బలపరీక్షలో నెగ్గిన నితీశ్ కుమార్
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ఎదుర్కొన్న బలపరీక్షలో విజయం సాధించింది. మేజిక్ ఫిగర్ 122 కాగా ఆయనకు అనుకూలంగా 131, వ్యతిరేకంగా 108 ఓట్లు వచ్చాయి. బలపరీక్షలో భారీగా క్రాస్ ఓటింగ్ చేసినట్లు తెలుస్తోంది. గురువారం జనతా దళ్ యూనైటెడ్(జేడీయూ), భారతీయ జనతా పార్టీల కూటమి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్ధానాలు ఉన్నాయి. జేడీయూ, బీజేపీలకు 132 మంది ఎమ్మెల్యేల(జేడీయూ 71, బీజేపీ 53, ఆర్‌ఎల్‌ఎస్‌పీ 2, ఎల్‌జేపీ 2, హెచ్‌ఏఎం 1, ముగ్గురు స్వతంత్రులు) మెజారిటీ ఉంది. నితీశే తమ ముఖ్యమంత్రిగా ఉండాలని భావించిన కొందరు విపక్ష ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో నితీశ్ కుమార్ ప్రభుత్వం బలనిరూపణ పరీక్షలో గెలుపొందింది. కాగా బలపరీక్షకు ముందు విపక్ష కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు ప్లకార్డులతో నితీశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.