ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమవుతుండటంతో ఆ పార్టీ మాజీ మిత్రపక్షం శివసేన ఎట్టకేలకు బుధవారం మౌనం వీడింది. బీజేపీ ప్రభుత్వంలో చేరికపై గురువారం నిర్ణయాన్ని వెల్లడిస్తామని ప్రకటించింది. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే బుధవారం ముంబైలో ఉదయం నుంచి రాత్రి వరకూ పలు దఫాలుగా పార్టీ సీనియర్లతో సమావేశమయ్యారు. అనంతరం పార్టీ ఎంపీ సంజయ్ దౌత్ విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంలో చేరడంపై గురువారం నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఉద్ధవ్ స్వయంగా ఈ ప్రకటన చేస్తారని సమాచారం. తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాకే శివసేనతో చర్చలు కొనసాగుతాయని బీజేపీ పేర్కొంది. కాగా, మహారాష్ట్ర సీఎంగా శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్న దేవేంద్ర ఫడణ్‌విస్ 12 మందితో కేబినెట్ ఏర్పాటు చేయనున్నారు.
బాలీవుడ్ తరహా సెట్టింగ్‌లు: ఫడణ్‌విస్ ప్రమాణస్వీకారానికి అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి బాలీవుడ్ చిత్రాల తరహాలో ఏర్పాటు చేస్తున్న భారీ సెట్టింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. జోధా అక్బర్, లగాన్ సినిమాల సెట్టింగ్‌లకు అవార్డులు అందుకున్న ఆర్ట్ డెరైక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ ఈ సెట్టింగ్‌లను డిజైన్ చేస్తున్నారు. కార్యక్రమానికి 40 వేల మంది హాజరవుతారని అంచనా. మరోవైపు ఇది ప్రభుత్వ కార్యక్రమం కావడంతో స్టేడియం వాడుకున్నందుకు ఫీజు వసూలు చేయరాదని శరద్ పవార్ సారథ్యంలోని ముంబై క్రికెట్ సంఘం నిర్ణయించింది.
సర్కారులో చేరికపై నేడు నిర్ణయం: శివసేన
Published Thu, Oct 30 2014 1:18 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement