మద్దతు ఇచ్చేందుకు అభ్యంతరం లేదు : శివసేన
సాక్షి, ముంబై: శివసేన తన వైఖరిని మార్చుకుంది. బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరంలేదని స్పష్టం చేసింది. మహారాష్ట్రను ముందుకుతీసుకెళ్లేవారికి అండగా నిలుస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అధికార పత్రిక సామ్నాలో సోమవారం రాసిన సంపాదకీయంలో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ మరిన్ని స్థానాలను కైవసం చేసుకోవడం పట్ల అభినందించారు. ‘బీజేపీ ఘన విజయం సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. కొంకణ్, మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో మా పార్టీని ఆదరించిన ఓటర్లందరికీ కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కారణంగా మహారాష్ట్రలో బీజేపీ మరిన్ని స్థానాలను గెలుచుకోగలిగిందంటూ అభినందించారు.
ముఖ్యమంత్రి రేసులో ఎంతోమంది ఉన్నారు. అయితే ఆ పదవిని ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని మోదీ, అమిత్‌షాలే నిర్ణయిస్తారు. ప్రాంతీయతత్వం ప్రాతిపదికన మహారాష్ట్ర ముక్కలు కావాలని మేము కోరుకోం’ అని అన్నారు. నితిన్‌గడ్కరీకి పరిపాలనాపరంగా మంచి అనుభవం ఉంది. కేంద్రంలో ఆయన కీలకబాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అటువంటపుడు గడ్కరీని మోదీ వదులుకోగలుగుతారా? ఇక దేవేంద్ర ఫడ్నవిస్‌కు శాసనసభ వ్యవహారాలు బాగా తెలుసు. అయితే ఆయనకు పరిపాలనా పరమైన అనుభవం లేదు’అని ఉద్ధవ్ పేర్కొన్నారు.