కథా నాయకుడా? కలల నాయకుడా? | pullarao pentapati writes on punjab elections | Sakshi
Sakshi News home page

కథా నాయకుడా? కలల నాయకుడా?

Published Sat, Feb 4 2017 6:15 AM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

కథా నాయకుడా? కలల నాయకుడా? - Sakshi

కథా నాయకుడా? కలల నాయకుడా?

విశ్లేషణ
పంజాబ్‌ ఎన్నికలలో కేజ్రీవాల్‌ తన సత్తా చూపితే పరిస్థితులు ఏ విధంగా మార తాయి? అదే జరిగితే దేశం మార్పు దిశగా కదులుతుంది. కొత్త నాయకత్వం, కొత్త పార్టీలు ఏర్పడి మార్పును తీసుకువచ్చే అవకాశం ఉంటుంది.

మార్చి 15వ తేదీని ‘ఐడస్‌ ఆఫ్‌ మార్చి’ అని ఐదు వందల ఏళ్ల క్రితం షేక్‌స్పియర్‌ పిలి చాడు. అదే రోజున రోమ్‌ చక్ర వర్తి జూలియస్‌ సీజర్‌ను హత మారుస్తారని ఒక జ్యోతిష్కుడు చెప్పాడట. అలాగే జరిగిందట. అంత కాకపోయినా, వచ్చే 15వ తేదీకి భారతదేశ చరి త్రలో ముమ్మాటికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఎన్ని కలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలోను ఆ రోజునే ఫలి తాలు వెలువడుతున్నాయి. అంటే చాలామంది నేతల తలరాతలు–నరేంద్ర మోదీ, రాహుల్‌గాంధీ, అఖిలేశ్‌ యాదవ్, మరీ ముఖ్యంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ల భవి ష్యత్తు తేలబోతున్నది. రాహుల్, అఖిలేశ్‌లు కుటుంబ పాలన నుంచి వచ్చినవారు. మోదీ నేపథ్యం అలాంటిది కాకున్నా, ఆయన ఎదురుగాలిలో ప్రయాణిస్తున్నారు. మోదీ జాతీయ రాజకీయాలలో కొత్త గాలి. అయినా కేజ్రీవాల్‌ మాదిరిగా ఆయనది ఒంటరి పోరాటం కాదు. ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ పరిస్థితి వేరు. జాతీయ రాజ కీయ చిత్రంలో ఆయన ఇప్పుడొక ఆకర్షణ. అందుకే అందరి దృష్టి ఆయన మీదే ఉంది. పైగా కొత్త వారికి రాజకీయంగా ఎదిగే అవకాశం ఇస్తున్న నాయకుడు ఆయనే. గోవా, పంజాబ్‌ ఎన్నికల ఫలితాల గురించి ఇప్పుడు పెరుగుతున్న ఆసక్తికి కారణం కూడా ఆయనే.


ఢిల్లీ ఎన్నికలలో కేజ్రీవాల్‌ విజయాలు చరిత్రా త్మకం. కేంద్రంలో, ఢిల్లీలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా ఆయన ఆ పార్టీని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో మట్టి కరిపించారు. ఆదాయపు పన్ను శాఖ ఉద్యోగం వదిలి అన్నా హజారే ఉద్యమంలో చేరిన కేజ్రీవాల్‌ ఆప్‌ను స్థాపించి 2013 నాటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో 28 (మొత్తం 70)స్థానాలు గెలిచారు. కానీ ఎనిమిది వారాలకే ఆయన ప్రభుత్వం పతనమైంది. తరువాత 2014 ఎన్నికలలో 67 సీట్లు గెలిచారు. మూడు చోట్ల గెలిచి బీజేపీ కకావికలైంది. కాంగ్రెస్‌ అధఃపాతాళానికి పోయింది. అందుకే ఆ రెండు జాతీయ పార్టీల లక్ష్యం ఆయనే. కేజ్రీవాల్‌ కనుక అప్రతిహతంగా కొనసాగిపోతే ఢిల్లీ, హరియాణా, పంజాబ్, హిమాచల్, గోవా వంటి చిన్న రాష్ట్రాలలో తమ చిరునామా కూడా ఉండదని కాంగ్రెస్‌ భయం. చిన్న రాష్ట్రాల ఎన్నికలలో పోరాడే సత్తా ఆయనకు ఉంది. పైగా ఈ చిన్న రాష్ట్రాలలో కాంగ్రెస్‌ లేదా బీజేపీలదే ఆధిపత్యం.

ప్రస్తుతం ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నా, కేజ్రీవాల్‌ పార్టీ గట్టిగా పోరాడుతున్నది మాత్రం రెండు అసెంబ్లీల వరకే. అవే పంజాబ్, గోవా. ఇప్పటిదాకా అక్కడ బీజేపీ–అకాలీదళ్, కాంగ్రెస్‌ పార్టీలకే స్థానం. ఇప్పుడు ఆప్‌ కొత్త ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది. భారత రాజకీయాలలో ఆప్‌ పెను కంపాలను సృష్టిం చడం ఆరంభించినది పంజాబ్‌తోనే. 14 స్థానాలతో ఆ రాష్ట్రానికి లోక్‌సభలో పెద్ద ప్రాధాన్యం లేకున్నా, ఆ రాష్ట్రంలో ప్రధాన వర్గం సిక్కుల ప్రాధాన్యం మాత్రం ప్రపంచ వ్యాప్తమైనది. అలాంటి చోట బయటివారి నాయకత్వంలోని పార్టీ ఆప్‌ ప్రవేశించింది. ఎన్నికలు సక్రమంగా జరిగితే 30 శాతం ఓట్లతో ఆప్‌ పార్టీకి 40 ఎమ్మెల్యే స్థానాలు (మొత్తం 117) దక్కుతాయని అంచనా. ఇదే నిజమైతే దేశ రాజకీయాలకు ఇదొక కుదుపు కాగలదు. కాంగ్రెస్, బీజేపీతో విసిగిపోయిన చోట ఆప్‌ను ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు ప్రజలు. పంజాబ్‌లో వందేళ్ల నాటి అకాలీదళ్‌ మత పార్టీ స్థాయి నుంచి బాదల్‌ కుటుంబ పార్టీ స్థాయికి దిగ జారింది. పంజాబ్‌ కాంగ్రెస్‌ అంటే పాటియాలా సంస్థా నాధీశుల వంశీకుడు అమరీందర్‌ సింగ్‌ జేబు సంస్థ. అవి నీతి బంధుప్రీతి విషయంలో ఆ రెండు పార్టీలు ఒక్కటే.

ఇంతకీ పంజాబ్‌ ఎన్నికలలో కేజ్రీవాల్‌ తన సత్తా చూపితే పరిస్థితులు ఏ విధంగా మారతాయి? అదే జరి గితే దేశం మార్పు దిశగా కదులుతుంది. కొత్త నాయ కత్వం, కొత్త పార్టీలు ఏర్పడి మార్పును తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. వంశ పారంపర్య పాలనకు బెడ దగా మారుతుంది. యువతరం ముందుకు వస్తుంది. దేశం పట్టణీకరణ చెందుతున్న కారణంగా యువత రంలో కుల ప్రభావం తగ్గి, నిజమైన రాజకీయ పార్టీల వైపు మొగ్గుతారు. ఈ దశలో బాదల్‌ కుటుంబీకులను ఓటర్లు నిరాకరించినప్పటికీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకుంటే అది రాహుల్‌కు పెద్ద దెబ్బగా మిగులుతుంది. అంటే కాంగ్రెస్‌కీ, రాహుల్‌కీ కూడా పెద్దగా ప్రజాకర్షణ లేదనీ, ప్రభుత్వ వ్యతిరేకత అన్న అంశంతో తప్ప గెలవలేరనీ నిర్ధారణ అవుతుంది. అదే సమయంలో కేజ్రీవాల్‌ ప్రతిష్ట పెరుగుతుంది. భవి ష్యత్తులో మరిన్ని అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఆయన విజయం సాధించగలుగుతారు. పంజాబ్‌ ఓటర్లు కేజ్రీ వాల్‌ పట్ల మొగ్గు చూపారంటే, దానర్థం దేశ ప్రజలు కూడా మార్పును కోరుతున్నారనే. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలలో సత్తా చూపాలని కేజ్రీవాల్‌ ఇప్పటికే ఆలో చిస్తున్నారు. ఆ పోరులో పటేల్‌ వర్గ నేత హార్దిక్‌ పటే ల్‌కూ, యువ దళితనేత జిగ్నేశ్‌కూ కేజ్రీవాల్‌ స్నేహ హస్తం అందిస్తారు. పంజాబ్‌లో ఆప్‌ విజయం గుజరాత్‌ ఓటర్లను కూడా చైతన్యవంతం చేస్తుంది. గుజరాత్‌ కాంగ్రెస్‌ 1996 నుంచి అహ్మద్‌ పటేల్‌ చేతిలో బందీ అయి ఉంది. బీజేపీలో కొత్త నాయకులు లేరు. అయితే ఇప్పటికే కేజ్రీవాల్‌ అక్కడ తన ఉనికిని చాటుకున్నారు.

పంజాబ్‌లో కేజ్రీవాల్‌ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తే కాంగ్రె స్‌కు గుదిబండగా తయారవుతారు. ప్రస్తుత అంచనా లను బట్టి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్‌కు ఉన్నట్టు అంచనా. ఆ అవకాశం తప్పితే, హంగ్‌ తప్పదు. అప్పుడైనా కేజ్రీవాల్‌ పెద్ద శక్తే. ఇదంతా మార్చి 15 తరువాత స్పష్టమవుతుంది. షేక్‌స్పియర్‌ మాట నిజమో కాదో తేలేది కూడా అప్పుడే.



(వ్యాసకర్త : పెంటపాటి పుల్లారావు రాజకీయ విశ్లేషకులు
ఈ–మెయిల్‌ : ppr193@gmail.com)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement