సాక్షి ముంబై: కేంద్రప్రభుత్వం నుంచి వైదొలగుతామని ప్రకటించి 24 గంటలు గడవకముందే శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే మాటమార్చారు. ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించిన తరువాత ఎన్‌డీఏలో నుంచి బయటపడే విషయంపై పునరాలోచించి నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన మంగళవారం ప్రకటించారు. లోకసభ ఎన్నికల్లో బీజేపీ, శివసేనలు కలిసిపోటీ చేశాయి.
కేంద్రంలో శివసేనకు చెందిన అనంత్ గీతేకు మంత్రి పదవి దక్కింది. కానీ రాష్ట్రంలో సీట్ల సర్దుబాటుపై విభేదాలు ఏర్పడడంతో బీజేపీ, శివసేనలు విడిపోయిన అనంతరం కేంద్ర మంత్రికి అనంత్ గీతే రాజీనామా చేస్తారని, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా శివసేన బయటపడుతుందని ఉద్దవ్ ఠాక్రే సోమవారం ప్రకటించారు. అయితే మాతోశ్రీలో జరిగిన ఓ విలేకరుల సమావేశంలో ఈ విషయంపై కూడా మాట్లాడుతూ ఎన్‌డీఏ నుంచి బయటపడే విషయంపై పునరాలోచిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న శివసేన కేంద్రంలో మాత్రం అధికారం కోసం ఆ పార్టీతో అంటకాగుతోందని ఎంఎన్‌ఎస్ అధ్యక్షులు రాజ్ ఠాక్రే విమర్శించడంతో ఉద్ధవ్ స్పందించి అనంత్ గీతే రాజీనామా చేస్తారని ప్రకటించారు. కానీ తన నిర్ణయంపై పునరాలోచన చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
బీజేపీ-శివసేన కూటమిని ప్రజలు ఎన్నుకొని కేంద్రంలో అధికారం ఇచ్చారని, ఇప్పుడు ప్రభుత్వం నుంచి వైదొలగితే ప్రజల తీర్పును వమ్ము చేసినట్లవుతందని అన్నారు. అందువల్ల పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాను శివసైనికుడనని, నాయకుడు ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధమని అనంత్ గీతే ఢిల్లీలో ప్రకటించారు.
పునరాలోచిస్తా:ఉద్ధవ్
Published Tue, Sep 30 2014 10:30 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement