
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే అద్భుత విజయం సాధించిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం వ్యాఖ్యానించారు. వారసత్వపాలన, రాచరిక పాలన, కులాల ఆధారిత రాజకీయాలను ప్రజలు ఈ ఎన్నికల్లో తిరస్కరించారని అన్నారు. పూర్తి మెజారిటీతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారం చేపడుతుందని ఆయన చెప్పారు. అసత్య ప్రచారాలతో ప్రభుత్వంపై విపక్షాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైనట్టుగానే ఫలితాలు సాధించామని తెలిపారు. ‘అద్భుత విజయాన్ని అందించిన సందర్భంగా ప్రధాని మోదీకి, ఎన్డీ యే, బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలుపుతున్నాను’అని ఆయన చెప్పారు. ఈవీఎంలను అనుమానించడం, వీవీ పాట్ల లెక్కింపునకు డిమాండ్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని చులకన చేసేందుకు యత్నించిన విపక్షాలను దుయ్యబట్టారు. విజయానికి తోడ్పాటునందించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.