సాక్షి, ముంబై: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పెళ్లిపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ర్పచారంపై శివసేన పార్టీ మండిపడింది. పెళ్లి అంశాన్ని అడ్డుపెట్టుకుని మోడీని ఇబ్బందుల్లోకి నెట్టాలని కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను శివసేన పార్టీ అధికార దిన పత్రిక సామ్నాలో తిప్పికొట్టింది. తమ కుంభకోణాలు, అవినీతి అంశం నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ ఈ ప్రచారానికి తెరలేపిందని ఆరోపించింది. పెళ్లి మోడీ వ్యక్తిగత విషయమని తెలిపింది.
‘కాంగ్రెస్ పార్టీలో గూండాలుగా ఉన్న నాయకులు, మంత్రులు ఇప్పటివరకు అనేక మంది మహిళలను మోసం చేశారు. యువతుల జీవితాలతో చెలగాటమాడారు. పెళ్లి, ఉద్యోగాల పేరుతో ఎంతో మంది యువతులను మోసం చేశారు. అత్యాచారం, హత్య కేసుల్లో చాలా మంది కాంగ్రెస్‌వాదులు దేశంలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే మురికి కాల్వ లాంటిది. అందులోంచి బయటపడిన కాంగ్రెస్ నాయకులు నేడు మోడీ భార్య యశోదాబెన్‌కు అన్యాయం చేశారని కట్టు కథలు అల్లి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నార’ని సంపాదకీయంలో పేర్కొంది. వడోదర, వారణాసి నుంచి పోటీచేస్తున్న మోడీ నామినేషన్ పత్రాలు దాఖలుచేసిన సమయంలో పెళ్లైందని అఫిడవిట్‌లో పేర్కొనడాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడాన్ని తప్పుబట్టింది.
గత ఎన్నికల్లో పోటీ సమయంలో దాఖలు చేసిన నామినేషన్‌లో అవివాహితుడినని పేర్కొన్న మోడీని వివిధ సెక్షన్ల కింద కేసుల్లో ఇరికించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడంపై మండిపడింది. ‘ఇంతవరకు పెళ్లి చేసుకోని కాంగ్రెస్ యువరాజు తలపై జుట్టు ఊడిపోతుంది. ఆయన మోడీ కట్టుకున్న భార్యకు ఎలా అన్యాయం చేశారు, ఆమెను గౌరవించలేదని పేర్కొనడం విడ్డూరంగా ఉందని మండిపడింది. ఆయన కుటుంబం విషయంలో ఎందుకు అంత శ్రద్ధ తీసుకుంటున్నారని ప్రశ్నిం చింది. భార్య విషయం వెల్లడించనందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోడై కూస్తున్నారు.
అయితే పెళ్లి విషయం మోడీ వ్యక్తిగతమని శివసేన పార్టీ తెలిపింది. మోడీ పెళ్లి విషయాన్ని రాద్ధాంతం చేసినంత మాత్రాన దేశంలో పెరిగిపోయిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గుముఖం పడతాయా...? అనేక కుంభకోణాల్లో చిక్కుకున్న మంత్రులు మచ్చలేకుండా బయటపడతారా..? అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులకు పూర్తి ఆర్థిక సాయం అందుతుందా..? వీటన్నింటిపై కాంగ్రెస్ నేతలు ముందు తేల్చాలని సామ్నా సంపాదకీయంలో శివసేన నిలదీసింది. కాంగ్రెస్ వైఫల్యాలను పక్కనబెట్టేందుకు మోడీ పెళ్లిని హైలైట్ చేస్తున్నారని ఆరోపించింది.
మోడీ పెళ్లి వ్యక్తిగతం
Published Mon, Apr 14 2014 10:32 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement