Uddhav Tirkey
-
సర్కారులో చేరికపై నేడు నిర్ణయం: శివసేన
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమవుతుండటంతో ఆ పార్టీ మాజీ మిత్రపక్షం శివసేన ఎట్టకేలకు బుధవారం మౌనం వీడింది. బీజేపీ ప్రభుత్వంలో చేరికపై గురువారం నిర్ణయాన్ని వెల్లడిస్తామని ప్రకటించింది. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే బుధవారం ముంబైలో ఉదయం నుంచి రాత్రి వరకూ పలు దఫాలుగా పార్టీ సీనియర్లతో సమావేశమయ్యారు. అనంతరం పార్టీ ఎంపీ సంజయ్ దౌత్ విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంలో చేరడంపై గురువారం నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఉద్ధవ్ స్వయంగా ఈ ప్రకటన చేస్తారని సమాచారం. తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాకే శివసేనతో చర్చలు కొనసాగుతాయని బీజేపీ పేర్కొంది. కాగా, మహారాష్ట్ర సీఎంగా శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్న దేవేంద్ర ఫడణ్‌విస్ 12 మందితో కేబినెట్ ఏర్పాటు చేయనున్నారు. బాలీవుడ్ తరహా సెట్టింగ్‌లు: ఫడణ్‌విస్ ప్రమాణస్వీకారానికి అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి బాలీవుడ్ చిత్రాల తరహాలో ఏర్పాటు చేస్తున్న భారీ సెట్టింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. జోధా అక్బర్, లగాన్ సినిమాల సెట్టింగ్‌లకు అవార్డులు అందుకున్న ఆర్ట్ డెరైక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ ఈ సెట్టింగ్‌లను డిజైన్ చేస్తున్నారు. కార్యక్రమానికి 40 వేల మంది హాజరవుతారని అంచనా. మరోవైపు ఇది ప్రభుత్వ కార్యక్రమం కావడంతో స్టేడియం వాడుకున్నందుకు ఫీజు వసూలు చేయరాదని శరద్ పవార్ సారథ్యంలోని ముంబై క్రికెట్ సంఘం నిర్ణయించింది. -
మద్దతు ఇచ్చేందుకు అభ్యంతరం లేదు : శివసేన
సాక్షి, ముంబై: శివసేన తన వైఖరిని మార్చుకుంది. బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరంలేదని స్పష్టం చేసింది. మహారాష్ట్రను ముందుకుతీసుకెళ్లేవారికి అండగా నిలుస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అధికార పత్రిక సామ్నాలో సోమవారం రాసిన సంపాదకీయంలో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ మరిన్ని స్థానాలను కైవసం చేసుకోవడం పట్ల అభినందించారు. ‘బీజేపీ ఘన విజయం సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. కొంకణ్, మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో మా పార్టీని ఆదరించిన ఓటర్లందరికీ కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కారణంగా మహారాష్ట్రలో బీజేపీ మరిన్ని స్థానాలను గెలుచుకోగలిగిందంటూ అభినందించారు. ముఖ్యమంత్రి రేసులో ఎంతోమంది ఉన్నారు. అయితే ఆ పదవిని ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని మోదీ, అమిత్‌షాలే నిర్ణయిస్తారు. ప్రాంతీయతత్వం ప్రాతిపదికన మహారాష్ట్ర ముక్కలు కావాలని మేము కోరుకోం’ అని అన్నారు. నితిన్‌గడ్కరీకి పరిపాలనాపరంగా మంచి అనుభవం ఉంది. కేంద్రంలో ఆయన కీలకబాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అటువంటపుడు గడ్కరీని మోదీ వదులుకోగలుగుతారా? ఇక దేవేంద్ర ఫడ్నవిస్‌కు శాసనసభ వ్యవహారాలు బాగా తెలుసు. అయితే ఆయనకు పరిపాలనా పరమైన అనుభవం లేదు’అని ఉద్ధవ్ పేర్కొన్నారు. -
బీజేపీ, శివసేన రాజీ!
‘మహా’ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధమన్న శివసేన సోమవారం నుంచి అధికారిక చర్చలు జరుగుతాయని వెల్లడి ముంబై: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేనలు రాజీబాట పట్టాయి. ఇరు పార్టీల నేతలు మంగళవారం రాత్రి చర్చలు జరపడంతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై ఆశలు చిగురించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమేనని శివసేన ప్రకటించింది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఆదేశంపై మంగళవారం రాత్రి ఢిల్లీలో కాషాయదళ నేతలతో సేన నాయకులు రాజ్యసభ ఎంపీ అనిల్ దేశాయ్, అసెంబ్లీలో ఆ పార్టీ నేత సుభాష్ దేశాయ్‌లు చర్చలు జరిపారు. తర్వాత బుధవారం ముంబై చేరుకున్నాక, సుభాష్ ఉద్ధవ్‌ను కలసి పరిస్థితి వివరించి, విలేకర్లతో మాట్లాడారు. ‘బీజేపీతో కలసి ప్రభుత్వ ఏర్పాటు అంశంపై చ ర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు ఢిల్లీ వెళ్లాం. చర్చలు సానుకూలంగా సాగాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీతో చేతులు కలిపేందుకు మేం సిద్ధం. మేం అనధికార చర్చలు మాత్రమే జరిపాం. సోమవారం నుంచి అధికారిక చర్చలు మొదలవుతాయి. ప్రస్తుతానికి మేం బీజే పీకి ఎలాంటి ప్రతిపాదనా చేయలేదు. పొత్తుపెట్టుకోవాలని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మాత్రమే నిర్ణయించాం’ అని తెలిపారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నిక పరిశీలనకు నియమితులైన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ను తాను కలవలేదని వెల్లడించారు. అయితే దేశాయ్‌లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, గుజరాత్ బీజేపీ ఎంపీ చంద్రకాంత్ పాటిల్‌తో చర్చించిన ట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. చర్చల్లో భాగంగా ఉద్ధవ్ ప్రధాని మోదీని కలుస్తారా అని సుభాష్ దేశాయ్‌ని విలేకర్లు అడగ్గా.. ‘అధికారిక చర్చలు మొదలయ్యాక ఉద్ధవ్ మోదీని కలుస్తారా, లేకపోతే ఉద్ధవ్‌తో చర్చలకు బీజేపీ నేతలే ముంబైకి వస్తారో తేలుతుంది’ అని చెప్పారు. రాష్ట్ర ప్రజల తీర్పు అదే: బీజేపీ పొత్తుకు సిద్ధమన్న శివసేన ప్రకటనపై మహారాష్ట్ర బీజేపీ నేత వినోద్ తావ్డే సానుకూలంగా స్పందించారు. ‘బీజేపీ, శివసేనలు కలసి ప్రభుత్వాన్ని నడపాలని మహారాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు’ అని అన్నారు. 1995 నాటి ఫార్ములా ప్రకారం ప్రభుత్వంలో రెండో పెద్ద భాగస్వామిగా ఉండబోయే తమకు డిప్యూటీ సీఎం పదవి కావాలని శివసేన కోరుతోందన్న వార్తలపై ఆయన స్పందించారు. సజావుగా పనిచేయాలంటే క్షేత్రస్థాయి వాస్తవాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. సీఎం పదవిని కేంద్రమంత్రి గడ్కారీకి ఇవ్వాలన్న డిమాండ్‌పై స్పందిస్తూ.. ఆయన ఆ పదవి కోరుకోవడం లేదన్నారు. కాగా, తెరవెనక చర్చల్లో డిప్యూటీ సీఎం పదవితోపాటు సగం మంత్రిపదవులను శివసేన కోరిందని, అయితే దీనికి బీజేపీ విముఖంగా ఉందని, అందుకే పొత్తుపై నిర్ణయాన్ని జాప్యం చేస్తోందని సమాచారం. ఏ బాధ్యత ఇచ్చినా తీసుకుంటా: గడ్కారీ నాగ్‌పూర్: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని రాష్ట్ర బీజేపీ చీఫ్ దేవేంద్ర ఫడ్నవీస్ చేపట్టడం ఖాయంగా కనిపిస్తున్నప్పటికీ.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ నాగ్‌పూర్‌లో విదర్భ ప్రాంతానికి చెందిన 39 మంది ఎమ్మెల్యేలతో భేటీ కావడం ఆసక్తి రేపుతోంది. గడ్కారీ మంగళవారం రాత్రి నాగ్‌పూర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానం తనకు ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరిస్తానన్నారు. ‘తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి రానని ఇదివరకు చెప్పాను. నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ కేంద్ర నాయకత్వం. అది ఏ బాధ్యత ఇచ్చినా తీసుకుంటా’ అని చెప్పారు. తనతో భేటీ అయిన ఎమ్మెల్యేలు తాను సీఎంగా ఉండాలని కోరారన్నారు. కాగా, తన గురువైన గడ్కారీకి మార్గం సుగమం చేయడానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని నాగ్‌పూర్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కృష్ణా ఖోప్డే బుధవారం చెప్పారు. ఈ పరిణామాలపై స్పందించేందుకు ఫడ్నవీస్ నిరాకరించారు. -
‘మహా’ ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్
* బీజేపీ, శివసేనల మధ్య తొలగని ప్రతిష్టంభన * ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకెళ్లనున్న కమలనాథులు! * బీజేపీకి మద్దతు నిర్ణయాన్ని సమర్థించుకున్న శరద్ పవార్ ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాని నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుపై మల్లగుల్లాలు పడుతున్నాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ.. ఎన్సీపీ ఇచ్చే బేషరతు మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా, లేక బీజేపీ-శివసేనల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందా అన్నది స్పష్టం కావడం లేదు. ఒకప్పటి మిత్రులైన బీజేపీ-శివసేనల మధ్య ప్రతిష్టంభన కూడా తొలగలేదు. సేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే.. బీజేపీ విజయం సాధించినందుకు ప్రధాని మోదీ, ఆ పార్టీ చీఫ్ అమిత్ షాలను అభినందిస్తూ ఫోన్ చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. శివసేనను సస్పెన్స్‌లో ఉంచి ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకెళ్లాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. మంగళవారం బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశమివ్వాలని కోరాలని కాషాయదళం యోచిస్తోంది. తమది పెద్ద పార్టీ కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అడిగే హక్కు తమకే ఉందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రాజీవ్ ప్రతాప్ రూడీ సోమవారం అన్నారు. ముఖ్యమంత్రి పదవిని తీసుకునేది తామేననన్నారు. బీజేపీకి బయటి నుంచి మద్దతు ఇస్తామన్న ఎన్సీపీ ప్రతిపాదనపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఇప్పటికైతే చర్చించలేదన్నారు. తాము అన్ని మార్గాలను తెరిచే ఉంచామని బీజేపీ నేత ఓమ్ మాథుర్ చెప్పారు. తద్వారా సేన మద్దతిస్తే తీసుకోవడానికి సిద్ధమేనని చెప్పకనే చెప్పారు. మరోవైపు.. మహారాష్ట్ర, హర్యానాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు అనుసరించాల్సి వ్యూహంపై పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీతో చర్చించారు. 288 స్థానాలు మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 122, దాని మిత్రపక్షమైన రాష్ట్రీయ సమాజ్పక్షకు ఒకటి, శివసేనకు 63, కాంగ్రెస్‌కు 42, ఎన్సీపీకి 41 సీట్లు వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన145 మేజిక్ మార్కును సాధించాలంటే బీజేపీకి మరో 22 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. శివసేన సస్పెన్స్: మరోపక్క.. కొత్తగా ఎన్నికైన శివసేన ఎమ్మెల్యేలు సోమవారం సమావేశమై తమ శాసనసభాపక్షనేతను ఎన్నుకునే అధికారాన్ని పార్టీ చీఫ్ ఉద్ధవ్‌కు కట్టబెట్టారు. అయితే బీజేపీతో 25 ఏళ్ల పొత్తు పునరుద్ధరణపై కానీ, బీజేపీకి మద్దతిచ్చే అంశంపై కానీ ఎలాంటి చర్చా జరగలేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. ఉత్తమ ప్రత్యామ్నాయం: పవార్ ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీకి బయటను నుంచి మద్దతిస్తామని ప్రకటించిన ఎన్సీపీ నిర్ణయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ గట్టిగా సమర్థించుకున్నారు. ఇతర ప్రధాన పార్టీల సీట్లను చూస్తే సుస్థిర ప్రభుత్వానికి అదే ఉత్తమ ప్రత్యామ్నాయమన్నారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు తన బంధువు, మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత శరద్ పవార్ వారినుద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేత ఒకరు తనను ఫోన్లో సూచించారని అజిత్ పవార్ వెల్లడించారు. అయితే మూడు పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య 146 కనుక ప్రభుత్వం స్థిరంగా ఉండదని చెప్పాననన్నారు. కాగా, కాంగ్రెస్, ఎన్సీపీలు శివసేన మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమూ లేకపోలేదని, వీటికి ఇతర చిన్న పార్టీలూ తోడైతే బీజేపీని అధికారానికి దూరంగా పెట్టగలవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా, ‘నేషనలిస్ట్ కరప్ట్ పార్టీ’ అని మోదీ విమర్శించిన ఎన్సీపీతో బీజేపీ ఎలా చేతులు కలుపుతుందని కాంగ్రెస్ నేత రణదీప్ దుయ్యబట్టారు. ముందంజలో ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం పదవి రేసులో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముందంజలో ఉన్నారు. రద్దుకానున్న అసెంబ్లీలో విపక్ష నేత ఏక్నాథ్ ఖడ్సే, శాసనమండలి విపక్ష నేత వినోద్ థావ్డే, దివంగత పార్టీ నేత గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ తదితరుల పేర్లూ చక్కర్లు కొడుతున్నాయి. ఢిల్లీలో అమిత్, మహారాష్ట్రకు చెందిన గడ్కారీతో మంతనాలు జరపడంతో గడ్కారీ కూడా సీఎం రేసులోకి వచ్చే అవకాశముందని ఊహాగానాలు వినిపించాయి. అయితే వీటిని పార్టీ వర్గాలు తోసిపుచ్చాయి. మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నికను పరిశీలించేందు పార్టీ నేత జేపీ నడ్డాతోపాటు నియమితులైన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర కేబినెట్ సమావేశం కారణంగా సోమవారం ముంబై వెళ్లలేకపోయారు. -
అడగనిదే మద్దతివ్వం
శివసేన చీఫ్ ఉద్ధవ్ స్పష్టీకరణ {పధాని మోదీ, అమిత్‌షాలకు అభినందనలు ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ అడగనిదే ఆ పార్టీకి మద్దతు ఇవ్వబోమని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ముందు స్పందించాల్సింది ఆ పార్టీనే అని పేర్కొన్నారు. ‘నా ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నా. ఎవరికైనా మా మద్దతు అవసరమనుకుంటే వారు మా వద్దకు రావచ్చు. వారివైపు(బీజేపీ) నుంచి ప్రతిపాదనతో రావాలి. నా అంతట నేను ఎలా మద్దతు ప్రకటించగలను? ఒకవేళ మద్దతిస్తానని వారి వద్దకు వెళ్లినా ఇప్పటికే మాకు ఎన్సీపీ మద్దతుందని, మీ మద్దతు అక్కర్లేదని వారంటే పరిస్థితేంటి?’ అని ఆయన త న నివాసంలో విలేకర్లతో అన్నారు. ఎన్సీపీ మద్దతుతో బీజేపీకి తృప్తిగా ఉంటే ఆపార్టీ ఎన్సీపీతోనే కలసి వెళ్లాలని అన్నారు. విదర్భ అంశాన్ని ప్రస్తావిస్తూ.. మహారాష్ట్రను సమైక్యంగా ఉంచుతామని హామీ ఇస్తే బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. బీజేపీ, శివసేనలు తిరిగి కలవాలన్న అద్వానీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తాను కూడా అలాగే భావించానని అన్నారు. తాజా ఎన్నికల్లో 63 సీట్లు సాధించిన తమ పనితీరు తీసికట్టుగా ఏమీ లేదని పేర్కొన్నారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటినందుకు ఆ పార్టీ చీఫ్ అమిత్‌షా, ప్రధాని మోదీలను ఉద్ధవ్ ఫోన్ చేసి అభినందించారు. కాగా, మద్దతు కావాలని బీజేపీ తమవద్దకు రాలేదని ఉద్ధవ్ చెప్పిన నేపథ్యంలో అమిత్ షా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారని సమాచారం. -
యస్..కలుస్తాం!
- ఉద్ధవ్‌తో కలిసి పనిచేసే విషయమై రాజ్‌ఠాక్రే సంచలన వ్యాఖ్య - అన్నదమ్ములం కలిసి పనిచేస్తే మీకేంటి బాధని ఎదురుప్రశ్న - రాజకీయాలకన్నా రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టీకరణ - తనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఉద్ధవ్ ఫోన్‌చేసిన మాట వాస్తవమేనని ఒప్పుకోలు సాక్షి, ముంబై: రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే అన్నదమ్ములిద్దరం కలిసి పనిచేస్తామని రాజ్‌ఠాక్రే స్పష్టం చేశారు. శివసేన నేత ఉద్ధవ్‌తో కలిసి పనిచేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు. అసలు తామిద్దరం కలిసి పనిచేస్తే వేరే వారికి ఎందుకు బాధ, ఇబ్బందులో అర్థం కావడంలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన ఒక న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పైవిధంగా స్పందించారు. ‘మా ఇద్దరి సిద్ధాంతాలు వేరైనా రాష్ట్ర ప్రయోజనాలు అన్నింటికంటే ముఖ్యమైనవి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్ధవ్,నేను అవసరమైతే ఒక్కటవుతాం.. దీనిలో మీకెందుకంత ఉత్సాహం.. మా పని మేం చూసుకుంటాం..’ అని రాజ్‌ఠాక్రే వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలుకానుంది. పొత్తులు బెడిసికొట్టిన నేపథ్యంలో అన్ని పార్టీలకూ ఒంటరి పోరు అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త సమీకరణాలకు తలుపులు తెరుచుకునేందుకు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. బీజేపీ, శివసేన కూటమి విడిపోయిన తర్వాత రాజ్, ఉద్ధవ్ ఠాక్రేలు ఒక్కటి కానున్నారంటూ హల్చల్ చేసిన పుకార్లు నిజం కానున్నాయని చెప్పవచ్చు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అవసరమైతే ఈ రెండు పార్టీలూ కలిసి పనిచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజ్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. ఉద్ధవ్ ఫోన్ చేసిన మాట వాస్తవమే... తనకు ఆరోగ్యం బాగాలేని సమయంలో ఉద్ధవ్ ఠాక్రే ఫోన్ చేసిన విషయం వాస్తవమేనని రాజ్ ఠాక్రే స్పష్టం చేశారు. అయితే ఆయనతో ఎక్కువగా మాట్లాడలేకపోయానన్నారు. ‘కేవలం ఎలా ఉన్నావు..? ఆరోగ్యం ఎలా ఉందని ఉద్ధవ్ అడిగాడు. కాని నాకు విపరీతంగా దగ్గువస్తుండడం ఎక్కువ సేపు మాట్లాడలేకపోయాన’నని వివరించారు. భూతద్దంలో చూడొద్దు... ప్రతి విషయాన్ని భూతద్దంలో చూపించడం సరికాదని రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. బీజేపీ నేత నితిన్ గడ్కరి, తాను అనుకోకుండా ఒకే హోటల్ల్లో దిగామని.. అలా ఆయనతో తాను మాట్లాడానని తెలిపారు. కాని దీనిపై గడ్కరీతో భేటీ కావడం వెనుక రహస్యమేమిటి.,.? రహస్యంగా గడ్కరితో భేటీ అయిన రాజ్ ఠాక్రే.. అని శీర్షికలతో కథనాలు వెలువడటం సరి కాదన్నారు. గడ్కరీతో నాకు వ్యక్తిగతంగా ఏమైనా విభేదాలున్నాయా.. లేవే.. అలాంటి సమయంలో రహస్యంగా కలవాల్సిన అవసరం నాకేంటి..’ అని రాజ్ ఎదురు ప్రశ్నించారు. -
వారిద్దరూ ఒకటవుతారు..
ఉద్ధవ్, రాజ్ఠాక్రేలపై సినీ నటుడు నానా పటేకర్ సాక్షి, ముంబై: శాసనసభ ఎన్నికల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కచ్చితంగా ఒకటవుతారని ప్రముఖ మరాఠీ, హిందీ సినీ నటుడు నానా పటేకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ మీడియా చానెల్ తో మంగళవారం జరిగిన మాటామంతి కార్యక్రమంలో పటేకర్ మాట్లాడుతూ ఇద్దరు సోదరులు ఒక్కటవ్వాలని గతంలో తను అనేక ప్రయత్నాలు చేశానని, ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నానని తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరికెన్ని స్థానాలు వస్తాయో అన్న విషయం మీదే వారిద్దరి కలయిక అధారపడి ఉందని అన్నారు. అన్ని పార్టీలూ ఒంటరిగా పోటీచేస్తున్నాయి కాబట్టి ఇందులో ఎవరు లాభపడతారో ఇప్పుడే చెప్పడం కష్టమని అన్నారు. ఓటర్లు మాత్రం మేలుకుని మంచి నాయకుడ్ని ఎన్నుకోవాలని కోరారు. నేర చరిత్ర గల నాయకులు ఏ పార్టీవారైనా సరే వారిని ఎన్నుకోవద్దని పిలుపునిచ్చారు. -
కాషాయ బంధం నిలిచింది!
శివసేన, బీజేపీ పొత్తు ఓకే శివసేనకు 151, బీజేపీకి 130, మిత్రపక్షాలకు 7 సీట్లు ఇచ్చేలా కుదిరిన అవగాహన ముంబై/న్యూఢిల్లీ: పాతికేళ్ల బంధం నిలబడింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తును కొనసాగించాలని బీజేపీ, శివసేనలు నిర్ణయించాయి. సీట్ల సర్దుబాటులో ఏర్పడ్డ ప్రతిష్టంభనను తొలగించేందుకు రెండు పార్టీల రాష్ట్రస్థాయి నేతలు మంగళవారం సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీట్ల పంపకానికి సంబంధించి ఒక కొత్త ప్రతిపాదనపై చర్చ జరిపామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్, బీజేపీ నేత వినోద్ తావ్దే తెలిపారు. ఆ ప్రతిపాదన వివరాలను మాత్రం వారు వెల్లడించలేదు. అయితే, పార్టీ వర్గాల సమాచారం మేరకు ఆ ప్రతిపాదనలో.. బీజేపీకి 130 స్థానాలు ఇచ్చేందుకు శివసేన అంగీకరించింది. అదే సమయంలో తాము మొదట్నుంచీ చెబుతున్నట్లుగా 151 సీట్లలో సేన పోటీ చేస్తుంది. బీజేపీకి పెరిగే సీట్ల మేరకు మహాకూటమి(మహాయుతి)లోని ఇతర పార్టీలకు కేటాయించిన సీట్లలో కోత విధిస్తారు. కూటమిలోని మిత్రపక్షాలైన ఆర్పీఐ(అథవలే), రాష్ట్రీయ సమాజ్‌పక్ష్, స్వాభిమాని షేత్కారీ పక్ష్, శివ్ సంగ్రామ్లతో ఈ ప్రతిపాదనపై చర్చించి, వాటి ఆమోదం తరువాత దీన్ని అధికారికంగా ప్రకటిస్తారు. పై ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే ఆ మిత్రపక్షాలకు 7 స్థానాలు మాత్రమే మిగుల్తాయి. బీజేపీకి 119 స్థానాలకు మించి ఇవ్వబోమని శివసేన తేల్చిచెప్పడం, కనీసం 130 సీట్లు కావల్సిందేనని బీజేపీ పట్టుబట్టడంతో పొత్తు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడటం తెలిసిందే. ప్రజలు కోరుకుంటున్నారు: ఉద్ధవ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్న తన ఆశను పక్షం రోజుల క్రితం బహిరంగంగా వెల్లడించిన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అది ప్రజల ఆకాంక్షేనంటూ మంగళవారం మాట మార్చారు. కాంగ్రెస్, ఎన్సీపీ చర్చలు అసంపూర్ణం కాంగ్రెస్, ఎన్సీపీల పొత్తుపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇరు పార్టీల నేతలు మంగళవారం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అధికారిక నివాసంలో మంగళవారం జరిగిన సుదీర్ఘ చర్చల్లో 124 స్థానాల్లో పోటీ చేయాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను ఎన్సీపీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. 144 సీట్లు కావాల్సిందేనని పట్టుబట్టింది. కాగా, ఎన్సీపీతో పొత్తు కొనసాగుతుందన్న ఆశాభావాన్ని కాంగ్రెస్ వ్యక్తం చేసింది. -
పొత్తా?.. ఒంటరి పోరా?
మహారాష్ట్రలో తేలని ప్రధాన కూటముల పొత్తుల కొట్లాట 119 కన్నా ఎక్కువ సీట్లివ్వబోమన్న శివసేన; 130 కావాలంటున్న బీజేపీ 124 ఇస్తానంటున్న కాంగ్రెస్; ఇంకా ఎక్కువ కోరుతున్న ఎన్సీపీ పొత్తులపై కాంగ్రెస్, ఎన్సీపీల కీలక భేటీ నేడు సాక్షి, ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన కూటములు కలసి పోటీ చేస్తాయా? లేదా ఒంటరిగా పోటీ చేస్తాయా? అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శివసేన, బీజేపీలు ప్రధాన పార్టీలుగా ఉన్న మహాకూటమిలోను.. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)ల ప్రజాస్వామ్య కూటమి(డీఎఫ్)లోనూ సీట్ల సర్దుబాటు చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో.. ఆయా పార్టీలు ఒంటరి పోరు దిశగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ(సెప్టెంబర్ 27) దగ్గరపడుతుండటంతో నాలుగు ప్రధాన పార్టీలు ఒకవైపు పొత్తులపై చర్చలు కొనసాగిస్తూనే.. మరోవైపు తమతమ అభ్యర్థుల ఖరారుపై దృష్టిసారించాయి. అవసరమైతే సొంతంగా బరిలో దిగుతామంటూ ఒకవైపు కత్తులు దూస్తూనే.. పొత్తును కాపాడుకుంటామంటూ మరోవైపు ప్రకటనలు చేస్తున్నాయి ఈ రెండు కూటములు. పాతికేళ్ల బంధం కొనసాగుతుందా? బీజేపీ, శివసేనల పాతికేళ్ల పొత్తుకు బీటలు వారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీకి 119 స్థానాలకు మించి ఇవ్వబోమని శివసేన తేల్చిచెబుతుండగా, 135 సీట్లు కావాలంటూ బీజేపీ కోరుతోంది. కనీసం 130 సీట్లైనా తమకు ఆమోదయోగ్యమేనని చెబుతోంది. ఆ ప్రతిపాదనకూ శివసేన ససేమీరా అంటోంది. ‘మేము 130 స్థానాలు కోరడం ద్వారా మేం ఒక ఉదాత్తమైన ప్రతిపాదన పంపాం. అదీ శివసేన ఏనాడు గెలవని స్థానాలనే మాకివ్వమంటున్నాం. దానికీ ఒప్పుకోకపోతే.. మొత్తం 288 స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని బీజేపీ మహారాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రాజీవ్ ప్రతాప్ రూడీ సోమవారం స్పష్టం చేశారు. పొత్తును కాపాడేందుకు బీజేపీ చీఫ్ అమిత్ షా సోమవారం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు ఫోన్ చేసి మాట్లాడారని.. సాయంత్రం ప్రధాని మోదీ కూడా ఉద్ధవ్‌కు ఫోన్ చేసి, సీట్ల సర్దుబాటు విషయంలో పట్టువిడుపు ఉండాలని హితవు చెప్పారని సమాచారం. 20, 30 మినహా అన్ని స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ఖరారు అయ్యాయని బీజేపీ వర్గాలు తెలిపాయి. కాగా, ఉద్ధవ్ చెప్పిన 119 స్థానాలే తమ చివరి మాట అని శివసేన సీనియర్ నేత ఒకరు స్పష్టం చేశారు. పదిహేనేళ్ల పొత్తు భవితవ్యమేంటి? అధికార ప్రజాసామ్య కూటమి(డీఎఫ్)లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 144 స్థానాలు కావాలని ఎన్సీపీ డిమాండ్ చేస్తుండగా.. 124 ఇస్తామంటూ కాంగ్రెస్ చెబుతోంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ నేతృత్వంలో సోమవారం పార్టీ కోర్ కమిటీ భేటీలో.. పొత్తును కొనసాగించాల్సిందేనని నిర్ణయించారు. కానీ, కాంగ్రెస్ ఇస్తామంటున్న 124 స్థానాలు తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. 15 ఏళ్ల పొత్తును కాపాడుకునేందుకు మంగళవారం ఉదయం ఇరు పార్టీల మధ్య మరో భేటీ జరగనుందని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. బీజేపీతో ఎన్సీపీ పొత్తు పెట్టుకోబోతోందన్న వార్తలను కొట్టివేశారు. కాంగ్రెస్ కూడా సీట్ల విషయంపై గట్టిగానే ఉంది. అన్ని స్థానాల్లో పోటీ చేసే విషయంపై పార్టీలో చర్చించామని పేర్కొంది. ఒకస్థాయిలో పొత్తు విషయమై చర్చలు జరుగుతున్నాయని, మరో స్థాయిలో అన్ని స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యానించారు. మోదీపై ‘సామ్నా’ ప్రశంసలు ఒకవైపు పొత్తు పట్లు కొనసాగుతుండగా.. మరోవైపు మోదీపై శివసేన ప్రశంసల జల్లు కురిపించింది. భారత ముస్లింపై మోదీ వ్యాఖ్యలను ప్రశంసిస్తూ పార్టీ పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసింది. మాతృభూమిపై ముస్లింల దేశభక్తికి మోదీ గ్యారంటీ ఇచ్చి కొత్త అధ్యాయం లిఖించారని, ఆయన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ముస్లింలపైనే ఉందని అందులో పేర్కొంది. ముస్లింలను ప్రశంసించడాన్ని ..మోదీలో హిందుత్వవాదం సన్నగిల్లినట్లుగా చూడరాదని తెలిపింది. ప్రధానమంత్రిగా మోదీ అన్ని మతాలకు, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారంది. నకిలీ లౌకికవాదులు మోదీని ముస్లిం వ్యతిరేకిగా చిత్రించారని తెలిపింది. -
పొత్తుకు బీటలు?!
సీట్లపై ఇరువురూ మంకుపట్టు ముంబై: మహారాష్ట్రలో గత పాతిక సంవత్సరాలుగా కొనసాగుతున్న బీజేపీ, శివసేనల పొత్తు కుప్పకూలనుందా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి వారే ఒంటరిగా పోటీ చేయనున్నారా? కాషాయ పార్టీల మధ్య వైరం కాంగ్రెస్ పార్టీలకు లాభం చేకూరుస్తుందా? శుక్రవారం ముంబైలో జరిగిన పరిణామాలపై రాష్ట్ర ప్రజలు, రాజకీయ పరిశీలకుల్లో మెదిలిన ప్రశ్నలివి. సీట్ల పంపకంపై బీజేపీ, శివసేనలు మొండి పట్టుదలకు పోతుండడంతో ఇక ఇరువురి మధ్య పొత్తు భగ్నమైనట్టేనని భావిస్తున్నారు. రెండు పార్టీల్లోనూ రోజంతా చర్చోపచర్చలు జరిగినప్పటికీ అవి ఒక కొలిక్కి రాలేదు. ‘‘పొత్తు భగ్నమైనట్టే. దీనిపై ఇక అధికార ప్రకటనే వెలువడాల్సి ఉంది’’ అని పేరు వెల్లడించడానికి నిరాకరించిన ఓ సీనియర్ బీజేపీ నేత వ్యాఖ్యానించారు. ‘‘పొత్తు ‘ముగిసింది’, మా వైఖరిని వెల్లడించడానికి ముందు తదుపరి పరిణామాల వైపు వేచిచూస్తున్నాం’’ అని శివసేనకు చెందిన నాయకుడు పేర్కొన్నారు. రెండు పార్టీల మధ్య సీట్ల పంపకంతో పాటు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నదానిపై ప్రతిష్టంభన నెలకొంది. సీట్ల సంఖ్యలో సింహభాగం తమకే కావాలని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్ధవ్ ఠాక్రేను ప్రకటించాలని శివసేన డిమాండ్ చేస్తోంది. కాగా ఈసారి చెరో 135 సీట్లు పోటీ చేద్దామని, మిగిలిన 18 సీట్లను భాగస్వామ్య పక్షాలైన చిన్న పార్టీలకు కేటాయిద్దామని బీజేపీ ప్రతిపాదిస్తోంది. కానీ బీజేపీకి 119 సీట్లు మాత్రమే ఇస్తామని శివసేన తెలిపింది. ఈ ప్రతిపాదనను బీజేపీ నిర్ద్వందంగా తిరస్కరించింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, భాగస్వామ్యపక్షాల పేర్లు ప్రస్తావించకుండానే వచ్చే ప్రభుత్వాన్ని తమ పార్టీ ఏర్పాటు చేస్తుందని ప్రకటిస్తూ ఒకరకంగా శివసేనకు అల్టిమేటం జారీ చేశారు. అయితే ఈ అల్టిమేటంను శివసేన తేలికగా తీసివేసింది. మహారాష్ట్రలో తాము పెద్దన్నగానే ఉంటామని సేన ఎంపీ సంజయ్ రావుత్ పేర్కొన్నారు. ఇక్కడే తాము సీట్లు ఇచ్చే వారమే తప్ప తీసుకునే వారము కాదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ పుట్టకముందునుంచే మహారాష్ట్రలో శివసేన ఉందని ఆయన గుర్తు చేశారు. పొత్తు ఉంటుందా లేదా అన్న అంశం తమపై ఎటువంటి ప్రభావమూ చూపబోదన్నారు. ఈ నెల 21న ఆదివారం తమ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశమవుతుందని, దీనికి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ హాజరవుతారని, ఆ సమయంలో పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే బీజేపీతో పొత్తుపై తుది ప్రకటన చేస్తారని రావుత్ చెప్పారు. -
సరిహద్దు లొల్లి..
సాక్షి, ముంబై: కర్ణాటక సరిహద్దులోని ‘యెళ్లూర్’ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ‘సరిహద్దు ప్రాంతాల్లో రోజురోజుకీ మరాఠీ ప్రజలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. కర్ణాటక పోలీసులు యెళ్లూర్ గ్రామంలోని మరాఠీ ప్రజలను ఇళ్లల్లోకి చొరబడి చితకబాదారు. ఇది చాలా అమానుష’ మంటూ దుయ్యబట్టారు. భారత్-పాక్ సరిహద్దు అంశం ఎంత కీలకమైనదో.., శివసేనకు కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు అంశం కూడా అంతే కీలకమైనదని ఉద్దవ్ నొక్కి చెప్పారు. సరిహద్దులోని యెల్లూర్ సంఘటనపై సోమవారం ప్రచురితమైన ‘సామ్నా’ సంపాదకీయంలో ఉద్ధవ్ ఠాక్రే కర్ణాటక తీరుపై మండిపడ్డారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులపై విమర్శలు గుప్పించారు. సరిహద్దు సంఘటనపై ఏపార్టీ నాయకులూ ఎందుకు నోరు విప్పడంలేదని నిలదీశారు.‘ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ సంఘటనపై అన్ని పార్టీలూ రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నించాయి. మరి ఈ ఘటనపై ఎవరూ ఎందుకు నోరు విప్పడంలేదో అర్థం కావడంలేదు.. ఇది మన ఆత్మగౌరవ సమస్య..’ అని అన్నారు. సరిహద్దులోని మరాఠీ ప్రజలకు శివసేన అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలాగే అక్కడ భవిష్యత్తులో ఎటువంటి దుర్ఘటనలు జరిగినా కేంద్రం బాధ్యత వహించాల్సి వస్తుందని పరోక్షంగా బీజేపీని హెచ్చరించారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో కొన్నేళ్లుగా సమస్య నడుస్తోంది. సరిహద్దులో ఉన్న కర్ణాటక ప్రాంతాల్లో ఉన్న మరాఠీలు తమను కర్ణాటక ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, తమ ప్రాంతాలను మహారాష్ట్రలో కలపాలని ఎప్పటినుంచో ఉద్యమం చేస్తున్నారు. అదే నేపథ్యంలో ఐదు దశాబ్దాల కిందట యెళ్లూర్లో ఏర్పాటుచేసిన మహారాష్ట్ర రాజ్-యెళ్లూర్’ అనే హోర్డింగ్‌ను పోలీసులు శనివారం తొలగించారు. దిమ్మెను పగలగొట్టేశారు. దాంతో స్థానిక మరాఠీలు ఆందోళనకు దిగడంతో కర్ణాటక పోలీసులు మరాఠీయులను చితకబాదారు. శని,ఆదివారాల్లో జరిగిన ఘటనలో సుమారు 50మందికి పైగా మరాఠీలు గాయపడ్డారు. దీంతో సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. ‘ముంబైలో కర్ణాటక సంఘం, భవనం కూడా ఉన్నాయి. అలాగే పలు ప్రాంతాల్లో వాళ్లు హోటల్ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వారికి స్థానిక మరాఠీలు ఎన్నడూ ఎటువంటి హానీ తలపెట్టలేదు. కాని కర్ణాటకలో ఉన్న మరాఠీయులను మాత్రం స్థానిక ప్రభుత్వం అణగదొక్కేందుకు యత్నిస్తోంది..’ అని ఠాక్రే విమర్శించారు. ఇదే విషయమై గతంలో బేల్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యవర్గాన్ని రద్దు చేసేశారు. అయితే తర్వాత జరిగిన ఎన్నికల్లో సైతం మరాఠీ ప్రతినిధులే విజయం సాధించారని.. దీన్ని బట్టి అక్కడి స్థానికుల్లో ఉన్న ఆకాంక్షను గుర్తించి ఆయా ప్రాంతాల ప్రజలకు కేంద్రం న్యాయం చేయాలని ఉద్ధవ్ డిమాండ్ చేశారు. కర్ణాటక సీఎంకు పృథ్వీరాజ్ చవాన్ ఫోన్.. యెళ్లూర్ ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఫోన్ చేసి మాట్లాడారు. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలను భయాందోళనలకు గురి చేసే చర్యలకు దిగకూడదని హితవు పలికారు. సరిహద్దులో శాంతి స్థాపనకు కృషిచేయాలన్నారు. ఇదిలా ఉండగా, మహారాష్ట్ర పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే కుమారుడైన నితీష్ రాణే మాట్లాడుతూ ముంబైలో కర్ణాటక దినోత్సవాన్ని జరగకుండా అడ్డుకుంటామన్నారు. అలాగే ముంబైలోని డబ్బావాలాలు సైతం కర్ణాటకలో మరాఠాలపై జరిగిన దాడిని ఖండించారు. ఈ మేరకు సోమవారం నగరంలో ఆందోళన నిర్వహించారు. యెళ్లూర్ ఘటన జరిగి ఉండాల్సింది కాదని ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఘటనకు కారకులైన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని, సరిహద్దు గ్రామాల్లో శాంతిస్థాపనకు కృషిచేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. -
అభ్యర్థుల ఎంపిక 90 శాతం పూర్తి
సాక్షి, ముంబై: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ 90 శాతం పూర్తిఅయ్యిందని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ఔరంగాబాద్‌లో ఆయన బుధవారం సాయంత్రం మరఠ్వాడా పరిధిలోని ఎనిమిది జిల్లాల పదాధికారులతో సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ.. ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు, పదాధికారులకు పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో ఏకంగా 42 స్థానాలు కైవసం చేసుకున్నాయి. దీంతో ఇరుపార్టీలు వచ్చే శాసనసభ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. కాగా, ఏ ఏ శాసనసభ నియోజక వర్గాల పరిధిలో లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయో అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ అభ్యర్థిత్వం ఇస్తున్నట్లు ఉద్ధవ్ చెప్పారు. ఎక్కడైతే తక్కువ ఓట్లు పోలయ్యాయో ఆ శాసనసభ నియోజక వర్గాలపై మరింత దృష్టి సారిస్తామని అన్నారు. కాగా గత శాసనసభ ఎన్నికల్లో శివసేన మరఠ్వాడా రీజియన్‌లో 27 స్థానాల్లో పోటీచేసి ఎనిమిది స్థానాలు కైవసం చేసుకుంది. అప్పుడు గెలిచిన వారందరికీ తిరిగి టికెట్ ఇవ్వనున్నట్లు ఠాక్రే సూత్రప్రాయంగా తెలిపారు. అదేవిధంగా పర్భణి ఎమ్మెల్యే సంజయ్ జాదవ్ లోక్‌సభకు ఎన్నిక కావడంతో అక్కడ శివసేన కొత్త అభ్యర్థిని బరిలో దింపాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక 90 శాతం పూర ్తయ్యిందని.. మిగతా 10 శాతం అభ్యర్థులను ఎంపికచేసే పనులు ఆగస్టులో పూర్తిచేసి తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. ఆ తర్వాత తమతమ నియోజకవర్గాలలో ప్రచార పనుల్లో నిమగ్నం కావాలని అభ్యర్థులకు ఆదేశాలివ్వనున్నట్లు ఉద్ధవ్ పేర్కొన్నారు. ఇదిలాఉండగా, కాషాయ కూటమి ఒప్పందం మేరకు బీజేపీ, శివసేనలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారు.దీంతో శాసనసభ ఎన్నికల్లో తమదే పైచేయి చాటుకోవాలనే తపనతో శివసేన ఉంది. మరోపక్క మోడీ ప్రభంజనాన్ని మరోసారి రాష్ట్రంలో చూపించేందుకు బీజేపీ కూడా సిద్ధమవుతోంది. ఆగస్టు 15లోపు తమ అభ్యర్థులు జాబితా ప్రకటిస్తామని బీజేపీ ఇటీవలే ప్రకటించింది. కాని శివసేన మాత్రం బీజేపీ కంటే ముందే 90 శాతం అభ్యర్థుల జాబితా సిద్ధంచేసినట్లు ప్రకటించింది. ఇలా రెండు పార్టీలు పోటాపోటీగా ముఖ్యమంత్రి పదవినే లక్ష్యంగా ముందడుగు వేస్తుండటం గమనార్హం. ఛగన్పై గరంగరం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ అంశంపై ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ) మంత్రి ఛగన్ భుజబల్‌పై విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర సదన్ పేరును లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ మార్చేస్తే బాగుంటుందని భుజబల్‌కు చురకలంటించారు. నాసిక్‌లో గురువారం జరిగిన ఓ కార్యక్రమానికి ఉద్ధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. ఢిల్లీలో మహారాష్ట్ర సదన్‌లో జరిగిన గొడవ అక్కడి అక్రమాలకు సంబంధించినది. దానికి మతం రంగు పూసి కొందరు మరింత రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కేవలం క్యాంటిన్‌లోనే కాదు మొత్తం మహారాష్ట్ర సదన్‌లోనే జరగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.