samna news paper
-
‘ప్రజలు మృతి చెందితే బాధ్యత వహిస్తారా’
ముంబై: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో లాక్డౌన్ ఎత్తివేయటం, వ్యాపార సముదాయాలు, పరిశ్రమలు తెరవటంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. శివసేన పత్రిక సామ్నాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే ఆంక్షలను ఎత్తివేయటంలో తొందర పడకూడదని తెలిపారు. నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ ఇటీవల వ్యాపార సంస్థలు, పరిశ్రమలను తెరవడానికి అనుమతించాలని కోరిన విషయం తెలిసిందే. ప్రస్తుత సమయంలో కరోనా వైరస్‌ను అరికడుతు ఆర్థిక వ్యవస్థ, ప్రజల ఆరోగ్యాన్ని సమతుల్యం చెయాల్సిన అవసరం ఉందన్నారు. లాక్డౌన్ గురించి కొంతమంది వ్యక్తులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. (సీఎం శివరాజ్‌సింగ్‌కు కరోనా పాజిటివ్) వారు కోరినట్టు అన్నింటిని తెరుస్తామని కానీ, దురదృష్టవశాత్తు లాక్డౌన్ ఎత్తివేయటంతో ప్రజలు మరణిస్తే దానికి వారు బాధ్యత వహిస్తారా అని ఉద్ధవ్ ప్రశ్నించారు. లాక్డౌన్ ఒకేసారి ఎత్తివేయటం వీలుకాదన్నారు. కానీ, క్రమక్రమంగా దానికి సంబంధించిన ఆంక్షలు ఎత్తివేస్తామని తెలిపారు. అన్ని ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత మళ్లీ విధించే పరిస్థితులు ఎదురు కావద్దన్నారు. ఆర్థిక వ్యవస్థ గురించి మాత్రమే ఆలోచించటం సరికాదు. ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ఇప్పటివరకు మహారాష్ట్రలో 3,57,117 కరోనా వైరస్ కేసులు నమోదుకాగా, 1,99,967 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,44,018 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక వైరస్ కారణంగా 13,132 మంది మృతి చెందారు. -
త్వరలో ‘మరాఠా’ పేరుతో ఎమ్మెన్నెస్ దినపత్రిక
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షులు రాజ్ ఠాక్రే త్వరలోనే ఓ దిన పత్రికను ప్రారంభించనున్నారు. తానే ప్రధాన సంపాదకులుగా వ్యవహరించనున్న ఈ పత్రిక పేరు ‘మరాఠా’ అని ఖరారు చేసినట్టు తెలిసింది. గతంలో శివసేన పార్టీ తన వాణిని వినిపించేందుకు ‘మార్మిక్’ అనే వ్యంగ్య చిత్రాల వారపత్రికతోపాటు ‘సామ్నా’ దినపత్రికను కూడా ప్రారంభించింది. ఈ పత్రికలను శివసేన తన ఎదుగుదలతోపాటు ప్రత్యర్థులపై తాము చెప్పదల్చుకున్నది వివరించేందుకు ఉపయోగించుకుంటోంది. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా శివసేన పార్టీకి సామ్నా పత్రిక ఎంతో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో బాల్ ఠాక్రే అడుగుజాడల్లో నడిచే రాజ్ ఠాక్రే పత్రిక స్థాపన విషయంలో కూడా ఆయనను అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెన్నెస్ స్థాపించి ఎనిమిదేళ్లు పూర్తవుతుండగా, గత సంవత్సరం జరిగిన లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కేవలం ఒక్క శాసనసభ స్థానం లభించింది. దీంతో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరంచేశారు. ఇందులో బాగంగా ప్రజల సంక్షేమంతోపాటు వారి సమస్యల కోసం పార్టీ చేపట్టిన కార్యక్రమాలను వివరించేందుకు , ప్రత్యర్థుల ఆరోపణలను తిప్పికొట్టేందుకు తమకంటూ ఓ పత్రిక ఉండాలన్న నిర్ణయాలనికి వచ్చారు. మరాఠీ రాజభాష దినోత్సవం సందర్భంగా ఎమ్మెన్నెస్ ఆధ్వర్యంలో మంగళవారం బాంద్రాలోని ఎంఐజీ క్లబ్లో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ కోసం ఓ పత్రిక ఉండాల్సిన అవసరాన్ని రాజ్ ఠాక్రే నొక్కి చెప్పినట్టు తెలిసింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందే పత్రికను ప్రారంభించాలన్న ఆలోచనతో రాజ్‌ఠాక్రే ఉన్నట్టు సమాచారం.