సాక్షి, ముంబై: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ 90 శాతం పూర్తిఅయ్యిందని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ఔరంగాబాద్‌లో ఆయన బుధవారం సాయంత్రం మరఠ్వాడా పరిధిలోని ఎనిమిది జిల్లాల పదాధికారులతో సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ.. ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు, పదాధికారులకు పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో ఏకంగా 42 స్థానాలు కైవసం చేసుకున్నాయి.
దీంతో ఇరుపార్టీలు వచ్చే శాసనసభ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. కాగా, ఏ ఏ శాసనసభ నియోజక వర్గాల పరిధిలో లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయో అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ అభ్యర్థిత్వం ఇస్తున్నట్లు ఉద్ధవ్ చెప్పారు. ఎక్కడైతే తక్కువ ఓట్లు పోలయ్యాయో ఆ శాసనసభ నియోజక వర్గాలపై మరింత దృష్టి సారిస్తామని అన్నారు. కాగా గత శాసనసభ ఎన్నికల్లో శివసేన మరఠ్వాడా రీజియన్‌లో 27 స్థానాల్లో పోటీచేసి ఎనిమిది స్థానాలు కైవసం చేసుకుంది.
అప్పుడు గెలిచిన వారందరికీ తిరిగి టికెట్ ఇవ్వనున్నట్లు ఠాక్రే సూత్రప్రాయంగా తెలిపారు. అదేవిధంగా పర్భణి ఎమ్మెల్యే సంజయ్ జాదవ్ లోక్‌సభకు ఎన్నిక కావడంతో అక్కడ శివసేన కొత్త అభ్యర్థిని బరిలో దింపాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక 90 శాతం పూర ్తయ్యిందని.. మిగతా 10 శాతం అభ్యర్థులను ఎంపికచేసే పనులు ఆగస్టులో పూర్తిచేసి తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. ఆ తర్వాత తమతమ నియోజకవర్గాలలో ప్రచార పనుల్లో నిమగ్నం కావాలని అభ్యర్థులకు ఆదేశాలివ్వనున్నట్లు ఉద్ధవ్ పేర్కొన్నారు.
ఇదిలాఉండగా, కాషాయ కూటమి ఒప్పందం మేరకు బీజేపీ, శివసేనలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారు.దీంతో శాసనసభ ఎన్నికల్లో తమదే పైచేయి చాటుకోవాలనే తపనతో శివసేన ఉంది. మరోపక్క మోడీ ప్రభంజనాన్ని మరోసారి రాష్ట్రంలో చూపించేందుకు బీజేపీ కూడా సిద్ధమవుతోంది. ఆగస్టు 15లోపు తమ అభ్యర్థులు జాబితా ప్రకటిస్తామని బీజేపీ ఇటీవలే ప్రకటించింది. కాని శివసేన మాత్రం బీజేపీ కంటే ముందే 90 శాతం అభ్యర్థుల జాబితా సిద్ధంచేసినట్లు ప్రకటించింది. ఇలా రెండు పార్టీలు పోటాపోటీగా ముఖ్యమంత్రి పదవినే లక్ష్యంగా ముందడుగు వేస్తుండటం గమనార్హం.
ఛగన్‌పై గరంగరం
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ అంశంపై ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ) మంత్రి ఛగన్ భుజబల్‌పై విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర సదన్ పేరును లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ మార్చేస్తే బాగుంటుందని భుజబల్‌కు చురకలంటించారు. నాసిక్‌లో గురువారం జరిగిన ఓ కార్యక్రమానికి ఉద్ధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. ఢిల్లీలో మహారాష్ట్ర సదన్‌లో జరిగిన గొడవ అక్కడి అక్రమాలకు సంబంధించినది. దానికి మతం రంగు పూసి కొందరు మరింత రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కేవలం క్యాంటిన్‌లోనే కాదు మొత్తం మహారాష్ట్ర సదన్‌లోనే జరగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
అభ్యర్థుల ఎంపిక 90 శాతం పూర్తి
Published Thu, Jul 24 2014 11:27 PM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM
Advertisement