విపక్ష కూటమి కలేనా?
నితీశ్‌కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరడాన్ని బీజేపీ ‘ఘర్ వాప్‌సీ’గా అభివర్ణిస్తోంది. నిజానికిది మరో ప్రత్యామ్నాయ వేదిక నిర్మాణాన్ని పునాదుల్లోనే దెబ్బతీసే రాజకీయ పునరేకీకరణ. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయం తర్వాత.. 2019లో మోదీని ఢీకొట్టడం అంత సులువు కాదనేది విపక్షాలకు అర్థమైంది. అందుకే కలిసికట్టుగా ఎదుర్కొనాలని ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
2015లో బిహార్‌లో ఏర్పడిన మహాకూటమే దీనికి తొలిమెట్టు. లౌకిక పార్టీలు ఏకమైతే 2019లో మోదీకి గట్టిపోటీనివ్వొచ్చనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతీయ పార్టీలు జట్టుకట్టే ప్రయత్నం జరిగింది. ఈ ఐక్యతతో ముప్పు ఉంటుందని పసిగట్టిన మోదీ–అమిత్‌షా జోడి కూటమి ఏర్పాటును దెబ్బతీయాలనే పథకాన్ని చాన్నాళ్ల కిందటే అమల్లో పెట్టారని.. దీని ఫలితం బిహార్ తాజా పరిస్థితులేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. నితీశ్‌కు సానుకూల సంకేతాలు పంపడం ద్వారా విపక్షాల ఐక్యతాయత్నాలకు తొలి అడుగులోనే విఘ్నం కలిగింది.
ముందుండి నడిపించేదెవరు?
1989 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యతిరేక శక్తులన్నీ ఏకమై వీపీ సింగ్ నేతృత్వంలో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటైంది. బీజేపీ, కమ్యూనిస్టులు బయటి నుంచి మద్దతునివ్వడంతో వీపీ సింగ్ ప్రధాని అయ్యారు. అదే తరహాలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలను ఏకం చేయాలనేది కాంగ్రెస్ వ్యూహం. అందుకే.. మోదీని ఢీకొట్టేందుకు విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా నితీశ్‌ను తెరపైకి తెస్తారని భావించారు. కానీ మారిన పరిస్థితులతో నితీశ్.. మోదీ పంచన చేరిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో విపక్షాల కూటమికి నేతృత్వం వహించేదెవరు? సోనియాగాంధీకి అనారోగ్యం.
పైగా ఆమె ప్రధాని పదవిని గతంలోనే వదులుకున్నారు. మరి మోదీకి ఎదురునిలిచేలా విపక్షాలను నడిపించే స్థాయి ఎవరికుంది? కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై సొంత పార్టీలోనే అసంతృప్తి కనబడుతుంటే.. విపక్షాలు ఎలా అంగీకరిస్తాయి? మాయావతి ప్రాభవం కోల్పోయారు. తృణమూల్ అధినేత్రి మమతా బెంగాల్‌లో బీజేపీని నిలువరించడానికే సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ప్రధాని పదవిపై భారీగా ఆశలు పెట్టుకున్న ములాయంను కుమారుడే పక్కన పెట్టేశారు. లాలూపై ఆరేళ్ల అనర్హత వేటు ఉంది. ఈ పరిస్థితుల్లో విపక్షాలకు నాయకత్వం వహించేదెవరు?
ఆ 120 స్థానాలపై పట్టు తగ్గొద్దనే!
హిందీ బెల్ట్‌లో హవా మూలంగానే 2014లో బీజేపీ తొలిసారి కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలాన్ని (282 సీట్లు) సాధించింది. 2019 ఎన్నికల్లో ఈ బెల్ట్‌లో ఏదైనా నష్టం జరిగితే దాన్ని పూడ్చుకోవడానికి వీలుగా ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లో బలపడే ప్రయత్నంలో ఉంది. నితీశ్‌తో దోస్తీ లేకుండానే 2014 ఎన్నికల్లో బిహార్‌లోని 40 లోక్‌సభ స్థానాల్లో 31 చోట్ల బీజేపీ పాగా వేసింది. ఈ విజయంతోనే 2015 బిహార్ అసెంబ్లీపై తమ జెండా ఎగురుతుందని ఆశించింది.
కానీ మహాకూటమి (జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు కలిపి పోటీచేశాయి) సమీకరణాలు బీజేపీని దారుణంగా దెబ్బతీశాయి. అందుకోసం.. 2019లో బిహార్‌లో తమ బలం తగ్గకూడదంటే.. నితీశ్‌ను చేరదీయాలనేది బీజేపీ వ్యూహం. యూపీ నుంచి దళితుడైన రామ్‌నాథ్‌కోవింద్‌ను రాష్ట్రపతిని చేసింది. 2019ని దృష్టిలో పెట్టుకొనే చాలా జాగ్రత్తగా కులసమీకరణాలను కూరుస్తోంది. యూపీ, బిహార్‌లో కలిపి 120 లోక్‌సభ సీట్లుండగా... ఇప్పుడు బీజేపీ చేతిలో 102 సీట్లున్నాయి. ఈ బలాన్ని కోల్పోకూడదని మోదీ–షా ద్వయం పావులు కదుపుతున్నారు.
ప్రాంతీయ పార్టీలకు సంకేతం
నితీశ్ కుమార్‌కు బేషరతు మద్దతు ప్రకటించడం ద్వారా.. దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకు బీజేపీ సానుకూల సంకేతాలు పంపుతోంది. రాష్ట్రాల పాలనలో తమ జోక్యం ఉండబోదని, ప్రాంతీయ పార్టీలకు తగిన స్వేచ్ఛ ఉంటుందనే సందేశం ఇస్తోంది. ఇప్పటి వరకు బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటిస్తూ వస్తున్న ప్రాంతీయ పార్టీలు తమవైపు మొగ్గుచూపుతాయన్నది కమలదళం అంచనా. – సాక్షి నాలెడ్జ్ సెంటర్