మోదీతో చర్చించాకే తేలుస్తాం: ఉద్దవ్
కేంద్రానికి మద్దతు ఉపసంహరణపై శివసేనాధిపతి స్పందన
చవాన్‌కు సంకీర్ణాన్ని నడిపే దృక్పథం లేదు: పవార్
ముంబై/పుణె/జమ్మూ: బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే విషయాన్ని ప్రధాని మోదీతో చర్చించిన తర్వాత నిర్ణయిస్తామని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే తాజాగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి శివసేన వైదొలగుతుందని, తమ పార్టీ నేత అనంత్‌గీతే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు సోమవారం ప్రకటించిన ఉద్దవ్, మంగళవారం కాస్త పట్టువిడుపు ధోరణిలో మాట్లాడారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయనతో మట్లాడి...దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఉద్దవ్‌ఠాక్రే మంగళవారం ముంబైలో మీడియాతో చెప్పారు. సీట్ల పంపకంలో తేడాలతో మహారాష్ట్రలో శివసేన, బీజేపీ విడిపోయిన విషయం తెలిసిందే.
మరోవైపు మహారాష్ట్రలో 15 ఏళ్ల అనుబంధానికి స్వస్తి చెప్పి, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న నేషనలిస్ట్ కాంగ్రె స్ పార్టీ, అందుకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తీరే కారణమంది. చవాన్‌కు సంకీర్ణాన్ని నడిపే దృక్పథం లేదని, ఆయన విభజన ఎత్తుగడలకు పాల్పడినట్లు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ అన్నారు. కాగా ఎన్నికల తరువాత బీజేపీతో కలిసి పోవాలనే ఎత్తుగడతోనే ఎన్సీపీ తన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుందని పృధ్వీరాజ్ చవాన్ తుల్జాపూర్ లో కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచార. సందర్భంగా ఆరోపించారు.