ముందున్నవి సంబరాలు కాదు.. సవాళ్లే! | Pentapati Pullarao Guest Column On BJP | Sakshi
Sakshi News home page

ముందున్నవి సంబరాలు కాదు.. సవాళ్లే!

Published Wed, Jan 8 2020 12:40 AM | Last Updated on Wed, Jan 8 2020 12:46 AM

Pentapati Pullarao Guest Column On BJP - Sakshi

జగజ్జేతలు కూడా అనూహ్యంగా సామ్రాజ్యాలను కోల్పోయినట్లు చరిత్ర చెబుతోంది. సంవత్సరం లోపే వరుసగా 9 రాష్ట్రాల్లో అధికారం కోల్పోవడం భారతీయ జనతా పార్టీకి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రాజ్యాంగంతో ముడిపడిన మౌలిక విధానాలను వేగంగా మార్చడం, ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో ఘోర వైఫల్యం, ప్రభుత్వం వెలుపలి ప్రతిభను పార్టీలోకి ఆకర్షించలేకపోవడం, వ్యవసాయం, నిరుద్యోగిత పరిష్కారం కాకపోవడం, కూటమి మిత్రులు దూరం కావడం బీజేపీకి పెనుసవాళ్లను తీసుకొస్తోంది. మహారాష్ట్రను కోల్పోవడం రాజకీయంగా కమలానికి అతిపెద్ద దెబ్బ. ఈ కొత్త సంవత్సరం బీజేపీకి చాలా సవాళ్లను తీసుకొచ్చింది. కొత్త సమస్యలకు మోదీ, షాలు కొత్త పరిష్కారాలు కనుగొంటారేమో కాలమే చెప్పాలి.

ప్రపంచం మొత్తాన్ని జయించామని మీరు భావిస్తున్న క్షణంలోనే అనూహ్యంగా కొత్త సవాళ్లు ఎదురవుతాయి. చరిత్రలో అతి పెద్ద సామ్రాజ్యాలు అనుకోని సవాళ్లు ఎదురై తమను కూల్చివేస్తాయమని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాయి. హంగరీ, ఆస్ట్రియా, తదితర యూరప్‌ దేశాల రాజులు 800 సంవత్సరాల క్రితం అత్యున్నత అధికారాన్ని చలాయిస్తుండేవారు. ఉన్నట్లుండి వీరు తమ నగర రాజ్యాలపై వేలాదిమంది మంగోలు అశ్విక దళాల దాడిని ఎదుర్కోవలసి వచ్చింది. వేలాది మైళ్ల దూరం ప్రయాణించివచ్చిన మంగోల్‌ రౌతులు విరుచుకుపడి రాత్రింబవళ్లు తమపై దాడులు కొనసాగించగలవని యూరోప్‌ రాజులు అసలు ఊహించలేకపోయారు. మంగోలులు ఉన్నట్లుండి యూరప్‌లో కనిపించి నగరం తర్వాత నగరాన్ని ధ్వంసం చేసిపడేశారు. మంగోలుల ఆకస్మిక ఉనికిని ఊహించని యూరోపియన్‌ మహా సామ్రాజ్యాలు చేష్టలుడిగి చూస్తుండిపోయాయి. 
అదేవిధంగా, బీజేపీ, నరేంద్రమోదీ 2020 ఆగమనం సంద ర్భంగా సంబరాలు చేసుకుంటూండగానే ఆకస్మిక సవాళ్లు ఎదురయ్యాయి. ఒకటి మాత్రం నిజం. ఏ రాజకీయనేత కానీ, పాలకుడు కానీ తమను ఏ సవాలు కుప్పగూలుస్తుందనే విషయాన్ని ముందుగా ఊహించలేరు. దక్కన్, మరాఠాలపై కేంద్రీకరించడం ద్వారా తమ సామ్రాజ్యమే కుప్పకూలుతుందని ఔరంగజేబ్‌ ఎన్నడూ ఊహించలేదు. వాస్తవానికి ఔరంగజేబు నేటి ఔరంగాబాద్‌లోనే చనిపోయాడు. అదేవిధంగా బీజేపీకి 2020లో సవాళ్లు ఎదురవుతున్నాయి. కూలంకషంగా ఈ సవాళ్లను పరిశీలిద్దాం.
1. తొమ్మిది రాష్ట్రాల ఎన్నికల్లో వరుస పరాజయం: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, హరియాణా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, ఇప్పుడు జార్కండ్‌లలో బీజేపీ శాసనసభ ఎన్నికల్లో పరాజయం పొందింది. మహారాష్ట్ర నాటి ముఖ్యమంత్రి ఫడ్నవిస్, జార్కండ్‌ నాటి ముఖ్యమంత్రి రఘుబర్‌ దాస్‌లపై అక్కడి అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమిత్‌ షా ప్రశంసల వర్షం కురిపించారు. 2019 మే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో మహారాష్ట్ర, హరియాణా, జార్కండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం నల్లేరు మీద నడకగానే ఉంటుందని నరేంద్రమోదీ భావించారు. కానీ ఈ మూడు రాష్ట్రాల్లో పరాజయాలు బీజేపీకి, దాని అధినేతలకు షాక్‌ కలిగించాయి.
2. దారుణంగా మారిన ఆర్థిక వ్యవస్థ: భారత్‌ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థను నిర్వహించడానికి నిపుణుల అవసరం ఉందని మోదీ అర్థం చేసుకున్నట్లు లేదు. రక్షణ, విదేశీ వ్యవహారాలను నిర్వహించడం కష్టమని భావిస్తుంటారు కానీ ఆర్థిక వ్యవస్థను నిర్వహించటమంత కష్టమైన పని మరొకటి ఉండదు. మోదీ ఇంత పెద్ద అంశాన్ని నిర్లక్ష్యం చేశారు. మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కూడా ఆర్థికంగా పెద్ద వైఫల్యాలను చవిచూశాయి కానీ మోదీ ప్రభుత్వం కూడా వాటికి ఏమాత్రం భిన్నంగా లేదు. 
3. విధానాల్లో పెను మార్పులు: 2019 మే నెల నుంచి మోదీ దేశానికి మింగుడు పడని స్థాయిలో రాజ్యాంగపరంగా తీవ్ర మార్పులను ప్రవేశపెట్టారు. ఇదే విధానాలను మరింత మృదువుగా, సమయస్ఫూర్తితో ప్రవేశపెట్టి ఉండవచ్చు. ఆర్టికల్‌ 370ని గంగలో కలి పారు సరే. కానీ దానికి కూడా ఒక పద్దతి అనేది ఉంటుంది కదా. తర్వాత పౌరసత్వ సవరణ చట్టంలో మార్పులు చేశారు. తర్వాత జాతీయ పౌర పట్టిక. కానీ మోదీ వీటన్నింటినీ అందరికీ సంతృప్తి కలిగించేరీతిలో తీసుకురావలసి ఉండేది. ఇప్పుడు మోదీలోని ఈ బలహీనమైన పనివిధానాన్నే ప్రత్యర్థులు అనుకూలంగా మల్చుకున్నారు. వేగంగా, ఆలోచనారహితంగా చేయడానికి బదులుగా, మోదీ ప్రభుత్వం జాగ్రత్తగా మార్పులను తీసుకువచ్చి ఉంటే బాగుండేది.
4. వ్యవసాయ వైఫల్యం: దేశంలోని సగం జనాభా ఇప్పటికీ వ్యవసాయంతో ముడిపడి ఉంది. నరేంద్రమోదీ కానీ, గతంలో మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కానీ వ్యవసాయాన్ని ప్రోత్సహించే కిటుకులలో నైపుణ్యం సాధించలేదు. రుణమాఫీలు మినహా ఈ ప్రభుత్వాలు చేసిందేమీ లేదు. మరింత సాగు లేక బీమాను కల్పిస్తే వ్యవసాయరంగ వృద్ధికి సరిపోతుందని మోదీ భావించారు కానీ అవి అసలు సమస్యలకు పరిష్కారాలు కావు. మోదీ హయాంలో వ్యవసాయం కుప్పగూలిపోతోంది.
5. నిరుద్యోగిత చాలా సంక్లిష్ట సమస్య: ఆర్థిక వ్యవస్థ సమర్థంగా పనిచేస్తున్నప్పుడు నిరుద్యోగంపై పెద్దగా ఆరోపణలు ఉండవు. కానీ ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ లాగా దిగజారుతున్నప్పుడు నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోతోందని ప్రభుత్వంపై విమర్శలు తప్పవు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి రేటు గురించి మోదీ ప్రభుత్వం ఏమాత్రం అర్థం చేసుకోవడం లేదు. ఉపాధి కల్పన వల్ల మాత్రమే వృద్ధి రేటు సాధ్యపడుతుంది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితి కూడా గత మూడేళ్లలో ఆశాజనకంగా లేదు. దీంతో మోదీ ప్రయత్నాలకు మరింత దెబ్బ కలుగుతోంది.
6. ప్రభుత్వం వెలుపలి ప్రతిభకు తిరస్కృతి:  కేంద్ర ప్రభుత్వాన్ని మీరు పరిశీలించినట్లయితే, మీకు మోదీ, అమిత్‌ షా, రాజ్‌ నాథ్‌ కనబడతారు. తర్వాత పీయూష్‌ గోయల్, నితిన్‌ గడ్కరీ వంటి సమర్థ మంత్రులు ఒకరిద్దరున్నారు. ఇతరులంతా అనామకులే. సాధారణంగా ఏ కేంద్ర ప్రభుత్వంలో అయినా కనీసం పదిమంది మాజీ ముఖ్యమంత్రులు ఉండేవారు. రాజకీయ నాయకులను ఆకర్షించినట్లే పాలనాపరంగా ప్రతిభ కలవారిని కూడా మోదీ ప్రభుత్వంలోకి తీసుకోవాలి. కానీ ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి, విప్రో చీఫ్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ వంటి పారిశ్రామిక, ఐటీ మేధావులను మోదీ తన ప్రభుత్వంలోకి తీసుకోవలసి ఉండె. మోదీ ఎంతసేపటికీ మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, గూగుల్‌ తదితర విదేశీ కంపెనీల ఉద్యోగులను కలవడంపైనే ఆసక్తి ప్రదర్శిస్తున్నారు తప్పితే ఘనమైన భారతీయ ప్రతిభామూర్తులను పక్కన పెట్టేశారు. 7. దూరమవుతున్న కూటమి మిత్రులు: రాజకీయాలు అంటే అర్థం మిత్రులను  కూడగట్టడం, వారిని నిలుపుకోవడం. 2014కి ముందు బీజేపీ చాలా నమ్రతతో ఉండి అనేకమంది మిత్రులను ఆకర్షించింది, పొత్తులను కూర్చుకుంది. కానీ తర్వాత్తర్వాత బీజేపీ తన మిత్రులను కోల్పోతూ వచ్చింది. కొత్తగా మిత్రులను కలుపుకోవడంలో విఫలమైంది. 2019లో ఘనవిజయం తర్వాత చిన్న పార్టీల నుంచి ఒక్కరికి కూడా బీజేపీ మంత్రి పదవిని ఇవ్వలేదు.  ఇది ఆ పార్టీనే బలహీనపర్చి మహారాష్ట్ర, హరియాణా, జార్కండ్‌లలో ఓటమికి దారి తీసింది. 
భవిష్యత్తు అవకాశాలు: తప్పులను సరిదిద్దుకోవడంలో నరేంద్రమోదీ గతంలో గొప్ప ప్రతిభ చూపారు. కానీ గత రెండేళ్లలో మోదీ, షాలు ఆర్థిక వ్యవస్థను నిర్లక్ష్యం చేసేశారు. ఇది దేశానికి, ఆర్థిక వ్యవస్థకు కూడా హాని చేసింది. ఆర్థిక వ్యవస్థ మోదీ ప్రభుత్వానికి అతి పెద్ద సవాలుగా మారింది. దీనికి పరిష్కారం ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేయడం కాదు. ద్రవ్య విధానాలు, పన్నుల సంస్కరణలో మౌలిక మార్పులే మార్గం. రాజకీయంగా చూస్తే మహారాష్ట్రలో ఎవరు గెలిస్తే వారే కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే మహారాష్ట్రను బీజేపీ ఎలా గెల్చుకుంటుందన్నదే పెద్ద ప్రశ్న. రాజీవ్‌ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత 1987లో భారత్‌ మొత్తంగా ఆయన్ని, తన కుటుంబాన్ని ప్రేమించింది. వారు చాలా మంచిగానూ, స్వచ్ఛమైనవారుగానూ కనిపించారు. కానీ సంవత్సరం లోపే రాజీవ్‌ అప్రతిష్టను మూటగట్టుకుని 1989 ఎన్నికల్లో ఓడిపోయారు. రాజీవ్‌ గాంధీ ప్రతిష్ట ఎంత వేగంగా దిగిజారిపోయిందో ఇప్పుడు బీజేపీ గుర్తుంచుకోవాలి. 

సమస్య ఏమిటంటే, చిన్న చిన్న సమస్యలను తక్షణం పరిష్కరించాలి. లేకుంటే అవే అతిపెద్ద సమస్యలుగా మారతాయి. బీజేపీ పుంజుకోవాలంటే దేశవ్యాప్తంగా మరింతమంది నాయకులను ప్రోత్సహించాలి. అధికారం చుట్టూనే కోటరీలు ఉంటాయి. బీజేపీలోకూడా ఇదే జరుగుతోంది. కోటరీలు రాజకీయ పార్టీలను నాశనం చేస్తాయి. యూరోపియన్‌ రాజులు 5 వేల మైళ్ల దూరంనుంచి అనూహ్యంగా వచ్చిపడిన మంగోలుల చేతిలో చిత్తయిపోయారు. అజేయులైన మరాఠాలను ఓడించాలన్న దుగ్ధవల్లే ఔరంగజేబు పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ఈ కొత్త సంవత్సరం బీజేపీకి చాలా సవాళ్లను తీసుకొచ్చింది. కొత్త సమస్యలకు మోదీ, షాలు కొత్త పరిష్కారాలు కనుగొంటారేమో కాలమే చెప్పాలి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం తర్వాత మోదీ, షాలు ఎక్కువకాలం విశ్రాంతిగా ఉండలేరు. నూతన సవాళ్లు నూతన పరిష్కారాలను కోరుకుంటాయి. మోదీ, షాలు వీటిని కనుగొంటారేమో వేచి చూడాల్సిందే.

పెంటపాటి పుల్లారావు
వ్యాసకర్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement