![Mamata Banerjee Trinamool Congress Survive Till 2021 Assembly Elections - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/27/mamatha.jpg.webp?itok=-FoqadEj)
పశ్చిమ బెంగాల్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు దీదీ కోటలో బీజేపీ బలం పుంజుకోవడమే కాక క్షేత్ర స్థాయిలో వేళ్లూనుకుంటోందని, ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుంటోందని వెల్లడిస్తున్నాయి. తాజా ఫలితాలను విశ్లేషిస్తే 18 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ రాష్ట్రంలో 121 అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీ సాధించిందని తేలింది. 22 సీట్లు దక్కించుకున్న తృణమూల్ 164 అసెంబ్లీ సెగ్మెంట్లలో ముందంజలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. దీన్ని బట్టి 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అగ్ని పరీక్షేనని, రాజకీయ పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర భవిష్యత్ రాజకీయ చిత్రాన్ని పూర్తిగా మార్చివేస్తాయని వారు అంచనా వేస్తున్నారు.
2014 ఎన్నికల్లో 39.7 శాతం ఓట్లు సాధించిన తృణమూల్ 34 సీట్లు గెలిచింది. ఈ సారి ఓట్ల శాతం 43.3కు పెరిగినా సీట్లు తగ్గడం గమనార్హం. అలాగే, గత ఎన్నికల్లో17 శాతం ఓట్లతో 2 స్థానాలు దక్కించుకున్న బీజేపీ ఈ సారి 40.2శాతం ఓట్లతో 18 సీట్లు గెలుచుకుంది. తృణమూల్ ఎమ్మెల్యేలు ఉన్న చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ మెజారిటీ సాధించడంతో ఓట్లతో పాటు సీట్లు కూడా పెరిగాయి. రాజధాని ,చుట్టుపక్కల ఉన్న ఐదు లోక్‌సభ నియోజకవర్గాల్లో( కోల్‌కతా సౌత్, నార్త్, జాదవ్‌పూర్, బరసాత్, డమ్‌డమ్) తృణమూల్ ఎంపీలే ఉన్నారు. వీటి పరిధిలో 35 శాసన సభ స్థానాలున్నాయి. తాజా ఎన్నికల్లో వీటిలో ఐదు చోట్ల బీజేపీ అభ్యర్ధులు పై చేయి సాధించారు. రాష్ట్ర మంత్రులు సోవన్‌దేవ్ ఛటోపాధ్యాయ,సుజిత్‌బోస్, జ్యోతిప్రియలు తమ సొంత నియోజకవర్గాల్లోనే తృణమూల్‌కు మెజారిటీ తీసుకురాలేక పోయారు.
అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మమత 2020లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. చాలా చోట్ల ఇప్పటికే బీజేపీ ముందంజలో ఉందని పలువురు తృణమూల్ నాయకులు లోపాయికారీగా అంగీకరిస్తున్నారు.దాంతో బూత్ స్థాయి నుంచి ప్రక్షాళనకు పార్టీ నాయకత్వం శ్రీకారం చుడుతోంది.నియోజకవర్గాల పరిస్థితి ఇలా ఉంటే జిల్లాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.డజనుకు పైగా సీనియర్ మంత్రులు ప్రాతినిధ్యం వహించే స్థానాల్లో తృణమూల్ బాగా వెనకబడి ఉందని తాజా ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఇక్కడ తృణమూల్ ఓటు బ్యాంకు ముక్కలయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థి పార్టీ ఒకవైపు బలపడుతోంటే, అంతర్గత కలహాలు, నేతల విభేదాలు తృణమూల్‌కు భారీగా నష్టం కలిగిస్తున్నాయి. కొందరు బహిరంగంగానే మమతపై ధ్వజమెత్తుతోంటే, మరికొందరు లోపాయికారీగా ప్రత్యర్థులకు సహకరించడం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనబడిందని పార్టీ నేతలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment