబ సభ్యుల మధ్య చెలరేగిన వివాదం ఆ పార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్కూడా విడుదలైనందున.. ఈ సంక్షోభాన్ని సత్వరమే పరిష్కరించుకోకపోతే ఎన్నికల్లో ఎస్పీకి ఇబ్బందులు తప్పవనేది పరిశీలకుల అంచనా. -
సమాజ్‌వాదీ అంతర్యుద్ధం
తాము అనుకున్నట్టే అంతా జరిగిందని భావించి సంబరపడిన సమాజ్‌వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆయన అనుచరులకు కథ అడ్డం తిరిగిందని అర్ధమయ్యేసరికి కాలాతీతమైంది. ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తండ్రికి ఆదివారం ఇచ్చిన షాక్ చిన్నదేమీ కాదు. 24 గంటల క్రితం కంటతడి పెట్టినవాడే... నాన్నను మించి నాకెవరూ లేరని చెప్పినవాడే... పార్టీలో తిరిగి ప్రవేశించేందుకు మధ్యవర్తుల ద్వారా రాజీకి ప్రయత్నించినవాడే తన మనోభీష్టానికి భిన్నంగా పార్టీ జాతీయ సమావేశం నిర్వహించడం, జాతీయ అధ్యక్ష పదవిని చేజిక్కించుకోవడం ములాయంకు మింగుడు పడని వ్యవహారం. ఎత్తుగడలు వేయడంలో, ప్రత్యర్థులను ఊహించని దెబ్బతీయడంలో ములాయంను మించిన రాజకీయవేత్త దేశంలోనే ఉండరన్న ఖ్యాతి కాస్తా అఖిలేశ్ గెరిల్లా వ్యూహంతో గల్లంతైంది. ఇక ఇరు వర్గాలూ పార్టీ మాదంటే మాదని ఎన్నికల సంఘం(ఈసీ) ముందూ, ఆనక న్యాయస్థానంలోనూ ఎటూ పోరాడతాయి. ఇప్పుడున్న పరి స్థితుల్లో పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్‌ను స్తంభింపజేస్తారన్న రాజకీయ నిపుణుల అంచనా మాటెలా ఉన్నా... మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోతున్న ఉత్తరప్రదేశ్ రాజకీయాలు మాత్రం కొత్త మలుపు తీసుకున్నాయి. గత మూడు నెలలుగా సమాజ్‌వాదీ పార్టీలో ప్రత్యర్థి పక్షాలు బాహాటంగా కత్తులు దూసు కుంటున్న వైనాన్ని గమనిస్తున్నవారికి ఈ పరిణామాలేవీ వింతగొలపక పోవచ్చు. కానీ పార్టీగా పాతికేళ్ల ప్రస్థానం... పాలనలో విశేష అనుభవం... గత అయిదేళ్లుగా ప్రభుత్వ సారథ్యంలాంటి అనుకూలాంశాలున్న పార్టీ వాలకం అసెంబ్లీ ఎన్నికలు ముంగిట్లోకొచ్చిన తరుణంలో ఇలా ఉంటుందని ఎవరూ అనుకోరు. ఇందుకు అఖిలేశ్ కంటే ఆయన బాబాయి శివ్‌పాల్ యాదవ్, అమర్సింగ్లాంటి నేతలను తప్పుబట్టాలి. వారి వర్గంగా చలామణి అవుతూ యూపీలో అరాచకాలను సాగి స్తున్న మరికొందరు సమాజ్‌వాదీ నేతలను తప్పుబట్టాలి. వీటిని ఏదోమేరకు సరిదిద్దుతూ, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్న అఖిలేశ్‌కు ఈ వర్గం ఆటంకాలు సృష్టిస్తూనే ఉంది. అయితే ఈ అయిదేళ్లూ వ్యక్తిగతంగా అఖిలేశ్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలూ రాకపోవడం ఆయనకున్న అనుకూలాంశం. ఈ సంక్షోభం తలెత్తాక పార్టీలో అత్యధిక ఎమ్మెల్యేలు అఖిలేశ్ వెనక నిలబడటానికి ప్రజల్లో... ముఖ్యంగా యువతలో ఆయన నాయకత్వంపట్ల, ఆయన పాలన పట్ల ఉన్న విశ్వాసమే కారణం. 