బీజేపీ, శివసేన రాజీ! | BJP, Shiv Sena revive hopes of coalition government in Maharashtra | Sakshi
Sakshi News home page

బీజేపీ, శివసేన రాజీ!

Published Thu, Oct 23 2014 2:27 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

బీజేపీ, శివసేన రాజీ! - Sakshi

బీజేపీ, శివసేన రాజీ!

‘మహా’ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధమన్న శివసేన
 సోమవారం నుంచి అధికారిక చర్చలు జరుగుతాయని వెల్లడి

 
ముంబై: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేనలు రాజీబాట పట్టాయి. ఇరు పార్టీల నేతలు మంగళవారం రాత్రి చర్చలు జరపడంతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై ఆశలు చిగురించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమేనని శివసేన ప్రకటించింది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఆదేశంపై మంగళవారం రాత్రి ఢిల్లీలో కాషాయదళ నేతలతో సేన నాయకులు రాజ్యసభ ఎంపీ అనిల్ దేశాయ్, అసెంబ్లీలో ఆ పార్టీ నేత సుభాష్ దేశాయ్‌లు చర్చలు జరిపారు. తర్వాత బుధవారం ముంబై చేరుకున్నాక, సుభాష్ ఉద్ధవ్‌ను కలసి పరిస్థితి వివరించి, విలేకర్లతో మాట్లాడారు. ‘బీజేపీతో కలసి ప్రభుత్వ ఏర్పాటు అంశంపై చ ర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు ఢిల్లీ వెళ్లాం. చర్చలు సానుకూలంగా సాగాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీతో చేతులు కలిపేందుకు మేం సిద్ధం. మేం అనధికార చర్చలు మాత్రమే జరిపాం.

సోమవారం నుంచి అధికారిక చర్చలు మొదలవుతాయి. ప్రస్తుతానికి మేం బీజే పీకి ఎలాంటి ప్రతిపాదనా చేయలేదు. పొత్తుపెట్టుకోవాలని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మాత్రమే నిర్ణయించాం’ అని తెలిపారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నిక పరిశీలనకు నియమితులైన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ను తాను కలవలేదని వెల్లడించారు. అయితే దేశాయ్‌లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, గుజరాత్ బీజేపీ ఎంపీ చంద్రకాంత్ పాటిల్‌తో చర్చించిన ట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. చర్చల్లో భాగంగా ఉద్ధవ్ ప్రధాని మోదీని కలుస్తారా అని సుభాష్ దేశాయ్‌ని విలేకర్లు అడగ్గా.. ‘అధికారిక చర్చలు మొదలయ్యాక ఉద్ధవ్ మోదీని కలుస్తారా, లేకపోతే ఉద్ధవ్‌తో చర్చలకు బీజేపీ నేతలే ముంబైకి వస్తారో తేలుతుంది’ అని చెప్పారు.
 
రాష్ట్ర ప్రజల తీర్పు అదే: బీజేపీ


 పొత్తుకు సిద్ధమన్న శివసేన ప్రకటనపై మహారాష్ట్ర బీజేపీ నేత వినోద్ తావ్డే సానుకూలంగా స్పందించారు. ‘బీజేపీ, శివసేనలు కలసి ప్రభుత్వాన్ని నడపాలని మహారాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు’ అని అన్నారు. 1995 నాటి ఫార్ములా ప్రకారం ప్రభుత్వంలో రెండో పెద్ద భాగస్వామిగా ఉండబోయే తమకు డిప్యూటీ సీఎం పదవి కావాలని శివసేన కోరుతోందన్న వార్తలపై ఆయన స్పందించారు. సజావుగా పనిచేయాలంటే క్షేత్రస్థాయి వాస్తవాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. సీఎం పదవిని కేంద్రమంత్రి గడ్కారీకి ఇవ్వాలన్న డిమాండ్‌పై స్పందిస్తూ.. ఆయన ఆ పదవి కోరుకోవడం లేదన్నారు. కాగా, తెరవెనక చర్చల్లో  డిప్యూటీ సీఎం పదవితోపాటు సగం మంత్రిపదవులను శివసేన కోరిందని, అయితే దీనికి బీజేపీ విముఖంగా ఉందని, అందుకే పొత్తుపై నిర్ణయాన్ని జాప్యం చేస్తోందని సమాచారం.
 
 ఏ బాధ్యత ఇచ్చినా తీసుకుంటా: గడ్కారీ

 నాగ్‌పూర్: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని రాష్ట్ర బీజేపీ చీఫ్ దేవేంద్ర ఫడ్నవీస్ చేపట్టడం ఖాయంగా కనిపిస్తున్నప్పటికీ.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ నాగ్‌పూర్‌లో విదర్భ ప్రాంతానికి చెందిన 39 మంది ఎమ్మెల్యేలతో భేటీ కావడం ఆసక్తి రేపుతోంది. గడ్కారీ మంగళవారం రాత్రి నాగ్‌పూర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానం తనకు ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరిస్తానన్నారు. ‘తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి రానని ఇదివరకు చెప్పాను. నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ కేంద్ర నాయకత్వం. అది ఏ బాధ్యత ఇచ్చినా తీసుకుంటా’ అని చెప్పారు. తనతో భేటీ అయిన ఎమ్మెల్యేలు తాను సీఎంగా ఉండాలని కోరారన్నారు. కాగా, తన గురువైన గడ్కారీకి మార్గం సుగమం చేయడానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని నాగ్‌పూర్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కృష్ణా ఖోప్డే బుధవారం చెప్పారు. ఈ పరిణామాలపై స్పందించేందుకు ఫడ్నవీస్ నిరాకరించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement