‘సైకిల్’ సమరంలో ఇద్దరు కోడళ్లు! | Mulayam Singh Daughter in Law's cold war in Samajwadi Party | Sakshi
Sakshi News home page

‘సైకిల్’ సమరంలో ఇద్దరు కోడళ్లు!

Published Wed, Jan 4 2017 11:44 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

‘సైకిల్’ సమరంలో ఇద్దరు కోడళ్లు! - Sakshi

‘సైకిల్’ సమరంలో ఇద్దరు కోడళ్లు!

 సమాజ్ వాది పార్టీ ముసలంలో ములాయం కోడళ్ల పాత్ర ఏమిటి?
 అఖిలేశ్ కు  పోటీగా చిన్న కోడలు అపర్ణను రంగంలోకి దించిన సాధన
 ‘ముప్పు’ను పసిగట్టి భర్తకు అండగా నిలిచిన పెద్ద కోడలు డింపుల్


(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
సమాజ్ వాదీ పార్టీ ‘కుటుంబం’లో ముదిరిన ముసలంలో ములాయం కోడళ్ల పాత్ర ఏమిటి? పార్టీలో ఆధిపత్యం కోసం తండ్రీ కొడుకుల మధ్య సాగుతున్న పోరాటంలో కోడళ్లు ఎటు ఉన్నారు? పార్టీని తండ్రి చేతుల్లోంచి తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న పెద్ద కొడుకు అఖిలేశ్ యాదవ్కు ఆయన భార్య డింపుల్ అండగా నిలిచారు. ములాయం చిన్న కొడుకు ప్రతీక్ భార్య అపర్ణ.. ములాయం శిబిరంలో  ఇంకా ఖచ్చితంగా చెప్తే శివ్పాల్ శిబిరంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

‘ప్రమాదాన్ని’ ముందే పసిగట్టిన డింపుల్..: వాస్తవానికి.. అఖిలేశ్ను 2012లో ముఖ్యమంత్రిగా ప్రకటించే సమయంలోనే.. ములాయం రెండో భార్య, అఖిలేశ్ సవతి తల్లి అయిన సాధనాగుప్తా.. తన కుమారుడైన ప్రతీక్ను ములాయం వారసుడిగా ప్రతిష్టించాలని కోరుకున్నారు. అయితే ప్రతీక్ రాజకీయాలను కాదని, రియల్ఎస్టేట్ వ్యాపారాన్ని ఎంచుకున్నారు. దీంతో ప్రతీక్ భార్య, తన కోడలు అపర్ణను అఖిలేశ్కు పోటీగా దించాలని సాధనాగుప్తా నిర్ణయించారు. ఈ వ్యూహాన్ని పసిగట్టిన డింపుల్ తన భర్త అఖిలేశ్ను అప్రమత్తం చేశారు. దీంతో ఆయన తన తండ్రి ములాయంను ప్రతి రోజూ కలుస్తూ జాగ్రత్తలు తీసుకునేవారు. అయినా కూడా తండ్రి నివాసం నుంచి సాధనాగుప్తాతో పాటు తన బాబాయి శివ్పాల్లు తనకు ఇబ్బందులు సృష్టించగలరని తేటతెల్లమయ్యాక అఖిలేశ్ తన నివాసాన్ని ఏకంగా ములాయం ఇంటి పక్కకే మార్చేశారు. శివపాల్-అపర్ణల శిబిరం వ్యూహాలను ప్రతిఘటిస్తూ వచ్చారు.

రాజకీయాల్లోకి రాకముందే దూకుడు..: ములాయం పెద్ద కోడలు డింపుల్ పెద్దగా మాట్లాడరు. రాజకీయాల్లోకి వచ్చాకే పరిణతి సాధించారు. చిన్నకోడలు అపర్ణ తీరు ఇందుకు విరుద్ధమైనది. రాజకీయాల్లోకి ప్రవేశించకముందే తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఎక్కడైనా సరే తనను తాను ప్రతిష్టించుకోవడం ఎలాగో ఆమెకు బాగా తెలుసు. ములాయం దృష్టిని ఆకర్షించడానికి ఆమె 2014లో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కీర్తించటం మొదలుపెట్టారు. అఖిలేశ్ను ఎదుర్కోవడానికి ములాయం కుటుంబం నుంచి ఒక వ్యక్తి కావాలని కోరుకుంటున్న శివ్పాల్.. అపర్ణ శక్తిసామర్థ్యాలను గుర్తించారు. ఈ నేపథ్యంలోనే.. రాబోయే శాసనసభ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి అపర్ణ పోటీ చేస్తారని ఏడాది కిందటే ప్రకటించారు. ఇటీవల ములాయం ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ఆ సీటుకు అపర్ణ పేరును ఖరారు చేశారు. ములాయం జాబితాను కాదంటూ సీఎం అఖిలేశ్ ప్రకటించిన రెబెల్ అభ్యర్థుల జాబితాలో లక్నో కంటోన్మెంట్ స్థానానికి ఏ పేరునూ ప్రకటించలేదు. దీనినిబట్టి.. అక్కడ అపర్ణ పోటీకి అఖిలేశ్ కూడా వ్యూహాత్మకంగానే అయినా వ్యతిరేకం కాదన్నది అర్థమవుతోంది.  

అపర్ణకు రాజ్నాథ్ఆశీర్వాదం..: డింపుల్ సమాజ్వాది పార్టీకి సంప్రదాయమైన రాజకీయాల పరిధిలోనే ఉంటే.. అపర్ణ తరచుగా ఆ పరిధిని దాటిపోయారు. ములాయం అన్న మనవడు తేజ్పాల్ వివాహం లాలుప్రసాద్ కుమార్తె రాజ్ లక్ష్మితో జరిగినపుడు.. తిలక్ వేడుకకు హాజరైన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో అపర్ణ సెల్ఫీ తీసుకున్నారు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ దేశంలో అసహనం పెరుగుతోందంటూ చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగినపుడు కూడా ఆమె బీజేపీని సమర్థిస్తూ మాట్లాడటం ద్వారా.. ఎస్పీ సైద్ధాంతిక పరిధిని మళ్లీ అతిక్రమించారు. అంతేకాదు.. గత అక్టోబర్లో అపర్ణ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ను కలిసి ఆయన పాదాలను తాకి నమస్కరించారు. యూపీలో బీజేపీకి ఠాకూర్ ప్రతినిధి అయిన రాజ్నాథ్.. అసెంబ్లీ ఎన్నికల విషయంలో అపర్ణను ‘ఆశీర్వదించార’ని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.

ఏదేమైనా సమాజ్ వాదీ పార్టీలో ఆధిపత్యం కోసం కుటుంబ సభ్యుల మధ్య చెలరేగిన వివాదం ఆ పార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్కూడా విడుదలైనందున.. ఈ సంక్షోభాన్ని సత్వరమే పరిష్కరించుకోకపోతే ఎన్నికల్లో ఎస్పీకి ఇబ్బందులు తప్పవనేది పరిశీలకుల అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement