పొత్తా?.. ఒంటరి పోరా?
మహారాష్ట్రలో తేలని ప్రధాన కూటముల పొత్తుల కొట్లాట
119 కన్నా ఎక్కువ సీట్లివ్వబోమన్న శివసేన; 130 కావాలంటున్న బీజేపీ
124 ఇస్తానంటున్న కాంగ్రెస్; ఇంకా ఎక్కువ కోరుతున్న ఎన్సీపీ
పొత్తులపై కాంగ్రెస్, ఎన్సీపీల కీలక భేటీ నేడు
సాక్షి, ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన కూటములు కలసి పోటీ చేస్తాయా? లేదా ఒంటరిగా పోటీ చేస్తాయా? అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శివసేన, బీజేపీలు ప్రధాన పార్టీలుగా ఉన్న మహాకూటమిలోను.. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)ల ప్రజాస్వామ్య కూటమి(డీఎఫ్)లోనూ సీట్ల సర్దుబాటు చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో.. ఆయా పార్టీలు ఒంటరి పోరు దిశగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ(సెప్టెంబర్ 27) దగ్గరపడుతుండటంతో నాలుగు ప్రధాన పార్టీలు ఒకవైపు పొత్తులపై చర్చలు కొనసాగిస్తూనే.. మరోవైపు తమతమ అభ్యర్థుల ఖరారుపై దృష్టిసారించాయి. అవసరమైతే సొంతంగా బరిలో దిగుతామంటూ ఒకవైపు కత్తులు దూస్తూనే.. పొత్తును కాపాడుకుంటామంటూ మరోవైపు ప్రకటనలు చేస్తున్నాయి ఈ రెండు కూటములు.
పాతికేళ్ల బంధం కొనసాగుతుందా?
బీజేపీ, శివసేనల పాతికేళ్ల పొత్తుకు బీటలు వారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీకి 119 స్థానాలకు మించి ఇవ్వబోమని శివసేన తేల్చిచెబుతుండగా, 135 సీట్లు కావాలంటూ బీజేపీ కోరుతోంది. కనీసం 130 సీట్లైనా తమకు ఆమోదయోగ్యమేనని చెబుతోంది. ఆ ప్రతిపాదనకూ శివసేన ససేమీరా అంటోంది. ‘మేము 130 స్థానాలు కోరడం ద్వారా మేం ఒక ఉదాత్తమైన ప్రతిపాదన పంపాం. అదీ శివసేన ఏనాడు గెలవని స్థానాలనే మాకివ్వమంటున్నాం. దానికీ ఒప్పుకోకపోతే.. మొత్తం 288 స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని బీజేపీ మహారాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రాజీవ్ ప్రతాప్ రూడీ సోమవారం స్పష్టం చేశారు. పొత్తును కాపాడేందుకు బీజేపీ చీఫ్ అమిత్ షా సోమవారం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు ఫోన్ చేసి మాట్లాడారని.. సాయంత్రం ప్రధాని మోదీ కూడా ఉద్ధవ్‌కు ఫోన్ చేసి, సీట్ల సర్దుబాటు విషయంలో పట్టువిడుపు ఉండాలని హితవు చెప్పారని సమాచారం. 20, 30 మినహా అన్ని స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ఖరారు అయ్యాయని బీజేపీ వర్గాలు తెలిపాయి. కాగా, ఉద్ధవ్ చెప్పిన 119 స్థానాలే తమ చివరి మాట అని శివసేన సీనియర్ నేత ఒకరు స్పష్టం చేశారు.
పదిహేనేళ్ల పొత్తు భవితవ్యమేంటి?
అధికార ప్రజాసామ్య కూటమి(డీఎఫ్)లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 144 స్థానాలు కావాలని ఎన్సీపీ డిమాండ్ చేస్తుండగా.. 124 ఇస్తామంటూ కాంగ్రెస్ చెబుతోంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ నేతృత్వంలో సోమవారం పార్టీ కోర్ కమిటీ భేటీలో.. పొత్తును కొనసాగించాల్సిందేనని నిర్ణయించారు. కానీ, కాంగ్రెస్ ఇస్తామంటున్న 124 స్థానాలు తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. 15 ఏళ్ల పొత్తును కాపాడుకునేందుకు మంగళవారం ఉదయం ఇరు పార్టీల మధ్య మరో భేటీ జరగనుందని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. బీజేపీతో ఎన్సీపీ పొత్తు పెట్టుకోబోతోందన్న వార్తలను కొట్టివేశారు. కాంగ్రెస్ కూడా సీట్ల విషయంపై గట్టిగానే ఉంది. అన్ని స్థానాల్లో పోటీ చేసే విషయంపై పార్టీలో చర్చించామని పేర్కొంది. ఒకస్థాయిలో పొత్తు విషయమై చర్చలు జరుగుతున్నాయని, మరో స్థాయిలో అన్ని స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యానించారు.
మోదీపై ‘సామ్నా’ ప్రశంసలు
ఒకవైపు పొత్తు పట్లు కొనసాగుతుండగా.. మరోవైపు మోదీపై శివసేన ప్రశంసల జల్లు కురిపించింది. భారత ముస్లింపై మోదీ వ్యాఖ్యలను ప్రశంసిస్తూ పార్టీ పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసింది. మాతృభూమిపై ముస్లింల దేశభక్తికి మోదీ గ్యారంటీ ఇచ్చి కొత్త అధ్యాయం లిఖించారని, ఆయన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ముస్లింలపైనే ఉందని అందులో పేర్కొంది. ముస్లింలను ప్రశంసించడాన్ని ..మోదీలో హిందుత్వవాదం సన్నగిల్లినట్లుగా చూడరాదని తెలిపింది. ప్రధానమంత్రిగా మోదీ అన్ని మతాలకు, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారంది. నకిలీ లౌకికవాదులు మోదీని ముస్లిం వ్యతిరేకిగా చిత్రించారని తెలిపింది.