2012లో అధికారంలోకొచ్చాక అఖిలేశ్ ప్రభుత్వం అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసింది. వాటిల్లో చాలాభాగం పూర్తి చేయగలిగింది. వాస్తవానికి పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటున్న ములాయం అఖిలేశ్‌కు అన్ని వర్గాల్లో లభిస్తున్న ఆదరణను గమనించి ఆయనకు మద్దతుగా నిలిచి ఉంటే... పార్టీకీ, ప్రభుత్వానికీ చెడ్డ పేరు తెస్తున్న శివ్‌పాల్ యాదవ్, అమర్‌సింగ్ అను చరగణాలను నియంత్రించి ఉంటే వేరుగా ఉండేది. కానీ ములాయం అందుకు భిన్నంగా వ్యవహరించారు. శివ్‌పాల్ తదితరులను వెనకేసుకొచ్చి ఆత్మహత్యాసదృ శమైన తోవను ఎంచుకున్నారు. మూడు దశాబ్దాలక్రితం రాష్ట్రంలో వెనకబడిన కులా లను ఏకం చేసి, ముస్లింలలో విశ్వాసాన్ని పెంచి రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన ములాయం... ఆ వర్గాలు ఇప్పుడు అఖిలేశ్ అభివృద్ధి కార్యక్రమాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయని, అవి ఫలవంతమైతే తమ బతుకులు మెరుగుపడతాయని భావిస్తున్నాయని గుర్తించలేకపోయారు. నిజానికి యూపీలో ములాయం సీఎంగా ఉన్న సందర్భాల్లోనే గరిష్టంగా మత కల్లోలాలు, గూండాయిజం ఉదంతాలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంలో తనకున్న అపకీర్తి సంగతి ములాయంకు స్పష్టంగా తెలుసు. కుమారుడికి అటువంటి మకిలి అంటలేదని కూడా తెలుసు. అయినా ఆయన సక్రమంగా వ్యవహరించలేకపోయారు. తనను నమ్ముకున్న శివ్‌పాల్, అమ ర్సింగ్లకు అన్యాయం జరుగుతున్నదని భావించి అఖిలేశ్‌ను బహిరంగంగానే ఆయన మందలించిన సందర్భాలున్నాయి. కానీ అఖిలేశ్ ఎప్పుడూ తండ్రితో కల హానికి దిగలేదు. ఆయనతోనే శభాష్ అనిపించుకుంటామని బదులిస్తూ వచ్చారు. మొన్న అక్టోబర్‌లో జరిగిన సమావేశంలో సైతం ములాయం హెచ్చరించారు. వీటన్నిటికీ పరాకాష్టగానే గత శుక్రవారం అఖిలేశ్‌నూ, ఆయనకు అండగా నిల బడిన తన సోదరుడు రాంగోపాల్ యాదవ్‌నూ ములాయం పార్టీ నుంచి బహి ష్కరించారు. ఇదంతా తాత్కాలికంగా సద్దుమణిగి తిరిగి పార్టీలోకి ప్రవేశించ గలిగినా అఖిలేశ్‌కు జరగబోయేదేమిటో తెలుసు. పార్టీలో ఇకపై తాను ద్వితీయ శ్రేణి నాయకుడిగా మిగలక తప్పదని, టిక్కెట్ల పంపిణీలో తన పాత్ర నామమాత్ర మవుతుందని ఆయనకు తేటతెల్లమైంది. ఇలాగైతే పార్టీకి విజయావకాశాలుండవని ఆయనకు అర్ధమైంది. అందుకే ఊహించని రీతిలో ప్రత్యర్థులపై పంజా విసిరారు. ఇంత చేసినా అఖిలేశ్ తన తండ్రికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చారు. ఆయనే పార్టీకి ఇప్పటికీ మార్గ నిర్దేశకుడని ప్రకటించారు. అఖిలేశ్ నిర్వహిస్తున్న జాతీయ సమావేశాలకు వెళ్లి తాడో పేడో తేల్చుకోవాలని ములాయం భావించినా, మిగిలిన వారు అడ్డుకోవడంతో ఆగిపోయారంటున్నారు. ఈ సందర్భంలో చంద్రబాబు టీడీపీని చీల్చి వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలతో క్యాంప్ నిర్వహించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అక్కడికి వెళ్లడం, ఆయనపై బాబు చెప్పు లేయించడం అందరికీ జ్ఞాపకమొస్తుంది. ములాయం వెళ్తే ఏం జరిగి ఉండేదో గానీ... వైస్రాయ్ ఉదంతం మాత్రం పునరావృతమయ్యేది కాదని అఖిలేశ్ వ్యవ హార శైలి తెలిసినవారు అంటున్నారు. అందులో వాస్తవం ఉంది. ఏదేమైనా కుల, మతాల ప్రాబల్యం అధికంగా ఉండే యూపీలో అఖిలేశ్ విజేతగా నెగ్గుకురావడం అంత సులభమేమీ కాదు. ఒంటరిగా కాకుండా ఇతర పార్టీలతో పొత్తు కుదు ర్చుకుని జనం ముందుకెళ్తే, ఆ కూటమి ముస్లింలలో విశ్వాసాన్ని కలిగించగలిగితే మరోసారి అధికార పీఠం అఖిలేశ్ సొంతమవుతుంది. ఆ విషయంలో ఆయన ఎంతవరకూ కృతకృత్యులు కాగలరో చూడాలి. -
సమాజ్‌వాదీ పార్టీలో ముదిరిన ముసలం
-
ఇక నేనే సారథి..
► సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేశ్ ఎన్నిక.. ► ములాయంకు మార్గనిర్దేశక బాధ్యతలు ► రాంగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం ► పార్టీ యూపీ అధ్యక్షుడిగా శివపాల్ తొలగింపు, అమర్‌సింగ్ బహిష్కరణ ► నరేశ్ ఉత్తమ్‌కు పార్టీ రాష్ట్ర బాధ్యతలు కట్టబెట్టిన అఖిలేశ్ ఆగ్రహంతో ప్రతిచర్యలకు పూనుకున్న ములాయం ► ఈ సమావేశం చట్టవిరుద్ధమంటూ లేఖ ► రాంగోపాల్, నరేశ్ ఉత్తమ్ సహా పలువురు నేతలపై బహిష్కరణ వేటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పుకునేందుకు సిద్ధమని గతంలోనే ములాయంతో చెప్పాను. ఆయన నన్ను సీఎంను చేశారు. అందరూ ఎస్పీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. కొందరు అలా జరగకూడదనుకుంటున్నారు. మరోసారి ఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే నేతాజీ(ములాయం) ఎక్కువ సంతోషిస్తారు. – అఖిలేశ్ యాదవ్ పార్టీ పార్లమెంటరీ బోర్డు అన్ని ప్రతిపాదనలు, నిర్ణయాల్ని ప్రకటిస్తుంది. రాంగోపాల్ నిర్వహిస్తున్న కార్యవర్గ భేటీ రాజ్యాంగ విరుద్ధం. పార్టీ రాజ్యాంగానికి, క్రమశిక్షణకు ఇది వ్యతిరేకం. ఇది పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించింది. సమావేశం నిర్వహించిన రాంగోపాల్‌ను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం. – ములాయం సింగ్ యాదవ్ లక్నో : ఉత్తరప్రదేశ్ ఎన్నికల రాజకీయం సరికొత్త మలుపు తీసుకుంది. సమాజ్‌వాదీ పార్టీలో ముసలం మరింత ముదిరింది. ఏకంగా పార్టీ జాతీయాధ్యక్ష పదవి నుంచి ములాయంసింగ్ యాదవ్‌ను తప్పించి.. అఖిలేశ్ యాదవ్‌ను అధ్యక్షుడిగా నియమిస్తూ ఆ పార్టీ జాతీయ సమావేశం నిర్ణయం తీసుకుంది. ములాయం సోదరుడు శివపాల్ యాదవ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతోపాటు సీనియర్ నేత అమర్‌సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఇందుకు దీటుగా స్పందించిన ములాయం.. తానే ఎస్పీ జాతీయాధ్యక్షుడినంటూ ప్రతిచర్యలకు పూనుకున్నారు. పార్టీ జాతీయ సమావేశాన్ని నిర్వహించిన రాంగోపాల్ యాదవ్‌ను బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక పార్టీ యూపీ అధ్యక్షుడిగా నరేశ్ ఉత్తమ్‌ను అఖిలేశ్ నియమించగా... ములాయం నరేశ్ ఉత్తమ్‌ను కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. మొత్తంగా యూపీ అసెంబ్లీ ఎన్నికలను మించి.. ఎస్పీలో కుటుంబ కలహాలు రోజుకో మలుపుతో తీవ్ర ఆసక్తి రేపుతున్నాయి. కుటుంబ కలహాలు కాస్తా పార్టీపై ఆధిపత్య పోరుగా మారడంతో తండ్రీ కొడుకుల మధ్య ఏ రోజు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. రాజీ కుదిరి ఒకరోజైనా గడవకముందే.. ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీలో కొంతకాలంగా అంతర్గత కలహాలు ముసురుకున్న విషయం తెలిసిందే. పార్టీ జాతీయాధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్, ఆయన సోదరుడు శివపాల్యాదవ్లకు.. ములాయం కుమారుడు, యూపీ సీఎం అఖిలేశ్‌యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్‌యాదవ్, వారి మద్దతుదారులకు మధ్య పోరు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రసకందాయంలో పడింది. పార్టీ అభ్యర్థుల ప్రకటనలో ఇరువర్గాలు మొండిపట్టుతో వ్యవహరించి, ఎవరి జాబితాలు వారు విడుదల చేశారు. దీనిపై ఆగ్రహించిన ములాయం శుక్రవారమే అఖిలేశ్‌ను, రాంగోపాల్ పార్టీ నుంచి బహిష్కరించారు. కానీ అఖిలేశ్ తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు, నేతలతో బలం ప్రదర్శించడంతో.. శనివారం రాజీకి వచ్చి, బహిష్కరణ ఎత్తివేశారు. కానీ ఇది జరిగి 24 గంటలైనా గడవకముందే.. ఆదివారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. (చదవండి :ములాయం సింగ్‌కు అస్వస్థత ) రాంగోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో ఎస్పీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. లక్నోలోని జ్ఞానేశ్వర్ మిశ్రా పార్కులో రాంగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఎస్పీ జాతీయ సమావేశంలో అఖిలేశ్‌ను పార్టీ జాతీయాధ్యక్షుడిగా ఎన్నుకుందామని ప్రతిపాదించారు. దీనికి పార్టీ శ్రేణులంతా చేతులెత్తి మద్దతు ప్రకటించాయి. ములాయం సింగ్‌ను పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, మార్గ నిర్దేశకుడిగా ప్రకటిస్తూ రాంగోపాల్ ప్రతిపాదన ప్రవేశపెట్టారు. అలాగే పార్టీ యూపీ అధ్యక్షుడిగా శివ్పాల్యాదవ్ను తొలగించే మరో ప్రతిపాదనకు సభ్యులు ఆమోదం తెలిపారు. అమర్‌సింగ్‌ను శాశ్వతంగా బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక అవసరం మేరకు పార్టీ జాతీయ కార్యవర్గం, పార్లమెంటరీ బోర్డు, ఇతర రాష్ట్ర విభాగాల్ని నియమించేందుకు అఖిలేశ్‌కు అధికారం కల్పిస్తూ నిర్ణయించారు. అలాగే ఎస్పీలో చోటు చేసుకున్న పరిణామాలన్నింటిని వివరిస్తూ ఎన్నికల సంఘానికి సమాచారమిచ్చారు. ములాయం హెచ్చరికలు బేఖాతరు రాంగోపాల్ నిర్వహిస్తున్న సమావేశానికి హాజరైతే క్రమశిక్షణరాహిత్యంగా పరిగణిస్తామని, వారిపై చర్యలు తీసుకుంటామని ములాయం హెచ్చరించినా... దాదాపు పార్టీలోని సీనియర్ నేతలంతా హాజరుకావడం గమనార్హం. సుదీర్ఘకాలంగా ములాయంతో సన్నిహితంగా ఉన్న పార్టీ నేతలు కూడా అఖిలేశ్, రాంగోపాల్లతో వేదిక పంచుకున్నారు. యూపీ కొత్త అధ్యక్షుడిగా నరేశ్ ఉత్తమ్ మరోవైపు శివ్‌పాల్ యాదవ్ స్థానంలో పార్టీ యూపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ నరేశ్ ఉత్తమ్‌ను అఖిలేశ్ నియమించారు. వెంటనే నరేశ్ అనుచరులు భారీ భద్రత మధ్య ఉన్న ఎస్పీ ప్రధాన కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. శివ్‌పాల్ యాదవ్ నేమ్ ప్లేట్‌ను ధ్వంసం చేశారు. మరోవైపు శివ్‌పాల్ మద్దతుదారులు పోటీగా నిరసన తెలపడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కుట్రపై పోరాడడం నా విధి: అఖిలేశ్ పార్టీ జాతీయాధ్యక్షుడిగా ప్రతిపాదించిన వెంటనే అఖిలేశ్ ప్రసంగించారు. ఇంతకుముందు ఉన్నదాని కంటే ఎక్కువగా తన తండ్రిపై గౌరవం ఉందని.. అయితే తనకు వ్యతిరేకంగా పార్టీలో కుట్ర చేస్తున్నవారిపై మాత్రం పోరాటం కొనసాగుతుందని ఆయన చెప్పారు. ‘‘పార్టీకి వ్యతిరేకంగా కుట్ర చేసిన వారే నష్టం కలిగించారు. జాతీయాధ్యక్షుడికి సమస్యలు సృష్టించారు. కొందరు నాపై ఆరోపణలు చేయవచ్చు. కానీ ములాయం కుమారుడిగా.. పార్టీకి, నా తండ్రికి వ్యతిరేకంగా ఏదైనా కుట్ర జరుగుతుంటే పోరాడడం నా విధి. ఇంతకుముందు ఇదే చెప్పాను.. ఇప్పుడు మరోసారి చెబుతున్నాను..’’ అని అఖిలేశ్ స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పుకొనేందుకు సిద్ధమని గతంలోనే తాను ములాయంతో చెప్పానని.. ఆయన తనకు ముఖ్యమంత్రిగా పనిచేసేందుకు అవకాశమిచ్చారని చెప్పారు. అందరూ ఎస్పీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని, కొందరు మాత్రం అలా జరగకూడదని ఆశిస్తున్నారని పేర్కొన్నారు. మరోసారి ఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే నేతాజీ (ములాయం) ఎక్కువ సంతోషిస్తారని, మరోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే బాధ్యత తనకు అప్పగించారని చెప్పారు. నేతాజీ గౌరవం, హోదా మనకు ఎంతో ముఖ్యమని, రాబోయే మూడు నాలుగు నెలలు మనకు చాలా కీలకమని పార్టీ శ్రేణులకు వివరించారు. ఆ ఇద్దరే కుట్ర చేశారు: రాంగోపాల్ అఖిలేశ్ అనంతరం రాంగోపాల్ యాదవ్ మాట్లాడారు. అఖిలేశ్ ప్రభుత్వం బాగా పనిచేస్తుందనే విషయం అందరికీ తెలుసని, ఆయనను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించేలా ఇద్దరు వ్యక్తులు కుట్ర చేశారని ఆరోపించారు. వారే పార్టీకి పెద్ద సమస్యగా తయారయ్యారని ఆరోపించారు. ‘‘శివపాల్ యాదవ్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో సభ్యులుగా లేనివారికి కూడా టికెట్లిచ్చారు. పార్టీ జాతీయాధ్యక్షుడి ఆదేశాలకు విరుద్ధంగా, పార్టీ నుంచి బయటికి గెంటిన వారిపై సస్పెన్షన్ ఎత్తివేశారు. కొందరు వ్యక్తులు ఎస్పీ తిరిగి అధికారంలోకి రాకుడదని కోరుకుంటున్నట్లు స్పష్టమైంది. అఖిలేశ్ మరోసారి సీఎం కావడం వారికి ఇష్టం లేదు..’’ అని వ్యాఖ్యానించారు. అది చట్టవిరుద్ధం: ములాయం పార్టీ జాతీయాధ్యక్షుడి అనుమతి లేకుండా సమావేశం నిర్వహించారని, అందులో తీసుకున్న నిర్ణయాలు చట్టవిరుద్ధమని ములాయంసింగ్ యాదవ్ స్పష్టం చేశారు. రాంగోపాల్ ఆధ్వర్యంలో పార్టీ సమావేశం ప్రారంభం కాగానే ఆగమేఘాలపై ఓ లేఖ విడుదల చేశారు. ‘‘రాంగోపాల్ నిర్వహిస్తున్న కార్యవర్గ భేటీ రాజ్యాంగ విరుద్ధం. పార్టీ రాజ్యాంగానికి, క్రమశిక్షణకు అది వ్యతిరేకం. ఇది పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించింది. పార్టీ పార్లమెంటరీ బోర్డు అన్ని ప్రతిపాదనలు, నిర్ణయాల్ని ప్రకటిస్తుంది. సమావేశం నిర్వహించిన రాంగోపాల్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం..’’ అని అందులో పేర్కొన్నారు. తాము జనవరి 5న జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం పార్టీ యూపీ అధ్యక్షుడిగా అఖిలేశ్ వర్గం ప్రకటించిన నరేశ్ ఉత్తమ్‌ను, పార్టీ ఉపాధ్యక్షుడు కిరణ్మయ్ నంద, ప్రధాన కార్యదర్శి నరేశ్ అగర్వాల్‌లను కూడా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ములాయం, శివపాల్‌లు ఒంటరేనా..? తాజా పరిణామాలతో పార్టీలో దాదాపు ములాయం, శివపాల్ యాదవ్‌లు దాదాపు ఒంటరైనట్లు భావిస్తున్నారు. శనివారం 200 మంది ఎమ్మెల్యేలతో అఖిలేశ్, రాంగోపాల్‌లు తమ బలం నిరూపించుకోగా...ఆదివారం పార్టీ సీనియర్ నేతలు కూడా ములాయంకు షాకిచ్చారు. ఎంపీలు సైతం అఖిలేశ్‌కే జై కొడుతూ మాట్లాడారు. తాజా పరిణామాలపై ఆ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ స్పందిస్తూ.. ‘‘లక్షల మంది ప్రజలు అఖిలేశ్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అలాంటప్పుడు తొలగించే హక్కు ఎవరికుంది. నేతాజీ మా నాయకుడు. మేమంతా ఆయన్ని గౌరవిస్తాం. మీ కొడుకు ముందుకెళ్తూ మీరు గర్వించేలా చేస్తున్నప్పుడు.. మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయానుకుంటున్న వ్యక్తుల్ని వదులుకోవాలని నేతాజీకి చెప్పాలనుకుంటున్నా..’’ అని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాన్ని ములాయం ఇంకా లక్ష్యపెట్టకుంటే అది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. -
ములాయం సింగ్‌కు అస్వస్థత
లక్నో : సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ ఆదివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా అధిక రక్తపోటు రావడంతో లక్నోలోని ఆయన నివాసంలోనే డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. (చదవండి : ఎస్పీలో మళ్లీ ప్రకంపనలు : 'ములాయం’కే ఎసరు ) ములాయం అనారోగ్యానికి గురికావడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. గత రెండు రోజులుగా ఎస్పీలో తలెత్తిన వివాదాల కారణంగానే ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఈ వార్త తెలుసుకోగానే శివపాల్ యాదవ్ ములాయం నివాసానికి చేరుకున్నారు. డాక్టర్లను అడిగి ములాయం ఆరోగ్యపరిస్థితిని వాకబు చేస్తున్నారు. (చదవండి : ఈసీ కోర్టులో ‘ఎస్పీ’ బంతి : ఎవరిది పైచేయి!)