అడగనిదే మద్దతివ్వం
శివసేన చీఫ్ ఉద్ధవ్ స్పష్టీకరణ
{పధాని మోదీ, అమిత్‌షాలకు అభినందనలు
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ అడగనిదే ఆ పార్టీకి మద్దతు ఇవ్వబోమని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ముందు స్పందించాల్సింది ఆ పార్టీనే అని పేర్కొన్నారు. ‘నా ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నా. ఎవరికైనా మా మద్దతు అవసరమనుకుంటే వారు మా వద్దకు రావచ్చు. వారివైపు(బీజేపీ) నుంచి ప్రతిపాదనతో రావాలి. నా అంతట నేను ఎలా మద్దతు ప్రకటించగలను? ఒకవేళ మద్దతిస్తానని వారి వద్దకు వెళ్లినా ఇప్పటికే మాకు ఎన్సీపీ మద్దతుందని, మీ మద్దతు అక్కర్లేదని వారంటే పరిస్థితేంటి?’ అని ఆయన త న నివాసంలో విలేకర్లతో అన్నారు. ఎన్సీపీ మద్దతుతో బీజేపీకి తృప్తిగా ఉంటే ఆపార్టీ ఎన్సీపీతోనే కలసి వెళ్లాలని అన్నారు. విదర్భ అంశాన్ని ప్రస్తావిస్తూ.. మహారాష్ట్రను సమైక్యంగా ఉంచుతామని హామీ ఇస్తే బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
బీజేపీ, శివసేనలు తిరిగి కలవాలన్న అద్వానీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తాను కూడా అలాగే భావించానని అన్నారు. తాజా ఎన్నికల్లో 63 సీట్లు సాధించిన తమ పనితీరు తీసికట్టుగా ఏమీ లేదని పేర్కొన్నారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటినందుకు ఆ పార్టీ చీఫ్ అమిత్‌షా, ప్రధాని మోదీలను ఉద్ధవ్ ఫోన్ చేసి అభినందించారు. కాగా, మద్దతు కావాలని బీజేపీ తమవద్దకు రాలేదని ఉద్ధవ్ చెప్పిన నేపథ్యంలో అమిత్ షా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారని సమాచారం.