పొత్తుకు బీటలు?!
సీట్లపై ఇరువురూ మంకుపట్టు
ముంబై: మహారాష్ట్రలో గత పాతిక సంవత్సరాలుగా కొనసాగుతున్న బీజేపీ, శివసేనల పొత్తు కుప్పకూలనుందా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి వారే ఒంటరిగా పోటీ చేయనున్నారా? కాషాయ పార్టీల మధ్య వైరం కాంగ్రెస్ పార్టీలకు లాభం చేకూరుస్తుందా? శుక్రవారం ముంబైలో జరిగిన పరిణామాలపై రాష్ట్ర ప్రజలు, రాజకీయ పరిశీలకుల్లో మెదిలిన ప్రశ్నలివి. సీట్ల పంపకంపై బీజేపీ, శివసేనలు మొండి పట్టుదలకు పోతుండడంతో ఇక ఇరువురి మధ్య పొత్తు భగ్నమైనట్టేనని భావిస్తున్నారు. రెండు పార్టీల్లోనూ రోజంతా చర్చోపచర్చలు జరిగినప్పటికీ అవి ఒక కొలిక్కి రాలేదు. ‘‘పొత్తు భగ్నమైనట్టే. దీనిపై ఇక అధికార ప్రకటనే వెలువడాల్సి ఉంది’’ అని పేరు వెల్లడించడానికి నిరాకరించిన ఓ సీనియర్ బీజేపీ నేత వ్యాఖ్యానించారు.
‘‘పొత్తు ‘ముగిసింది’, మా వైఖరిని వెల్లడించడానికి ముందు తదుపరి పరిణామాల వైపు వేచిచూస్తున్నాం’’ అని శివసేనకు చెందిన నాయకుడు పేర్కొన్నారు. రెండు పార్టీల మధ్య సీట్ల పంపకంతో పాటు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నదానిపై ప్రతిష్టంభన నెలకొంది. సీట్ల సంఖ్యలో సింహభాగం తమకే కావాలని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్ధవ్ ఠాక్రేను ప్రకటించాలని శివసేన డిమాండ్ చేస్తోంది. కాగా ఈసారి చెరో 135 సీట్లు పోటీ చేద్దామని, మిగిలిన 18 సీట్లను భాగస్వామ్య పక్షాలైన చిన్న పార్టీలకు కేటాయిద్దామని బీజేపీ ప్రతిపాదిస్తోంది. కానీ బీజేపీకి 119 సీట్లు మాత్రమే ఇస్తామని శివసేన తెలిపింది. ఈ ప్రతిపాదనను బీజేపీ నిర్ద్వందంగా తిరస్కరించింది.
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, భాగస్వామ్యపక్షాల పేర్లు ప్రస్తావించకుండానే వచ్చే ప్రభుత్వాన్ని తమ పార్టీ ఏర్పాటు చేస్తుందని ప్రకటిస్తూ ఒకరకంగా శివసేనకు అల్టిమేటం జారీ చేశారు. అయితే ఈ అల్టిమేటంను శివసేన తేలికగా తీసివేసింది. మహారాష్ట్రలో తాము పెద్దన్నగానే ఉంటామని సేన ఎంపీ సంజయ్ రావుత్ పేర్కొన్నారు. ఇక్కడే తాము సీట్లు ఇచ్చే వారమే తప్ప తీసుకునే వారము కాదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ పుట్టకముందునుంచే మహారాష్ట్రలో శివసేన ఉందని ఆయన గుర్తు చేశారు. పొత్తు ఉంటుందా లేదా అన్న అంశం తమపై ఎటువంటి ప్రభావమూ చూపబోదన్నారు. ఈ నెల 21న ఆదివారం తమ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశమవుతుందని, దీనికి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ హాజరవుతారని, ఆ సమయంలో పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే బీజేపీతో పొత్తుపై తుది ప్రకటన చేస్తారని రావుత్ చెప్పారు.