మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షులు రాజ్ ఠాక్రే త్వరలోనే ఓ దిన పత్రికను ప్రారంభించనున్నారు.
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షులు రాజ్ ఠాక్రే త్వరలోనే ఓ దిన పత్రికను ప్రారంభించనున్నారు. తానే ప్రధాన సంపాదకులుగా వ్యవహరించనున్న ఈ పత్రిక పేరు ‘మరాఠా’ అని ఖరారు చేసినట్టు తెలిసింది. గతంలో శివసేన పార్టీ తన వాణిని వినిపించేందుకు ‘మార్మిక్’ అనే వ్యంగ్య చిత్రాల వారపత్రికతోపాటు ‘సామ్నా’ దినపత్రికను కూడా ప్రారంభించింది. ఈ పత్రికలను శివసేన తన ఎదుగుదలతోపాటు ప్రత్యర్థులపై తాము చెప్పదల్చుకున్నది వివరించేందుకు ఉపయోగించుకుంటోంది. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా శివసేన పార్టీకి సామ్నా పత్రిక ఎంతో కీలకంగా మారింది.
ఈ నేపథ్యంలో బాల్ ఠాక్రే అడుగుజాడల్లో నడిచే రాజ్ ఠాక్రే పత్రిక స్థాపన విషయంలో కూడా ఆయనను అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెన్నెస్ స్థాపించి ఎనిమిదేళ్లు పూర్తవుతుండగా, గత సంవత్సరం జరిగిన లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కేవలం ఒక్క శాసనసభ స్థానం లభించింది. దీంతో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరంచేశారు. ఇందులో బాగంగా ప్రజల సంక్షేమంతోపాటు వారి సమస్యల కోసం పార్టీ చేపట్టిన కార్యక్రమాలను వివరించేందుకు , ప్రత్యర్థుల ఆరోపణలను తిప్పికొట్టేందుకు తమకంటూ ఓ పత్రిక ఉండాలన్న నిర్ణయాలనికి వచ్చారు.
మరాఠీ రాజభాష దినోత్సవం సందర్భంగా ఎమ్మెన్నెస్ ఆధ్వర్యంలో మంగళవారం బాంద్రాలోని ఎంఐజీ క్లబ్‌లో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ కోసం ఓ పత్రిక ఉండాల్సిన అవసరాన్ని రాజ్ ఠాక్రే నొక్కి చెప్పినట్టు తెలిసింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందే పత్రికను ప్రారంభించాలన్న ఆలోచనతో రాజ్‌ఠాక్రే ఉన్నట్టు సమాచారం.