న్యూఢిల్లీ: మరో నాలుగు నెలల్లో లోక్‌సభ సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒకవైపు రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహాల్లో తలమునకలవుతుంటే మరోవైపు ఢిల్లీ కోటలో పాగా వేసేదెవరనే అంశంపై చర్చోపచర్చలు, సర్వేలు, అంచనాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందనే విషయమై ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్‌లు కలిసి గత నెల 15 నుంచి 25 వరకు అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ సర్వే నిర్వహించాయి. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఈ సర్వే నిర్వహించడం గమనార్హం.
దేశంలో మొత్తం 543 నియోజకవర్గాలుండగా, ప్రతీ నియోజకవర్గంలోనూ వంద మంది అభిప్రాయాలను తీసుకుని ఈ సర్వే చేశారు. ఉన్నపళంగా ఎన్నికలు వస్తే కేంద్రంలో ఏ కూటమికీ సాధారణ ఆధిక్యం రాదని సర్వేలో తేలింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు సాధారణ ఆధిక్యం (272 సీట్లు) కన్నా 15 సీట్లు తక్కువగా వస్తాయనీ, ఇరు కూటముల్లోనూ లేని ‘ఇతర’ పార్టీల మద్దతే కేంద్రంలో సర్కారు ఏర్పాటుకు కీలకమని ఈ సర్వే చెబుతోంది. కాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు ముందు, నవంబర్‌లో కూడా ఈ సంస్థలు సర్వే నిర్వహించగా, ఎన్‌డీఏకు 281, యూపీఏకు 124, ఇతరులకు 138 సీట్లు వస్తాయని వెల్లడైంది. ఆ అంచనాతో పోలిస్తే తాజా సర్వేలో ఎన్‌డీఏ 24 సీట్లు కోల్పోగా, యూపీఏకు 22 సీట్లు ఎక్కువగా రావడం గమనార్హం.
ఎన్డీయేకు 257 సీట్లు..
కేంద్రంలో అధికారం చేపట్టాలంటే కనీసం 272 సీట్లు గెలవాలి. 2014 ఎన్నికల్లో బీజేపీ ఒక్కటే 282 సీట్లు గెలిచింది. అయితే ఈసారి పరిస్థితి వేరుగా ఉండనుందనీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పార్టీలన్నింటికీ కలిపి 257 సీట్లు మాత్రమే వస్తాయని ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్ సర్వే అంటోంది. అంటే సాధారణ ఆధిక్యానికి 15 సీట్ల దూరంలో ఎన్డీయే ఆగిపోనుంది. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు (ఎస్పీ, బీఎస్పీలను కలపకుండా) 146 సీట్లు మాత్రమే వస్తాయని సర్వే పేర్కొంది.
‘ఇతరుల’ హవా..
ఇరు కూటముల్లో లేని పార్టీలు, స్వతంత్రులు కలిసి మొత్తంగా 140 సీట్లు గెలుస్తారనీ, ప్రభుత్వ ఏర్పాటుకు వీరే కీలకం కానున్నారని అంచనా వేసింది. ఈ ‘ఇతర’ పార్టీల్లో ఎస్పీ, బీఎస్పీ, అన్నాడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బిజు జనతాదళ్, వైఎస్సార్‌సీపీ, లెఫ్ట్ ఫ్రంట్, పీడీపీ, ఏఐయూడీఎఫ్, ఎంఐఎం, ఐఎన్‌ఎల్‌డీ, ఆప్, జేవీఎం, ఏఎంఎంకే తదితరాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ, తెలంగాణలో టీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకోనున్నాయని సర్వే తేల్చింది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు 16, ఏపీలో వైఎస్సా ర్సీపీకి 19 సీట్లు వస్తాయని అంచనావేసింది.
పార్టీల వారీగా సీట్లు ఇవీ..
ఈ సర్వే ప్రకారం ఎన్డీయే కూటమిలో బీజేపీకి మొత్తంగా 223 సీట్లు రానున్నాయి. మిత్రపక్షాలైన శివసేన 8 స్థానాల్లో, జేడీయూ 11, శిరోమణీ అకాళీదళ్ 5, ఎల్జేపీ 3 స్థానాలు గెలవనున్నాయి. ఎన్డీయేలో మిగిలిన పార్టీలకు తలో సీటు రావొచ్చని అంచనా వేసింది. యూపీఏ విషయానికి వస్తే కాంగ్రెస్ 85 స్థానాల్లో విజయం సాధించనుంది. 2014 ఎన్నికల కంటే ఇది రెట్టింపు. ఆ కూటమిలోని డీఎంకే 21, ఆర్జేడీ 10, ఎన్‌సీపీ 9, జేఎంఎ, జేడీఎస్‌లు చెరో 4 సీట్లు, టీడీపీ సహా కూటమిలోని మిగతా పార్టీలకు 13 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది.
యూపీలో బీజేపీకి 40 మాత్రమే
ఢిల్లీ గద్దెకు దారిచూపే ఉత్తరప్రదేశ్ (యూపీ)లో మొత్తం 80 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఏకంగా 71 నియోజకవర్గాల్లో గెలవగా, ఎన్డీయే భాగస్వామి అయిన అప్నాదళ్ రెండు చోట్ల గెలిచింది. మొత్తంగా 80లో 73 సీట్లు ఎన్డీయేకే వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో మాత్రం బీజేపీకి యూపీలో 40 సీట్లు మాత్రమే వస్తాయనీ, ఎస్పీకి 20, బీఎస్పీకి 15, కాంగ్రెస్‌కు 2 స్థానాల్లో విజయం దక్కుతుందని సర్వే అంటోంది. బిహార్‌లోని మొత్తం 40 సీట్లలో బీజేపీకి 13, మిత్రపక్షం జేడీయూకు 11, ఆర్జేడీకి 10, కాంగ్రెస్‌కు 2 సీట్లు వస్తాయంది. మహారాష్ట్రలో బీజేపీకి 22, శివసేనకు 8, కాంగ్రెస్‌కు 9, ఎన్సీపీకి 9 స్థానాలు దక్కుతాయనీ, ఇక దక్షిణ భారతంలో అత్యధిక ఎంపీ నియోజకవర్గాలు కలిగిన తమిళనాడులో డీఎంకేకు 21, అన్నాడీఎంకేకు 10, కాంగ్రెస్‌కు 3 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment