మెజారిటీకి చేరువగా ఎన్డీఏ
జేడీయూ మద్దతుతో రాజ్యసభలో పెరిగిన బలం
న్యూఢిల్లీ: విపక్షానికి మెజారిటీ ఉన్న రాజ్యసభలో అధికార ఎన్డీఏ బలం పెరుగుతోంది. తాజాగా జేడీయూ మద్దతుతో కూటమి సభ్యుల సంఖ్య 89కి పెరిగింది. పలు అంశాల్లో మద్దతిస్తున్న అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ తదితర ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులు, నామినేటెడ్ సభ్యులను కూడా కలుపుకుంటే అధికార కూటమి బలం 121. ఇది 243 సభ్యులున్న సభలో కావలసిన మెజారిటీ 123 కంటే రెండే తక్కువ. కేంద్ర మంత్రి అనిత్‌దవే మరణంతో ఖాళీ అయిన మధ్యప్రదేశ్‌లోని ఒక రాజ్యసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో గెలిచే అవకాశమున్న బీజేపీ.. గుజరాత్ నుంచి ఒక కాంగ్రెస్ స్థానాన్ని చేజిక్కించుకోడానికి యత్నిస్తుండటం తెలిసిందే.
ఈ రెండు సీట్లూ దక్కితే పార్టీ ఎన్డీఏ బలం 91కి పెరుగుతుంది. ఉత్తరప్రదేశ్ నుంచి 9 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో 8 సీట్లలో గెలిస్తే ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో అధికార పక్షానికి ఊరట లభిస్తుంది. వచ్చే ఏడాది మార్చి–ఏప్రిల్‌లలో బిహార్ నుంచి ఆరు రాజ్యసభ స్థానాలకు నిర్వహించే ఎన్నికల్లో ఎన్డీఏకు ప్రతికూల ఫలితాలు ఎదురుకావొచ్చు. ఈ సీట్లలో నాలుగు జేడీయూ, రెండు బీజేపీవి కాగా, కాంగ్రెస్–ఆర్జేడీ కూటమి మూడింటిని గెలుచుకునే అవకాశముంది. రాజ్యసభలో ప్రభుత్వానికి మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వబిల్లులు వీగిపోతుండటం తెలిసిందే.