'మా కూటమిదే విజయం.. 8న సీఎం రాజీనామా'
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తమ కూటమి మూడింట రెండొంతుల మెజార్టీ సాధిస్తుందని, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పదవి నుంచి వైదొలగక తప్పదని చెప్పారు.
శరన్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో షా మాట్లాడుతూ.. 'బిహార్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే అధికారంలోకి రాబోతోంది. నవంబర్ 8న సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేస్తారు' అని జోస్యం చెప్పారు. ఎన్డీయేకు ఓ అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ అభివృద్ధి గురించి కాకుండా మంత్రాలు, తంత్రాల గురించి మాట్లాడుతున్నారని, లాలుతో జతకట్టిన నితీష్ బిహార్ను ఎలా అభివృద్ధి చేస్తారని షా ప్రశ్నించారు. బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ కలసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.