బిహార్‌లో కమల వికాసం | bjp development in Bihar | Sakshi
Sakshi News home page

బిహార్‌లో కమల వికాసం

Published Sun, Jul 12 2015 11:33 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బిహార్‌లో కమల వికాసం - Sakshi

బిహార్‌లో కమల వికాసం

విశ్లేషణ
 
బిహార్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక కూటమి గెలుపొందుతుందని భావించారు. లౌకిక కూటమి సంబరాలు మొదలెట్టేసింది. బీజేపీ కూటమి 15 స్థానాలను, లౌకిక కూటమి 9 స్థానాలను చేజిక్కించుకోవడం ప్రకంపనలు సృష్టించింది.
 
బిహార్‌లో 24 ఎంఎల్‌సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలను జూలై 11న ప్రకటించారు. అనూహ్యంగా ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి 15 స్థానాలు గెల్చుకోగా, కాంగ్రెస్, లాలూ, నితీష్ కుమార్ (లౌకిక) కూటమి 9 స్థానాలు మాత్రమే గెల్చు కుంది. పైగా లౌకిక కూటమి నుంచి ఒక్క మైనారిటీ ముస్లిం అభ్యర్థి మాత్రమే గెలుపొందారు. ఢిల్లీలో ఈ ఫలితాలు ప్రకంపనలు సృష్టించాయి. బిహార్‌లో అనూహ్యంగా బీజేపీ మానసిక విజయం సాధించింది. గత రెండు నెలలుగా కాంగ్రెస్ ఎలా మాట్లాడుతూ వచ్చిందంటే, బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో ప్రకటించినట్లు, బీజేపీ ఓడిపోయి నట్లు వ్యవహరించింది. నితీష్ కుమార్ సైతం అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి తాను మళ్లీ ముఖ్యమంత్రి అయినట్లు నమ్మసాగారు. ఇక లాలూ ముగ్గురు కుమారులూ ఇప్పటికే తమను తాము మంత్రులుగా ఊహించుకోసాగారు.
 బిహార్ ప్రస్తుత సీఎం నితీష్ కుమార్, లాలూప్రసాద్ యాదవ్ గత 22 ఏళ్లుగా బద్ధ శత్రువులుగా ఉన్నారు. లాలూను జైలుకు పంపడానికి, ఎన్నికలలో పోటీకి అనర్హుడిని చేయడా నికి మూలకారకుడు నితీష్. లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, నితీష్ 1989 నుంచి బిహార్ ముఖ్యమంత్రులుగా ఆధిపత్యం చలాయిస్తూ వచ్చారు. బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీని ప్రకటించగానే నితీష్ 2013లో ఎన్డీయే కూటమి నుంచి తప్పుకున్నారు. అయితే 2014 పార్లమెంట్ ఎన్నికల్లో నితీష్ ఘోరంగా దెబ్బతిన్నారు. అలాగే బిహార్‌లో లాలూ కూడా దెబ్బతిన్నారు. దీంతో మనుగడ కోసం కలసి పోరాడాలని ఇరువురూ నిర్ణయించుకున్నారు.

 బీజేపీని అడ్డుకోవడానికి తాను విషం తాగడానికైనా సిద్ధమేనని లాలూ జూన్ 7న ప్రకటించారు. ఇద్దరి మధ్య సయోధ్య అప్పుడే కుదిరింది. తమ కూటమి తరపున ముఖ్య మంత్రిగా నితీష్‌కు లాలూ మద్దతు పలికారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, లాలూ, నితీష్‌లకు కలిపి దాదాపు 45 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 38 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. విడిగా కాకుండా లౌకిక పార్టీలు ఒక్కటైతే బీజేపీని ఓడించవచ్చని వీరు లక్ష్యం పెట్టుకున్నారు. ఇది ఒక అద్భుత గణితమే కానీ రాజకీయాలు గణిత శాస్త్రం కాదు. 2014 ఆగస్టు 24న బిహార్‌లో 10 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా, లాలూ, నితీష్ కూటమి వాటిలో ఆరింటిని గెలుచుకుంది.

 నితీష్ కుమార్‌ను కూటమి తరపున ఉమ్మడి సీఎంగా ఈ సంవత్సరం జూన్ 7న ప్రకటించగానే నరేంద్రమోదీ ఓడిపో యారనే రీతిలో కాంగ్రెస్ వ్యవహరించింది.  మోదీ అంతానికి ఇదే నాంది అనీ కాంగ్రెస్ కలగనింది. 2019లో బీజేపీ ఓడిపోతుందని భారత పాలకవర్గాలు అంచనావేస్తే, ప్రజలలో అధిక సంఖ్యాకులు మోదీకి మద్దతివ్వడం నిలిపివేస్తారని కాంగ్రెస్‌కు తెలుసు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో తాను గెలవ లేనని కాంగ్రెస్‌కు తెలుసు. కానీ, తను బీజేపీని నిలువరించి నట్లయితే, అది కూటమికి దారితీసి మళ్లీ లేచినిలబడవచ్చు. అధికారం లేకుంటే కాంగ్రెస్ సర్వనాశనమవుతుంది. అందుచేత 2019 ఎన్నికల్లో ఏవిధంగానైనా సరే బీజేపీని కాంగ్రెస్ నిలువరించాలి లేదా పదేళ్లపాటు అధికారానికి దూరమైన స్థితిలో కాంగ్రెస్ కుప్పకూలిపోతుంది.

 బీజేపీని నిలువరించే క్రమంలో బిహార్ ఎన్నికలు తొలి దశ. బీజేపీ గనుక బిహార్‌లో ఓడిపోయినట్లయితే 2019 ఎన్ని కల్లో బీజేపీ ఓటమి ఖాయమని, ఇక మోదీకి మద్దతు ఉపసం హరించుకోవడం మంచిదంటూ భారత పాలక వర్గాలకు, కులీ నవర్గాలకు కాంగ్రెస్ పార్టీ సందేశం పంపగలుగుతుంది. అప్పు డు సంపన్న వ్యాపార వర్గం, రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌తో మళ్లీ అధికారం పంచుకోవాలని కోరుకుంటారు. ఈ వ్యూహం లో భాగంగానే బిహార్ తమకు అనుకూలిస్తుందని కాంగ్రెస్ భావిస్తూ వచ్చింది. బద్ధశత్రువులైన నితీష్, లాలూ ఇద్దరూ పొత్తు కుదుర్చుకోవడమే గొప్ప విజయ సూచకం మరి.

 బిహార్‌లో ముస్లింల జనాభాయే ఎక్కువ. బీజేపీకి వ్యతి రేకంగా ఏ పార్టీనయినా వారు బలపరుస్తారు. ఇది కూడా లౌకిక పార్టీలకు అనుకూలమే. నితీష్‌కు మంచి గుర్తింపు ఉంది కానీ ఓట్లు లేవు. లాలూకు చెడ్డ గుర్తింపు ఉంది కానీ కొన్ని ఓట్లే ఉన్నాయి. కాంగ్రెస్‌కు ఏ ఓట్లూ లేవు కానీ జాతీయ గుర్తింపు ఉంది. ఈ ముగ్గురి మనుగడకు గెలుపు అవసరం.

 బీజేపీ ఇటీవల అనేక వివాదాల్లో కూరుకుపోయింది. ప్రతిపక్షానికి ఇది ఊతమిచ్చింది. సుష్మాస్వరాజ్ వంటి కేంద్ర మంత్రులూ, రాజస్తాన్ సీఎం వసుంధరారాజే వంటి వారిని వివాదాలు చుట్టుముట్టాయి. బీజేపీకి చెందిన పలువురు మంత్రులు తమ విధులను పేలవంగా నిర్వహిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పలువురు మంత్రులు అసమర్థులే కాకుండా వివాదాల్లో చిక్కుకున్నారు. మరోవైపు ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నప్పటికీ మోదీ ప్రభుత్వం ఆర్థిక ఫలితాలను అందివ్వడానికి సమయం తీసుకుంటోంది. భూ చట్టంలో మార్పులకు ప్రయత్నిస్తూ మోదీ ప్రభుత్వం వివాదాలను కొని తెచ్చుకుంటోంది. బీజేపీ గనుక బిహార్‌లో ఓటమి పాలయితే, మీడియాలో కాంగ్రెస్ తన దాడిని పెంచగలుగుతుంది. ఈ రోజుల్లో మీడియానే సర్వస్వం కదా.

 బిహార్‌లో 24 ఎంఎల్‌సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక కూటమి కచ్చితంగా విజయం సాధిస్తుందని భావించారు. ఫలితాలు ప్రకటించకముందే లౌకిక కూటమి సంబరాలు మొదలెట్టేసింది. రాహుల్ గాంధీ, నితీష్ కుమార్, లాలూ సాహస ప్రకటనలు ఇవ్వడంలో పోటీ పడ్డారు. బిహార్ లో లౌకిక పార్టీలకు విజయం తప్పదన్న అంచనా ఢిల్లీలోనూ, బిహార్‌లోనూ బీజేపీని మరింతగా దిగజారుస్తుంది. కానీ 24 ఎంఎల్‌సీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి 15 స్థానాల ను, బీజేపీ వ్యతిరేక కూటమి కేవలం 9 స్థానాలను చేజిక్కించు కోవడం ప్రకంపనలు సృష్టించింది. ఫలితాలు బీజేపీకి గొప్ప ప్రోత్సాహం ఇవ్వగా బీజేపీ వ్యతిరేక కూటమి కుప్పకూలి పోయింది. కొన్ని సార్లు ఒకే ఒక్క స్థానం సైతం ప్రకంపనలు సృష్టిస్తుంది.  

 బీజీపే ఎంఎల్‌సీ ఎన్నికల్లో అనూహ్యంగా గెలుపొంద డానికి కారణాలు బోలెడు. బీజేపీ మంత్రులు, సీఎంల వ్యవ హారం ఎలా ఉన్నప్పటికీ మోదీకి ప్రజాదరణ వెనుకపట్టు పట్ట లేదు. బీజేపీ బిహార్‌లో ఎన్నడూ అధికారంలో లేదు. గత 40 ఏళ్లుగా అధికారంలో ఉన్న లాలూ, నితీష్‌లకు పెద్ద ఎత్తున ఏర్పడిన వ్యక్తిగత శత్రువులు గంపగుత్తగా బీజేపీ ని బలపర్చా రు. లౌకిక కూటమికి, మైనారిటీలకు వ్యతిరేకంగా ముస్లిమేత రులను కూడగట్టడంలో బీజేపీ సఫలమైంది. లాలూ కుటుం బం మొత్తం అధికార స్థానాలు కైవసం చేసుకునేందుకు వెంప ర్లాడటంతో ప్రజలకు ఏవగింపు కలిగింది. దీంతో ఒక్కరోజులో బిహార్ రాజకీయ ముఖచిత్రం పెనుమార్పుకు గురయింది. ఒక వారం క్రితం బీజేపీకి పరాజయం తప్పదనిపించిన చోట ఇప్పుడు బీజేపీయే గెలుస్తుందన్న భావం బలపడిపోయింది.

 నోబెల్ గ్రహీత, రచయిత రాబర్ట్ స్టెయిన్‌బెక్ ఒకమాటం టారు. మనుషుల పథకాలు ఎల్లవేళలా విఫలమవుతుంటాయి అని. కోరికలే గుర్రాలయితే ఊహలకు రెక్కలొస్తాయని తెలుగు సామెత. ఏదేమైనా బిహార్ ఎన్నికలు ఇప్పుడు ఆసక్తికరం గానూ, ఆశ్చర్యకరంగానూ మారాయి. గతవారం కంటే బీజేపీ లో మరింత ఆశాభావం ఏర్పడింది. అయితే ఇదంతా తన ప్రజాదరణ ప్రభావమని మోదీ భావించకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇది బీజేపీ ప్రత్యర్థులైన లాలూ, నితీష్ వంటి వారి అప్రతిష్టే ఈ అనూహ్య పరిణామానికి కారణం.

http://img.sakshi.net/images/cms/2015-07/61436724438_Unknown.jpg
పెంటపాటి పుల్లరావు
(వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు    ఈమెయిల్: Drpullarao1948@gmail.com)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement